Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 19


    రవీంద్ర తరవాత ఆమె నేమనలేక పోయాడు. ఆ సాయంత్రానికి సరస్వతి కి జ్వరం తగ్గింది. కళ్ళు తెరిచి పక్కన కూర్చున్న గోదాదేవి ని చూసింది. 'వెళ్లలేదూ?' అంది.
    ఆమె జరిగింది చెప్పింది. నీరసంగా నవ్వి అంది.
    'ఆ రవీంద్ర కు విడాకులిచ్చి నన్ను చేసుకో రాదూ?'
    'ఫరవాలేదు....పులుసు చావలేదు.'
    'నిన్ను వెళ్ళ నివ్వటం నాకిష్టం లేదు.'
    'చూస్తె దొంగ జ్వరం లా ఉంది.' అన్నట్లు సరస్వతి కి తరవాత జ్వరం రాలేదు.
    ఆ మధ్యాహ్నం సావిత్రమ్మ గోదాదేవి దగ్గరగా కూర్చుంది. సరస్వతి అప్పుడే స్నానాని కెళ్ళింది. నిద్రబోతున్న హసంతి ని జోకొడుతుంది గోదాదేవి. రవీంద్ర, గోదాదేవి ల జంట రవ్వల జోదులా ఉందని మెచ్చుకుంది.
    ఆ మాటా ఈ మాటా మాట్లాడి, శ్యామల వివాహం సంగతి ప్రస్తావించి, ఆమె నింట్లో సూచించమని కోరింది.
    'అది ఖాయమయిందేగా....అనంతయ్య గారు కూడా నాకు వ్రాసారు.'
    'అయిందే అనుకో...ఆ పని జరిగిపోతే నాకు భయం లేదు.'
    'ఈరోజు కాకపోతే రే పవుతుంది -- భయమెందుకు?'
    'పెద్దవాళ్ళ జాగ్రత్తలు మీకు తెలీవు---'
    తెలీదంటూనే తననే అడుగుతున్న ఆమె తెలివికి గోదాదేవి నవ్వుకుంది.
    'మధ్యలో సరస్వతి గతి ఇట్లా కాకపొతే ఈ పాటి కయ్యేదే! పోయిన వాళ్ళతో మనమూ పోలేం. మరణ దుఃఖాన్ని మరో పెళ్ళి జేసి మాన్పుకో మన్నారు పెద్దలు.'
    అదీ నిజమేనేమో! అందువల్ల నైనా ఈ నిశ్శబ్ధత తొలగి పోతుందేమో? సరేనంది గోదాదేవి.
    ఈమె తన నెందు కడిగింది? ఇంటి ఆడబిడ్డగా ఆమెకు లేని హక్కు తన కేముంది? బహుశా వీళ్ళు తన పట్ల చూపుతున్న ప్రేమ వల్ల అట్లా అనుకుందేమో?
    లేచి, అటూ ఇటూ తిరుగుతూ సరస్వతి కోసం చూస్తుంది. కిటికీ లోంచి అవతల నన్నయ్య కి అన్నం బెడుతున్న శ్యామల కనిపించింది. ఒక్క నిమిషం గమనిస్తూనే ఆమె మేధ ఆ పెట్టడం లో ఏదో ప్రత్యేకతున్నట్లు కనిపెట్టింది. ఇంతలో సరస్వతి వచ్చి గోదాదేవి ని భోజనానికి రమ్మంది. ఆమె కళ్లలో అదే దృశ్యం కనిపిస్తుంది. ఏమిటి దానర్ధం? శ్యామల వాసవి కి కాబోయే భార్య! తానేవారితో చెప్పాలి? అసలు చెప్పాలా? వద్దా? చెపితే ఏమవుతుంది? ఇది శ్యామల బాల్య చాపల్యం మాత్రమే అయితే, చిన్న తప్పుకు పెద్ద శిక్ష విధించి నట్లవుతుంది. చెప్పక పొతే! వాసవి బ్రతుకు భగ్న మవుతుందా? ఇది వీళ్ళకూ తెలుసేమో! ముఖ్యంగా సావిత్రమ్మ కు తెలుసేమో! మోసం! మోసమేనా! ఏమో మరి.... ఆలోచనలతో సతమతమవుతూ , ఒక గంట విశ్రమించి లేచేటప్పటికి తన పేరిట టెలిగ్రామ్ !- తక్షణం బయలుదేరి రమ్మని పద్మనాభయ్య! ఏమయింది? భయంతో గుండె అదురుతూంది. ఆ ఉద్వేగంలో ముందు ఆలోచన అడుగున పడిపోయింది. ఆమెకు అంతర్యం లో ఒక ఆశ! అది రవీంద్ర తనను రప్పించు కోవడానికి కిచ్చిన టెలిగ్రామని. అందువల్ల కొంత నెమ్మది.
    పొద్దుగుంకక ముందే స్టేషన్ చేరుకోవడానికి వీలుగా నన్నయ్య అప్పుడే బండి తీసుకొచ్చాడు. అందరికీ చెప్పేసి బండి ఎక్కింది. నిలుచున్న అందరి కళ్లలో ఆందోళన! తేలిక చెయ్యటాని కన్నట్లు సరస్వతి అంది; 'త్వరగా కడుపు పండించుకో! తోలి కాన్పు ఇక్కడే.'
    సిగ్గుతో పక్కకు తిరిగింది. బండి కదిలింది. ఆమె తలలో ముసురుకున్న ఆలోచనలు. రవీంద్ర తో తన పెళ్లి, వాసవి ఉత్తరం, జాలి కలిగించే సరస్వతి జీవితం. ఇప్పుడు వాసవి జీవితం గూడా జాలి పడవలసిందేనెమో! అప్పుడు జ్ఞప్తి కొచ్చిందామెకు!'    
    'నన్నయ్యా!'
    'ఏమమ్మా!' అన్నాడు వెనక్కి తిరిగి.
    'ఒక్క టడుగుతాను....నిజం చెబుతావా?'
    'అడుగు!' కంపిస్తున్నగొంతుతో.
    'వాసవి పైన నీ కెంతో అభిమానం కదూ?'
    వాసవి పైన అభిమానమని తన నోటి తోనే చెప్పాలా? 'అది నాకు తెలుసు.... ఆయనకూ తెలుసునమ్మా!'
    'శ్యామల నీతో చనువుగా ఉంటుంది కదూ?'
    'శ్యా' అన్న మాటతో ఉలికిపడ్డాడు. ఎన్నాళ్ళ గానో తనలో కలిచి వేస్తున్న విషయాన్ని ఈమె కనిపెట్టింది. ఇంతకాలానికి తన భారాన్ని దించడానికీమే తయారయింది. నన్నయ్య కళ్లల్లో నీళ్ళు కమ్మినాయి.
    'అమ్మా! నేనా రోజు చచ్చిపోయి ఉంటె బావుండేది.'
    ఆశ్చర్యపడింది. గోదాదేవి. ఆ మనస్సు నిష్కల్మషత్వం అర్ధమైంది. కరిగిపోయింది. శ్యామల రక్తమిచ్చి నన్నయ్య ను బ్రతికించు కుంది. అది చాపల్యం కాదేమో, సాఫల్యమేమో? తనేం చెప్పగలదు?
    తరవాత ఇద్దరూ మాట్లాడలేక పోయారు . రైలు పెట్టెలో కెక్కిన ఆమెకు నమస్కారం చెప్పాడు నన్నయ్య. ఆమె ప్రతి నమస్కారం చేసింది.

                           *    *    *    *
    ఆందోళనా హృదయం తో అడుగు పెట్టిన ఆమెకు, పేపరు ఒళ్లో వేసుకుని ఆలోచిస్తూ కూర్చున్న పద్మనాభయ్య కనిపించాడు. గుమ్మం లో గోదాదేవి ని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు. ఆమె మనస్సు తేలిక పడింది.
    'భయమేసిందా?' లాలనగా అడిగాడు.
    'కాదా మరి" అన్నట్లు చూసింది . అనవసరంగా భయ పెట్టినందుకూ చిరాకూ ఉంది; ఏ ఉపద్రవం జరగనందుకు సంతృప్తీ ఉంది ఆ చూపులో.
    'రవీంద్ర బాధ చూడలేక పోయాను మరి....'
    'అందుకేనేమో ఎదురుగా కాచుకునున్నాడు...'
    'అతనికీ తెలీదు. చెప్పకుండా అకస్మాత్తుగా రప్పించాలనుకున్నాను. ఈవేళ ఆదివారం. ఇంటి దగ్గరుంటాడనుకున్నాను. తిరుచానూరు లో స్నేహితుని పెళ్లని ఆరింటికే వెళ్ళాడు.'
    'అరె! ఎప్పుడొచ్చావు? ఇప్పుడే నేను లోపలి కెళ్ళాను...' అంటూ వచ్చింది అలివేణి.'
    'సరే! లోపలికి పదమ్మా!'--
    పద్మావతమ్మ కొంచెం విషాదంగా, ముభావంగా కనిపించింది. కారణ మేమిటో? భార్యాభార్తా లేమైనా అనుకున్నారేమో? ఏమీ ఆలోచించే అవకాశం ఇవ్వకుండానే అలివేణి ప్రసంగం నడిపిస్తుంది. కాఫీలు, తాగి, కొంచెం సేపు అనంతయ్య, కుటుంబాన్ని గురించి మాట్లాడుకున్నారు. తరవాత గోదాదేవి తన ప్రయాణం లో తీసు కెళ్ళిన బట్టలు మామూలుగా సర్దేసుకునే సరికి భోజనాల వేళయింది. భోజనాలు చేసి, రాత్రి నిద్ర లేదు కనుక, కొంచెం పడుకుని లేచేసరికి నాలుగయింది. హల్లో అలివేణి-- పద్మావతమ్మ తో పాటు మరో యువతి కూర్చోనుంది. అమెది కర్నూలట! తెలిసిన వాళ్ళే! కొండ పై కెళ్లాలని వచ్చిందట. మళ్లా సంభాషణ ప్రారంభమయింది. ఆ సంభాషణ లో గోదాదేవి ఏ ఊరెళ్ళింది , అది ఆమె జన్మ స్థల మయిందీ గూడా ప్రసక్త మయింది. ఆ అమ్మాయి పేరు కమల! ఆమె పొట్టిగా, బొద్దుగా, తెల్లగా ఉంది. ఆ తెల్లని ముఖం లో స్పుటంగా కనపడుతున్న స్పోటకపు మచ్చలు! ఆమె గోదాదేవి ని పరిశీలనగా చూస్తూ, తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ ఆలోచిస్తుంది! ఆమె చూపులు గోదాదేవి కి వెగటు కలిగించలేదు. అవి లోపాన్ని గుర్తించాలన్నట్లు కాక, స్వయం శిక్షణా పూర్వకమైన మానసిక సంస్కారాన్ని చాటుతున్నాయి. ఆ వ్యక్తిత్వం మీద అభిమానం కలిగింది గోదాదేవి కి.
    సాయంత్రమయింది. రవీంద్ర కోసం ఎదురు చూస్తుంది గోదాదేవి. రాత్రయింది! మళ్ళీ భోజనాలు. తోచక తన గదిలోంచి ఇవతలకు రాబోతున్న గోదాదేవి కి   పద్మావతమ్మ, అలివేణి, పద్మనాభయ్య , కమల మాట్లాడుతుండటం కనిపించింది. మళ్ళీ వాళ్ల దగ్గరకు వెళ్లి , ఒంటరితనం పోగొట్టు కోవడం ఇష్టం లేక, గోదాదేవి గదిలో కెళ్లి పడుకుంది. ఎందుకనింకా రాలేదు రవీంద్ర? ఇన్నాళ్ళు గా ఉన్నది, ఈవేళ ఇంతగా ఎందుకని ఎదురు చూస్తుంది తాను? రాత్రికి రాకపోతేనేం? పొద్దున్న రాకపోడుగా....అంత చిన్న విషయమేనా ఇంత అశాంతి కలిగిస్తుంది? ఎంత చిత్రం! హృదయమే ఇంతా? లేక స్త్రీ హృదయమే ఇంతా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS