
"కూర్చో చండి!"
"నా కావల బోలెడు పనులున్నాయి! 'అబ్బాయికి డబ్బులిచ్చావా?' అని మీరు నన్నడిగితే 'ఇచ్చానూ ' అంటాను! ఆ ముష్టి అరవై రూపాయలు అబ్బాయికి ఏ మూలకు? నేనూ అడపాదడపా ఏదో....పాతికో ఇస్తున్నాను."
"అంతేనా?.....ఆహా....వంద, రెండు వందలు ఒక్కొక్క తడవ ముట్ట జేబుతున్నావేమోనని?"
"ఆ వందలూ, వేలూ మీరు నాకిస్తున్నారనా , నేను వాడికిస్తూన్నాను! ఆ అరుణ అక్కౌంట్ లో ఆరు వేలుంటే.....కనీసం నా పేరిట ఏ బాంకు లో నయినా అక్కౌంటనేది ఉందా?"
"సరి, నీ బాధలు నీకూ ఉన్నాయిలే పాపం! ఇక నువ్వు వెళ్ళచ్చు!"
"చిత్తం!" అంటూ అతి విసురుగా వెళ్ళిపోయింది చాముండేశ్వరి.
సేతుపతి గారే స్వయంగా వెళ్ళారు అరుణ గదికి. వాడుక చొప్పున, ఆ అమ్మాయి పుట్టెడు పుస్తకాల మధ్య కూర్చుని శ్రమ పడుతుంది. చూడగానే సేతుపతి గారి కడుపు నిండిపోయింది. అరుణ ఆయన్ని గమనించలేదు. తన చదువేమో....తన లోకమేమో! సేతుపతి గొంతు సవరించు కున్నారు. అరుణ ఆయన్ని గమనించి, దిగ్గున లేచి నిలుచుని, "మామయ్యగారూ, మీరా! ఎంత సేపయిందీ వచ్చి? క్షమించండి. నేను మిమ్మల్ని గమనించనే లేదు!" అంది.
"నన్ను గమనించనందుకు నాకే బాధా లేదు గానీ... రఘుని కూడా నీ అంతటి వాణ్ణి చెయ్యడానికి నీవు ప్రయత్నించడం లేదనే నాకు చాలా చింతగా ఉందమ్మా,
దానికి బదులుగా అరుణ ఏమనగలుగుతుంది? మందహాసం చేసి, పుస్తకాలు సర్దడం మొదలు పెట్టింది.
"కూర్చోండి మామయ్యగారూ!"
"కూర్చుంటానమ్మా. నిలుచునే ఓపికా లేదు నాలో ఇప్పుడు" అంటూ కూర్చుని , సేతుపతి దీర్ఘంగా అలోచించి, తనలో తాను ఒక నిశ్చయానికి వచ్చి మొదలు పెట్టారు.
"అరుణా, నీ మనస్సు ఎంత సున్నితమైనదో నాకు తెలుసు. నీవు ఎంత బుద్ది మంతురాలి వో కూడా నాకు తెలుసు. నీవు అన్నివేళలా మా క్షేమాన్నే గాని మరి దేనినీ కొరవు...."
అరుణ కు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకో అర్ధం కాలేదు. "ఉన్న విషయాన్ని నాతొ చెప్పడానికి కూడా ఎందుకండీ మామయ్యగారూ , ఇంతగా సంకోచిస్తున్నారు?"
"రఘుకు నీవేమైనా డబ్బు లిస్తున్నావా, అరుణా?"
అరుణ, ఇక అయన చూపులతో తన చూపులను కలప లేకపోయింది. తల వంచి, నేల మీద ఉన్న తివాసీ మీది చిత్ర విచిత్రాలయిన అల్లికల్ని చూడడం మొదలు పెట్టింది.
"ఇస్తున్నావా , అమ్మా?"
"ఇస్తున్నానండి!"
"ఎంత?"
"రఘు అడిగినంత."
"బాంక్ పాస్ బుక్కు నీ దగ్గిరే ఉందా?"
"ఉందండీ' అంటూ వెళ్లి, ఆ పుస్తకాన్ని తెచ్చి ఇచ్చింది. సేతుపతి పేజీలు తిరగవేశాడు . అరువల చిల్లర ఉండవలసిన అరుణ అక్కౌంటు లో పద్నాలుగు వందల చిల్లర ఉంది! సేతుపతి గారు ఉస్సురన్నారు. అరుణ చూపులు తివాసీ నే ఆశ్రయించి ఉండిపొయినాయి.
"ఈ పాస్ బుక్కు , నీ చెక్కు బుక్కు అయ్యం గార్ గారికి అప్పజెప్పేసెయ్యి."
"అలాగేనండీ."
"ఎందుకు నేనిలా చేస్తూన్నానో నీవు అర్ధం చేసుకో గలవను కుంటా."
"నన్ను క్షమించండి, మామయ్యగారూ!"
"ఛీ ఛీ....నీవేం అపరాధం చేశావు కనక? రఘు మనకు తెలియనంత ఇదిగా చెడిపోతున్నాడు అరుణా! వాడికి నేను డబ్బు లివ్వలె కనా? ఇదంతా వాడిదేగా? అయినా, ఏ వయస్సు లో ఏది చేస్తే వ్యక్తికీ వన్నె తెస్తుందో ఆ పనే చెయ్యాలి. పద్దెనిమిదేళ్ళ కుర్రాడికి రేసు లెందుకు?"
అరుణను కొరడా తో కొట్టినట్ట యింది!
"నిజంగానమ్మా. నా కళ్ళారా చూశాను. వాడికి చెడు సావాసాలు బాగా అబ్బినాయి."
"అయిందేదో అయిపొయింది. నేను నచ్చ చేబుతాలెండి, మామయ్యగారూ. మీరు మాత్రం రఘును ఏమీ అనద్దండీ!"
'అనేవాణ్ణి అయితే వాణ్ణి అక్కడ చూడగానే......అనేసే వాడ్నమ్మా. నా పద్దతి అది కాదు. నీవేమీ మనసు కష్ట పెట్టుకోవద్దు , అరుణా!"
"నన్ను క్షమించండి మామయ్యగారూ. నేను ఇంతదూరం ఆలోచించలేక పోయాను."
"నీవేమీ బాధపడద్దు. మరి, రఘు మళ్ళీ డబ్బడిగితే ఏం చెబుతావు?"
"ఏదో విధంగా నచ్చ చేబుతాలెండి, ,మామయ్యగారూ, ఇక మీదట రఘు చదువు మీద శ్రద్ధ పెట్టెలా నేను చూస్తాగా?"
"ఏదో నీవయినా పుణ్యం కట్టుకో తల్లీ. నేను జోక్యం కలుగ జేసుకుంటే వాడు చెడు నించి మరింత చెడుకు దారి తీస్తాడేమోనని భయంగా ఉంది. నీవు ప్రయత్నించు , చూద్దాం! మార్పులు తీసుకురావడం కాలధర్మం. ఆ కాలం ఏం చేస్తుందో ఇంకా కొంతకాలం ఆగి, చూచి, ఆ తరవాత ఆలోచిద్దాం. వస్తానమ్మా. నువ్వు చదువుకో. అయాం సారీ. డిస్టర్బ్ చేశాను" అంటూ, ఆలోచనలతో , బరువెక్కిన మనస్సుతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోయారు సేతుపతి.
ఇక అరుణ మాత్రం పుస్తకాలు తెరిచి చేసేదేముంది? అందుకని, ఆ అమ్మాయీ ఆలోచిస్తూనే కూర్చుంది. సరిగ్గా ఆ సమయానికే రఘు కూడా అక్కడికి వచ్చాడు.
"ఆరూ, ఏడు వందలు వచ్చాయి. అయిదు వందలు ప్లస్. ఇదుగో ఈ మూడు వందలూ నీ అప్పు కింద జమ కట్టుకో."
అరుణ కు తెలియ కుండానే ఆమె కళ్ళు ఏకధారగా కన్నీరు కారుస్తున్నాయి. తన మనో వేదన నూ, ఆ మనో వేదన కలిగించిన దుఃఖాన్ని తనలోనే ఇముడ్చు కోవాలని అరుణ ఎంతో ప్రయత్నించింది . కానీ.. ఉప్పెన వచ్చినప్పుడు సముద్రం ఎలా అయితే తన అవధిని దాటి రాకుండా ఉండలేదో, అలానే అరుణ అనుభవిస్తున్న దుఖమూ పొంగి, పొర్లి అంతటినీ ముంచుకు వచ్చింది! బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది అరుణ.
"ఆరూ, అరుణా, ఎందుకూ? అరె....."
ఏడుస్తూనే "రఘూ , ఆ డబ్బంతా నీ దగ్గిరే ఉంచుకో. నీవు నాకేమీ బాకీ లేవు. కానీ, ఇకమీదట మాత్రం ఏ పరిస్థితుల్లోనూ నన్ను నీవు డబ్బు అడగద్దు. నామీద నీకే మాత్రం కనికరమున్నా ఆ సహాయం ఒక్కటీ చెయ్యి" అంది.
"నాన్నగారికి తెలిసిందా?' అన్నాడు రఘు, ఎంతో ఆదుర్దాగా.
"నిన్ను మామయ్యగారు రేసు కోర్సు లో చూశారట!"
"ఆ!"
"ఎన్నిమార్లు చెప్పాను నీకు? ఈ వయస్సు లో నీవు చెయ్యవలసిన పనులేనా? ఈ స్టూడెంట్స్ యూనియన్లూ....ఈ రాజకీయాలూ.... ఈ జూదాలూ ...ఈ దురలవాట్లూ అన్నీను! మామయ్య గారికి నీవు తప్ప మరెవరున్నారు? నీ చేతల వల్ల అయన మనస్సు ఎంత గాయపడుతుందో నీవేనాడైనా ఆలోచించావా? అయన రక్తమాంసాలు పంచుకుని పుట్టినందుకు నీ కర్తవ్యమేమిటి? ఆయన్ని సంతోష పెట్టడమా? లేక, అయన గుండె నిలా రంపపు కోత కోయడమా? నీవు శ్రద్దగా చదువుకుని, నలుగురి లోనూ మంచి వాడివని పించుకుంటే ఈ జీవితంలో మామయ్యగారు కోరుకోదగినది ఏముంటుంది? నీ ఈ నడత, నీకు నలుగురి లో మంచి పేరు సంపాదించి పెడుతుందా? ఆలోచించు, నీకంటే చిన్నదాన్ని. మీ ఉప్పు తింటూ, మిమ్మల్ని ఆశ్రయించుకుని పడి ఉండేదాన్ని. నాకు మంచి అని తోచిన దాన్ని నీకు మనవి చేసుకుంటున్నాను. చెవిని పెడతావో....పెడచేవి ని పెడతావో నీ ఇష్టం! కొడుకు అన్నవాడు ఉండగానే ఏ తండ్రీ సంతోషించడు.
"పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!'
అని అనుభవజ్ఞులయిన మన పెద్దలు ఎంత గొప్పగా వివరించారు, ఇటువంటి విషయాల్ని! అన్నీ తీరిగ్గా అలోచించి, నీకేది మంచిదని తోస్తే అది చెయ్యి" అంటూ జడి వానలా , తన మొరను తాను వినిపించింది అరుణ. రఘు, అసలు నోరెత్తలేదు. అక్కణ్ణించి వెళ్ళిపోయాడు అంతే.
భోజనాలకు రండని అందరికీ కబురు వచ్చింది. "ఒంట్లో బాగాలేదు" అన్నారు సేతుపతి. "ఆకలి లేదు" అంది అరుణ. రఘు, తనకసలు అన్నమే వద్దన్నాడు! ఒకేరోజు, ఒకే పూట , ఇంతమంది దేన్నీ గురించి సతమత మావుతున్నారో తెలియక చాముండేశ్వరి ఏదేదో సణుక్కుంది!
