Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 20

 

       "ఈ బిస్కట్ మీద నేమ్ చూసారు కదా.... మా కంపెనీయే తయారుచేసింది.." అని ఆ పక్కనే ఉన్న ఫ్లాస్క్ ను చూపెడుతూ-
    
    "ఆ ఫ్లాస్క్ కూడా.... మన కంపెనీ తయారీయే... ఫ్లాస్క్ కాదండీ సి.ఎమ్ గారూ.... ఆ కల్తీలేని ఆ వాటర్ బాటిల్స్... మన కంపెనీ నుంచి వచ్చినవే."
    
    అతని పొగరుమోతుఠీవీ, పొగరుమోతు హుందాతనం అసహ్యంగా ఉన్నాయి త్రిభువనేశ్వరికి.
    
    "మీ కంపెనీ ప్రోపగాండ కోసం వస్తే.... సెక్రటేరియట్ కి.... వీటిని సప్లయ్ చేసే.... కాంట్రాక్టర్ ఉన్నాడు....వాడిని వెళ్ళి కలవండి" చికాగ్గా అంది సి.ఎమ్.
    
    ఆ మాటకు నవ్వాడా వ్యక్తి.
    
    "అయ్యబాబోయ్ సి.ఎం.గారూ...భలే జోకేశారండీ బాబూ... కానీ నేను నవ్వడం లేదు. చూడండి సి.ఎమ్ గారూ! పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు మీకు పూర్తిగా ఏజ్ రాకుండానే సి.ఎం. అయిపోయారు. దానికి తోడు...ఇద్దరు ముసిలోళ్ళు మీకో ఎడ్వయిజర్స్... తప్పమ్మా తప్పు... అర్జంటు....అర్జంట్ డెసిషన్స్.... డ్రాస్టిక్ డెసిషన్స్... తీసుకోకూడదమ్మా."
    
    తీరుబడిగా సిగరెట్ వెలిగించాడా వ్యక్తి.
    
    చిర్రెత్తుకొచ్చింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవికి.
    
    "ఐ... విల్....కాల్ ద పోలీస్..." దాదాపు అరుస్తున్నంతగా అంది సి.ఎమ్
    
    "ఉండవమ్మా....చెప్పాను గదా...ఎవరూ రారు...ఎందుకంటే...."
    
    సరిగ్గా ఆ సమయంలోనే-
    
    లోనికి రాబోయిన ఫ్యూన్ ఆ వ్యక్తిని చూసి గబగబా వెనక్కి పరుగెత్తాడు.
    
    "రాయుడూ" కేకేసింది వెళుతున్న ఫ్యూన్ ని సి.ఎం.
    
    వాడు రాలేదు.
    
    "నేను సెక్రటేరియాట్ లోకి వచ్చిన విషయం మెయిన్ గేట్ దగ్గరున్న ఎ.సి.పి దగ్గర్నుంచి....మీ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ వరకూ తెలుసు...అందుకే...ఎవడూ....ఎవడూ....ఇక్కడికి రాడు."
    
    అంతవరకూ రకరకాలుగా ఆలోచిస్తున్న త్రిభువనేశ్వరీదేవికి, అప్పుడు అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది.
    
    వచ్చిన వ్యక్తి ఎవడో!
    
    అబ్బయ్యనాయుడు! ఆ పేరు నోటిమీదకు రాగానే ఎందుకో ఆమె వంటిమీద చిరుచెమట్లు పట్టేసాయి.
    
    "ఆర్యూ....అబ్బయ్యనాయుడు" తడారిపోయిన గొంతుతో అడిగింది సి.ఎం.
    
    "అబ్బయ్యనాయుడు! అబ్బయ్యనాయుడు!! అబ్బయ్యనాయుడు! ఆహా సి.ఎం. గారికి అబ్బయ్యనాయుడు గురించి తెల్సిందన్న మాట....అబ్బయ్య నాయుడు పేరు విని....అబ్బయ్యనాయుడు గురించి తెల్సుకుని....అబ్బయ్య నాయుడికి తెలీకుండా, అబ్బయ్యనాయుడు పర్మిషన్ లేకుండా...సారా నిషేధం పెట్టడానికి.....జీ.వో కూడా తేడానికి ప్రొహిబిషన్ సెల్ ను ఏర్పాటు చేయ్యదనైక్జి నిర్ణయాలు చకచకా తీసేసుకుంటే ఎలాగమ్మా....తప్పుకదూ."
    
    వ్యంగ్యంగా నవ్వాడా వ్యక్తి. పొగరుగా నవ్వాడా వ్యక్తి.
    
    మరి సహించలేకపోయింది త్రిభువనేశ్వరీదేవి. ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారింది.
    
    "మిస్టర్ నాయుడూ గెటవుట్.... ఒక చీఫ్ మినిస్టర్ ని డైరెక్టుగా సెక్రటేరియట్ లో, సి.ఎం ఛాంబర్ లోనే బెదిరించడానికొచ్చిన నువ్వు.... నేను తల్చుకుంటే నువ్వేమౌతావో తెల్సా..." త్రిభువనేశ్వరీదేవి నరనరంలో అసహనం నిండిపోయింది.
    
    "సి.ఎం తలచుకుంటే....నేనే మవుతానా....అమాయకమైన కోపం...పనికిరాని కోపం. అనుభవ శూన్యమైన కోపం ఇదే మాట నాతో అన్నావు కాబట్టి సరిపోయింది... మా బావతో అన్నావు కాదు....ఈపాటికి నీ స్థానంలో కొత్త సి.ఎం. ఉండేవాడు."
    
    అంటే.. అంటే.... వీడు అబ్బయ్యనాయుడు కాదన్నమాట! అబ్బయ్య నాయుడు బావమరిది శ్రీరాములునాయుడన్న మాట!
    
    "ఏం....సి.ఎం. మీ సారా కంట్రాక్టర్ల సొత్తనుకున్నావా..." ఉగ్రంగా ప్రశ్నించిందామె.
    
    "తెలీదా పాపం....కరెక్టుగా పాయింట్ కొచ్చావ్. ప్రభుత్వం- మేం తయారుచేసే సారా బాటిల్ మినిస్టర్లు... ఆ బాటిల్ లోని డ్రింక్... సి.ఎం...పూర్ సి.ఎం....కేప్ అంటే మూత అర్ధమైందా..."
    
    "అలా రాజ్యమేలే రోజులు పోయాయి మిస్టర్ శ్రీరాములు నాయుడు...విర్రవీగకు అలాగే... విర్రవీగొద్దని మీ బావతో కూడా చెప్పు....దిసీజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్....మిస్టర్ గెటవుట్" విసురుగా ముందుకు రాబోయింది త్రిభువనేశ్వరి.
    
    అడ్డుగా చెయ్యి పెట్టాడు శ్రీరాములునాయుడు.
    
    "ఇంత దూరం వచ్చింది...నీ స్పీచులు విండానికి కాదు సి.ఎం. మా మాటగా ఒక మాట చెప్పడానికి..."
    
    "రాయబారివా..."
    
    "అలాగే అనుకో నా మాట విను. నాసిక్ లో కరెన్సీని ప్రింట్ చేసే ప్రెస్ ను మూసేసావనుకో ఏమవుతుందో తెల్సా... మద్యంమీద నిషేధం పెట్టావనుకో అదే అవుతుంది....నిషేధం...జీ.వొల మీదే ఉంటుంది. రేపో నేడో చావడానికి సిద్దంగా వున్న ఫ్రీడమ్ ఫైటర్స్....ఎవరో ఒకరు సోషల్ వర్కర్స్... నిన్ను పొగడొచ్చు...కానీ... కల్తీ సారాని నువ్వాపలేవు.... కల్తీసారా చావుల్ని నువ్వాపలేవు...ఏ ప్రజల క్షేమం కోసం....నువ్వు నిషేధాన్ని పెట్టాలను కుంటున్నావో...వాళ్ళు నిషేధం పెట్టినా....ప్రతిరోజూ సారా తాగుతుంటారు గుర్తుంచుకో..."
    
    "ఇంకా..."
    
    "సారా సిండికేట్లను తేలిగ్గా తీసేయకు సి.ఎం...ఈ దేశంలో ఇవాళ తలలెగరేస్తున్న ప్రతి బడా పారిశ్రామికవేత్త కూడా నిన్నటి సారా చుక్కలోంచి మొలిచిన వాడే.... ప్రతి నాయకుడూ లిక్కర్ సిండికేట్ల దయా దాక్షిణ్యాలమీద బతుకుతున్నవాడే.... ఫర్ ఎగ్జాంపుల్... మీ ఎక్సయిజ్ డిపార్టుమెంటుకి మీరిస్తున్న దేమిటి? చాలీ చాలని జీతాలు.... మరి డిస్ట్రిట్ హెడ్ క్వార్టర్ లో.... ఎక్సయిజ్ డిపార్టుమెంట్లో పనిచేసే ఒక ఫ్యూన్ గాడి ఇంటికెళ్ళి చూడండి ఎలా ఉంటుందో...టీ.వీ. ఫ్రిజ్... వీసీఆర్... వాషింగ్ మెషిన్....ఎలా వచ్చాయి వాడికి? ఒక ఆఫీసర్ ఒక కేబినేట్ మినిస్టర్ కన్నా దర్జాగా, హుందాగా బతుకుతున్నాడంటే ఎలా వస్తోందా డబ్బు..." ఆవేశంగా ప్రశ్నించాడు శ్రీరాములునాయుడు.
    
    "మీలాంటి అవినీతిపరుల దృష్టికి, అవినీతిపరులే కన్పిస్తారు" కోపంగా అంది త్రిభువనేశ్వరీదేవి.
    
    "మైడియర్ యంగ్ సిఎం! ఒకప్పుడు నీతి, అవినీతి ఉండేవి. కానీ ఇప్పుడు అవినీతే నీతి, భోపాల్ గ్యాస్ కేస్ లో లక్షలాదిమంది ఇంకా హాహాకారాలు చేస్తూనే వున్నారు...దానికి కారణం అధికారుల అవినీతి. బోఫోర్స్ కేస్ ఇంకా కొలిక్కి ఎందుకు రాలేదు? దానికి నీతా కారణం చెప్పండి....రాజీవ్ గాంధి కేసు ఎన్నాళ్ళుగా నలుగుతోంది? ఎక్కడుంది లొసుగు చెప్పండి....కుళ్ళిన అవినీతి రాజకీయాలు కారణం కాదా.....పదేళ్ళక్రితం సిమెంట్ కుంభకోణంలో వందకోట్లు సంపాదించిన అవినీతి మహాగ్రేశరుడు అప్పటి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అంతుల్ ఇవాళ నీతిపరుడు....ఒకప్పుడు మనదేశం నుంచి అవినీతి ఆరోపణలతో విదేశాలు పారిపోయిన ఖషోగ్గీలు, హిందూజాలు, చంద్రస్వాములు. ఇవాళ మన రాజకీయ నాయకులకు ఆరాధ్య దేవతలు...టెల్ మీ- ఏది నీతి ఏది అవినీతి? బహిరంగంగా అవినీతికి పాల్పడిన ఈ దేశపు చీఫ్ జస్టిస్ రామస్వామికి, అధికార పార్టీ కొమ్ముకాసి దొడ్డి దారంట రక్షించడం అవినీతి కదా....ప్రతి ఎలక్షన్ కి మాలాంటి సారా కంట్రాక్టర్ల ఇళ్ళ మీద పడి ఎలక్షన్ల ఫండ్ గా కోట్లాది రూపాయలు వసూలు చెయ్యడం అవినీతి కాదా?
    
    మీ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది మేడమ్....ఒక్కసారి మీ పార్టీ ప్రెసిడెంట్ ను అడగండి.... ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక్కో కోటిరూపాయల్ని...మా లిక్కర్ సిండికేట్ ఎలక్షన్ నిధుల్ని అందిస్తేనే మీకు ఎమ్మెల్యేలొచ్చారు....మీకు ఓట్లు వేయించింది మా గూండాలు....మీకు రిగ్గింగులు చేయించింది మా మనుషులు .... బేలట్ బాక్సుల్ని సూట్ కేసుల్లా ఎత్తుకొచ్చింది మేం... ఇది అవినీతి కదా."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS