2
రెండు నెలల్లో పట్టణపు పరిస్థితులకూ, హోటలు భోజనానికి సగం అలవాటు పడ్డాడు సురేంద్ర. అతనిలోని మార్పును గమనిస్తూనే ఉన్నాడు రమేష్.
ఒక రోజున ఒక సినిమా హాలు ప్రాంతం లో విపరీతంగా జనం గుమిగూడి ఉన్నారు. డానికి ఇరు ప్రక్కలా జనం గుమిగూడి బారులు తీర్చి నిల్చున్నారు. అంతమంది జనసమూహాన్ని చూసేసరికి ఆశ్చర్యం వేసింది సురేంద్ర కు. అదే దారిన కాలేజీ నుంచి వస్తూ అడిగాడు రమేష్ ను-- "ఏమిటి హడావుడి?' అని.
"ఇవాళ ఆ హల్లో ఆడుతున్న తెలుగు చిత్రం శతదినోత్సవం. సినిమా యాక్టర్లూ, డైరెక్టరూ , తారలూ వచ్చారు. వాళ్ళని చూట్టానికే ఈ హడావుడి " అన్నాడు రమేష్.
"సినిమాల్లో చూస్తున్నారుగా?' అన్నాడు సురేంద్ర.
"ప్రత్యక్షంగా ఎట్లా ఉంటారో చూద్దామని. కొంతమంది కి అదో సరదా , అభిలాషా . నువ్వు కూడా యిక్కడి నుండి సినిమా వాళ్ళని చూస్తావా?"
"నేను ఎక్కువగా సినిమాలకు పోను. మా ఊళ్ళో ఒక సినిమా హాలున్నది. ఏవో సినిమాలు వస్తయ్యి. పోతయ్యి. నేను ఎక్కువగా పోను. మా నాన్నగారిని ఊరికే నే రమ్మంటారు. అయన కొన్ని వందలు చూశాడు."
"మీ నాన్నగారి పేరు నేను విన్నాను. చాలా పలుకుబడి గల వ్యక్తీ."
"అవును. అంతా అదే అంటారు-- అలాంటి రామయ్య గారికి ఇలాంటి కూచిలాంటి వాడూ , బి,సి నాటి భావాలు కలవాడూ అయిన ఈ సురేంద్ర ఎట్లా పుట్టాడా అని" అంటూ నవ్వాడు సురేంద్ర.
"అయితే సినిమాలు ఎందుకని చూడవు?"
"ఏ సినిమా చూసినా ప్రేమా, విరహమూ , తోట షికర్లూ, పాటలూ , ఒకళ్ళ నొకళ్ళు పూసుకు తిరగటం. నాకేం నచ్చవు."
"అంటే ప్రేమను గురించి కొంతవరకూ తెలుసునన్న మాట" అన్నాడు రమేష్ నవ్వి.
"నాకు తెలీదు. అయినా ప్రేమ అనేది నాలుగు గోడల మధ్య ఉండవలసినది గాని, బజార్లు , పార్కులు ఎక్కవలసింది కాదు. అంతకన్నా నాకేమీ తెలీదు."
"ఇంగ్లీషు సినిమాలు చూశావా?"
"ఒక్కటి మాత్రం చూశాను."
"వాటిల్లో ముద్దులు పెట్టుకుంటారు కదూ!"
"అవి మరీ ఘోరం. ఆ వాతావరణానికి ఆ సినిమాలు చెల్లుబాటు అనచ్చు మనదేశం లో కాదు."
"ఎందుకని?"
"అంత మరీ పచ్చి శృంగారమా?"
"ఆ దేశాల పద్దతులు అవ్వి. ముద్దులు నీకు బావుండవా?"
"ఆ విషయాలు నాకు తెలీవు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ముద్దు పెట్టుకునేది. మా తాతయ్య ఏదిరా మారాయ్ ఒక్క ముద్దివ్వు-- అనేవాడు."
రమేష్ కు నవ్వు వచ్చింది -- ఈ ఇరవయ్యో శతాబ్దం లో అర్ధభాగం దాటినా కూడా ఇంకా ఇలాంటి తరహా కు చెందిన వ్యక్తులు ఉంటారా అని. రామయ్య గారు నలబై ఆరో సంవత్సతరం లో ఎలక్షన్ల లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తీ. పలుకుబడి కలవాడు. అలాంటి వారి కడుపున ఈ సురేంద్ర ఎట్లా పుట్టాడా అన్న ఆశ్చర్యం రమేష్ కు కలిగింది. కాని సానపడితే ప్రకాశించే వజ్రమే ననుకున్నాడు.
ఆ సాయంత్రం ఇద్దరూ ఇంగ్లీషు సినిమాకు వెళ్ళారు. అంతా డాన్సు లూ, ముద్దులూ, తాగుడూ , అవయవ ప్రదర్శన లూ ఎక్కువగా ఉన్నాయి. సినిమా అయ్యాక హోటల్లో భోజనం చేసి ఇద్దరూ గదికి పోయారు.
"ఎట్లా ఉందిరా సినిమా?"
"రంగుల్లో చాలా బావుంది. కాని అంత విచ్చలవిడిగా ముద్దులూ, అవయవ ప్రదర్శన లూ బావుండలా. ఏదయినా కాలక్షేపానికి బాగానే ఉంది."
"ఈ ఊరొచ్చింతరవాత నువ్వు పాతిక పర్సంటు పాలిష్ అయినావు. ఇంకా మూడొంతులు పాలిష్ కావాలి."
"అంటే?"
"నీకు తెలీని విషయాలు చాలా ఉన్నయ్యి. క్రమేపీ నేర్చుకో. ఈ ప్రపంచం లో చెలామణి అవాలంటే అన్ని విషయాలూ నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. నేర్చించు కోవాలి. డబ్బు తెలివితేటల్ని ఇవ్వదు. తెలివి తేటలు పరిసర వాతావరణాన్ని బట్టి , స్నేహితుల్ని బట్టీ వృద్ది చేసుకోవచ్చు."
సురేంద్ర మాట్లాడలేదు. అతని మనస్సు లో ఏదో ఒక అనిర్ధిష్టమైన ఆలోచన కలిగి అంత లోనే అంతరించింది. రమేష్ తాపీగా సిగారెట్టు వెలిగించాడు.
` * * * *
సురేంద్ర కు పదిహేడో ఏడు. రమేష్ వయస్సు ఇరవై. చదువులో కొంచెం మందం.అతనికి వ్యాపకాలు జాస్తీ. రచయిత. పత్రికల్లో కధలూ, వ్యాసాలూ , గేయాలూ వ్రాస్తుంటాడు. ఊహ ప్రపంచం లో విహరిస్తాడు . ఆశావాది. వయస్సు కు మించిన ఊహలూ, ఆలోచన లూ. క్లాసు పుస్తకాలు అన్నీ ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదు. క్లాసులో చెప్పిందీ, విన్నది మరిచి పోడు. నవలల్లో, కధల్లో, గేయాల్లో అనేక రకాల . అనేక తరహాల ప్రియురాళ్లు. అందులో తన వయస్సు కు మించిన వారూ, తన ఈడు వారూ, తనకన్నా చిన్నవారూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు పిల్లలు తల్లులూ ఉన్నారు.
రమేష్ అన్నదమ్ములు ముగ్గురు. పెద్దన్న గారు న్యాయవాది. తండ్రితో భాగం పంచుకుని విడిపోయాడు. రెండో అన్నగారికి రైల్వే లో ఉద్యోగం. అతనూ భాగం పంచుకొని వెళ్ళిపోయాడు. మూడో వాడు రమేష్. రమేష్ వాటా, తండ్రి వాటా కలిసి మూడున్నర ఎకరాలు. ఈ కాస్త పొలం సేద్యం చేయిస్తూ తండ్రి స్వంత ఊళ్ళో ఉన్నాడు. అన్నలిద్దరూ వాళ్ళ భాగాలు, పొలాలు అమ్మేసుకుని డబ్బు దాచుకున్నారు.
రమేష్ కు పదో ఏట తల్లి పోయింది. రమేష్ అప్పగారు కామాక్షి. ఆవిడకు ఇరవై అయిదేళ్ళు . చిన్నప్పుడే భర్త పోయాడు. అప్పటి నుంచీ అత్తవారు మనోవర్తి కి ఇచ్చిన రెండెకరాల పొలం లోని అయివేజు తీసుకుంటూ, తండ్రికీ, తమ్ముడికీ పవండి పెడుతూ తండ్రి వద్దనే ఉంటున్నది. ఆవిడకు పిల్లలు లేరు. ఆవిడ కు రమేష్ అంటే పంచ ప్రాణాలును. ఇలాంటి వాతావరణం లో పెరిగిన రమేష్ కాలేజీ లో ఇంటరు లో చేరి ఇప్పుడు ఇంటరు రెండవ సంవత్సరం చదువుతున్నారు.
* * * *
దసరా పండుగులకు సురేంద్ర వాళ్ళ ఊరు వెళ్ళాడు. పండుగలకు కొడుకు వచ్చినందుకు తల్లి ఎంతో సంతోషించింది. ఆవిడకు కొడుకు కాస్త చిక్కినట్లు కనుపించాడు.
"ఏరా, బాబూ, చిక్కి పోయావెం రా? ఆ హోటలు తిండి పట్టలేదు కామాలు" అన్నది. కొడుకు హోటల్లో భోజనం చేస్తూ చదువుకో వలసి వచ్చినందుకు ఆవిడ చాలా నొచ్చుకుంది.
తల్లి తండ్రుల పెంపకాన్ని బట్టి కూడా పిల్లల మనః ప్రవృత్తు లు మారుతూ ఉంటాయి. నలుగురు పిల్లల మధ్య కొట్టుకుంటూ తిట్టుకుంటూ పీరిగిన పిల్లాల మనత్సత్వాలు వేరు. ఏకాకి గా ఒక్కగా నొక్కరు పెరిగే తీరు వేరు. అలాంటి వారు కేవలం కూపస్థ మండూకం లా అయినా అవుతారు; లేక దుర్వ్యసనాలకు గురయిన వారయినా అవుతారు.
"తోడు పెట్టిన పెరుగు వెయ్యమ్మా , చాలా రోజులయింది" అన్నాడు సురేంద్ర.
"హోటల్లో వెయ్యరురా?"
"వేస్తారు. అది పిండి పాల పెరుగు!"
"ఏమిటో కాలం మారిపోయింది. అంతా సూపర తిళ్ళు" అన్నదావిడ , ఇంత గడ్డ పెరుగు కంచం లో పోస్తూ.
సెలవుల్లో ఉన్న పది రోజులూ తనకు కావలసిన వన్నీ చేయించుకుని తిని, కావలసిన డబ్బు తండ్రి నడిగి తీసుకుని వెళ్ళాడు సురేంద్ర.
సురేంద్ర వెళ్ళుతుంటే తండ్రి, తల్లితో అన్నాడు ; "మనవాడు కాస్త ప్రపంచం లో పడుతున్నాడు. చూడు, అ పాంటు తొడుక్కొని సిల్కు బుష్ కోటు వేసుకుంటే ఎంత బావున్నాడో! నేను రాజకీయాల్లో మునిగి తేలుతున్నా, వాడికి ప్రపంచ జ్ఞానం ఎట్లా అబ్బుతుందా అని మధన పడుతూనే ఉండేవాణ్ణి."
"మీ పుణ్యమా యిరి, దిష్టి తగిలెను, మా పిచ్చి నాయనకు." అన్నదావిడ.
ఈ దసరా సెలవులకు రమేష్ ఇంటికి వెళ్ళలేదు. గుంటూరు లోనే ఉంటూ సాహిత్య సభలకూ,సంగీత కచ్చేరీల కూ , సినిమా కూ వెళ్ళుతూ కాలక్షేపం చేశాడు.
సురేంద్ర రాగానే రమష్ కు ప్రాణం లేచి వచ్చినట్లయింది . ఆప్యాయంగా కావలించు కొని ఈ పది రోజుల్లో తను చూచిన వినోదాలు , విశేషాలూ అన్నీ చెప్పాడు.
"సినిమాలు సరేగాని, నన్నొక మంచి పాట కచ్చేరీ కి తీసుకు వెళ్ళు" అన్నాడు సురేంద్ర.
"అట్లాగే. ఎల్లుండి ఆదివారం వాణీ విలాస్ లో మంచి పాట కచ్చేరీ ఉంది. డానికి వెళదాం" అన్నాడు రమేష్.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వాణీ విలాస్ లో పాట కచ్చేరీ కి వెళ్లారు. రమేష్ కు కొన్ని కొన్ని రాగాలూ, ఆలాపన లూ తెలుసు. సురేంద్ర కు జీవితం లో ఇదే మొదలు పాట కచేరీలకు వెళ్ళటం.
ఆరోజు పాట కచ్చేరీ లో ఎవరో మంచి సంగీత విద్యాంసుడు పాడుతున్నాడు. డానికి తగినట్లు గా పక్క వాద్యాలు కూడా అమరినాయి.
ప్రేక్షకులు తన్మయులై వింటున్నారు. చాలా మంది ఆడవాళ్లు కూడా వచ్చారు.
ఇదంతా చాలా విచిత్రంగా తోచింది సురేంద్ర కు. రమేష్ కూడా తల ఊపుతూ తాళం వేస్తూ తన్మయుడై వింటున్నాడు. అంతా నిశ్శబ్దంగా వింటున్న సమయంలో సురేంద్ర మెల్లగా రమేష్ వీపు తట్టి, ఆడవాళ్ళ లో కూర్చున్న ఒకమ్మాయి వైపు చూపించి, "చూడు రమేష్, ఆ పిల్ల ఎంత బావుందో! చక్కగా, సన్నగా, పొడుగ్గా , నాజుగ్గా , రేవటాకు లా ఉంది " అన్నాడు. రమేష్ కూడా ఆ పిల్ల వైపు చూశాడు. "చాలా చక్కని పుటక. ఎంతో బావుంది."
పాట కచ్చేరి పూర్తయే వరకూ ఆ పిల్ల వైపు మధ్య మధ్య చూస్తూ కూర్చున్నాడు రమేష్. సురేంద్ర మాత్రం రెండు మూడు సార్లు ఆ పిల్ల వైపు చూసి ఊరుకున్నాడు.
పాట కచ్చేరి పూర్తయింది. అంతా వెళ్ళిపోతున్నారు. సురేంద్ర ను గదికి వెళ్ళమని రమేష్ హాలు వద్దనే ఉండిపోయాడు.
జనం అంతా వెళ్ళాక ఆ పిల్ల తల్లితో కూడా రిక్షా ఎక్కింది. రమేష్ కూడా యింకో రిక్షా లో ఎక్కి వాళ్ళను వెంబడించాడు. ఆ రోడ్డు నే నాలుగయిదు ఫర్లాంగు లు వెళ్ళాక ఓ మేడ ముందు వాళ్ళు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇల్లు గుర్తుపెట్టుకుని రమేష్ కూడా గదికి వెళ్ళాడు.
