Previous Page Next Page 
మేఘమాల పేజి 19


    
                                     10

    పది గంటలప్పుడు ,అప్పటికి రాజేశ్వరి ఓ వందసార్లు పొరగా ఇంటి నుండి బయటకు వచ్చాడు-- శకుంతల దగ్గిరకు వెళ్ళేటందుకుగాను!
    గాంధీ హాస్పిటల్ కు వచ్చేటప్పటికి పదకొండు గంటలకు పావుగంట తక్కువ అయింది.
    శకుంతల బెడ్ దగ్గరకు వెళుతూనే ఉలిక్కిపడ్డాడు త్యాగరాజు.
    --అక్కడ రాణి, సుందరమూర్తి , జయరాం అప్పటికే వచ్చి వున్నారు!
    క్షణం తటపటాయించాడు ముందుకు వెళ్దామా, వెనక్కు వెళ్దామా-- అని!
    మొట్టమొదట రాణి చూసింది. కలవరపాటునూ, కాంతిని గూడా కళ్ళకు పులుముకుని, భర్త వైపుకు చూస్తూ, 'అన్నయ్యా!' అన్నది పెద్దగానే.
    ఒక్కసారి అందరూ త్యాగరాజు వైపుకు తిరిగారు.
    --వారి చూపులకు తట్టుకోలేనట్లుగా గిలగిల లాడాడు త్యాగరాజు!
    'హలో! త్యాగరాజు!' జయరాం ముందుగా పలకరించాడు.
    "హల్లో!' అన్నాడు గొణుగుతున్నట్లుగా -- ఏదో కంపరమెత్తు తున్నట్లనిపించగా.
    అడుగులు ముందుకూ పడలేదు -- వెనక్కూ పడలేదు!
    "అదేమిటి ! ఆగిపోయారేం? -రండి !' అన్నాడు సుందరమూర్తి.
    మరే ఆలోచనా లేకుండా, త్యాగరాజు వెనక్కు తిరగబోతూ , 'కానీయండి.... మీరు మాట్లాడుతుండండి...నేను కాసేపుండి వస్తాను !' అన్నాడు.
    "మేముండగా మీరు రాగూడదా ఏవిటి?....మేం రహాస్యాలేమీ మాట్లాడుకోవటం లేదు!' మనస్సును బాధతో గంటు పెట్టుకున్నా, మొఖం మీద చిరునవ్వును మాయనీయలేదు సుందరమూర్తి.
    త్యాగరాజు తడబడుతూ , సుద్నరమూర్తి నుండి చూపు మారలుస్తూ.... జయరాం తో , 'అబ్బెబ్బే ....అలాంటిదేమీ లేదు!' అన్నాడు బింకంగా. కాని తరువాత ఏం మాట్లాడాలో తెలియలేదు.
    శంకుంతలకూ, రాణికీ ఆ వాతావరణం చాలా అసహజంగా వుండి, ఇబ్బంది పడుతున్నారు.
    శకుంతల గంబీర వాతావరణాన్ని చల్లబరచటానికా అన్నట్లుగా 'అక్క రాలేదా?' అన్నది త్యాగరాజు వైపుకు మెడ తిప్పి.
    'లేదు!' అన్నాడు ముభావంగా.
    "కూర్చోండి!' అన్నది పక్కగా ఉన్న ఖాళీ స్టూలు ను చూపిస్తూ.....' ఫరవాలేదు.... ఫరవాలేదు!.... అన్నాడు త్యాగరాజు కూర్చోవటానికి ప్రయత్నించకుండానే.
    --అలాంటి సమయంలో అక్కడికి రావటం అతడి మనస్సుకీ కష్టంగానే వున్నది!
    తన స్వేచ్చను ఎవ్వరో లాక్కొని పళ్ళతో కొరికేస్తూన్నట్లుగా గిలగిలలాడ సాగాడు.
    'కాస్త ఆగి వచ్చి వుంటే ఎంతో బాగుండేది!' అనుకున్నాడు.
    అప్రసన్నంగా వున్నట్లుగా ఓ నిట్టుర్పు భారంగా విడిచాడు. ఇంతలోనే రాణి అన్నది. 'అయితే శకుంతలా మేము వెళ్ళివస్తాం!'
    శకుంతకీ బాధగానే వున్నది-- ఆ పరిస్థితి.
    'సరే!.....మళ్ళా ఎప్పుడు వస్తావ్?' నవ్వును పెదాల మీదకు లాక్కువస్తూ.
    "వీలయినంత తొందరలో!' అన్నది వెనుదిరుగుతూ.
    సుందరమూర్తి, జయరాం గూడా బయల్దేరారు.
    వాళ్ళు వెళ్ళిపోవటానికి తన రాకే హేతువయిందేవో అనుకున్నప్పుడు మరింతగా బాధపడ్డాడు త్యాగరాజు.
    'వస్తాం , త్యాగరాజు గారూ!' అన్నారు జయరాం, సుందరమూర్తి ఇద్దరూ.
    ఏదో మనస్సులో గూడు కట్టుకున్నది వెళ్ళగక్కబోతున్నట్లుగా పెదాలు కదిలించబోయాడు.
    --కాని నాలికే ఎదురు తిరిగింది!
    వాళ్ళు వెళ్ళిపోయారు.
    పోతున్న రాణి వంక, సాలోచనగా , పరీక్షగా కొన్ని క్షణాలు అనుకోకుండా చూచాడు-- అంతా అప్రయత్నంగా జరిగి పోయింది!
    'రండి-- కూర్చోండి!' అన్నది శంకుంతల.
    ఉలిక్కిపడ్డాడు త్యాగరాజు.
    ముందుకు తిరిగాడు.
    --కాని క్షణం క్రితం చూచిన రాణి రూపం మనస్సు నుండి చేరిగిపోవటం లేదు!
    కొద్దిగా లావేక్కింది.  వత్తయిన జడను చుట్టగా చుట్టుకొన్నది.
    -మొఖానికి ఏదో పెద్దరికం, నిండుదనం వచ్చినట్లుగా అనిపించింది.
    --రాణి చాలా మారింది అనుకున్నాడు!
    'అదేవిటి? ....కూర్చోండి!' అన్నది శకుంతల రెట్టిస్తున్నట్లుగా -- ఇంకా అలోచిస్తున్నట్లుగానే వున్న త్యాగరాజును పరిశీలనగా చూస్తూ!
    తేరుకొని, కూర్చొని , 'ఎలా వున్నది అన్నాడు.
    'ఇప్పుడిప్పుడే నరకం ప్రారంభమవుతోంది!' అన్నది దీనంగా నవ్వుతూ.
    జాలిగా చూచాడు ఆమె ముఖంలోకి త్యాగరాజు.
    ఒక్క రోజులోనే మొఖమంతా పీక్కుపోయింది. గడ్డం క్రింద, చెంప మీదగా వున్న నీలి మచ్చలు ఆమెలోని అందాన్ని హరిస్తున్నాయి.
    -అవే ఆమెలోని అహాన్ని గూడా హరిస్తున్నాయ్యేమో అనుకున్నప్పుడు మనిషి వివలితుడయ్యాడు.
    బేలగా వున్న ఆమె చూపులు అతడి లోని జాలికి పురులేక్కిస్తున్నాయి.
    'నొప్పిగా వున్నదా!"
    'రాత్రి నిద్ర లేదు!'
    'ఆహారం ఏం తీసుకున్నావ్?"
    "దానికీ అంక్షలె.... ఏవేవో చెప్పారు.... అమలుపరచలేక చస్తున్నాను!' అన్నది.
    'మరి కష్టాలు వచ్చినప్పుడే గదా మనం భరించవల్సింది!'
    'నా కనిపిస్తుంటుంది ఒక్క క్షణంలో -- ఈలాంటి కష్టాలు ఎదుర్కొనే దాని కంటే చావటమే సంతోషంగా వుంటుందని!'
    తలవంచుకు కూర్చున్న త్యాగరాజు అధట్టుగా తలెత్తి ఆమె ముఖంలోకి చూచాడు భయంగా.
    'నిజం కాదంటారా?' అన్నది నవ్వి రెట్టిస్తున్నట్లుగా.
    'పిరికివాళ్ళ భావన అది!'
    'నేను ధైర్యస్టురాలినని ఎవరు చెప్పారు? ఆ కంఠం లో ఓ క్షణం గర్వపు జీర తొంగి చూచినట్లనిపించింది.
    'కాని పిరికిదానివి అనుకోలేదు!' అన్నాడు చిన్నగా నవ్వుతూ.
    "పోనీయండి.... ఆచర్చ దేనికి.... నేనేం ఆత్మహత్య చేసుకోబోవటం లేదుగా!' అన్నది నవ్వుతూ తల తిప్పుకుంటూ.
    త్యాగరాజు కు మాటలు దొరక్క కూర్చుండి పోయాడు.
    "మీ మిత్రుల కేలా వున్నది?"
    'మాములుగానే!'
    'ఇంకా ఆసుపత్రి లో ఎన్నాళ్ళు ఉండాలిట ?-- నాకు మాత్రం ఆసుపత్రి అంటే రెండు రోజులలోనే పరమ అసహ్యం మేసింది!'
    'కాని తప్పదు గదా?' అన్నాడు మొదటి ప్రశ్నకు తప్పిస్తూ, రెండో ప్రశ్నకు సమాధానం అన్నట్లుగా. `    
    దీనంగా త్యాగరాజు ముఖంలోకి చూసింది.
    '--నిజంగా , నేను అదృష్టవంతురాలిని!.... అహంతో మిడిసిపడ్డ నన్ను, మీరు ఇంత త్వరలో క్షమిస్తారనుకోలేదు!'
    'నేను క్షమించకుండా వుండేందుకు నీవు నాకు చేసిన హాని ఏం వున్నది?'
    'అవమానించటమూ, ద్వేషించటమూ హాని గదా?'
    'నేను నీ మాటల్ను ఎక్కువసార్లు సీరియస్ గా తీసుకోలేదు. కుండ బద్దలు కొట్టేలా అన్న మాటలకు ఆ క్షణంలోనే బాధపడేవాడిని, మనస్సు పాడు చేసుకుండేవాడిని!'
    'అయితే నిజంగా ధన్యురాలినే నేను!' అన్నది శంకుతల -- ఆనందంతో మొఖాన్ని నిండుగా చేసుకొని.
    కొద్ది క్షణాల మౌనం తరువాత 'నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు కోపం రాకుండా ఉంటుందా?' అన్నది-- అతడి మొహంలోకి -ఏదో దివ్యమూర్తి మొఖం లోకి తాదాప్యం జెంది చూస్తున్నట్లుగా చూస్తూ.
    'అడుగు!'
    'మీరు నాకు మాటివ్వండి!'
    'ఏ వని?'
    '---కోపం తెచ్చుకొనని!'
    'ఇచ్చినా తెచ్చుకోకుండా వుండాలనే వున్నది?- నా హృదయం అంత దృడ మైనదేం గాదె!'
    'నాకు నమ్మకమున్నది-- మీ మాటలు మీద మీరు నిలబడగలరని!'
    'ముందుగానే సంకెళ్ళ తో బంధించాలను కుంతున్నావా?'
    'మీరేమైనా అనుకోండి దాన్ని!'
    ఒక్క క్షణం మౌనంగా కాలాన్ని మింగేసి , 'సరే! అడుగు....నాకిష్టం లేనిదీ, నాకు ఇష్టం కలిగించేది అయితే - ఇంకెప్పుడూ ఆ విషయం మీద మాట్లాడవద్దంటాను- దానికి నీ వంగీకరించాలి- మాట మీద నిలబడాలి గదా!' అన్నాడు ఒత్తి పలుకుతూ -- ఏదో ఒప్పందానికి వస్తున్నట్లుగా.
    'తప్పకుండానూ!' అన్నది కళ్ళు కాంతి వంతం చేసుకొని.
    తృప్తిగా నవ్వాడు త్యాగరాజు.
    'అడుగుతున్నాను!'
    'ఇంకా ఆలస్యందేనికి' ఎమడుగుతుందా అనే ఉత్సుకతతో ముందుకు వంగాడు .
    ఒక్క క్షణం మనస్సులో చెప్పదలచుకున్న దేదో మననం చేసుకుంటున్నట్లుగా ఆగి, 'నేను పరాయిదాన్ని ...అంతేకాదు కొన్ని నెలల క్రితం వరకూ నన్ను మీరు చూడలేదు.... మీకు పరిచయం లేదు.... అయినా నేను చేసిన తప్పుల్ని మీరు చాలా త్వరలో క్షమించగలిగారు.... కాని రాణి మీ చెల్లెలు..... మీ చేతుల్తో పెంచారు.... మీ మరో ప్రాణం లా చూచుకున్నారు.... అప్పటికీ ఆమె తప్పుల్ని మీరు క్షమించలేదు.... క్షమించలేక పోతున్నారు....కారణం తెలుసుకోవచ్చా!' అన్నది.
    అలా అడిగిన తరువాత ఒక్కసారి --' అలా అడగటం లో త్వరపడ్డానెమో అని గూడా అనుకోబోలేదు.
    త్యాగరాజు ఊహించిన ప్రశ్న గాకపోయినా విషయం అదే!
    అందుకే అతడు ఆమె మాటలకు ఎలాంటి అవేశమూ తెచ్చుకోలేదు.
    చాలా తాపీగా , 'అందుకే!' అన్నాడు ఏదో భావ గర్బితంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS