Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 19

                            

                                      10

    బాబును తిరిగి పొందగలిగానన్న సంతోషంతో స్నేహితులందరినీ పిలిచి పార్టీ ఇచ్చింది రూపవతి. "ఇన్నాళ్ళు పెంచీ పిల్లాడిని నీ కిచ్చాడేం డాక్టరు?" అని కొందరు అడిగారు.
    ఎవరికీ అనుమానం కలగకుండా చెప్పింది రూప: ఆయన పెళ్ళిచేసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నట్లున్నారు. బాబును ఎవరికో ఇచ్చే ఉద్దేశం కనిపెట్టి నేను పెంచుకొంటాను, 'ఇమ్మన్నాను. ఇచ్చారు."
    "బాబుమీద ఆయనకు విపరీతమైన ప్రేమ అని విన్నాను. ఎలా ఇచ్చారబ్బా!"
    "పెళ్ళికావాలన్నప్పుడు బాబు అడ్డంకి కదూ? పెళ్ళి ఎక్కువా? ఎక్కడో దొరికిన పిల్లాడు ఎక్కువా?"
    "మరి నీ కెందుకీ పిల్లాడు? ముందు కావలసినదానివి!"
    "నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు."
    "పెళ్ళి అంటే ఇష్టంలేదు. పిల్లలంటే ఇష్టం! చిత్రంగా ఉంది."
    ఎవరి పరిహాసాలూ, గుసగుసలూ లక్ష్యపెట్టే టట్లు లేదు రూప. అందరినీ చిరునవ్వులతో సాగనంపింది.
    నాటి సాయంకాలం రత్న దిగింది, ఊరినుండి.
    బాబును ఎత్తుకొని ఎదురువెళ్ళింది రూప. "వదినా! బాబు ఎంతవాడయ్యాడో చూడు."
    "ఊఁ!" గంభీరంగా మూలిగి ఇంట్లోకి వచ్చింది రత్న, ముఖం చిట్లిస్తూ.
    "అత్తరా, బాబూ! వెళ్ళు."
    "ఉహుఁ." తీవ్రంగా తల ఆడించాడు బాబు. "అత్తకాదు. అత్త మా ఇంతిలో ఉంది. నన్ను తీసి కెళ్ళు."
    నుదురు కొట్టుకుంది రూప. "వాళ్ళను మరిపించలేక చస్తున్నానే! ఎంతసేపూ నాన్నా, అత్తా, తీసికెళ్ళు అన్నమాటే. ఏడుపు లంకించుకొన్నాడంటే మాన్చలేక తలప్రాణం తోకకి వస్తూంది" చెప్పు కొంది రత్నతో.
    చాలాసేపు మాట్లాడలేదు రత్న, రూప తెచ్చిన కాఫీకూడా తాగకుండా టేబిల్ మీద ఉంచేసింది.
    "కోపంగా ఉందా?" రూప అడిగింది, తేలిగ్గా నవ్వేస్తూ.
    "నువ్వు చేసిన పని మంచిదికాదు, రూపా." మందస్వరంతో అన్నది రత్న.
    "ఆ సంగతి నీ కిప్పుడు తెలియదు. నీ కడుపున ఓ బిడ్డ పుడితే తెలుస్తుంది, తల్లిబాధ, నీతులకేం, ఎన్నయినా చెప్పవచ్చు." తిరస్కారభావంతో చూచింది రూప.
    "అవును, చెప్పవచ్చు." దీర్ఘంగా నిట్టూర్చింది. "ముందు ఇలా జరుగుతుందని తెలిస్తే ఈ పాపిష్టి పిల్లాణ్ణి ఏ ఏట్లోకో గిరవాటు వేసేదాన్ని. పీడ వదిలేది. అందరి ఆశలూ మంటగలపడానికే పుట్టాడ దౌర్భాగ్యుడు." స్వగతంగా అనుకొంది.
    "వదినా!" అంచులు దాటిన ఆగ్రహంతో చిందులు తొక్కింది రూప. "వచ్చినదానివి వచ్చావు; అపభ్రంశపు మాటలు మాట్లాడకు. నువ్వు నాకు చేసిన మేలు ఏమైనా ఉంటే, కృతజ్ఞత. అయితే పెళ్ళి
    బాబు విషయంలో నువ్వు జోక్యం కల్పించుకోవద్దు దయచేసి."
    "ఈ సంబరం చూడడానికే ఉత్తరం వ్రాశావా, రమ్మని?"
    "బాబుని చూసి సంతోషిస్తావనుకొన్నాను."
    "కడుపు నిండిందమ్మా, సంతోషం!" లేచింది రత్న. "ఇప్పుడు కాదు అప్పుడు. చెల్లెలి పెళ్ళి చేసి ముద్దుముచ్చటలు చూసుకోవాలని ఓ వైపు మీ అన్న గారు సంబరపడుతున్నారు. ఇక్కడ నీ వ్యవహార మేమో ఇలా ఉంది....సరే, నీ ఇష్టం. అందరినీ ఏ గంగలో దింపుతావో దింపు."
    సూటుకేసు అందుకొని వెళ్ళిపోతూన్న రత్నను మాటమాత్రంగానైనా వారించలేదు రూప.
    "నాన్న!" బాబు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
    "నాన్న, నీ నాన్నరా!" కిషన్ ఫోటో ముందు ఉంచింది రూప.
    "ఛ! నాన్నకాదు పో!" కాలుతో టక్కుమని తన్నాడు. ఫోటో బద్దలైంది. "నాన్న దగ్గిరికి పోతాను. నన్ను తీసికెళ్ళు. ఊఁ తీసికెళ్ళు." ఇంటి కప్పు ఎగిరిపోయేలా రాగం తీశాడు.
    రూప బాబును ఎత్తుకొని తోటలోకి వెళ్ళింది. "ఏడుపు మానెయ్యి. నీకా పిట్టను పట్టి ఇస్తాను." బులిపించింది, మామిడిచెట్టుమీద కువకువలాడుతూన్న ఓ నల్లని పిచ్చుకను చూపుతూ.
    "నా కక్కర్లేదుపో. నాన్న....ఆ...ఆ..ఆ."
    "ఇదో, బాలూ! గులాబీ ఎంచక్కా పూసిందో చూడు. కోసి ఇవ్వనా?"
    తల అడ్డంగా ఊపాడు.
    "బిస్కెట్లు ఇవ్వనా?"
    "నా కేమి వద్దు పో. నాన్నదగ్గిరికి పోతాను."
    "నువ్వు ఇలా చేస్తే ఎలా, బాలూ? అమ్మని ఇలా కష్టపెట్టవచ్చా?"
    "నా పేలు బాలు కాదని చెప్పలా?" గద్దించాడు. "నా పేలు గోకులకిత్న. ఆఁ!"
    రూప ముద్దుగా ముచ్చటపడి పెట్టుకొన్న పేరు 'బాలకిషన్'. ఆ పేరుతో ఎప్పుడు పిలిచినా వెర్రి కోపం వస్తూంది బాబుకు.
    బాబు "నాన్న" అన్నప్పుడల్లా ఏదో చెప్పి,  ఏ పండో చేతికి ఇచ్చి అతడిని ఆ ధ్యాస నుండి మరల్చేది. ఈ వేళమాత్రం అతడిని కల్యాణ్ ధ్యాస నుండి మరల్చడం తరం కావడంలేదు రూపకు. నాన్న దగ్గిరకి తీసుకువెళ్ళమని రెండు గంటలుగా ఏడుస్తూనే ఉన్నాడు. ముఖం కందగడ్డలా అయింది. కళ్ళు ఎర్రబడి చిన్నగా అయ్యాయి. ఏడ్చి ఏడ్చి గొంతు సన్నబడి జీరపోయింది.
    "నాన్నా, అన్నం తిందువుగాని రా." వెండి పళ్ళెంలో అన్నం కలిపి తెచ్చింది.
    "నా కక్కరలేదు."
    "నా మంచి నాన్నని కాదూ?" చెయ్యి పట్టి కూర్చోబెట్టబోయింది. దూరంగా పరిగెత్తాడు. రూప చెయ్యి కడుక్కొని పట్టుకుందుకు వెళ్ళింది. ఆమె చేతుల్లో నిలవకుండా కాళ్ళూ చేతులూ కొట్టుకో సాగాడు.
    "ఇలా మొండికేస్తే దెబ్బలు పడతాయి, చూడు."
    బాబు చిర్రెత్తిపోయాడు. "దెయ్యం!" రూప చేతిని కసికొద్దీ కొరికి విడిపించుకు పరిగెత్తాడు. పట్టుకుందామని పరిగెత్తింది రూప. బాబు అందకుండా గేటుదాటి రోడ్డుమీద పడి ఒకటే పరుగు! బాబు ముందు. వెనక రూప.
    వచ్చిపోయే కార్లూ, రిక్షాలూ చూసి హడిలి పోయింది రూప. "బాబూ!"
    పెనుభూతం బారినుండి తప్పించుకొని పారిపోయే వాడిలా పరిగెత్తుతున్నాడు బాబు, "నాన్నా, నాన్నా" అంటూ.
    ఎదురుగా వేగంగా వస్తూన్న కారు ఒకటి అకస్మాత్తుగా వేసిన బ్రేక్ తో ఆగిపోయింది. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది.
    దమ్ముపట్టి పరిగెత్తి పట్టుకోగలిగింది రూప, బాబును.
    ఆ రాత్రి బాబు అన్నం తినలేదు. ఏడుపూ మానలేదు. మంచిగా చెప్పింది; బెదిరిస్తూ చెప్పింది. రూప చేసిన ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు. ఆమెలో ఓర్పు నశించింది. బాబు ఏడుపుతో చిరాకెత్తిపోయింది. "ఛీ, వెధవా! నాన్న ఎవడురా? దిక్కుమాలినవాడు" అంటూ ఒక్క దెబ్బ వేసింది. బాబు కెవ్వుమన్నాడు. పాల బుగ్గ కందిపోయింది.
    చిరాకు పరాకు అంతా వదిలిపోయిన రూప బాబును దగ్గిరికి తీసుకోబోయింది.
    'నువ్వు ముట్టుకొంటేనే మైలపడతా' అన్నట్లు విదిలించికొట్టి దూరంగా జరిగాడు.
    'ఛీ! నా చెయ్యి పడిపోను. ఎంత దెబ్బ కొట్టాను!' రూప కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 'ఇప్పుడు డాక్టరు ఉండవలిసినమాట. బాబుమీద పడిన ఒక దెబ్బకు పది రెట్లు తననుండి వసూలుచేసి ఉండేవాడు!'
    బాబు ఏడ్చి ఏడ్చి అలిసి నేలమీదే నిద్రపోయాడు. రూప చేతులమీద లేవనెత్తి మంచంమీద పడుకోబెట్టింది. బాబు ఒళ్ళు వెచ్చబడి ఉంది. రూప మనస్సులో కలత బయలుదేరింది. 'బాబును తిరిగి పొందగలిగానన్న ఆనందమైనా లేకుండా ఏమిటీ అన్యాయం?' అనిపించింది. 'రెండు రోజులు వెళ్ళాలి. తరవాతయినా వాళ్ళను మరిచి నావాడు కాడా?' అని ధైర్యం చెప్పుకొంది.
    తెల్లారేసరికి బాబుకు పాలపొంగులా జ్వరం వచ్చేసింది. దిక్కుతోచలేదు రూపకు. తనకు బాగా తెలిసి ఉన్న డాక్టరుకు కబురు పంపింది.
    డాక్టర్ ఆనంద్ వచ్చాడు. బాబును చూసి ఆశ్చర్యపోతూ, "డాక్టర్ కల్యాణచక్రవర్తి పెంచుతున్న అబ్బాయి కదూ?" అని అడిగాడు.
    "అవును."
    ప్రశ్నార్ధకంగా చూశాడు రూపకేసి, డాక్టరు.
    "ఆయన పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నారు. బాబును ఎక్కడికో పంపేసే ప్రయత్నంలో ఉండగా నేను తెచ్చుకొన్నాను." ఏదో ఒకటి చెప్పక తప్పలేదు రూపకు.
    డాక్టరు ఇంజక్షన్ చేసి, "డిస్పెన్సరీకి ఎవరినైనా పంపించండి. మందు పంపిస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
    ఆ రోజంతా బరువుగా గడిచింది.
    బాబుకు వచ్చిన జ్వరానికి విడుపు అన్నది లేదు. స్మారకం లేకుండా పడి ఉండే "నాన్న! నాన్న" అంటూ పలవరిస్తున్నాడు.
    డాక్టరు, బాబు పరిస్థితి చూచి, "కల్యాణ చక్రవర్తిని పిలిపించండి. అతడిపై బెంగ పెట్టుకొన్నట్లున్నాడు. ఇన్నాళ్ళు అతడి చేతుల్లో పెరిగిన వాడు. ఎలా విడిచి ఉంటాడు? అతడిని పిలిపించండి" అని సలహా ఇచ్చాడు.
    రూప బొత్తిగా వినిపించుకోలేదు. 'తిరిగి ఆ పీడ ఎక్కడ తగిలించుకోను?' అనుకొంది.
    రాత్రి గడవడం కష్టమనిపించింది. రూపకు ఎటూ తోచక రాత్రి పన్నెండు గంటలప్పుడు నౌకరును పంపి డాక్టరును రప్పించింది.
    "ఉదయమే చెప్పాను కదండీ? నా మందులేమీ పనిచెయ్యవు. కల్యాణబాబు వస్తే మందులు అక్కర లేకుండానే నయమైపోతుంది" అన్నాడు డాక్టరు.
    రూప మౌనం సహించింది.
    "మీ రీ విషయంలో అశ్రద్ధ చేశారంటే బాబుకు ప్రాణగండం తప్పదని గ్రహించండి." హెచ్చరించి వెళ్ళిపోయాడు.
    రూప గుండెలో రాయి పడింది. 'మహారాజాలా పెరుగుతూన్న పిల్లాణ్ణి తెచ్చి చేతులారా చంపు కొంటున్నట్లయిందే! ఇదేం కర్మ నాకు? నే నేది చేసినా ఇంత కఠినంగా శిక్షిస్తున్నాడెందుకు భగవంతుడు?' దుఃఖించింది. 'ఆయన పిల్లాణ్ణి ఆయన చేతుల్లో పెడతాను. నా బరువు తీర్చుకొంటాను' అని నిశ్చయించుకొంది.
    కనుచీకటి ఉండగానే రిక్షా తెప్పించుకొని కళ్యాణ్ ఇంటికి బాబును తీసుకువెళ్ళింది రూప.
    పనిమనిషి కళ్ళాపి చల్లగా కృష్ణప్రియ ముగ్గుపెడుతున్నది, వాకిటిలో. రిక్షానుండి బాబుతో దిగిన రూపను చూచి ముఖం తిప్పేసుకుంది. జుగుప్సా క్రోధాలతో నిండిపోయింది ఆమె హృదయం. రూప ఆగమనం ఆమెకు ఆశ్చర్యంగా ఉన్నా పలకరించలేదు.
    రూపే ఆదుర్దాగా అడిగింది: "డాక్టరు ఉన్నారా?"
    "లేడు."
    "లేరా?" ఎక్కడలేని నీరసం ఆవహించింది రూపను. "ఎక్కడికి వెళ్ళారు?"
    "అతడితో అవసరమేమి వచ్చింది?" నిరసనగా అంది కృష్ణప్రియ.
    గుడ్లనీళ్ళు తిరిగాయి రూపకు. "ఇప్పుడు నే నెంత ఆపదను నెత్తినపెట్టుకు వచ్చానో కొంచెం గ్రహించండి. నేను చేసిన తెలివిలేనిపనికి ప్రతీకారంగా శూలాలతో పొడవవద్దు. ఇప్పటికే నా ప్రాణం చచ్చింది." దీనంగా పెట్టింది ముఖం.
    "ఇప్పుడు వచ్చిన ఆపద ఏమిటి?" హేళన తిరస్కారం మేళవించాయి కంఠంలో. "బాబును దక్కించుకొన్నావుగా? ఇక సుఖంగా ఉండవచ్చునే!"
    "బాబుకు జ్వరమండీ. మన తెలివిలో లేడు. డాక్టరును గురించి పలవరిస్తున్నాడు." రుద్ధ కంఠంతో చెప్పింది. "మీ బాబును మీకు ఇచ్చి పోతాను. జీవితంలో ఇంకెప్పుడూ బాబుమాట తలుచుకోను. నా మాట నమ్మండి."
    "అయ్యో! మా బాబు ఎందుకౌతాడు? మా బాబు అయితే మా దగ్గిరే ఉండేవాడు. కాదు కనకనే మానుండి లాక్కొన్నావు. జ్వరం వస్తే కళ్యాణ్ ఏం చేస్తాడు? తల్లివి నువ్వు ఉండగా అతడి అవసరం ఏమి వచ్చింది?"
    కృష్ణప్రియ ఎంత పరుషంగామాట్లాడినా కోపం తెచ్చుకోలేదు రూప. వినయంగానే అడిగింది: "డాక్టరు ఎక్కడి కెళ్ళారు?"
    "మద్రాసు వెళ్ళాడు, మరదలిదగ్గరికి."
    "ఈవేళ వస్తారా?"
    "ఇప్పుడే రాడు. సెలవు నెల్లాళ్ళు పెట్టి వెళ్ళాడు."
    ఎక్కడలేని నిస్పృహ తోచింది. "బ్రతికే యోగం లేనట్లుందిరా నీకు." ఏడుస్తూ రిక్షా ఎక్కింది రూప.
    రూపమీద కోపంతో ఎంత కటువుగా మాట్లాడినా బాబును పెంచిన ప్రేమ కృష్ణ ప్రియను నిలవ నీయలేదు. 'పురిటి పిల్లాడిని ఈ చేతులమీదుగా అంతవాన్ని చేశాను. ఒల్లెరుగని జ్వరంతో ఉన్నా డంటే కనీసం ముఖమైనా చూడని కఠినురాల నయ్యానేమిటి?' కదిలిపోతున్న రిక్షా దగ్గిరికి గబ గబా వెళ్ళింది. "బాబూ, గోకుల్! ఏమైందమ్మా? కళ్ళు తెరిచి చూడమ్మా, ఒక్కసారి. ఒక్కసారి చూడరా." అన్నది గద్గదస్వరంతో. "బాబులేని ఇంట్లో ఉండలేనంటూ పిచ్చెత్తినవాడిలా వెళ్ళి పోయాడురా మీ నాన్న!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS