
కార్లు దగ్గిరవుతున్న కొద్దీ సరళ బుర్రలో ఒక పధకం ఏర్పడసాగింది.... ఒక్కసారి కళ్ళు మూసుకుని చేసేసిందంటే అన్ని సమస్యలూ పటాపంచలై పోతాయి అనుకుంది అంతే.
'జాగ్రత్త -- మరీ దగ్గిరిగా వస్తుంది లైటు తగ్గించవేం?' అంటూనే స్టీరింగు మీద చేయి వేశాడు బలరాం.
బలంగా అతనిచేయి తోసేసి రోడ్డు మధ్యకి కారు తెచ్చేసింది -- సరళ.
ఆ క్షణంలో ఆమె తలపెట్టిన ఘాతకం అర్ధమైంది.
ఎదుటి కారు చిన్న హంసలాగా తేలిపోతూ వస్తుంది. అది లలితదే సందేహం అక్కరలేదు.
మరుక్షణం లో కీచుమంటూ బ్రేకు వేసింది లలిత కారు. అప్పటికీ సరళ తిన్నగా ఎదుటి కారుని కొట్టేసింది. పెద్ద చప్పుడుతో రెండు కార్లూ అటూ యిటూ ఆగాయి. లలిత కేకతో పాటే చిన్నకారు బాగా వారకి పోయింది. ముందు భాగం -- తుక్కుగా అయిపొయింది. విండ్ స్క్రీను అద్దం అసలు మిగలలేదు.
ఎలాగో కారు లోంచి బయట పడ్డాడు బలరాం. సరళ కాట్టే దెబ్బ తగల్లేదు గాని రాయిలా కూర్చుండి పోయింది.
బలరాం కాలికి దెబ్బ తగిలింది . లక్ష్య పెట్టకుండా పక్కగా నిలచిన కారు దగ్గరికి పరుగెత్తాడు.
'లలితా! మైగాడ్ చచ్చిపోలేదు కదా?' అంటూ డ్రైవరు సీటు లోకి చూశాడు. లలిత చక్రం మీద వాలిపోయి ఉంది -- నుదిటినుంచి రక్తం కారుతోంది.
'లలితా! ప్లీజ్ చూడు నాకేసి, నేను బలరాం ని' అంటూ బాధగా కుదిపి చూశాడు లలితని. కాని ఆమెలో చైతన్యం లేదు....స్పృహ తప్పి పడిపోయింది.
తలుపు బలంగా తెరిచి నెమ్మదిగా చక్రం ముందు నుంచి ఆమెని తన గుండెలకి అన్చుకున్నాడు. మెల్లిగా రెండు చేతులా ఎత్తి ఇవతలకి తీశాడు. తల వేలాడేసి అలాగే ఉండిపోయిన లలితని చూస్తె బలరాం కి భయం , దుఃఖం కూడా పొంగాయి. 'ప్లీజ్, అన్ని మబ్బులూ విడిన యిప్పుడు నువ్వు నన్నొదిలి పోకు,' అంటూ చెప్తున్నాడు.
సరళ కారు దిగి కింద నిలబడింది.
బలరాం లలిత ని కారు వెనక సీటులో భద్రంగా పడుకో బెట్టాడు. డ్రైవరు సీటు లోకి ఎక్కి ఇంజన్ అన్ చేశాడు చప్పుడే కాని కారు కదలడం లేదు....ఆలస్యం అయిన కొద్దీ ఎంత ప్రమాదమో గుర్తించిన అతనికి ఆత్రం హెచ్చింది....బోనేట్ ఎత్తి అన్నీ పరీక్షించాడు. మళ్ళీ స్టార్టు చేసాడు. ఈసారి ఒక్క జేర్కుతో కారు ముందుకి కదిలింది. 'థాంక్స్ గాడ్! అని సర్దు కూర్చుని కారు బయలుదేర తీయడానికి సంసిద్దుడయ్యాడు.
'బలరాం . నేను...నేను....' అంటూ కారు తలుపు తెరవబోయింది సరళ.
'మేం ఇద్దరం ఉన్నచోట నీకు స్థలం లేదు-- ఇక్కడే ఉండు ఎవర్నేనా పంపుతాను నిన్ను ఇంట్లో దింపడానికి ' అంటూ కారు పోనిచ్చాడు.
'బలరాం, బలరాం ' అంటూ హిస్తీరిక్ గా కేకలు వేస్తూ కారు వెనక పరుగెత్తింది సరళ. కాని కారు ఆగలేదు. బలరాం వెనక్కు తిరిగి చూడలేదు. అతని ధ్యేయం -- ముందు కారుని ఆస్పత్రికి చేర్చాలి. అదీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా....మంచి కండిషన్ లో ఉన్న వాహనం కాబట్టి దెబ్బకి తట్టుకుని ముందుకి సాగింది....బలరాం కారు.
తిన్నగా టౌను అప్సత్రికి పోనిచ్చి నిలిపాడు.
"ఎమర్జన్సీ" అంటూ నర్సులు డాక్టర్లు స్టేచ్చర్లు, అన్నీ క్షణాల మీద ....కూడాయి.'
ఓ అరగంట లో లలిత చక్కని స్పెషల్ వార్డు లో పడుకుంది. తెలివి రానేలేదు గాని నుదుటి మీది దెబ్బలకి కుట్లు వేసి ప్లాస్టర్లు వేశారు. మరేమంత పెద్ద గాయాలు తగల్లేదు....ఇంకో గంటకి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు డాక్టరు....
'ఆమెకి కొంచెం తెలివి వచ్చాక నే వెడతాను....' అంటూ మంచం పక్కగా కుర్చీలో కూలబడ్డాడు. అతని పాదానికి దెబ్బ తగిలింది...దానికీ ప్లాస్టర్ వేశారు.
అలసటతో, మనస్సు లోని సంఘర్షణ తో -- అలసిపోయిన బలరాం మంచం పట్టే మీద తల వాల్చి నిద్రపోయాడు.
అలా ఎంత సేపు పడుకున్నాడో అతనికే తెలియదు.
తెలివి వచ్చి చూసేసరికి లలిత చేయి తన జుట్టులో ఉంది. ఆమె కూడా ప్రశాంతంగా పడుకుని ఉంది--
మాట్లాడకుండా కళ్ళు మూసుకుపడుకున్నాడు.
'బలరాం, నన్ను ఎప్పుడూ నమ్మవనుకుంటాను యింక' అంటూ అతని చెంపను సున్నితంగా రాసింది లలిత. ఆమె మనస్సు శంకలతో, నిరాశతో నిండి పోయి ఉంది. ఏం జరిగిందో తెలిసే లోపల తను ఆస్పత్రిలో ఉందేమిటి? బలరాం ఇక్కడ పడుకుని ఉన్నాడేమిటి? అనుకుంది.
బలరాం అలసిపోయి పడుకుని కన్పించాడు.
అతను మెలుకువగా ఉంటె చెప్పలేని ఎన్నో విషయాలు నెమ్మదిగా నిద్రపోతున్న అతని చెవులో చెప్పకల్గింది లలిత.
"నన్ను వెళ్లి పోనివ్వకు బలరాం , బలవంతంగా నైనా నీ దగ్గర అట్టే పెట్టుకో ...యీ మాత్రం ప్రశాంతి కూడా ఉండకుండా పోతుంది నాకు....'
'నేను ఎప్పుడో చెప్పవలసింది-- కాని చెప్పలేక పోయాను ....కాలం చేయి జారిపోయింది ...నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనసారా ప్రేమిస్తున్నాను బలరాం , నీకిదేలా అర్ధం అవుతుంది?'...అనుకుంటూ తలవాల్చి తిరిగి మగత నిద్రలో పడింది లలిత.
ఆమె హృదయాంత రాళాలలో దాగిన మాటలు చెవులారా వినీ కదలక పడుకున్నాడు బలరాం. అతని హృదయంలో కోటీ వీణలు శృతి చేసుకుంటున్నాయి. కదలాడుతున్న ఆమె చేయి ఆగిపోవడంతో తలెత్తి చూశాడు. కళ్ళు మూసి నిద్ర పోతుంది -- అమాయికంగా , నిస్సహాయంగా .
లేచి కూర్చున్నాడు బలరాం. 'నిన్ను నేనిక వదలను లలితా, నువ్వు నిశ్చింతగా ఉండు, ఇక ఎప్పటికీ వదలను నిన్ను' అని వంగి ఆమె చెంపకి పెదవులు ఆన్చి -- అవతలికి నడిచాడు బలరాం. డాక్టరు కి చెప్పి ....బయలుదేరాడు ...అప్పటికే ఉదయం పది గంటలు దాటిపోయింది.
జరిగిన దారుణానికి అచ్చేరువందారు అమ్మమ్మగారు. సుబ్బారావు గారు తమ కారేసుకుని.... సరస్వతమ్మ గారి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయారు--
అమ్మమ్మగారు పెడుతుంటే భోజనం చేస్తూ గత ఇరవై నాలుగ్గంటలలో జరిగిన విశేషాలు తిరగేస్తున్నాడు.
'సరళ యింత దారుణం చేస్తుందని నేను ఊహల్లో కూడా అనుకోలేదు.... కొంచెం లో తప్పింది ప్రమాదం' అన్నాడు.
'ఈయన కారేక్కించు కునేసరికీ బాగా కుప్పకూలి పోయిందిట. నీ ఫోను రాగానే బయలుదేరారు....పోనీలే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నారు-- మన యింటి గుట్టె రచ్చ కేక్కేది. అన్నీ మరిచి పోవడమే మంచిదని తోస్తుంది బలరాం.'
'మోహన్ ఆ లేఖ రాసి పంపకపోతే నేనేన్నిటికీ లలితకి నమ్మలేక పోదును.... సరళ అంత గట్టి ప్లాను వేసినట్టుంది....'
'నేనిక్కడే కాస్సేపు పడుకుంటాను. వెళ్లి లలితని చూసి రండి' అన్నాడు.
'అదే నేనూ అనుకుంటున్నాను.... ఏం కావలసినా రాఘవుణ్ణి పిలు' అంటూ ఆవిడ పళ్ళూ అవి పట్టుకుని ఆస్పత్రికి బయలుదేరారు....
లలిత తెలివిగానే ఉంది.
అమ్మమ్మగార్ని చూసేసరికి ఎక్కడ లేని దుఃఖం పొంగి వచ్చింది.
'అంతా అయిపొయింది కదమ్మా ఇప్పుడెందుకు దుఃఖం' అంటూ తల నిమురుతూ కూర్చున్నారు.
'సరళేనా చేయాలని చేసిందనుకోను' అంది నెమ్మదిగా.
'వాళ్ళ సంగతి ఎత్తకిక. వాళ్ళని చిట్టి వలస లో పొలాలు చూసుకోమని అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాడు బలరాం. ఎంత బందువైనా పాముకి పాలు పోసి పెంచడం ఎప్పటికైనా హానికరమే బలరాం ని చూశావా?' అడిగారు.
'రానేలేదు...నామీద బాగా కోపం వచ్చి ఉంటుంది....నేనేం చెయ్యాలి? ఎప్పటి కప్పుడే చెప్పాలని....కాని కుదరలేదు' బాధగా అంది లలిత.
'నీమీద కోపం ఎందుకు పిచ్చి తల్లీ. నువ్వంటే అతని కెంత యిష్టమో గ్రహిస్తే అలా అనుకోవు. ప్రేమ లున్నచోటే కోపతాపాలుంటాయి . ఆవేశం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు ముభావంగా ఉంట్యే ఎలా ఊరుకో కల్గుతారు లలితా. నువ్వు కొంచెం చొరవ చూపించాలి....
'నేనా! నన్నో చిన్నదాన్నని తోసి పారేస్తుంటే....అమ్మమ్మ గారూ, నేనంటే కోపం లేదు కదూ బలరాం కి?' పసిపిల్ల లాగా అడిగింది.
'లేదు. నీమీద జాలి కూడా లేదు బలరాం కి...ఒక్క ప్రేమ తప్పించి.'
'నిజమంటారా? నన్ను నిజంగా ప్రేమిస్తాడంటారా?'
'అందుకే కదమ్మా నీకేదైనా అయిపోయి ఉంటె అని బాధపాడుతున్నాడు.... నేను వెళ్లి బలరాం ని పంపిస్తాను...రేపు నిన్నింటికి పంపేస్తారు. నా దగ్గిర ఉండు. అన్నీ సవ్యంగా ముగించి నీయింట దింపుతాను సరేనా?' ఆప్యాయంగా తల నిమురుతూ అడిగారు.
'నా మూర్కత్వాన్ని క్షమించమని చెప్పండి బలరాం కి ...చెప్తారు కదా?'
'అలాగే' అంటూ ఆవిడ తిరిగి యింటికి వచ్చేశారు.
'కీర్తి పతాక' లో కొత్త వెల్గు నింపే వార్త చెప్పి సుబ్బారావు గారు కూడా తిరిగి వచ్చారు.
'రెండు రోజుల్లో సరస్వతమ్మ సరళ వెళ్ళిపోతారు బలరాం, తరువాతే లలితని తీసుకు వెళ్ళు.' అన్నారు.
'అంతే కాదండీ అమ్మాయికీ బలరాం కీ ఆ పెళ్లి కాస్తా జరిపించి పంపేస్తే మన బాధ్యత తీరిపోతుంది.' అన్నారు అమ్మమ్మగారు.
'అది బాగానే ఉంటుంది....ఇదిగో బలరాం అమ్మాయి కారు సీటులో ఉంది-' అంటూ పగడాల దండ ఉన్న కవరు అందించారు.
'కారు కూడా గారేజీ కి పంపే ప్రయత్నం చేసేసాను. నీ కారుకి సోట్టలేగా పడత. అవి తరవాత చూసుకోవచ్చు. ఏమంటావు?'
'అలాగే చేద్దాం....నేనోసారి వెళ్లి లలితని చూసి యింటికి వెడతాను.' అంటూ లేచాడు బలరాం.
గది తలుపులు జేర్లా వేసి ఉన్నాయి.
తోసుకుని లోపలికి వెళ్ళాడు బలరాం.
'బలరాం వచ్చావా?' అంటూ చేతులు చాపింది లలిత.
మంచం పక్కగా మోకాళ్ళ మీద కూర్చుంటూ ఆమె చేయి అందుకుని తన గుండెల కాన్చుకున్నాడు బలరాం.
గుండెలు వేగంగా కొట్టుకుంటూన్నాయి.
'నేను చాలా గుడ్డిగా ప్రవర్తించాను. క్షమించు లలితా, నీతో చనువుగా ఉండలేక, ఉండకుండా ఉండలేక సతమతమై బాధపడ్డాను బాధపెట్టాను.' అన్నాడు పల్చగా ఉన్న ఆమె మునివేళ్ళ ని పెదవులతో తాకుతూ.
'నువ్వెలా ఉన్నా భరిస్తాను. కొట్టు, తిట్టు, కోప్పడు. అంతేగాని యిలా దైన్యంగా మాట్లాడితే నేను సహించలేను బలరాం.' అంది లలిత. ఆమె కళ్ళు నీళ్ళతో నిండి మిలమిల మెరుస్తున్నాయి.
వంగి వణుకుతున్న ఆమె పెదవులు చుంబించాడు బలరాం.
ఆ ప్రయత్నంగానే ఆమె చేతులతని విశాల మైన వెన్ను నిమిరాయి.
'మనం దెబ్బలాడుకోవచ్చు. మాట్లాడు కోవడం మానేస్తూ ఉండవచ్చు. కాని ఎప్పుడూ విడిగా ఉండడం మటుకు నేను సహించను. నన్ను వెళ్ళనివ్వవు కదూ?' అడిగింది లలిత.
'ఇంకెక్కడికి వెళ్ళడం?' అంటూ అమ్మమ్మగారి ప్లాను చెప్పాడు బలరాం.
'నన్ను క్షమించకలవా బలరాం. నిజంగా మోహన్ ని నేను ప్రేమించా ననుకున్నానే అది ప్రేమ కాదని త్వరలోనే తెలుసుకున్నాను అందుకే మోహన్ ఇక్కడికి వచ్చినా నా హృదయం ఉప్పొంగిపోలేదు . ఉదాసీనంగా ఉండిపోయింది. నువ్విది గ్రహించకలవా?' బలరాం తల నిమురుతూ అడిగింది లలిత.
'మోహన్ చెప్పాడు లలితా, నువ్విప్పుడెందుకు చెప్పడం! నువ్వా రాత్రి వస్తానని చెప్పి వచ్చిందిట సరళ. అతనికి కూడా ఎక్కడో అమాయకంగా ఉండే నిన్ను మోసగించడం బాధపెట్టడం ఇష్టం లేక పోయింది. అందుకే అమ్మమ్మ గారి తోట వాడితో ఉత్తరం యిచ్చి నాకిమ్మన్నాడు. తను ఇక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.....నే సరళ కీ సంగతి చెప్పకుండా బయలుదేరదీశాను.... పోనీలేద్దూ మబ్బు తెరలు తొలగి పోయిన యిప్పుడిక ఆ సంగతులు జ్ఞాపకం చేయకు' అంటూ ఆమె గుండెల మీద తల వాల్చు కున్నాడు బలరాం.
'నాకీ ప్రమాదం జరక్కపోతే ఎప్పటికీ నీ ప్రేమ చెప్పకుండా నన్ను బాధపెట్టే వాడివే కదూ?' అడిగింది లలిత.
'ఏమో....అయినా మనిషి ఓర్పుకి కూడా ఓ అంతం ఉంటుంది. నాలో ఎన్నాళ్ళి ముడ్చు కుంటాను? చెప్పేసే వాణ్ణి నేను. లేకపోతె జెలసీ తో నిన్ను కాల్చుకునేనా తినే వాణ్ణి!..బాగా ఆలోచించుకో లలితా, యిప్పటికీ మించి పోయింది లేదు. వయస్సులో డబ్బులో హోదాలో నీకు తగిన వరులు ఎందరో లభిస్తారు....'
బలరాం మాట ముగించకుండా చేతితో అతని నోరు మూసింది.
'ఇది జాగ్రత్తగా విను బలరాం. నాకు తగిన వరుడు దొరికాడు. కొంచెం దళసరి బుర్ర అయితేనేం? ఒక్కొక్కప్పుడు పిచ్చిగా ఆలోచిస్తాడు. అయితేనేం నాకతనే కావాలి...ఇక వయస్సు అంటావా? నాకు పెద్దవాళ్ళ మీదే మోజు-- అన్నది అత్తయ్యతో, సద్దుకుపోతే తెలియలేదా? లాయరు గారంటే ఉన్న యిష్టం లో తెలియలేదా? ఇక్కడ సుబ్బారావు గారు నాకు మంచి సర్తిఫికేటిచ్చినప్పుడు తెలియలేదా?' అంటూ సన్నగా ఓ మొట్టికాయ యిచ్చింది.
జేబులోంచి పగడాలు తీసి మెళ్ళో తగిలిస్తూ...బలరాం సన్నగా నవ్వుకున్నాడు.
'ఎందుకు ?' అడిగింది లలిత.
'ఆరోజు -- అంటే నిన్న కదూ! ఇలాగే నీమెడలో ఇది పెట్టాను.
ఒక్కసారి నిన్ను కౌగిట చేర్చుకోవాలన్న పిచ్చి కోరికని బలవంతంగా అణచుకొడం జ్ఞాపకం వచ్చింది.
లలిత చేతులు జాచి అతన్ని గట్టిగా పెన వేసుకుంది -- అతని భుజం లో ముఖం దాచుకుంది ....'నన్నిప్పుడే ఇక్కడ్నించి తీసుకు పో బలరాం, ప్లీజ్' అంది రహస్యంగా.
'లేదు లేదు ...మళ్ళీ నువ్వు నా భార్య గానే నా యింట అడుగు పెడుదువుగాని అప్పటిదాకా అమ్మమ్మగారి దగ్గిరే! అంటూ ముక్కు మీద చిన్న ముద్దు పెట్టాడు బలరాం.
మూతి ముడుచుకుని పడుకుంది లలిత.
'రేపు నీకు విముక్తి . అమ్మమ్మ గారింట నిన్ను ఆరాధించి -- నాదాన్ని చేసుకుంటాను లలితా, అప్పటిదాకా నన్ను మరిచిపోకు ' అంటూ లేచాడు బలరాం.
'ప్రేమించు ప్రేమకై ' అంటూ పాడేవే....నయం అది పాడుకోమన్నావు కాదు--' అంది లలిత.
'పాడుకున్నా తప్పులేదు -- నేను ముక్తి కోసం నిన్ను ప్రేమిస్తున్నానులే' అంటూ గది దాటి వచ్చేశాడు బలరాం.
ఇంటిదారి పట్టిన కారులో బలరాం హృదయం తేలికగా ఉంది. దారంతా కొత్త అందం సంతరించుకుని కన్పించింది.
లలిత ఆస్పత్రి మంచం మీద విశ్రాంతి గా పడుకుంది-- రాగల రోజులు తలచుకొంటూ.
(అయిపొయింది)
