Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 20


    'ఎంతసేపయింది ? ఎవరో తేలియదా రంగయ్యా' నెమ్మదిగా అడిగాడు బలరాం.
    'అమ్మగారింటి తోటాడి మనవడయ్యా' ఆన్నాడు రంగయ్య. గేటు వేసి ఇంట్లో కొచ్చాను. నువ్వక్కడ లేవు. అంతా తిరిగి ఇటోచ్చాను.' అంటూ ఆలస్యాన్ని వివరించాడు రంగయ్య--
    'ఎవరిదో కారు చప్పుడయింది-- చూశావా?'
    'లేదయ్యా, నేనేగా గేటేసి వచ్చాను' అంటూ ఎందుకేనా మంచిదంటూ  గేటు కేసి పరుగెత్తాడు. గేట్లు బార్లా తీసి ఉన్నాయి. ఎవరబ్బా? వచ్చారా? వెళ్లారా అని ఇంటి గుమ్మం కేసి పరుగెత్తాడు. పక్క గారేజీ తలుపు తెరిచి ఉంది. అమ్మాయి గారి కారు లేదు. పరుగు పరుగున బలరాం దగ్గిరకి వచ్చాడు రంగయ్య.
    'అమ్మాయి గారు బాబూ, కారేసు కెళ్లి నట్టుంది ---' అన్నాడు భయంగా --
    'లలితా? ఎందుకెడుతుంది టైములో" అంటూ ఒక్క ఉదుటన లేచి వరండా పిట్ట గోడ మీంచి దోకి గుమ్మంలోకి వచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చుంది ఉంది సరళ.
    'ఎమిటిక్కడ కూర్చున్నావు సరళా? లలిత కారేసుకు వెళ్ళడం చూశావా?' ఆత్రంగా అడిగాడు.
    'చూడలేదు -- కాని కారు గేటు దాటేక చూశాను....'
    'ఎక్కడి కెళ్లి ఉంటుంది? ఎందుకింత రాత్రి వేళ ఒక్కర్తే వెళ్ళింది.'
    'నీవెంత అమాయకుడిని బలరాం, ఓ ఆడపిల్ల రెండో కంటికి తెలియకుండా రాత్రి పూట ఎక్కడికి కెడుతుంది ప్రియుణ్ణి కలుసుకుందుకు కాకుంటే' నవ్వింది సరళ. బలరాం చేయి చాచి చెంప మీద కొట్టాడు. 'ఆ' అంటూ ఆశ్చర్యం నుంచి తెరుకుందుకు క్షణం పట్టింది సరళకి.
    'ఏం నిజం చెప్పడం తప్పా?,.... ఎక్కడి కెడుతుందో నాకు తెలుసు కనక చెప్పాను' అంది చెంప తడుముకుంటూ. పళ్ళు కొరికాడు బలరాం. చేతిలో కాగితం నలిపేశాడు. -- అప్పుడే గుర్తుచ్చింది -- అదంతా తాను చదవలేదని ....నలిగిపోయినదాన్ని సాపు చేసి లైటు కిందకి కదిలాడు. చదువుతున్నంత సేపూ అతని ముఖం కోపంతో బిగుసుకు పోయింది. చదవడం ముగించి కాగితం జేబులో పెట్టేశాడు.
    'మైగాడ్! నా పంచన ఎలాంటి వాళ్ళున్నారు!' అనుకున్నాడు.
    'అది ఎవరికి వారు తెలుసుకో గల్గాలి బలరాం, నేను చెప్తే నమ్మేవాడివా? జలసీ! అనేవాడివి. అవునా?' అంది దగ్గిరగా వస్తూ -- తన పధకం యింత బాగా అమలులోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది సరళ కి.
    'షటప్ , నువ్వూ బయలుదేరు నాతొ....అంటూ గారేజీ కేసి నడిచాడు బలరాం.
    అంతా అయోమయంగా తోచింది సరళకి.
    'ఎక్కడికి? మనం ఎందుకు ఇప్పుడు వెళ్ళడం?' అంటూనే కారు దగ్గరకి నడిచింది సరళ.
    'ఇక మాట్లాడకు సరళా నే చెప్పినట్టు వినడమే నీ వంతు. కారెక్కు ' అని గదమాయించాడు.
    'అటు కాదు ఇటు నువ్వు డ్రైవ్ చేయి. నేను కూర్చుంటాను' అంటూ డ్రైవరు సీటులోకి సరళని తోసి తలుపు వేశాడు బలరాం.
    ఏమీ చెయ్యలేక కారుని గారేజీ లోంచి ఇవతలకి తెచ్చి నెమ్మదిగా గేటు కేసి మళ్ళించింది.
    ఈ హడావిడికి సరస్వతమ్మ గారు బయటికి వచ్చారు.
    'ఇప్పుడెక్కడి కర్రా సాయింత్రం అంతా అయిందిగా' అన్నారు వస్తున్న అవలింతలని ఆపుకుంటూ.
    'నీవి సరళవీ సామాన్లు సర్దుకొండత్తయ్యా , నే తిరిగి వచ్చేసరికి' అంటూ హెచ్చరించాడంతే బలరాం.
    వాటి అంతరార్ధం బోధపడలేదు సరళకి.
    కారు గేటు దాటేసరికి ఇంట్లో దీపాలన్నీ వెలిగాయి.
    పనివాళ్ళ తో సహా అంతా ముందు వరండా లోకి వచ్చేశారు.
    బలరాం హెచ్చరిక అర్ధం కాక అలాగే కుర్చీలో కూలబడి పోయారు సరస్వతమ్మ.
    'లలిత ఎక్కడి కెళ్ళిందో నీకెలా తెలిసింది!' సిగరెట్టు వెల్గిస్తూ అడిగాడు బలరాం.
    కొంచెం కంగారు పడింది సరళ. 'నాకు చెప్పి వెళ్ళిందిగా?'
    'ఎందుకు చెప్పింది?' సూటిగా అడిగాడు.
    'మరేమో ...మోహన్....
    "ఊ మోహన్....కానియి సరళా ఇంకా దాపరికం ఎందుకు?'
    'మోహన్ కి లలిత పగడాలిచ్చిందట అమ్ముకోమని.'
    "అందుకని.'
    'అవి యివ్వలేదంది నాతొ....వెళ్లి అడిగోస్తానంది....' సరళ కి సరైన సమాధానాలు తోచడం లేదు.
    'ఇచ్చిందని నీకెలా తెలిసింది?'
    'నాకతను చెప్పాడు....' చెప్పక తప్పలేదు సరళకి.
    'ఎప్పుడు?'
    'సాయంత్రం....
    'మరతగాడు మాకు కనపడలేదేం?'
    'మనం బయలుదేరబోయే ముందే వచ్చాడు...' పోడారి పోతున్న పెదవులని నాలుకతో తడుపుకోంది సరళ. స్టీరింగు మీది చేతులు వణుకుతున్నాయి.
    'లలితని వాటికోసం పంపిస్తానని కూడా చెప్పానా?'
    'లేదే, నేనెందుకు చెప్తాను!'
    'నువ్వెందుకు చెప్తావులే....ఇదిగో ఈ ఉత్తరం చెప్తుంది అంతా,' అన్నాడు జేబుని చేతిలో తట్టి.
    పై ప్రాణం పైకే పోయినట్టయింది సరళకి.
    "ఎవరు రాసారది!' నీరసంగా అడిగింది....
    'ఏం మోహన్ రాసి ఉండకూడదా?'
    'మోహన్ ఎందుకు రాస్తాడు! అలా రాయనే రాయడు.' అంది సరళ.
    'అయుండొచ్చు చూస్తాంగా.'
    'ప్లీజ్ బలరాం నన్ను దింపేయి, నువ్వెళ్ళి తీసుకురా లలితని' అంది కారాపెస్తూ.
    'అదేం కుదరదు సరళా. ఈరోజుతో యీ ముసుగులో గుద్దులాట కి స్వస్తి. నువ్వే నడుపు' అన్నాడు బలరాం.
    తిరిగి కారు స్టార్టు చేసింది సరళ.
    ఎలాగైనా లలిత పూర్వ చరిత్ర బలరాం కీ కొంచెం చెప్పడం మంచిదని తోచింది.
    చాలా తీవ్రంగా ముఖం పెట్టుకుని బలరాం రోడ్డు చూస్తూ కూర్చున్నాడు.
    'లలితకీ మోహన్ కి ఇదివరకు మంచి పరిచయం ఉంది.
    'లేదని లలిత అందా?'
    'లేదన్నట్టు ప్రవర్తించింది గాని వారికీ చాలా సన్నిహితమైన స్నేహం ఉండేదట.'    
    'మోహన్ చెప్పాడు? లలితా?'
    'మోహన్ చెప్పాడా? లలితా?'
    'మోహన్ చెప్పాడు. వాళ్లత్తయ్య పెళ్ళికి ఒప్పుకోలేదట.చూశావా , లలిత ఎంత తెలియనట్టు ప్రవర్తించింది.'
    'అన్నీ ఇంకో గంటలో తేలిపోతాయి సరళా. తొందరపడకు. ముందు లలితని కలుసుకోనీ....' అంటూ సంభాషణ తుంచేశాడు బలరాం.
    కారు స్పీడు గా కూడా తోలలేక పోయింది సరళ నిస్సత్తువలో.

                                  10
    లలిత వీరావేశం లో తోలుకొచ్చిన కారు ఆరోజు మోహన్ ని దింపిన ఇంటి దగ్గర ఆపింది.
    తలుపు తెరచుకుని దిగి విసురుగా తలుపు మూసింది.
    అదొక లాద్జింగు కాబోలు-- చూడ్డానికి కూడా అంత గొప్పగా లేదు. ముందు హల్లో బల్ల ముందో వ్యక్తీ కునికిపాట్లు పడుతూ కూర్చున్నాడు.
    'మిస్టర్ మోహన్ ని కొంచెం పిలుస్తారా?....' అడిగింది.
    'ఏ మోహన్? మీరెవరు?' అడిగాడతగాడు. ఆడపిల్ల రాత్రిపూట వంటరిగా వచ్చిందేమిటన్న ఆలోచనతో.
    'అదే సినిమా కంపెనీ పనిమీద ఇక్కడ దిగామని చెప్పారు.' అంది ధైర్యం కూడగట్టుకుని.
    'వారంతా ఓ అరగంటై వెళ్ళిపోయారు....' అన్నాడు గుమస్తా.
    'వెళ్ళిపోయారా ? ఎక్కడికి?' భయంతో ఓ మూల నుంచి మాట రావడం లేదు లలితకి. మోహన్ వెళ్ళిపోతే...ఇంక బలరాం కి తనేం సమాధానం చెప్తుంది?'
    'కాని ఓ కవరిచ్చి వెళ్ళారు-- ఎవరేనా వస్తే యివ్వమని.' అన్నాడు గుమాస్తా.
    'ఎవరోస్తారని చెప్పారు?'
    "ఓ అమ్మాయిగారోస్తారు యివ్వమన్నారు.' అంటూ డ్రాయరు లాగి ఓ కవరు తీసి అందించాడు.
    కవరు మీద స్పష్టంగా లలిత పేరు రాసి ఉంది.
    'ఈ కవరందుకున్నట్టు సంతకం పెట్టండి. అని రిజిస్టర్ ముందుకి తోశాడు. యాంత్రికంగా సంతకం పెట్టి కారు దగ్గిరికి నడిచింది లలిత....సీటులో కూర్చుని వణుకుతున్న చేతులతో కవరు చించింది- నన్నిక ఏవిధంగా పీదిస్తావని బెదరిస్తాడీ మోహన్? అనుకుంది-- కాని కవరు లో టిష్యూ కాగితానికి చుట్టి పగడాల దండ ఉంది. చిన్న కార్డు ముక్క మీద -- 'నన్ను క్షమించు లలిత , నిన్ను అపార్ధం చేసుకున్నాను.' అని మాత్రం రాసి ఉంది.
    దడదడ లాడుతున్న గుండెలతో ....కారు స్టార్టు చేసింది లలిత ఇంటికి వెళ్ళి బలరాం కి అంతా వివరంగా చెప్పేస్తే ఈ బెడద తీరిపోతుంది. నన్ను అర్ధం చేసుకుంటాడా సరి -- లేకుంటే ...గొంతులో దుఃఖం అడ్డుపడింది లలితకి... కారు రోడ్డు వారగా నిలిపి స్టీరింగు మీద తల ఆన్చి కసితీరా ఏడ్చుకుంది....కళ్ళు తుడుచుకుని 'ఇక ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చు-- ఇదివరకటిది ప్రేమ మంట కాదు-- పిచ్చి మొహం అందుకే గుండె కాల్చలేదు. ఇప్పుడిది -- నన్ను నిలువునా దహించి వేస్తుంది తప్పదు .' -- నేనిక జీవితంలో ఇలా ఎవరి కోసం బాధపడలేను-- ఉద్యోగం చేసుకు బ్రతకడమే శరణ్యం అనుకుంది. కొంగుతో ముఖం తుడుచుకుని తిరిగి డ్రైవింగు మీదికి దృష్టి నిల్పింది... రోడ్డు ప్రశాంతంగా ఉంది. అసలు జనసంచారం లేదు. లారీలూ, కార్లూ కూడా లేవు-- రోడ్డు కిటూ అటూ ఉన్న చెట్లు మొదళ్ళు కారు లైట్లు పడి కదిలి నడుస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఆకాశం చెట్ల సందుల నుంచి అక్కడక్కడ కన్పిస్తుంది-- ఒకటి అరా మిణుకుమిణుకు మంటూ నక్షత్రాలు కన్పిస్తున్నాయి. మిణుగురు పురుగులు మటుకు వందలకి   వందలు వింత కాంతులు వేదజిమ్మి తిరుగాడు తున్నాయి-- దారి పొడవునా....
    దూరంలో కారేదో వస్తోందో , లేక ఏ లారీ ఏనావో -- పెద్ద నక్షత్రం లాగా లైటు కన్పిస్తుంది. అది త్వర త్వరగా ముందుకి సాగి వస్తుంది.....
    బలరాం ఆలోచనలు కట్టిపెట్టి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. రంగయ్య అందించిన ఉత్తరం తక్షణమే చూసి ఉంటె ఇంత ఆలస్యం కాకపోను అనుకున్నాడు.
    ఎదురుగా కారు రావడం సరళతో, పాటే బలరాం కూడా చూశాడు.
    ఎదుటి కారు లైట్లు తగ్గించి హెచ్చించింది. అదేం గమనించినట్టు లేదు సరళ.... ఆమె మనస్సు విష పుటాలోచనలతో  సతమతం అవుతుంది. ఈ లలితెక్కడ దాపురించింది . తనదయి తీరుతుందని తలపోసిన జీవితాన్ని....కాకుండా చేసేలా తయారైంది. ఇప్పుడిక అసలు లాభం లేకుండా పోయింది. బలరాం కి చాలా నిజాలు తెలిసిపోయి ఉంటాయి. అందుకే అంత పట్టుదలగా తనని తీసుకువచ్చి ఉంటాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS