Previous Page Next Page 
మారిన విలువలు పేజి 19

 

    అతనితో మాట్లాడుతుంటే జానకికి సమయం తెలిసేది కాదు. చాలాసార్లు వేళ తప్పి ఇంటికి వెళ్ళి తల్లి చేత అన్న చేత చివాట్లు తిన్నది.
    సాధారణంగా అనసూయమ్మ , గోవిందబాబు, జానకి ఆఫీసులో పనులు ముగిసేక లాన్ లో కూర్చుని మాట్లాడుకునే వారు. బాలవిహార్ కేంద్రంగా తీసుకొని మొదలయే మాటలు పెరిగి పెరిగి వారు ఊహించలేనంత పరిధిలో వృత్తంగా తయారయేవి. సంకుచితమైన మానవ నైజాన్ని శుభ్రపరుస్తూ పెంచుకొంటూ పొతే, ఆఖరికి తను అన్న పదార్ధం లేకుండా పోతుందనిపించేది జానకికి.
    గోవిందబాబు వచ్చిన మొదట్లో అతని మాటల మీద, చేతల మీద ఒక కన్ను వేసి ఉంచినా, త్వరలోనే అతని కార్యదీక్ష, సత్ప్రవర్తన తెలుసుకోగలిగింది అనసూయమ్మ. అప్పటి నుండి చాలావరకు బాధ్యతలు అతని పై విడిచి, తను విశ్రాంతి తీసుకోసాగింది.
    బాలవిహార్ అభివృద్ధి కి సంబంధించిన సంభాషణ లలో తను తరచూ భాగం తీసుకొనేది. అప్పుడప్పుడు "ఉత్సాహవంతులైన పిల్లలు మీరు. అన్ని సాధక బాధకాలు అలోచించి, ఆ నిర్ణయాలేవో నాకు తెలియజేయ్యండి. అంగీకార ముద్ర అచ్చోత్తి ఇచ్చేస్తాను." అనేది నవ్వుతూ.
    అ  ఏడు సంక్రాంతికి పిల్లలందరికీ కొత్త బట్టలు కొనే ప్రయత్నంలో బాజారుకు బయలుదేరారు గోవిందబాబు. జానకి. అంతకు ముందు రోజు పిల్లల్ని పిలిచి, "పండక్కు మీ కెలాంటి బట్టలు కావార్రా?" అని ప్రశ్నించింది జానకి.
    "ఆ రోజు మనం తోటలోనికి వెళ్ళినప్పుడు ఆ కారులో కూర్చున్న అమ్మాయి కట్టుకుందే? జూలు... జూలు ఎర్ర గౌను. అలాటిది నాకు కావాలక్కా!" ఒక చిన్నారి కోరిక.
    "మరేం! పార్కులో బంతాట ఆడుకొనే అబ్బాయిలు తొడుక్కుంటారే? అలాటి డ్రెస్సు కావాలి నాకు." ఒక బాబు అభిలాష.
    సినిమాలో ఆ చిన్న పాప తోడుక్కొందే? అలాటి గౌను మన సుధకు కొనక్కా!" ఆ గౌను తనకు పనికి రాకపోయినా , దానిమీద మోజు చంపుకోలేని ఒక అమ్మాయి అభిప్రాయం.
    ఇలా ప్రతి ఒక్కరూ తాము చూసినవి, తాము ఊహించుకొనికలలు కంటున్నవి ఏకరువు పెట్టేరు. అంత హంగామా పూర్తయేక , "నీకు బాగున్నవి పట్టుకురా , అక్కా!" అన్నారు తుది మాటగా.
    సాధ్యమైనంత వరకు ఆ పిల్లలు కోర్కెలు తీర్చాలనే ఉద్దేశంతో బజారంతా కలయ తిరుగుతున్నారు వాళ్ళు.
    ఒక బట్టల కొట్లోంచి జానకి బయటికి వస్తుంటే ప్రకాశం కనిపించేడు.
    "ఇక్కడేం చేస్తున్నావక్కా!" అన్నాడు.
    "మా పిల్లలకు బట్టలు తీస్తున్నాము రా, నీ పనే ఏంటి? ఈరోజు కొట్టు తెరవలేదా?"
    "ఆ పుస్తకాల కొట్టు మరీ సందులోకి అయిపొయింది, అక్కా! తెలిసినవాళ్ళకు తప్ప, అక్కడ అలాటి కొట్టోకటి ఉన్నట్లే కొత్త వాళ్ళకు తెలిసే అవకాశం లేదు. సందు ముందు బోర్డు పెట్టేననుకో.అయినా ఆ స్థలం అంత అనుకూలంగా లేదు. ఇక్కడేదో కొట్టు ఖాళీగా ఉందని తెలిసి అద్దె మాత్రమో కనుక్కోందామని వచ్చెను."
    కొన్ని బట్టలకు సొమ్ము చెల్లించి బయటికి వచ్చిన గోవిందబాబు, "ఇంక వెళ్దామా, జానకీ" అన్నాడు.
    గోవిందబాబు ను చూసి ప్రకాశం "ఇతనేవరక్కా?" అని అడుగుదామనుకొన్నాడు. కాని, ఆ మాటను నాలిక చివరనే ఆపుకొని, "నే వెళ్ళొస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.ఆవ్యక్తి గురించి ఏమైనా చెప్పవలసిన అవసరం ఉంటె అక్క అనే చెప్తుంది అనుకొన్నాడు.
    "ఈ కుర్రాడేవరు?' గోవిందబాబు ప్రశ్నించేడు.
    "మాతమ్ముడు."
    "ఏమిటి చదువుతున్నాడు?"
    "చదువు మానేసేడు. పుస్తకాల కొట్టు పెట్టుకొన్నాడు."
    'అలాగా? అయితే మన పిల్లలకు కావలసిన పుస్తకాలు ఇతని ద్వారా తెప్పించవచ్చునే? ఆ కమీషన్ ఏదో ఇతనికే ముడుతుంది. ఇంకెవరికో ఇయ్యాక పోతేనేం?" అన్నాడు.
    జానకి కృతజ్ఞత తో, "సంతోషం" అన్నది.
    తాము కొన్న బట్టల్ని పిల్లలకు చూపించి వాళ్ళచే ఒప్పించుకొచ్చేసరికి జానకి తాతముత్తాతలు దిగి వచ్చేరు. ప్రతి వాళ్ళకూ తమకు తెచ్చింది తప్ప మిగిలిన వన్నీబాగుంటాయి. పోనీ, నీకు నచ్చిన దానిలో ఇంకోటి తీసుకో అంటే, అది కుదరదు.
    "నాకోసం ఇదేగా తెస్తా? మరొకరి దెందుకు తీసుకోవాలి" అంటారు బుంగమూతి పెట్టి.
    ఇంక ఇది పని గాదని ఒక్కొక్కరిని దగ్గరకి పిల్చి వాళ్ళ కిచ్చిన డ్రెస్సు కోసం ఎన్ని కోట్లు తిరిగిందో, ఎన్ని బట్టల్లోంచి దాన్ని ఎంచి తెచ్చిందో, అది వాళ్ళకు మాత్రమే ఎందుకు నప్పుతుందో వర్ణించి చెప్పి, ఆ డ్రెస్సు లో సొగసులు, అది తొడుక్కునే వాళ్ళు కనిపించే తీరు వ్యాఖ్యానించి, వాళ్ళను సంతృప్తి పరిచే సరికి గోడ గడియారం ముల్లు తోమ్మిది గంటలు చూపించింది.
    ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయింది. ఇంక పడుకోండని వాళ్ళనుసాగనంపి అనసూయమ్మ దగ్గర సెలవు తీసుకోందికి వచ్చింది జానకి.
    "ఇంతవేళయింది . మాతో పాటు భోజనం చేసి వెళ్ళు" అన్నది ఆవిడ.
    ఏనాడు ఇటువంటి అలవాటు లేని జానకి ఏం చేస్తే బాగుంటుందా అని కాస్త సేపు తటపటాయించింది.
    "వద్దులెండి. ఇంటి దగ్గర చూస్తుంటారు. ఇప్పటికే చాలా రాత్రయింది." అన్నది.
    "ఫరవాలేదు. జానకీ! ఈ ఒక్క రోజేగా? రోజూ ఉండిపోతున్నావా? ఇలాగ ఎక్కువ పనిచేస్తే పెద్ద ఆఫీసుల్లో ఓవర్ టైం అంటూ ఎక్కువ డబ్బిస్తారు. మనది చిన్న సంస్థ . పోనీ డబ్బియ్యకపోతే మానె,ఒక్కపూట భోజనమైనా పెట్టద్డా?"అన్నది అనసూయమ్మ నవ్వుతూ.
    ముగ్గురూ మాట్లాడుకుంటూ భోజనాలు ముగించే సరికి పది గంటలయింది.
    "చీకట్లో ఒక్కరూ ఎలాపోతారు? పదండి, మీ ఇంట్లో దిగవిడిచి వస్తా" అన్నాడు గోవిందబాబు.
    "ఎందుకు మీకు శ్రమ?అలవాటు పడిన దారేగా? వెళ్ళిపోగలను."
    "నేను మీకోసం ప్రత్యేకంగా రావడం లేదు. రాత్రి భోజనం అయేక కొంత కాలు ఝూడించే అలవాటు నాకుంది." అన్నాడు గోవిందబాబు.
    దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. వీధి చివర నుండే తమ ఇంట్లో దీపం వెలుగు గుమ్మంలో పడుతూ కనిపించింది జానకికి. తనకోసం ఎవరో కాచుకు కూర్చున్నట్లు అరుగు మీద లీలగా ఆకృతి కనిపించింది.
    "అదిగో, అదే మా ఇల్లు. ఇంక వెళ్ళి పోగలను. నమస్కారం" అంది.
    గోవిందబాబు జానకి కళ్ళలోకి చూసేడు. తను వారింటికి వరకు రావడం ఆమెకు ఇష్టం లేదని తెలుసుకొన్నాడు.
    "సరే, మీరు వెళ్ళండి. మీరు గుమ్మం ఎక్కేవరకు నేనిక్కడే నిలిచి చూస్తాను. నమస్కారం" అన్నాడు.
    జానకి ముందుకు నడిచింది. ఆ తలుపు మూతపడి గుమ్మంలో వెలుగు పోయాక వెనుదిరిగి వెళ్లిపోయేడు గోవిందబాబు.
    గుమ్మంలోనే ఎదురుకొన్నాడు సూర్యారావు. సుందరమ్మ చావిట్లో కూర్చుంది.
    "ఇంత రాత్రయిందేం ?' జానకి తలుపు గడియ వేస్తుంటే ప్రశ్నించేడు సూర్యారావు.
    "ఆఫీసులో పనుంది."
    "ఇంత రాత్రి దాకా?"
    "అవును. పండక్కు పిల్లలకు బట్టలు కొన్నాం. వాటిని చూస్తుంటే లేటయింది."
    "ఒంటరిగా వచ్చావా?"
    క్షణకాలం ఆలోచించింది జానకి. గోవిందబాబు సహాయంగా వచ్చేరని చెప్తే, "ఎవరా గోవిందబాబు' అని ప్రశ్నిస్తారు. ఇంత రాత్రి వేళ ఆడపిల్ల పరాయి మగాడి వెంట రావటం ఏ పరిస్థితుల్లో నూ తన అన్న మెచ్చడు. ఏదీ చెప్పకుండా ఉంటేనే సరి అనుకొంది.
    "ఏం, అడిగినదానికి సమాధానం చెప్పవేం?"
    "ఎమడిగేవు?"
    "ఇంత రాత్రి పూట ఒక్కదానివే వచ్చేవా అని ప్రశ్నిస్తున్నాను."
    "ఆ"
    "నువ్వు గుమ్మం ఎక్కే వరకు ఆ లైటు స్థంభం దగ్గర నిలబడ్డ వాడేవడే? అర్ధరాత్రి దాకా వాడితో తిరిగి పైగా అబద్దాలు కూడా చెప్తావా?" సూర్యారావు కోపంతో చెయ్యెత్తేడు.
    "అగు, అన్నయ్యా! నోటి కొచ్చిన మాటల్లా అంటే నేను పడేది లేదు. అతడు మా బాస్. ఒంటరిగా వస్తున్నానని తెలిసి, ఇంటి కొస్తే అతన్ని అవమానిస్తారని అక్కడి నుంచే పంపివేసెను."
    "ఎవరో బాస్? ఇందాక బజార్లో కిలకిలా నవ్వుతూ కబుర్లు చెప్తూ నడుస్తున్నావు వీడితోనేనా?"
    అన్నయ్య కెవరు చెప్పేరు? ప్రకాశం చెప్పి ఉంటాడా? వాడు అలాంటి మాటలు మోసే రకం కాదే! సరే, ఏదో విధంగా అన్నయ్యకు తెలిసి ఉంటుంది. తెలిసినా అందులో కొంప మునిగిపోయేదేం లేదు అనుకొన్నది జానకి.
    "వీడి కేలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ  , జగమంతా చీకటిగా ఉంది . నన్నెవరు చూస్తారనుకుంటుందిట.
    "రెండు మూడు నెలలై నీ ఆఫీసులో పనెందుకు ఎక్కువయిందో నాకు తెలీయదనుకున్నావా? పాపం! పిల్లల్ని పిక్నిక్కులకు, తీసుకు వెళ్తున్నది. సినిమాలకు తిప్పుతున్నది. దీని పని చూసి అనసూయమ్మ జీతం పెంచింది. ఎవరికి చెప్పాలనుకొన్నావే ఈ మాటలన్నీ. ఆ సొమ్ము వీడిస్తున్నదేనా? చేసుకొన్న మొగుణ్ణి వదిలి అడ్డమైన వాళ్ళతో తిరుగుతూ....."
    "ఛీ, ఛీ! అన్నయ్యా! ఏం మాట లన్నావు? నా గురించి, నా నైజం గురించి తెలియని వాళ్ళు ఏదో అన్నారంటే నేను బాధపడలేదు కాని....కాని , నువ్వు , ఇంతకాలంగా నా తరహ తెలిసిన నువ్వు ఇటువంటి మాటలంటున్నావంటే నమ్మలేకపోతున్నాను.
    "అన్నయ్యా! అర్ధరాత్రి నలుగురు కట్టిన ఇంట్లో నిలబడి ఒక మాట చెప్తున్నాను. జ్ఞాపక ముంచుకో. మీరు ఈ పూట నా మెళ్ళో తాళి కట్టించి , మరు పూటనే దెబ్బ లాటలతో దానిలి విలువ లేకుండా చేసేరే! ఆ తాళి నన్ను బంధించి ఉంచలేదు. నాకు మగాడి అవసరం కావాలనుకుంటే నాలా ధైర్యమున్న వాడిని బాహాటంగా పెళ్ళి చేసుకుంటాను. నాకిష్టం లేని మొగుడితో కాపురం చెయ్యమని ఏ కోర్టులూ నన్ను నిర్భంధించలేవు. మీలా కుటుంబ గౌరవం అంటూ కుళ్ళు మూట కట్టుకొని తిరిగే ఓపిక నాకు లేదు. నాకు న్యాయం, ధర్మం అని తోచిన దాన్ని ధైర్యంగా , నలుగురికి తెలిసేలా చేస్తాను."
    మాట పూర్తీ చేసి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది జానకి.
    చాల రాత్రి వరకు సూర్యారావు సుందరమ్మ గుసగుస లాడుకొంటూనే ఉన్నారు.
    "చూసేవా , అమ్మా దీని తెగింపు! వాణ్ణి వెంట వేసుకొని వీధుల వెంట తిరుగుతూ పైగా తను చేసిన పనిలో తప్పు లేదని వాదిస్తున్నది. ఇందుకే ఈ ఉద్యోగాలు, సద్యోగాలు వద్దు. ఏముంటే అది తింటూ పరువుగా ఓ మూల పడుందామంటే విన్నావు కాదు."
    సూర్యారావు గొంతు కాస్త గట్టిగానే వినిపించింది.
    "ఇదిలా అయిపోతుందని నేను మాత్రం అనుకోన్నానా ? ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోల్లింపుగా నీ బరువు కొంత తగ్గుతుంది ; దానికి కొంత వ్యాపకం ఉంటుందని అనుకొన్నాను కాని...."
    "ఇప్పుడు ఇంకేం చెయ్యటం?"
    "ఉద్యోగం మానీయమను."
    "మానె అంటే మానేస్తుందినేనా నీ ఉద్దేశం? ఒకసారి తిరగడం మరిగిన ఆడది ఇంటి పట్టున ఉండగలదనుకొంటున్నావా?"
    "పోనీ , వాళ్ళింటి కోమారు వెళ్ళి కాళ్ళూ చేతులూ పట్టుకొని, బ్రతిమాలుకొని రా. ఈపాటికి వాళ్ళ కోపం చల్లారి వాళ్ళ మనస్సులు మారితే, ఏదో విధాన చల్లగా దాన్ని సాగనంపవచ్చు."
    తల్లి అన్నమాట సబబుగా ఉన్నదనిపించింది సూర్యారావుకు. జానకిని దారిలోకి తీసుకురావాలంటే అంతకుమించిన మార్గం లేదని తోచింది. త్వరలోనే జానకి అత్తవారింటికి వెళ్ళి ఏదో విధంగా వాళ్ళను ఒప్పించి చెల్లెల్ని అంపకం పెట్టాలని నిశ్చయించుకొన్నాడు సూర్యారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS