ఎందుకు, తండ్రలా చెప్తున్నాడో విమల్ కు తెలుసు.
తండ్రంటే ఎంతో భక్తీ విమల్ కు. అందుక్కారణం తల్లిని, దేవతలా చూసుకునేవాడు తండ్రి.
"గుడ్ నైట్ ......మై సన్." ఫోన్ పెట్టేసాడు జయేంద్ర దత్.
తండ్రి జయేంద్రదత్, నిలువెత్తు రూపం ఒక్కసారి కళ్ళముందు మెదిలింది. మెత్తని మాట. చల్లని మనసు.
ఆ సమయంలో తండ్రి ఫోన్ చేయడం, మనసుకెంతో ఆనందమనిపించింది.
కానీ -------
ఏదో లోపం .........ఏదో లోపం........
కృష్ణనందన .......కృష్ణనందన.......
ఎందుకలా మారిపోయింది. అంత అసహజంగా, అంత కృత్రిమంగా, అంత క్రూరంగా - ఆ మార్పుకు కారణం ఏమిటి?
- ఆ ప్రయత్నంగా ఆ గదిలోంచి బయటికొచ్చేశాడు విమల్.
పరిసరాలన్నీ నిశ్శబ్దంగా వున్నాయి.
వరండాలో అక్కడక్కడ దీపాలు వెలుగుతున్నాయి.
మెట్లు దిగి కింద కొచ్చాడు.
కారు పార్కింగ్ వేపు నడిచాడు.
* * * *
మరోసారి ఫోన్ ట్రై చేసింది మాధురి.
ఫోన్ రింగవుతున్న , ఎవరూ 'లిప్ట్' చెయ్యకపోవడంతో ,
'అంత మొద్దు నిద్రలో పడిపోయాడా విమల్ .'
విమల్ లేచి, ఫోన్ మాట్లాడితే ....
మాట్లాడాలనే కోరుకుంటోంది మాధురీ.
'టక్.......టక్.......టక్.......' డోర్ చప్పుడు.
రిసివర్ని పెట్టేసి, డోర్ వేపు చూసింది.
ఇంత రాత్రప్పుడు తన గది తలుపు చప్పుడు.
ప్రొడక్షన్ మానేజర్ కి ఏదో జ్ఞాపకం వచ్చుంటుంది.
టక్........టక్.......టక్.......
"మేనర్ లెస్ బ్రూట్స్ రాత్రివేళ డిస్టర్బ్ చెయ్యకూడదని లెసన్ ఇవ్వాలి."
విసురుగా వచ్చి, గడియతీసి, డోర్ తెరచింది.
ఎదురుగా --------
అంతంత కళ్ళతో మధురి అలా చూస్తూ వుండిపోయింది.
నైటీలో వున్న మాధురిని కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు విమల్.
ఏమలా నిలబడిపోయారు, కమిన్ ........."నవ్వుతూ వెనక్కి రెండడుగులు వేసింది.
"పడుకోలేదా నిద్ర రావడం లేదా .........." లోనికడుగేస్తూ అన్నాడు విమల్."
"రెండూనూ........
"సోఫాలో కూర్చుంటూ అంది మాధురి.
మాధురి కళ్ళ వేపు చిలిపిగా చూసాడు విమల్.
"నిద్రరాలేదు . బోరుగా వుంది. మీరు జ్ఞాపకం వచ్చారు. ఫోన్ చేసాను ......వచ్చేసాను" చిన్నపిల్లాడిలా అన్నాడు విమల్.
"నాకూ...అంతే. మాధురి నోటివరకూ వచ్చి ఆగిపోయిన మాట.
ఇక్కడ చల్లగా వుంది కదూ......' నెమ్మదిగా అన్నాడు.
"ఏసీ గదిలో అలాగే ఉంటుందేమో......." మెల్లగా నవ్వుతూ అంది మాధురి.
"మీరు పడుకుంటానంటే వెళ్ళిపోతాను." ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.
"ఎక్కడికి వెళ్ళిపోతారు."
"ఎక్కడికో , బయట మంచు బాగా పడుతోంది. మంచులో పూర్తిగా తడిసి ముద్దాయిపోయే వరకూ కూర్చోవాలని ఉంది."
"మీకు భలే భలే సరదాలున్నాయే. అకస్మాత్తుగా ఏకాంతంలోకి వెళ్ళిపోవడం అదొక రకం. ఎవరూ లేకపోతే నేనేక్కడకూ వెళ్ళలేను." శాలువాను భుజాల చుట్టూ కప్పుకుంటూ అంది మాధురి.
"బైట కెళ్దాం , వస్తారా?"
"ఏం?రాకూడదా!"
"రాకూడదని కాదు, జలుబు చేస్తే .....హీరోయిన్ వి కదా."
"ఎంత హీరోయిన్ అయినా, అంత సుకుమారం కాదులెండి. పదండి. "స్లిప్పర్స్ వేసుకుంటూ అంది.
లైటార్పి డోర్ దగ్గరకు వేసింది.
ఇద్దరూ బయటకొచ్చి , హోటల్ లాన్ లో కొచ్చారు.
ఊరంతా చీకటి ముద్దలా వుంది. పరిసరాలు నిద్రపోతున్నట్టుగా వున్నాయి.
ఆ హోటల్ కుడివేపు అర కిలోమీటరు దూరంలో ఓ పార్కు, మసక మంచు వెన్నెల్లో అస్పష్టంగా కనిపిస్తోంది.
చెట్ల కొమ్మల మీద మంచు, తెల్లటి గన్నేరు పువ్వుల్లాగా ఉంది.
ఇద్దరూ --
మంచు వర్షంలో తడుస్తూ ----
రోడ్డు మీద నడుస్తున్నప్పుడు విమల్ సూట్లో ఫోన్ మోగింది.
అలా ఆ ఫోన్ పదినిమిషాల సేపు మోగుతూనే వుంది.
తర్వాత -------
ఇంకో ఫోను , మాధురి డీలక్స్ రూమ్ లో మోగింది. పదినిమిషాలు మోగి , మోగి ఫోన్ మౌనం దాల్చింది.
ఆ సమయంలో -
మాధురి, విమల్ -
పార్కులో చెట్టుకింద రాయి మీద కూర్చున్నారు.
