'సారీ, తెలిసినాయిన్ని గేటు దాకా సాగనంపి వచ్చాను' అంటూ అందరి కంటే ముందు కారెక్కి కూర్చుంది సరళ. వీడ్కోలు చెప్పుకుంటూ ఉంటేనే కారు గేటు దాటింది.
మౌనంగా కూర్చుంది లలిత ఆమె మనస్సులో వేయి నయాగారాలు, వేయి అగ్నిపర్వతాలు పగులుతూ ప్రవహిస్తున్నాయి ...చెలి వలసితగాడు పట్టించు కోడు. వలపు తీగెకు జీవఫలం కాయనే కాయదు' అనుకుంది బలరాం చదివిన పద్యం జ్ఞాపకం చేసుకుంటూ.
బలరాం ఏం హడావిడిలో ఉన్నాడో తెలియదు గాని మేఘాల మీద తోలు కొచ్చాడు కారు...రంగయ్య గేటు తెరిచి ఉంచే కునుకు తీస్తున్నాడు.
'అంతా అలసిపోయినట్టే ఉన్నారు. ఎవరికీ మాట్లాడే ఓపిక లేదు నాకు తప్ప ' అంది కారు దిగుతూ సరళ.
'ఏం నువ్వు అలసి పోలేదా?' కుతూహలంగా అడిగాడు బలరాం.
'లేదు. నాకిప్పుడే అట మొదలైనట్టుంది' అంది నవ్వుతూ . మేట్లేక్కేసి వెళ్ళిపోయింది సరళ.
'పోయి పడుకుంటానర్రా' అంటూ సరస్వతమ్మ గారు కూడా కూతుర్ని అనుసరించారు.
'థాంక్యూ బలరాం, గుడ్ నైట్....' అంటూ లలిత కూడా మెట్లెక్కింది.... 'పోనీలే స్వీట్ డ్రీమ్సు!' అంది.
'ఎవర్ని గురించి?' తేలికగా అడిగాడు.
'నీకేవర్ని గురించి వస్తాయి! సరళ గురించి' తీవ్రంగానే అంది లలిత.
రెండంగల్లో వెళ్లి లలిత పక్క నిలబడ్డాడు బలరాం.
ఆమె జబ్బ పట్టుకుని 'ఏమిటి నువ్వనేది?...సరళ కూడా నాకు నీలాంటిదే. అది మరిచిపోకు. మీరిద్దరూ నా బాధ్యతలు --- ఇవి ఎంత త్వరగా వదిలితే అంత త్వరగా నాకు విముక్తి.'
'నీకు బాధ్యతే గాని స్వార్ధం లేదా! అసలు నీకు మనస్సు, ఆవేశం, కోపం, తాపం ఉన్నాయా? అక్కడా బాధ్యతేనా? నువ్వసలు మనిషివి కావు బలరాం , గుండె రాయి చేసుకొని బ్రతుకుతున్న శిలవి! మనిషివి కానే కావు....లేకుంటే...' గొంతు ఆవేశంతో ఒణికి పోయింది లలితకి.
'ఎప్పుడేనా ఆ శీల కరుగుతుందేమో నని భయం నీకు. అక్కణ్ణించి నీ గుండెల్లో ఎవరికేనా స్థానం చిక్కుతుందేమోనని భయం నీకు....నిజమైన స్వార్ధ పరుడువి నువ్వే....నువ్వే బలరాం....నన్నోదులు-- నెప్పి పెడుతుంది' అంది కళ్ళు తుడుచుకుంటూ.
'లలితా!' ఆశ్చర్యం ముంచెత్తింది బలరాం ని.
లలిత మాటలు సుత్తి పొటులాగా తగలకూడని అతని గుండెకి టతగిలాయి . దేనిలో నైతే ఆమెని భద్రంగా దాచేసి పైకి తెలయనివ్వడం లేదో దాని కవచం పగుల కొట్టింది లలిత.
'లలితా! లలితా త్వరగా లోపలికి వెళ్ళిపో....నువ్విక్కడే నిలబడితే ...నేనేం చేస్తానో నాకే తెలియదు-- వెళ్ళిపో లలితా ప్లీజ్' ఎంతో నిస్సత్తువగా నుదుటి మీదికి చేయి పోనిచ్చి ... తోటలోకి నడిచి వెళ్ళిపోయాడు . ఓ నిముషం కొయ్యబొమ్మలా పై మెట్ట్టు మీద అలాగే నిలబడిపోయింది లలిత. తరువాత నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ తనగదికి వెళ్లి మంచం మీద వాలిపోయి.... వెక్కి వెక్కి ఏడ్చింది.... దుఃఖం తగ్గాక లేచింది...కాని మెడ మీద చెయ్యి అలాగే ఉండిపోయింది. బలరాం యిచ్చిన పగడాల దండ అక్కడ లేదు.... భయంతో లలిత గుండెలు దడదడలాడాయి. ఎక్కడ పడిపోయి ఉంటుంది? అమ్మమ్మ గారింట్లోనా? కారులోనా? ఇప్పుడు బలరాం కి తనేం చెప్తుంది?...ఏం చేయాలి?...అనుకుంటూనే సరళ గదికి నడిచింది లలిత.
లలితని చూస్తూనే నవ్వుతూ, 'నువ్వు వస్తావనే అనుకుంటున్నాను లలితా?' అంది.
'ఎలా ఊహించావ్?....ప్లీజ్ సరళ, నా పగడాల దండ కనపడలేదు....ఎక్కడ పడిపోయి ఉంటుందో....బలరాం కి తెలిస్తే ....ఏం చేయ్యనిప్పుడు?' ఆత్రంగా అడిగింది--
'పోయిందా?...నువ్వు మోహన్ కివ్వలేదు? డబ్బు కావాలంటే' అడిగింది సరళ.
'అదెక్కడో పడిపోయిందని బెంగపడి చస్తుంటే నీ గొడవేమిటి నా కర్ధం కావడం లేదసలు' నోట మాటలు రానంత నీరసం వచ్చింది లలితకి, ఎందుకిలాంటి అబద్దం తన మీద సృష్టిస్తుంది ? ఊహించలేని స్థితిలో ఉంది.
'అవేక్కడో ఒకచోట ఉండే ఉంటాయి. ఎవరేత్తుకు పోతారు అమ్మమ్మగారింటికి వచ్చిన వాళ్ళలో. నేనిప్పుడే బలరాం ని లేపుతాను. ఇద్దరం వెళ్లి చూసోస్తాం' అంది ధైర్యం తెచ్చుకుని.
'తీసుకెళ్ళు... అవి ఉన్నచోటు బలరాం కిప్పటికేనా తెలియడం మంచిది' అంది కూల్ గా.
'నువ్వనేది నా కర్ధం కావడం లేదు సరళా? ఏమిటి? నీకు తెలుసా అవెక్కడ ఉన్నాయో?' ఆత్రంగా అడిగింది ఓ పక్క కళ్ళ వెంట నీరు పొంగి ప్రవహించడానికి సిద్దంగా ఉంది. ఓ పక్క నుంచి సరళ పీక నులమాలన్నంత కోపం పొంగి వస్తుంది లలితకి.
'నేను బయలుదేర బోతుంటే నీ పగడాలు చేతిలో తిప్పుతూ మోహన్ వస్తున్నాడు. అందుకే అప్పుడక్కడ ఆలస్యం అయింది. నువ్విచ్చావని చెప్పాడు' అంది సరళ.
'నిజంగానా?' నమ్మ శక్యం కా లేదు లలితకి. తనేమిటి? బలరం అరువిచ్చిన దండ మోహన్ ని అమ్ముకోమని యీయడం ఏమిటి?'
'నువ్వే ఇచ్చి ఉంటావని నేను నమ్ముతున్నాను. బలరాం కి చెప్తే అతను నమ్మక తప్పదు.'
'నేను మోహన్ కి ఇచ్చానా? ఏమిటి నువ్వనేది. మతి కాని పోయిందా నీకు? నేనెందు కిస్తాను?'
'అతను నీ స్నేహితుడు కనుక. అతన్ని ఇదివరలో నువ్వు ప్రేమించావు కనుక.'
'నేనివ్వలేదు సరళా, ప్లీజ్ నన్ను నమ్ము' గట్టిగా అరిచింది లలిత
'గట్టిగా అరిస్తే నిజం అబద్దం అయిపోతుందనుకోకు....ఈసరించింది సరళ.
స్తాణువై నిలబడిపోయింది లలిత. అవును. ఏం చెప్పినా నమ్మదల్చని వారిని నమ్మించడం ఎలాగ? ...తనేక్కడేనా పారేసుకున్నదేమో . అని మోహన్ కి దొరికాయేమో.
'నేను బలరాం ని లేపి అంతా చెప్పేస్తాను.....' అంటూ సరళ గది దాటి బయటికి వచ్చేసింది లలిత. సరళ పరిగెత్తి వచ్చి లలిత చేయి పట్టుకుంది....'నీకిప్పుడు నిజంగానే మతి పోయింది....ఇప్పుడు లేపి బలరాం కి చెప్పి ప్రయోజనం ఏమిటి?' అంది.
'నిజం తెలియాలతనికి' అంది లలిత.
'పగడాలు చేత్తో పట్టుకుని అప్పుడు నిజం చెప్పు' అంది లలిత కేసి వ్యంగ్యంగా చూస్తూ.
'అది నిజమే. అవి నా చేతిలోకి వచ్చాక జరిగిన సంగతి చెప్తాను.... ఎక్కడుంటాడతను?'
"నీకు తెలియదా ఏం? ఆరోజు దింపావుగా అక్కడే" అంది సరళ.
మారు మాట్లాడకుండా అక్కడ్నించి కదిలింది లలిత. తిన్నగా తన గదికి వెళ్లి తలుపు జేరవేసి మెట్లు దిగింది. హాలు చీకటిగా ఉంది. తోటలోంచి వస్తున్న గాలికి కిటికీల సిల్కు తెరలు కదలాడుతున్నాయి.
పక్క తలుపు తెరచి గారేజీల కేసి నడిచింది. లలిత లో ఎక్కడలేని మూర్కపు పట్టుదలా తలెత్తింది. ఏమైనా సరే మోహన్ అంతు కనుక్కోవాలను కుంది.
కారు బయటికి తీసింది. గేటు మూసి ఉంది. కారు గేటు దాకా రానిచ్చి దిగి తలుపులు తీసుకుని-- అవతలికి దూసుకు పోయింది లలిత....' ప్రాణం పోయినా సరే యీ అన్యాయం చూస్తూ చూస్తూ దిగమింగి ఊరుకోలేను!' అనుకుని ఆవేశంతో కారు తోలడం మొదలెట్టింది.
వెనక్కు తిరిగి చూసి ఉంటె వరండా లో వెల్గిన దీపం కన్పించేదే. కాని వెనక్కు తిరిగి చూడలేదు లలిత తను వెళ్ళడం ఎవరు చూసేనేం? అన్నీ ధీమా వచ్చేసింది.
తోటలో కురుస్తున్న మంచులో గులాబి చెట్ల ని చూస్తూ ఏమీ ఆలోచనలు లేక శూన్యమైన మనస్సుతో కూర్చుని ఉన్న బలరాం కి కారు చప్పుడు వినిపించింది . ఎవరై ఉంటారింత రాత్రి వేళ? అనుకున్నాడే గాని కూర్చున్న చోట నుంచి కదలబుద్ది కాలేదు.
ఇంతలో రంగయ్య తలపాగ చేవులంటా కట్టుకుని వచ్చి ఓ కాగితం యిచ్చి పోయాడు. 'సైకిలు మీదొచ్చి అర్జెంటుగా యిచ్చి పోయ్యాడయ్యా ' అంటూ అక్కడే నిలబడ్డాడు.
