'ఎవరివో తెలుసుకోవాలన్న జిజ్ఞాస నీకు లేదా?' అన్నాడు గవర్రాజు.
'ఎందుకు లేదు?' అంది సుభద్ర.
'నీవే సుభద్రా! ఆకళ్ళు నీవే! నీవు మీ అక్కకు ఏవిధంగానూ తీసి కట్టుగా వుండకూడదని పెద్ద మేడకొన్నాను. నిన్ను చూడకుండా వుండలేకనే, నేనిక్కడ పడి వుంటున్నాను సుభద్రా! నీ అందం, యవ్వనం నన్ను పిచ్చివాణ్ణి చేస్తాయి! నీవు కాదంటే, నేనే మయిపోతానో నాకే తెలీదు! సుభద్రా! దీనంగా అన్నాడు గవర్రాజు. అందంగా ఆరోగ్యంగా, దృఢంగావున్న గవర్రాజు సుభద్రని అల్లాదేవిరించటం సుభద్రకెంతో ఆనందంగా వుంది. తాను చదివిన ప్రేమకధల్లోని నాయకుడు గవర్రాజులో కన్పించాడు ఆపిల్లకి!
వెన్నెల్లో చలిస్తూన్న పెదవులతో, సజీవ ప్రతిమవలె నిలుచున్న సుభద్రని చూస్తే, గవర్రాజుకి కవిత్వం దానంతటదే పెల్లుబుకుతూ వచ్చింది.
'సుభద్రా! నేను నిన్ను ఎంతగానో ప్రేమించుతున్నాను. మీవాళ్ళకి, వాళ్ళ దృష్టిలో నేనొక, పెళ్ళికొడుకుగా కన్పించను. అందుచేతనే, ఎన్నివేల రూపాయలు కట్నాలు పోసి అయినాసరే, సంబంధాలు వెతుకుతున్నారు! వాళ్ళ దృష్టిలో, నేనొక 'కిళ్ళీ కొట్టు' వాణ్ణిమాత్రమే! వాళ్ళకి హోదాగల వుద్యోగస్థులైతేనే కళ్ళకి ఆనుతారు! కాని నీవొకసంగతి ఆలోచించు! డబ్బిచ్చి కొనుక్కున్న ఆ హోదాగల భర్తనించి నీకీ ఆరాధనా, ఆత్మీయతా లభ్యమౌతాయా? నాకిప్పుడు, ఏ ఆఫీసరుకీ రానంత రాబడివుంది! మేడ కొనుక్కున్నాను! పొలంవుంది! ఇద్దరన్న తమ్ములు, బాధ్యత, గౌరవమూకల వుద్యోగాల్లో వున్నారు! ఇద్దరూకూడా మర్యాదస్తులైన కుటుంబాల్లోంచి వచ్చిన పిల్లల్ని వివాహం చేసుకుని, సుఖంగా, సంసారాలు చేసుకుంటున్నారు. నాకూ పెళ్ళి చేయటానికి ఎంతకాలంగానో ప్రయత్నించుతున్నారు. కాని నామనస్సుని ఆకర్షించిన సౌందర్యరాశివి! నీవుతప్ప, నాకు మిగిలిన ఆడపిల్లలు అక్కచెల్లెళ్ళుగా కన్పించుతారు! నీవు నన్ను పెళ్ళిచేసుకుంటాను అని మాటివ్వు! నీకు ఇష్టం లేకపోతే, ఈ కిళ్ళీకొట్టు ఎత్తేసి పట్నం వెళ్ళి పోదాము! ఒక కారుకొంటాను. బట్టల కొట్టువకటి వచ్చేనెలలో తెరుద్దామను కొంటున్నాను నీవిప్పుడు, కిళ్ళీ కొట్టు గవర్రాజుని కాదు ప్రేమించాల్సింది! హోల్ సేల్ డీలర్! క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎ. జి. రాజుని ప్రేమించాలి సుభద్రా! వూఁ! అను సుభద్రా!' చనువుగా రెండు భుజాలమీదా చేతులువేసి తనవెంపు ఆమెని త్రిప్పు కున్నాడు! అతని శరీరం మీంచి కునేగా పరిమళం ఆమె ముఖం అంతా పరుచుకుంది. ఉక్కిరి బిక్కిరయి చటుక్కున అతని వక్షం మీద తల వాల్చి కళ్ళుమూసుకుంది. సుభద్ర! ముఫ్ఫయ్ ఆరేళ్ళు వస్తోన్నా స్త్రీ స్పర్శా సుఖాన్ని ఎరుగని గవర్రాజు లజ్జాన్విత అయి కంపిస్తోన్న సుభద్ర లేత పరిష్వంగానికి చలించిపోయేడు! చుక్కల్లోని చంద్రుని సాక్షిగా ఆమెని తనలోనికి అయిక్యం చేసుకున్నాడు!
గవర్రాజు లోని రసికత సుభద్రని చాలా రంజింప చేసింది! సుభద్రలో పొంగులెత్తుతూవున్న యవ్వనం గవర్రాజు అందించే అనుభవంకోసం ఎదురుచూడటం మొదలెట్టింది! గవర్రాజు సుభద్రని ఇంతతేలిగ్గా లొంగదీసుకోగలనని మొదట్లో అనుకో;లేదు! అయినింటి ఆడపిల్ల! గౌరవ కుటుంబీకులు! కన్నెగా తనకి తనను సమర్పించుకోగలదని అతను అనుకోలేదు! గవర్రాజు తన జీవితంలో చాలాసార్లు స్త్రీ సాహచర్యంకోసం తహ తహ లాడేవాడు! కాని చిన్నప్పటి దుబారీ తనంవల్ల ఆవిద్యవల్ల తను జీవితంలో చాలా పోగొట్టుకున్నానని తెలుసుకున్నాడు! తను ఎల్లాగయినా ధనం బాగా ఆర్జించి గొప్ప ధనవంతుల జాబితాలోనికి ఎక్కాలనే దృఢమైన దీక్షవల్ల లాలసని అతను లెక్క చేయలేదు. దీక్ష లాలసని జయించింది! డబ్బుతో అతను స్త్రీ సౌఖ్యం పొందవచ్చునని అతనికి తెలుసును! కాని దేనికయితే అతను వ్యాపారదృష్టిని అలవర్చుకున్నాడో, ఆ కుటుంబ ప్రతిష్ఠని బజారుపాలు చేయటం అతనికి నచ్చలేదు! పైగా శరీరం మీద అతనికి తగని ప్రేమ! దానిని రోగభూయిష్టం చేయటం అతనికి నచ్చదు! సుభద్ర అతని తృష్ణని తీర్చ గలిగింది!
అయిదారురోజులు గడిచేక నరసయ్య వచ్చేడు. గవర్రాజుని కుశలప్రశ్నలు వేసేడు! సుభద్రలోని కొత్త కాంతిని జగదాంబ గమనించలేదు! తండ్రివచ్చినా, సుభద్ర భయపడలేదు! రాత్రుళ్ళు పది గంటలు దాటేక అరుగుమీదకు వచ్చి గ
ది వద్ద నిలబడేది! గవర్రాజు, సుభద్ర వచ్చి వెళ్ళితేనే కాని, నిద్రపోయేవాడు కాదు!
రెండునెలలు పూర్తిగా గడవలేదు! ఒకరోజు ఉదయాన్నే గవవ్రాజు, నరసయ్య వీధిగది ఖాళీచేసేడు. రిక్షాలో పెట్టే బేడా సర్దుతూంటే నరసయ్య అడిగేడు!
'ఏం? గవర్రాజూ! కొట్టు ఎత్తి పెట్టేసావ్! లాస్ వొస్తూందా!' అని.
'మీ దయవల్ల లాసేమీ లేదండి! పట్నంలో బట్టలషాపు పెట్టాను! అక్కడ స్వయంగా చూసుకోవచ్చని ఇక్కడ కొట్టు ఎత్తిపెట్టాను!' వినయంగా చెప్పాడు గవ్రరాజు!
'బట్టలషాపే!' ఆశ్చర్యపోయేడు నరసయ్య 'పట్నంలో స్వంతంగా మేడ కొనుక్కున్నాడట! హోటల్ వినోదాలో సగం భాగం ఇతడిదేనతట! బట్టలషాపు కూడా స్వంతంగానే పెట్టాడుట!' గవర్రాజు వెళ్ళిపోయేక, జగదాంబ చెప్పింది.
'ఆఁ! దానిదేముందీ! ఈ రోజుల్లో ప్రతీ లకాయి లూకాయి వెధవా ఎల్లానో అల్లా నాలుగుడబ్బులు అడ్డమైన గడ్డీ తినీ పోగుచేసుకోవటం తర్వాత పెద్ద బిజినెస్ మాన్ అయిపోయి, కార్లో తిరగటం పరిపాటి అయిపోయింది!' తేలిగ్గా అన్నాడు నరసయ్య.
పట్నం వెళ్ళిపోయిన గవర్రాజుకి ఏమీ తోచలేదు! సుభద్ర బాగా అలవాటు అయి పోయింది. వెళ్ళేరోజు రాత్రి సుభద్ర చెప్పిన విషయం ఒకటి గవర్రాజుకి అయోమయంగా వుంది! 'నాకీ మధ్య వంట్లో నీరసంగా వుంటుందో! అమ్మకు తెలిస్తే ఏమవుతుందో!' అంది సుభద్ర. 'కావల్సినంత డబ్బు ఇస్తాను! ప్రతీవారం వస్తాను. మంచి టానిక్సు కొనితెస్తాను! నీ ఆరోగ్యం గురించి దిగులుపడకు!' అన్నాడు గవర్రాజు.
పట్నం వచ్చేక అన్నగారింటికి వెళ్ళాడు! చిన్న వదిన మంచంమీద పడుక్కొని వుంది.
'ఏం వదినా అలా పడుక్కున్నారు?' అన్నాడు.
'వంట్లో నీరసంగా వుంది నాయనా!' అంది వదిన. చప్పున సుభద్ర కూడా నీరసంగా వుండటం గుర్తుకి వచ్చింది. బజారుకుపోయి పళ్ళూ ఏదో బలానికి టానిక్కులూ కొనితెచ్చి చిన్న వదినకు ఇచ్చాడు. ఇస్తూ,
'వదినా నీరస మెందుకు వస్తుందంటారు?' అన్నాడు ఆమె చటుక్కున సిగ్గుపడింది. పెద్దవదిన,
'మీకు పెళ్ళయితే మీ ఆవిడ చెబ్తుంది లెండి?' అని హాస్యం చేసింది.
గవర్రాజు చిన్న ముఖం చేసుకున్నాడు! పెద్ద వదినకి జాలి వేసింది.
'అది కాదు రాజుబాబూ! ఇంకో అయిదారునెలల్లో ఆమె పిల్లలకి తమ్ముడో చెల్లెలో పుట్టబోతారు! అందుకనే ఆ నీరసం!' అని నవ్వింది.
గుండె ఝల్లుమంది గవర్రాజుకి! సుభద్రకి కూడా నీరసం అంటే ఇదేనా! తను, తనవల్లేనా? ఇంకా పెళ్ళి కాకుండానే తను తండ్రి అవుతున్నాడా! ఛీ ఛీ! సుభద్ర కేనా సిగ్గుండద్దూ! అయినా తనకి మేడ వుందనీ, డబ్బు సంపాదించాననీ చెప్పగానే తనకి లొంగిపోయింది! ఏమిటి ఈ ఆడపిల్లలు? ఇట్టే లొంగి పోతారు! సిగ్గేనా వుండదు, వాళ్ళకి కావల్సినది డబ్బు! దర్జాగా షికార్లు తిరగటం! దానికోసం నీతిని కూడా కోల్పోతారు!
తను పెళ్ళి చేసుకుందామనుకున్నాడు! అదే చెప్పాడుసుభద్రతో!
'ఎల్లానూ పెళ్ళి చేసుకోబోతున్నాం! ఇంతలో తొందర దేనికి! ఆ మూడు ముళ్ళూ పడిపోయేక మనం స్వేచ్చగా వుండచ్చు కదా! అంతవరకూ హద్దు మీరకూడదు!' అని వక్కమాటన్నా వారించకుండా తనకి తాను లొంగిపోయింది సుభద్ర! ఇప్పుడేం చేస్తుందో! తను పెళ్ళాడనంటే ఏం చేస్తుంది? ఏమీ చేయదు! చల్లగా ఏమందో మాకో ఇస్తారు వాళ్ళ వాళ్ళు. తర్వాత ఏం రెండో పెళ్ళివాడినో చూసి ఆ మూడు ముళ్ళూ పడేయిస్తారు! కామేశ్వరీ అంతే అయివుంటుంది! చక్కగా తల వంచుకుని పెళ్ళి చేసుకుంది! ఇప్పుడు ఆ రామనాధాన్ని, మాధవినీ ఇంటిచుట్టూ త్రిప్పుకుంటోంది! ఛీ ఛీ! ఎల్లాంటి వాళ్ళు ఈ ఆడపిల్లలు!' అనుకొని సుభద్రని ఈసడించుకున్నాడు గవర్రాజు.
* * *
కామేశ్వరి గదిలోనికి వచ్చేసరికి కేశవ ఏదో ఆలోచిస్తున్నాడు. కామేశ్వరి రావటంతోనే సరాసరి తన మంచంమీదకు పోబోయింది!
'కాస్సేపు ఇల్లా వచ్చి కూర్చో కామేశ్వరీ! నీతో ముఖ్యంగా ఒక విషయం మాట్లాడాలి!' అన్నాడు కామేశ్వరి దగ్గరగా వచ్చి నిలబడింది.
'కూర్చో!' అన్నాడు.
కామేశ్వరి సంకోచిస్తూ నిలబడింది!
'ఫరవాలేదు కూర్చో!' అన్నాడు మళ్ళీ సోఫాలో ఒకవార మొగలిపువ్వులా కూర్చుంది కామేశ్వరి!
'నీకు నేను రెండోపెళ్ళివాణ్ణి అని మన పెళ్ళికి ముందు తెలుసా? తెలిసే చేసుకుందు కొప్పుకున్నావా?' హఠాత్తుగా అడిగిన ఆప్రశ్న కామేశ్వరిని విచలితను చేసింది. కామేశ్వరికి ఏం జవాబు చెప్పాల్నో తోచక ఊరుకుంది.
