శ్రీరాములునాయుడు, అబ్బయ్యనాయుడికి ఎందుకు కుడిభుజంగా ఉన్నాడో స్పష్టంగా అర్ధమైంది త్రిభువనేశ్వరికి!
"అందువల్ల మేడమ్ పాత సి.ఎం....ల్లాగే అందర్నీ మంచి చేసుకుని హాయిగా వెళ్ళిపొండి....ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల్ని ఆపేయండి ఎవ్వడూ బాధపడడు. కూలి జనానికి బియ్యం సరఫరా ఆపేయండి ....ఎవ్వడూ బాధపడడు. కానీ సారాని ఆపకండి....సారాని ఆపేసి పేదోడి కడుపు కొట్టకండి" నవ్వుతూ వ్యంగ్యంగా అన్నాడు శ్రీరాములునాయుడు.
"అయిపోయిందా మీ ఉపన్యాసం? మర్యాదగా వెళ్ళండి."
"లేదు కాలేదు... ఎక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతిక్షణం అన్నీ మాకు తెలుసు. ప్రభుత్వానికి వెయ్యి కళ్ళుంటే మాకు లక్ష కళ్ళున్నాయి. ఇవి మర్యాదగా, సామరస్యపూరిత వాతావరణం కోసం చెప్తున్న మాటలు. జాగ్రత్తగా వినండి...మధ్యనిషేధం జరక్కూడదు తెద్దామానుకున్న జీవోను ఉపసంహరించుకుంటే-
ప్రభుత్వానికి మంచిది...
ప్రజలకూ మంచిది....మరీ ముఖ్యంగా-
మీకు, మీ పదవికీ మంచిది గుర్తుంచుకోండి" ముందుకు నడిచాడు శ్రీరాములునాయుడు.
రూమ్ లోంచి బయటకొచ్చి, మెట్లు దిగుతున్న శ్రీరాములునాయుడు వేపు చూస్తూ-
"మిస్టర్ నాయుడూ..."
అలా పిలుస్తున్న సి.ఎం. వేపు తలతిప్పి చూసాడు శ్రీరాములు నాయుడు.
ఒకడుగు ముందుకు వేసి-
దూరం నుంచి వస్తున్న కమెండోస్ ని చూపిస్తూ-
"నిన్నిప్పుడే అరెస్ట్ చేయించగలను. నువ్వానేవాడివి భూమ్మీద లేకుండా చెయ్యగలను. కానీ ఎందుకు చెయ్యడం లేదో తెలుసా? చెప్పు.... అబ్బయ్య నాయుడు ఎక్కడున్నా ఫోన్ చేసి చెప్పు....ఆ చీకటి రాజ్యం ఎన్నాళ్ళో సాగాదని రోజులు మూడాయని. అండర్ స్టాండ్" కోపాన్ని నిగ్రహించుకుని కూల్ గా హెచ్చరించింది త్రిభువనేశ్వరీదేవి.
ఏవనుకున్నాడో ఏమో...
అంతంత కళ్ళతో అదోరకంగా చూసి-
బయటికెళ్ళిపోయాడు శ్రీరాములునాయుడు.
అయిదు నిమిషాలు గడిచాయి.
సోఫాలో వెనక్కిచేరబడి, నిస్త్రాణంగా కూర్చున్న త్రిభువనేశ్వరి అడుగులు చప్పుడుకి తలెత్తి చూసింది.
ఎదురుగా ఫ్యూన్ రాయుడు వాడ్ని చూడగానే పెనుకోపం వచ్చింది సి.ఎమ్.కు.
"పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ ని రమ్మను."
పరుగు, పరుగున బయటికెళ్ళాడు వాడు మరో రెండు నిమిషాలకు సెక్యూరిటీ చీఫ్ హాజరయ్యాడు.
"వాటీజ్ దిస్....పట్టపగలు సెక్రటేరియట్ లో సి.ఎం. ఛాంబర్ లో కొచ్చి, ఒక సారా కాంట్రాక్టర్ సి.ఎం.నే బెదిరించ గలిగాడంటే మీరంతా ఎందుకండీ?"
"ఏ సి.ఎం. దగ్గరకైనా... విత్ అవుట్ అపాయింట్ మెంట్ వచ్చే వ్యక్తి మేడమ్ శ్రీరాములునాయుడు ... అలాగే... మీ దగ్గరక్కూడా వచ్చాడని...."
పరిస్థితి అర్ధమైపోయింది సి.ఎం.కు.
"మరోసారి ఆ శ్రీరాములునాయుడు సెక్రటేరియట్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు గుర్తుంచుకోండి."
"ఎస్... మేడమ్..."
పావుగంట గడిచింది.
కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టింది త్రిభువనేశ్వరీదేవి.
అప్పటికే అక్కడ చీఫ్ సెక్రట్రీ వరదరాజన్, పర్సనల్ సెక్రట్రీ హేమాద్రి శర్మ కూర్చున్నారు.
అప్పటికే శ్రీరాములునాయుడు సి.ఎం. త్రిభువనేశ్వరిని బెదిరించిన వార్త సెక్రటేరియట్ లో గుప్పుమంది.
వరదరాజన్, హేమాద్రిశర్మలు కూడా అప్పటివరకూ చర్చించుకున్న విషయం కూడా అదే.
"సెక్రటేరియట్ ఒక బజారులా తయారవుతుందాని నేనెప్పుడూ అనుకోలేదు" కామెంట్ చేసింది సి.ఎం.
"రెస్పెక్టడ ఆఫీసర్... ప్రొహిబిషన్ గురించి మనం తీసుకున్న నిర్ణయాలు.... మన చర్చలు....మనమధ్యే వున్నాయి....అవునా....ఇంతలోనే ఈ న్యూస్ శ్రీరాములునాయుడికి తెల్సిపోయింది ఏం జరిగింది చెప్పండి..."
ఆశ్చర్యంగా ఇద్దరూ తలెత్తారు వరదరాజన్, హేమాద్రిశర్మ.
"నో మేడమ్....ఇట్స్ నాట్ పాజిబుల్.... జస్ట్....దే ఆర్ బ్లఫింగ్ అంతే...మీ నోటంట వచ్చే సమాధానం కోసం, వాళ్ళు మిమ్మల్ని....టెస్ట్ చేసి ఉంటారు అంతే" వరదరాజన్ అన్నాడు.
"నేనలా అనుకోవడం లేదు చీఫ్ సెక్రట్రీగారూ మన సరౌండింగ్స్ లోనే ఎక్కడో లోపం వుంది. ఐ విల్ ఫైండ్ అవుట్..." చాలా సేపట్నించి ఆ విషయం గురించే ఆలోచిస్తున్న త్రిభువనేశ్వరీదేవి అప్పటికే ఒక నిర్ణయానికొచ్చింది.
అదే సమయంలో వరదరాజన్ ఒక ఫైలుని, సి.ఎమ్ కి అందించాడు. సి.ఎమ్. ఆ ఫైలుని సీరియస్ గా వెరిఫై చేస్తోంది.
ఇన్నాళ్ళకు తన కోరిక నెరవేరబోతోంది.
"ఈ రాష్ట్రంలో ఎప్పటికయినా మద్యాన్ని నిషేధించాలమ్మా" అని తన తండ్రి తరుచూ అనేమాట గుర్తువస్తోంది.
అకస్మాత్తుగా త్రిభువనేశ్వరికి తండ్రి సుభాష్ చంద్ర గుర్తుకొచ్చాడు.
తను చీఫ్ మినిష్టరు అవుతుందాని గానీ-
తన తండ్రి ఆశయాన్ని, తద్వారా గాంధీగారి ఆశయాన్నీ తను నెరవేర్చగలుగుతుందని గానీ-
ఎప్పుడూ అనుకోని సి.ఎమ్. త్రిభువనేశ్వరి-
కళ్ళు ఎందుకో చెమర్చాయి.
జీ.వో. డ్రాఫ్టింగ్ ఒకటికి రెండుసార్లు చదువుతోంది.
"హైకోర్టు చీఫ్ జస్టిస్ కు స్పెషల్ మెసెంజర్ ద్వారా లెటర్ పంపించాను మేడమ్. ఫోన్ చేసి మాట్లాడాను. రేపు కోర్టుకి హాలిడే డిక్లేర్ చేస్తున్నారు మేడమ్."
"గుడ్..." త్రిభువనేశ్వరీదేవి కళ్ళల్లో సంతోషం తొణికిసలాడుతోంది.
డ్రాఫ్టింగ్ చదివి ఏవో కరక్షన్స్ వెంటనే చేయమని చెప్పింది సి.ఎమ్.
"ఈ రిపోర్ట్సు మరోసారి చూస్తే బావుంటుంది మేడమ్...." పసుపుపచ్చ ఫైలుని ముందుకు తోస్తూ అన్నాడు హేమాద్రిశర్మ.
"ఏంటది..." ప్రశ్నించింది సి.ఎమ్. త్రిభువనేశ్వరి.
"అసెంబ్లీ లైబ్రరీ నుంచి తెప్పించాను మేడమ్... మీ రిఫరెన్స్ కి ఉపయోగపడుతుంది..." చెప్పాడాయన.
ఆ ఫైలులో పేపర్లు రంగుమారిపోయి ముదురు బూడిదరంగులో ఉన్నాయి.
ఫైలుమీద పేరును చదివింది సి.ఎమ్...
ఆంద్రప్రదేశ్ ఎక్సయిజ్ బిల్లు- 1968.
ఫైలు పేజీలు తిప్పింది త్రిభువనేశ్వరీదేవి.
"దేశ స్వాతంత్ర్య్తానికి పూర్వం మన రాష్ట్రం రెండు విభాగాలుగా ఉండేది. ఆంద్ర ప్రాంతం బ్రిటీష్ పాలనలో ఉండగా తెలంగానా ప్రాంతం నిజాం నవాబు పాలనలో ఉండేది.
అందుకే ఎక్సయిజ్ విధానం కూడా రెండు విధాలుగా ఉండేది. అమల్లో ఉండగా కోస్తాజిల్లాలలో 1904, 1906వ సంవత్సరాలలో బ్రిటీష్ వారు చేసిన చట్టాలు అమలులో ఉండేవి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఆంద్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఈ వివిధ చట్టాలను అమలు చేయడం కష్టమైంది. ఒక చట్టానికి మరో చట్టం విరుద్దంగా ఉండడంతో సారా కాంట్రాక్టర్లూ, మధ్యదళారులు ఈ లోపాన్ని అవకాశంగా తీసుకొని అనేక అక్రమాలకు పాల్పడసాగారు. కొస్తాజిల్లాలలో మద్యపాన నిషేధం అమలులో ఉండగా తెలంగాణా జిల్లాలో మద్యాన్ని సేవించేవారు.
