Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 19


    "ఎదుటజీవి రక్త మాంసాలు తిని తన రక్తమాంసాలు వృద్ధి చేసుకోవాలనటం మహాపాపం". అని ఓసారి హిందీ "కళ్యాణ్" లో చదివిన సూక్తి గుర్తు వచ్చింది. అది చదివిన నాటినుంచే అటు వంటి ఆహారం ముట్టటం మానుకున్నాను. ఆ ఒక్కవాక్యం నాలో అంతటి మార్పు తీసుకొచ్చింది.
    ఈ విషయంలో మాధవ్ అభిప్రాయాలు సమంజసమే ఐనా నేను మాత్రం అంగీకరించను. -ప్రజలంతా మాంసాహారం విసర్జించిన నాడు భూమిమీద పండుతూన్న శాకాహారం ఏమూలకీ రాదట. ఇటు జంతువులు విచ్చలవిడిగా మందలు మందలు పెరిగిపోయి-ఆనాడు మనుష్యులకీ మనుష్యసంఖ్యని మించిపోయె జంతు జాలానికి తిండి దొరకటం అసాధ్యమట - అసలు ఆనాడు భూమిమీద నిలవ నీడనీదే కరువవుతుందట. ఏమి టేమిటో రాశాడు. అదీ నిజమే కావచ్చు. కానీ ఎక్కడో చెట్లమీదా, పుట్లమీదా, ఆడుతూ పాడుతూ తిరిగే ఆ అమాయికపు నెమలినే ఆహారంగా చేసుకోటాన్ని మాత్రం నేను సమర్ధించలేను.
    అయితే జయసింగు గొప్పవీరుడే అనుకున్నాను.
    మాధవ్ రాసిన లంబాడీపడుచు కళ్ళలో మెదిలింది. లంబాడీ అంటే నాకెంతో సరదా. వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత గమ్మత్తుగా-అందంగా ఉంటుందనీ. ఆపొట్టి పరికిణీలూ-అద్దాల ముసుగులూ-వీపులేని రవికలూ- దంతం గాజూలూ -జుట్టులోంచి వేల్లాడే గవ్వలూ- ఇంతచోటు లేకుండా ఒంటినిండా ఏమిటేమిటో ఆభరణాలు-వాళ్ళు నడిచిపోతూంటే ఆ గలగలలు ఎవరికైనా గుర్తే. ఆరోగ్యంగా పుష్టిగా అందంగా వుండే లంబాడీ పడుచుని చూసిన కొద్దీ చూడబుద్దేస్తుంది.
    "ది ప్రిన్సెన్ అండ్ ది జిస్సీస్" లో రాకు మారి తలపోసినట్టువాళ్ళని చూస్తుంటే వాళ్ళలో కలిసిపోయి-ఆ పొట్టి పరికిణీ కట్టుకొని-అద్దాల ముసుగుమీద ఏ పందుం పుల్లల తట్టో పెట్టుకొని గలగలమనుకుంటూ నడిచిపోవాలని పిస్తుంది నామట్టుకు నాకు. అది ఎంత సాధ్యమో తెలిస్తే నవ్వూ వస్తుంది.
    మాధవ్ కి కూడా లంబాడీలంటే అంతిష్టమా? అందమైన లంబాడీ పడుచుని మాధవ్ కి కూడా చూసినకొద్దీ చూడబుద్దేస్తుందా? మాధవ్ చదువుకొంటూ వుండగానే అందమైన లంబాడీ పడుచు గది తుడుస్తూన్న దృశ్యం తలపుకొస్తే ఆ లంబాడీ దాని మీద అసూయా, మాధవ్ మీద కోపం ముంచుకొచ్చాయి-అది బలే గడుసుదట-గమ్మత్తుగా మాట్లాడుతుందట- అవును మరి. అంత గమ్మత్తుగా మాట్లాడుతుంది కాబోలు. వాళ్ళసలె కరుకుమూక. ఏమాత్రం చనువు చేసుకున్నా వదిలించుకోటం కష్టం-నాకో కధ-కొన్ని నెలల క్రిందట ఏదో హిందీపత్రికలో చదివింది గుర్తుకొచ్చింది. అది గుర్తు కొచ్చినప్పుడల్లా మనస్సు అదోలా అయిపోతుంది.
    బయటి ప్రపంచమంటే ఏమిటో తెలీకుండా అడవుల్లోనే పుట్టి పెరిగి అక్కడే అంతమైపోతున్న నాగ జాతీయులకి ప్రపంచమంటూ బయట ఒకటుందని చెప్పి వారిలో విజ్ఞానం నెలకొల్పాలనే సదుద్దేశంతో కర్నల్ బోస్ రెజిమెంట్ అడవుల్లోకి అడుగు పెడుతుంది. స్నేహ సౌహార్ధ్రాలతో నాగజాతీయులని చనువు చేసుకోవాలని సైనికులు నిశ్చయించుకున్నప్పటికీ -వారి మంచితనాన్ని తెలుసుకోలేని నాగాలు ఎవరో శత్రువులనుకొని సైనికుల మీద దాడిచేసి చిట్టచివరకు లోబడిపోతారు.
    ఆ దాడిలో నాగాల సర్దార్ మరణిస్తాడు. సర్దార్ కొడుకైన తృబాని లెఫ్టినెంట్ సాహసించి విషపు బాణాలని కూడా లెక్కచెయ్యకుండా దూసుకువెళ్ళి- మూర్చబోయిన వాడిని తన టెంట్ లోకి తీసికెళ్తాడు. కేంప్ డాక్టర్ త్రూబా శరీరంలోంచి ఐదు తుపాకీగుళ్ళు తీసి పునర్జన్మ ప్రసాదించినప్పుడు త్రూబా కన్నులు కృతజ్ఞతతో వాలిపోతాయి-తండ్రి మరణంతో సర్దారైన త్రూబాకీ లెఫ్టినెంట్ కీ స్నేహం కుదురుతుంది. దానితో నాగాలకీ సైనికులకీ పొరపొచ్చాలు తెగిపోతాయి. నాగాలు సైనికుల టెంట్స్ కీ-సైనికులు నాగాల గూడేలకీ రాకపోకలు సాగిస్తారు. కర్నల్ బోస్ త్రూబాకి ఎన్నో బహుమతులిస్తాడు. అలాగే సర్దార్ కూడా సైనికులకి చాలవస్తువులిస్తాడు. సైనికుల ఉద్భోధల మూలంగా నాగాలలో తెలివితేటలు పెంపొందుతూంటాయి. వారి మిషన్ ఆశయం సఫల మైందని తలుస్తారు సైనికులు.
    సరే! అంతా సవ్యంగా సాగిపోతూన్న ఆరోజుల్లో త్రూబాకి ఒక్కగానొక్క చెల్లెలైన సీమ లెఫ్టినెంట్ ని ఆకర్షిస్తుంది. లెఫ్టినెంట్ సీమకి కూడా కొన్ని బహుమతులిస్తాడు. లెఫ్టి నెంట్ గుంపు, నృత్యాలు చూడటానికెళ్ళి నప్పుడు సీమ తనని తానే మరిచి నాట్యం చేసేది. చాటుమాటుగా లెఫ్టినెంట్ ని కలవటానికొచ్చేది. రాత్రుళ్ళు చంద్రోదయమయేసరికి సీమకూడా లెఫ్టినెంట్ టెంట్ పరిసరాల్లో ఉదయించేది. దూరంగా రాతి గుట్టల వెనుక సన్నటి కోయిల స్వరం వింటూనే లెఫ్టి నెంట్ దొంగలా అక్కడికి చేరిపోతూండేవాడు,
    వెన్నెలవంటి సీమతో దాగుడుమూతలాడుతూ ఎన్నిరాత్రుళ్ళు గడిపివేశాడో-ఆసీను ఒళ్ళో పడుకొని లంబాడీ పాటలు ఎన్ని విన్నాడో తెలీదు. ఆ చందమామ అంతర్ధానమై పోతూండగా విడిపోయే సమయంలో అందాలసీమ లెఫ్టినెంట్ మెడచుట్టూ చేతులువేసి - "నన్ను విడిచి వెళ్ళిపోవుకదూ?" అని అడిగేది. ఆక్షణం లెఫ్టినెంట్ కి సర్వస్వం వదులుకుని నాగజాతిలో కలిసి పోవాలనిపించేది.
    లెఫ్టినెంట్ ప్రేమగాధ కేంప్ లో అందరికీ తెలిసింది. కర్నల్ బోస్ "చాల భయంకరమైన పరిణామాలు కలగొచ్చు సుమా!" అని హెచ్చరించాడు కూడా కాని లెఫ్టినెంట్ ఎప్పటికి ఆ రాతి గుట్టల వెనుకకి చేరకుండా వుండలేకపోయే వాడు. ఓనాటిరాత్రి వారి దాగుడుమూతలు త్రూబాయే స్వయంగా చూశాడు. నాగాల గూడెంలో ఈవిషయంమీద చర్చలు చెలరేగాయి. ఐనప్పటికీ యవ్వనదశలో ప్రేమ పాశంలో చిక్కు పడిపోయిన సీమ ఆ చిక్కులు తప్పించుకోటానికే మాత్రమూ ప్రయత్నించలేదు.
    అనుకోకుండా ఆనాడు రెజిమెంట్ ని ఆ ప్రాంతాలనుంచి ముందుకు సాగమని ఆర్డరొచ్చింది- "మేమీ ప్రాంతం వదిలివెళ్ళి పోతున్నామని లెఫ్టినెంట్ సీమకి చెప్పక తప్పలేదు. సీమ కళ్ళనీళ్ళు పెట్టుకొంది - "ఉద్యోగం వదిలేసి నువ్వయినా ఇక్కడ వుండి పో. లేక పోతే నన్నయినా నీవెంట తీసుకు పో" అని అడిగింది. లెఫ్టినెంట్ చిక్కులో పడ్డాడు. ఆఖరికి -తనకి భార్యా కొడుకూ వున్నారనీ సీమని తీసికెళ్ళటానికి వీల్లేదనీ ఖచ్చితంగా చెప్పేశాడు.
    నిరాశతో కోపంతో సీమ మొహం ఎర్రబారి పోయింది. లెఫ్టి నెంట్ కేసి క్రూరంగా చూడసాగింది. నడుం నుంచి వేలాడుతూన్న కత్తిని పిడికిట్లోకి తీసుకున్నంతలోనే లెఫ్టినెంట్ బలంగా సీమచేతిని విడిపించి దాన్ని కొండల క్రిందకి విసిరేశాడు. సీమ కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. లెఫ్టినెంట్ పాదాలమీద తల ఆన్చి వెక్కివెక్కి ఏడవటం మొదలెట్టింది. లెఫ్టి నెంట్ నిర్దయగా-నిర్లక్ష్యంగా కాళ్ళు వదిలించుకొని వెనక్కి తిరిగి కొండ దిగి పోసాగాడు. అలా రెండడుగులు వేశాడో లేదో వెనకనుంచి బాధాపూరితమైన కేకా-దభేలుమన్న చప్పుడూ! అంతా తిరిగి ప్రశాంతమై పోయింది. లెఫ్టి నెంట్ వెనక్కి తిరిగి చూసిన ఆ భయంకర దృశ్యం అతని కెప్పటికీ మరుపు రావటం లేదు. అమాయకురాలైన సీమ అందాల శరీరం ఎక్కడో కొన్నివేల అడుగులలోతున రాళ్ళగుట్టమీద చితికి చితికి పడివుంది. సీమ ఎత్తి పట్టిన చేతులు అప్పుడుకూడా ఆ వెన్నెల రాత్రిలో ఎవరినో పిలుస్తున్నాయి. లెఫ్టి నెంట్ రెండు చేతులతో కళ్ళు గట్టిగా కప్పుకొని పరుగు పరుగున టెంట్ లోకెళ్ళి పోయాడు.
    కాస్సేపటిలోనే పర్వతాల క్రింద నాగాల గూడెంలో యుద్దసూచకంగా నగారాలు మ్రోగటం మొదలుపెట్టాయి, సైనికులందరు కలవరపడుతూ తుపాకీలు సర్దుకొంటూంటారు. హఠాత్తుగా ఏమిటదని కర్నల్ బోస్ విస్తుపోతాడు. అంతలో గూడెంలోంచి మంటలు చెలరేగుతూన్న ఒక బాణం దూసుకొచ్చి కేంప్ మధ్యలో రెపరెపలాడుతూన్న జెండాని మసిచేసి వేస్తుంది. తెల్లవారుతూండగా నగారా మోతలు మరీ విజ్రుంభిస్థాయి. విల్లులూ-అమ్ములూ ధరించిన నాగాలు గుంపులు గుంపులుగా పర్వతం ఎక్కి కేంప్ కేసి రావటం మొదలుపెడతారు. కర్నల్ బోన్ త్పూలాని చూస్తూ స్నేహపూర్వకంగా చేతులు చాపుతాడు. కాని సర్దార్ చెయ్యి పైకెత్తి గంభీరంగా- "ఇరవై నాలుగుగంటల లోపల నా సోదరి సీమను హత్యచేసిన లెఫ్టినెంట్ ను మాకు స్వాధీనం చెయ్యకపోతే కేంప్ మీద దాడి చేస్తాం. ఒక్క సిపాయినికూడా ప్రాణాలతో విడిచిపెట్టం అంటాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS