ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా ఈ బాత్రూములో ఎంతసేపని కూర్చోను?-ఈ ఆలోచనలతో పాటు దొడ్డిలోవున్న మరోవ్యక్తి కూడా నా మనసులో మెదుల్తున్నాడు.
వాడుకూడా దొంగే అయుండాలి. సరిగ్గా ఈ రోజునే వాడికీ ముహూర్తం కుదిరిందంటే అది నా అదృష్టమనుకోవాలో, దురదృష్టమనుకోవాలో తెలియడంలేదు. వాడిప్పుడేం చేస్తాడు? ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాడు?
తాపీగా ఆలోచిస్తూంటే రకరకాల అనుమానాలొస్తాయి. నాకిప్పుడింకో బెంగ పట్టుకుంది. ఈ ఇంట్లో చాలా డబ్బుంది కాబట్టి వీళ్ళు నైట్ వాచ్ మన్ ని ఏర్పాటు చేసుకున్నారేమో-వాడు రహస్యంగా దొంగాళ్ళ ఉనికిని కనిపెట్టి రెడ్ హేండెడ్ గా పట్టుకుంటాడేమో?
ఈ ఆలోచన నాకు నచ్చలేదు. అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదనుకున్నాను. అలా అనుకున్నాక నెమ్మదిగా ధైర్యంచేసి బాత్రూం తలుపుల దగ్గరకు వెళ్ళాను. నెమ్మదిగా లాగిచూశాను. రాలేదు. ఏమైనా సందుంటుందేమోనని చూశాను. లేదు. లాభంలేదు.
ఈ గదిలో చిక్కడిపోయాననే అనుకోవాలి. ఇందులోంచి బయటకేనా పోవాలి. లేదా ఎదురుచూస్తూ కూర్చోవాలి.
ఇంతలో బాత్రూంలో మళ్ళీ దీపం వెలిగింది. ఏం చేయాలో నాకు తోచలేదు. ఎక్కడా దాక్కునేందుకు చోటులేదు. లోపలికెవరొస్తున్నారో-యేమో!
బయట తలుపుతీస్తున్న శబ్దమవుతోంది. నాకు ఆలోచించడానికి కూడా వ్యవధిలేదు. తలుపు తెరుచుకుంటే ఏ గోడవైపు వస్తుందో ఆ గోడవారగా నక్కాను. తలుపు తెరుచుకుంది. నన్ను కవర్ చేస్తోంది.
ఆమె ఇంకా తువ్వాలులోనే వుంది. నేను ఊపిరి బిగబట్టి గమనిస్తున్నాను. ఆమె తిన్నగా నడుస్తోంది. వెనక్కు చూడడంలేదు.
ఆమె ఏం చేస్తుందన్నది కాదు-నా ఆలోచన-నా అనుభవాన్నంతా ఉపయోగించి. ఒక్కరవ శబ్దమైనా కాకుండా నేను బాత్రూంలోంచి ఇంట్లో ప్రవేశించాను.
బహుశా, తలుపులు మరోసారి జాగ్రత్తగా వేయడం ఆమె అభిమతమయుండవచ్చు. వేసి వున్న తలుపులు, కోసి వున్న అద్దం ఆమెకు అనుమానాన్ని కలిగిస్తాయా? కలిగితే ఆమె ఏం చేస్తుంది?
నేను బాత్రూంలోంచి బయటపడగానే అర్జంటుగా తడిపాదాలు తుడిచేసుకున్నాను. అలా చేయకపోతే నా పాదాల గుర్తుతో నా జాడ తెలిసిపోతుంది.....పాదాలు తుడిచేసుకోగానే అక్కడున్న హాల్లోంచి కనబడిన గదిలోకి పరుగెట్టాను.
నేను వెళ్ళింది ఆమె బెడ్రూమనుకుంటాను. రెండు సింగల్ కాట్స్ దగ్గరగా వేసివున్నాయి. డ్రెస్సింగు టేబులుంది. గదిలో రెండు గాడ్రెజ్ బీరువాలు కూడా వున్నాయి. మనుషులు మాత్రం ఎవ్వరూ లేరు.
ఆమె ఏ క్షణంలోనైనా యీ గదిలోకి రావచ్చు. కాబట్టి నేను దాక్కోడానికి మంచి చోటు చూడాలి. బీరువాల వెనుక చాలా చోటున్నదని గమనించేక నాకు మంచి ధైర్యం వచ్చింది. ఓసారి మంచం మీద తలగడాలను ఎత్తి చూశాను. తాళాల గుత్తి ఒకటి కనిపించింది. తీసి జేబులో వేసుకున్నాను.
ఇంక ఒక్కక్షణం కూడా ఆలశ్యం చేయకూడదు. నా పని నేను పూర్తి చేసుకోవాలి. ఈ రోజు నిజంగానే నెంతో అదృష్టవంతుడ్ని. ఇంట్లో ఎవరూ మగవాళ్ళు లేరు.
నేను జేబులోంచి జేబురుమాలూ క్లోరోఫాం సీసా తీసాను. జాగ్రత్తగా క్లోరోఫాం జేబురుమాలు మీద పోసి గోడవార నక్కి నిలబడ్డాను. ఆమె రావడం తరువాయిగా మిగతా పని చేయాలనుకున్నాను.
అంతసేపామె బాత్రూంలో ఏం చేస్తోందో తెలియదు. సుమారు అయిదు నిమిషాలకు పైగా పట్టింది ఆమె తిరిగి రావడానికి మెత్తటి అడుగుల చప్పుడు శ్రద్దగా విన్నాను. ఆమె గదిలో అడుగు పెట్టడమేమిటి-వెంటనే ఆమెను వెనుక నుంచి పట్టుకుని చటుక్కున ముక్కువద్ద క్లోరోఫాం రుమాలు అదిమాను. కొద్ది క్షణాలు పెనుగులాడింది కానీ చివరకు తల వాల్చేసిందామె.
ఆమె తల వాల్చేయడంతోనే ఒక చేత్తో కాపాడుకుంటున్న ఏకైక ఆచ్చాదన ఆమె ఒంటి మీద తువ్వాలు కూడా నేల జారింది. నేను చటుక్కున ఆమెను రెండు చేతులతోటీ ఎత్తుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాను.
కళ్ళు చెదిరే సౌందర్యం ఆమెది. క్షణం మాత్రం నా మనసు వశం తప్పింది.
ఇటువంటి బలహీనతలకు లొంగేవాడినైతే నేనెప్పుడో పట్టుబడి వుండేవాడ్ని. నాకు స్త్రీ వ్యసనముంది కానీ అది వేరు. దొంగతనం చేసే చోట మరో వ్యాపకముండడం నాకు. జారిపోయిన ఆమె తువ్వాలు తెచ్చి వంటి మీద కప్పాను.
దొడ్డిలో మరో దొంగ తిరుగుతున్నాడని తెలుసు నాకు. అందుకే ఇంట్లోకి అన్ని దారులూ బంద్ చేసేయాలి.
ఈ అభిప్రాయంతో ఓ పర్యాయం ఇల్లంతా సర్వే చేశాను. అప్పుడే నేను బాత్రూమ్ తలుపులు తెరిచి వుండడం గమనించాను. ఇందాకా నేనున్నప్పుడు తలుపులు వేసిన ఈమె ఈ పర్యాయం తలుపులు వేయడం మరిచిపోవడం ఆశ్చర్యమే అనిపించింది.
ఇందులో ఏమీ రహస్యం లేదుగదా అన్న ఆలోచన లీలమాత్రంగా వచ్చినప్పటికీ వెంటనే బాత్రూం తలుపులు దగ్గరగా లాగి బోల్టు బిగించారు.
మళ్ళీ బెడ్రూంలోకి వచ్చాను. ఆమె యింకా అలాగే మంచం మీద పడి వుంది.
తాళాల గుత్తిని వుపయోగించి బీరువాలు తెరిచిచూశాను. ఒకదాంట్లో బొత్తిగా ఏమీ పనికొచ్చేవి లేవు. అన్నీ బట్టలే! రెండోదాంట్లో మాత్రం నాక్కావలసిన అన్నీ వున్నాయి. లోపల రహస్యపు అరలున్నా తెలుసు కోవడానికి నాకు పది నిమిషాలకంటే పట్టలేదు.
అన్నీ వందరూపాయలనోట్లు, నూటఎనభై వున్నాయి. అంటే పద్దెనిమిది వేలన్నమాట. నాకు పరవశంలాంటిది కలిగింది. నగలయితే విలువేకట్టలేము. అన్నీ గబ గబా మూట కట్టాను. ఆమె యింకా అలాగే పడివుంది.
మూట తీసుకుని బాత్రూం వరకూ వచ్చాను. బైట వున్న స్విచ్ నొక్కాను.
