ఆ రాత్రి విజయకి నిద్ర పట్టలేదు.
రెండు మూడు సార్లు లేచి దాహం వెయ్యక పోయినా మంచినీళ్ళు తాగి మళ్ళీ మంచమెక్కింది. 'నేను చాలా పాపం చేశాను.' ఇవే ఆలోచన మనసంతా అల్లుకుని నిద్ర పట్టకుండా చేస్తూంది.
జగదీశ్వరీ మంచంమీద లేచి కూర్చుంది.
"ఏం విజయా! నిద్ర పట్టలేదా?"
ఉలిక్కిపడింది విజయ.
"అవునమ్మా! నిద్ర రావటం లేదు. ఆలోచనలు మనసు దొలిచేస్తున్నాయి. నువ్వుకూడా మెలుకువగానే ఉన్నావా?"
"నా కేమిటో వేడి చేసినట్టుగా ఉందమ్మా! వద్దు వద్దంటుంటే వినకుండా నువ్వేమో నా చేత్తో ఇస్తున్నా తాగమంటూ అలవాటు లేని కాఫీ తాగించే ఏవేళ నా చేత."
"పోనీలే! ఈ చేతులతోటే ప్రాయశ్చిత్తంగా రేప్పొద్దున్న రెండు గ్లాసుల మజ్జిగ ఇచ్చుకుంటాను. సరేనా?" బాధంతా మరిచిపోయి నవ్వింది విజయ.
"బాగానే ఉంది. సరేగాని, నిద్ర పట్టకుండా ఉండేటంత ఆలోచనలు ఏం వస్తున్నాయి నీకు?"
మరుక్షణం విషాదం పులుముకుంది విజయ ముఖం.
"నే నీ నాటకం ఇక ఆడలేనమ్మా." రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. ' జగదీశ్వరి వచ్చి విజయ పక్కన కూర్చుంది.
"పిచ్చిదానా! నేను మొదటే చెప్పానా? విన్నావుకాదు. వద్దమ్మా, ఎందుకొచ్చిన గొడవ అంటే 'కాదు, మగజాతి మీద కసి తీర్చుకుంటా'నన్నావు."
"అవునమ్మా! పెద్ద పొరపాటే చేశాను. దానికి రెట్టింపు చిత్రకథ మనసులో ఇన్నాళ్ళకి హఠాత్తుగా ఈ రోజు అనుభవిస్తున్నాను. నా తెలివి తక్కువ వల్ల, మగవాళ్ళ మీద నాకున్న కోపం మూలాన రెండు స్త్రీ హృదయాలు నలిగిపోయాయన్న సత్యం ఈ రోజే నా మనసుకి తట్టింది. ఇంత ఆలస్యంగా కనువిప్పు కలిగినందుకు నే నెంత బాధ పడుతున్నానో చెప్పలేను. కానీ, ఒకటి మాత్రం నిజం. ఎలాగో అయిందేదో అయిపోయింది. ఇంతవరకూ వచ్చిన తరవాత ముగింపులో నా నిర్ణయం మాత్రం మారదు. ఈ నాటకానికి ముగింపు ఏ విధంగా చెయ్యాలని మొదట అనుకున్నానో అలాగే చేస్తాను. రేపే చెప్పేస్తాను. ఇంక రోజులు పెంచదలుచుకోలేదు."
"మంచిదే. కానీ అసలింతకీ నీ కీ రోజే ఈ ఆలోచన రావడానికి కారణం ఏమిటో అదికూడా చెప్పు."
"అతని ఇంటికి వెళ్ళా నీ వేళ. అతని చెల్లెలి చూపులు నా గుండెల్లో నాటుకుపోయాయి. మనసులోని వేదనంతా ఆమెకళ్ళలో నిండి ఉంది. నా వల్లే కదా ఆ కళ్ళు నవ్వుకి దూరమయ్యాయి. నా మూలానే కదా ఆ ఇంట్లోని ఇంకో స్త్రీ ఈ లోకానికే దూరమైంది దిగులుతో. ఈ సత్యం, ఏ సుఖం ఎరుగని అతని చెల్లెలి ముఖం చూసేవరకూ నా మనసుకి తట్టలేదు." దీర్ఘంగా నిట్టూర్చింది విజయ.
"ఊరుకో, విజయా! రాసి పెట్టి ఉన్నది జరిగి పోయింది. అంతే అనుకో!"
"అంతే! కాక మరి చేసేది మాత్రం ఏముంది? నా మీది శ్రద్ధతో కదా ఇంట్లోవాళ్ళని రామం అశ్రద్ధ చేశాడు..." సన్నగా తనలో తనే అనుకుంటూ వెనక్కి వాలింది విజయ.
తన మంచంమీదికి వెళ్ళింది జగదీశ్వరి నిట్టూర్పు విడిచి.
* * *
మర్నాడు కొంచెం ఆలస్యంగా షాపుకి వెళ్ళింది విజయ.
తనని చూసి నవ్వుతూ పలకరించిన రామంతో మెల్లిగా అంది: "మీతో మాట్లాడాలి."
సందేహంగా చూశాడు రామం.
మరుక్షణం "పద" అంటూ వెనక ఉన్న రూమ్ లోకి నడిచాడు.
కూర్చోకుండానే ఏ ఉపోద్ఘాతం లేకుండా చెప్పదలుచుకున్నది చెప్పింది విజయ. "నేను ఉద్యోగం మానేస్తున్నాను."
"అంటే?" వింతగా చూశాయి రామం కళ్ళు.
మాట్లాడలేదు విజయ.
"ఓ! తెలిసింది. గృహిణిగా మారమని నీ మనసు తొందర పెడుతూందా? అదెంత సేపు! నేనూ నీతో ఈ సంగతి ఎప్పుడు చెపుదామా అని ఎదురు చూస్తున్నాను. త్వరలోనే మన పెళ్ళి ఏర్పాట్లు చేయిస్తాను." నవ్వుతూ దగ్గరగా వచ్చాడు రామం.
"ఏమిటి మీ రనేది?" వెనక్కి ఒక్క అడుగు వేసింది.
"అదేమిటి, విజయా! అర్ధంకానట్టు అలా చూస్తావు? నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదూ? నువ్వుకూడా నన్ను ప్రేమిస్తున్నావు' అవునా! మన పెళ్ళి..."
"రామం!"
అదిరిపడ్డాడు రామం, విజయ కంఠస్వరంలోని మార్పుకి.
"మీ రేమిటో ప్రేమా, పెళ్ళీ అంటూ పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. మీ సంగతేమో నాకు తెలియదు గానీ, నే నెప్పుడైనా మీతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పావా? ఎప్పుడైనా హద్దుమీరి ప్రవర్తించానా?"
"విజయా! నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది?" ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. తన చెవులు వింటున్నది సత్యమని నమ్మలేక పోతున్నాడు. విజయకి మతి పోయి అలా మాట్లాడుతూందేమో ననిపించింది ఒక్క క్షణం. మెల్లిగా నచ్చచెప్పాలనుకున్నాడు.
"తొందరేం లేదు, విజయా! బాగా ఆలోచించిన తరవాతే చెప్పు."
కసితీరా నవ్వింది విజయ. "అటువంటి అభిప్రాయం అంటూ ఉంటేగా అసలు ఆలోచించడానికి!"
కోపంతో ఎర్రబడింది. రామం ముఖం.
"నువ్వు ఇలా మోసం చేస్తావని కల్లోకూడా అనుకోలేదు."
భుజాలెగరేసి నవ్వింది. "చనువుగా ఉండడం తప్పని నే ననుకోలేదు సుమా! అయినా మోసాలలేని నాకు తెలియదు. 'ఇంట్లో భార్య జబ్బుతో బాధపడుతుంటే బయట నా లాంటి వాళ్ళతో షికార్లనీ, సినిమాలనీ ఖుషీగా కాలం గడిపిన మనుషులు మీరు. ఎవరెలాంటి వాళ్ళో తెలుస్తూనే ఉందిగా! ఎవరు మోసగాళ్లో ఆలోచించుకుంటూ ఉండండి. నే వస్తా." గిరుక్కున వెనక్కి తిరిగి మరి ఒక్క క్షణం అక్కడ నిలబడకుండా వచ్చేసింది విజయ.
* * *
మధ్యాహ్నం భోజనానికి రామం ఇంటికి రాకపోవ డంతో ఎంతోసేపు ఎదురుచూసి, ఆకలితో అలాగే రాజేంద్ర పక్కన కలత నిద్రపోయింది విశాలి.
సాయంత్రానికైనా ఇంటిముఖం చూస్తాడనుకుంది. అదీ లేదు ఏం చెయ్యాలో పాలుపోక, ఏమీ తోచక కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న విశాలి వెనకే "అత్తా! అత్తా!" అంటూ తిరుగుతున్నాడు రాజేంద్ర.
అన్యమనస్కంగానే వాడిని పలకరిస్తూ మధ్య మధ్యలో వాడిని ఎత్తుకుని ముద్దాడుతూంది.
"అత్తా! నాన్నేలీ?" ఉన్నట్టుండి అడిగాడు రాజేంద్ర.
ఉలిక్కిపడింది విశాలి.
"వస్తారమ్మా!"
"అత్తా! నాకు మరే..కాలు కొనమని నాన్నతో చెప్పు."
"అలాగే! ఎంత కారు కావాలి నీకు?"
"ఇంత..... ఇంత పెద్దది." రెండు చేతులూ చాపి నిలబడ్డాడు.
"ఓ! అలాగే చెపుతానులే." నవ్వింది విశాలి.
వాడిని చూస్తుంటే చెప్పలేని జాలి ముంచుకొచ్చింది.
నాన్న ఇంట్లో లేకపోయినా, రావడం ఆలస్యమైనా "నాన్నేడీ?" అంటూ తెగ అడుగుతాడు.

కానీ, నాన్న వచ్చాక ఎదుటపడి సంతోషంగా మాట్లాడే అదృష్టం లేదు వాడికి.
ఎలా మాట్లాడతాడు? ప్రేమగా వాళ్ళ నాన్న ఒక్కనాడైనా పలకరిస్తే కదా? దగ్గిరికి వెళితేనే చీదరించుకుంటాడయ్యె!
రాత్రి పది దాటాక వచ్చాడు రామం ఇంటికి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తూలుతూ అడుగు పెట్టాడు ఇంట్లోకి.
భయంగా, బాధగా చూస్తూ ఉండిపోయింది విశాలి.
అన్నం తినమంటే వద్దన్నాడు.
గ్లాసునిండా పలు పోసి తీసుకెళ్ళి గదిలో బల్లమీద పెట్టింది.
అవి తాగి మాట్లాడకుండా పడుకున్నాడు.
గుండెల్లో నిండిన బాధ పెల్లుబికి కన్నులగుండా స్రవించగా తల దిండుల దాచుకుంది విశాలి.
"తలపు తరగల నూగు ముత్యాలనౌక
అబ్బి గర్భంబులో బడి భగ్నమైన యపుడు,
ఊర్చి, ఒకసారి కనుల నీరోడ్చుకుంటే,
చింతిలుటకంటే ఎవరేమి చేయగలరు?...."
అవును! ఎవరేం చెయ్యగలరు? విధిని నిందిస్తూ కూర్చోవడమేగా? అన్నయ్యని చూస్తూ కూడా తను ఏం చెయ్యగలుగుతూంది? భగవంతుడెందుకిలా, మనుషుల్ని ఆడిస్తాడు? ఇవన్నీ చూడాలని రాసిపెట్టి ఉందిగావును. లేకపోతే తను బ్రతికి ఉండవలసిన అవసరం ఏముంది? ఎవరి కోసం బ్రతకాలి?
నా కోసం..... నా కోసం....ఎవరో కన్నులముందు అస్పష్టంగా కదలాడుతున్నారు.
ఎవరు? ఎవరది?
కన్నులముందు కదలాడే ఆ రూపాలు మరెవరివో కాదు.
తన ముద్దుల రాజేంద్ర....తన చిన్ని రాజేంద్ర ఒక పక్క...
తన మనసులో దాగిన, తన హృదయ పీఠాన్ని తనకి తెలియకుండానే అలంకరించిన స్నేహమూర్తి రాజేంద్ర మరో పక్క.
'ఏమో? కలవరపరిచే ఆలోచనలు, కన్నీరొలికే కన్నులు-ఇవే కాబోలు భగవంతుడు తన కిచ్చిన వరాలు.' బాధగా నిట్టూర్చి, ఆలోచనలని ఆమడదూరంలో ఉంచి, నిద్రాదేవిని కరుణించమని వేడుకుంది.
* * *
రాత్రి పదయింది. వీధి తలుపు చప్పుడవగానే అన్నయ్య వచ్చాడనుకుంటూ లేచింది విశాలి.
తలుపు తియ్యబోతూ "ఎవరూ" అంది ఎందుకైనా మంచిదని.
"నేను..."
ఆ కంఠస్వరం ఎప్పుడైనా, ఎక్కడైనా గుర్తు పట్టగలదు తను.
అవును.....నిశ్చయంగా అది రాజేంద్ర గొంతు.
తలుపు తీసి, "రండి" అంది నవ్వుతూ.
చేతిలో సూట్ కేసుతో లోపల అడుగు పెట్టాడు రాజేంద్ర.
"క్షమించండి, ఇంత రాత్రివేళ డిస్టర్బు చేసి నందుకు."
"ఫరవాలేదు. రండి."
రామం కోసం అటూ ఇటూ చూస్తూ విశాలి చూపించిన కుర్చీలో కూర్చున్నాడు రాజేంద్ర.
"మీ వదినగారు పోయినట్టు నా కింతకు ముందు తెలియదు. పనుండి ఈ ఊరు వచ్చాను పొద్దున్న. ఈ సంగతి తెలిసింది. ఒకసారి రామాన్ని చూద్దామని, ఇలా వచ్చాను. పొద్దున్న ట్రెయినుకి వెళ్ళిపోవాలి. రామం ఇంట్లో లేడా?"
"ఉండండి. ఇప్పుడే వస్తాను. అన్నయ్య లేడు."
లోపలికి వెళ్ళబోతున్న విశాలిని మృదువుగా వారించాడు. "నేను హోటల్లో బోజనం చేసే వచ్చాను. మీరేమీ శ్రమ తీసుకోకండి."
విశాలి మౌనంగా ఉండిపోవడంతో మళ్ళీ తనే అన్నాడు: "నేనీ ఊరొచ్చి చాలా రోజులైంది. అదీకాక నాకూ, రామానికీ ఉత్తరాలు రాసుకునే అలవాటు లేదు. అందుకే ఈ సంగతి ఇన్నాళ్ళవరకూ నాకు తెలియదు. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. చిన్నవయసులోనే పోవడం...రామానికిది పెద్ద దెబ్బ."
వదినని తలుచుకుని బాధ, రామానికిది పెద్ద దెబ్బ అన్నందుకు నవ్వు వచ్చి, విరక్తిగా తనలో తనే నవ్వుకుంది విశాలి.
"మీ రేమీ అనుకోకపోతే మీతో ఒక విషయం మాట్లాడాలని ఎప్పటినించో అనుకుంటున్నాను...కూర్చోండి మీరుకూడా నిలబడే ఉన్నారు." తన మనసులో మాట అడగాలనుకున్నాడు రాజేంద్ర.
కానీ, విధి వక్రించడం అంటే అదె కాబోలు సరిగ్గా అదే సమయంలో దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసుకుని లోపల అడుగు పెట్టాడు రామం. బాగా తాగినట్టు ఎర్రటి ఆ కళ్ళే చెపుతున్నాయి. తూలుతూ లోపలికి వచ్చి రాజేంద్రని చూసి ఆగిపోయాడు.
"ఎవడ్రా నువ్వు? నేను లేకుండా చూసి...నువ్వు నా ఇంట్లో దూరావు. నీ కేం పనిక్కడ? ఆఁ చెప్పు."
రామం ప్రవర్తనకి సిగ్గుతో చితికిపోయింది విశాలి.
ఆ మాటలకి తెల్లబోయి చూస్తూ నిలబడి పోయాడు రాజేంద్ర.
మరునిమిషంలో తెప్పరిల్లి, నిశ్చలంగా నిలబడి విశాలివై పోసారి చూసి మెల్లిగా అన్నాడు: "నేను రామం రాజేంద్రని."
"నువ్వెవడివో నాకు తెలియదు. నేను లేకుండా చూసి నా చెల్లెల్ని బుట్టలో వేసుకుందామని వచ్చావు. పో ముందు. పోతావా లేదా? ఉండు నీ పని చెపుతాను."
మూలన ఉన్న కర్ర తీసుకురావడానికి తూలుతూ ముందుకి నడిచాడు రామం. ఒక్క అంగలో రాజేంద్ర ముందుకి వచ్చింది విశాలి. "దయచేసి మీ రిక్కడి నించి వెళ్ళిపొండి. మీ వంటివారు అనవసరంగా మాటలు పడటం, గొడవ పడటం నేను చూడలేను. ఈ నరకయాతన మానసిక వేదన నాకు రాసి పెట్టి ఉంది. నే నెలాగా అనుభవించక తప్పదు. ఇక్కడినుంచి వెళ్ళి పొండి."
"ఫర్వాలేదు. మీరు కంగారు పడకండి."
రాజేంద్ర ఇంకా ఏదో అంటుండగానే కర్ర తీసుకుని వస్తున్న రామాన్ని చూసి మరింత కంగారు పడింది. "మీకు నమస్కరిస్తాను. దయచేసి నా కోసం ఈ చోటు వదిలి వెళ్ళండి. కేకలు, రభస అయితే నలుగురూ చేరతారు. నలుగురిలోనూ అన్నయ్య మిమ్మల్ని నోటి కొచ్చినట్టు అంటాడు. నా కది ఇష్టం లేదు. దయచేసి ..."
