Previous Page Next Page 
మనిషి పేజి 2


    నా స్మృతి పధంలో సారధిని గురించి నాకున్న జ్ఞాపకాలు , ఈ ఇరవై అయిదేళ్ళ జీవితం లోనూ ఇద్దరం కలిసి పంచుకున్న అనుభవాలు , ఇద్దర్నీ ముంచెత్తిన ఆలోచనలు, సమస్యలు పోగు చేసి వీలైనంత వరకు , నాకు చేతనైనంత వరకు ఓ క్రమం లో అమర్చి , ఈ రచన మీ ముందుంచుతున్నాను.
    ఇహపోతే కధలోకి వద్దాం.
    ఇంతవరకు పార్ధసారధి రూపు రేఖల్ని గురించి నేను చెప్పలేదు. అతనెలా ఉంటాడో ఊహించుకోమని పాఠకుల్ని గాలిలో వదిలి పెట్టటం అన్యాయం గనక చెపుతున్నాను.
    పార్ధసారధి అందమైన వాడనీ అందరూ అంగీకరించక పోవచ్చు. కాని, అతనిలో ఓ అవ్యక్తమైన ఆకర్షణ ఉందదంటే ఎవరూ కాదనరు. దాన్ని సౌకుమార్యం అనండి, లాలిత్యం అనండి-- ఏమైనా అతన్ని చూడాలని పిస్తుంది చూసిన వారికి.
    అయిదున్నర అడుగుల మనిషి. చిన్నప్పుడు బొద్దుగా ఉండి కొంచెం పొట్టిగా ఉన్నట్లు కనిపించేవాడు. బుగ్గలు ఉబ్బి ఉండేవి. కొంచెం పచ్చదనం కలిసిన చామన చాయ శరీరం. తలకట్టు కిరీటం లా అలంకారంగా ఉండేది. వంకీల్లేవు. కానీ, చిత్రమైన నిగారింపు కనిపించేది. గడ్డం మధ్యలోకి చీరినట్లుగా కింద చిన్న నొక్కుండేది.
    ఇద్దరం స్కూలు ఫైనలు లోకి వచ్చాం.
    ఒక్క సంవత్సరం లో సారధి విపరీతంగా సాగి, సన్నబడి కొంచెం రంగు తగ్గాడు. బుగ్గల బింకం తగ్గింది. ఇంటర్ రెండేళ్ళ ల్లోనూ రవ్వంత లావైనాడు కాని, మొత్తం మీద పలచటి మనుష్యుల్లోనే ఉండిపోయాడు.
    బొంబాయి లో ఉన్న నాలుగేళ్ల ల్లోనూ మనిషి కొంత మారాడు. గడ్డం నల్లబడింది. ఒళ్ళు కొంచెం తెల్లబడింది. గడ్డం నలుపులో నీలి రంగు మెరుపుండేది. శరీరచ్చాయ లో చిత్రమైన నిగారింపు కనిపిస్తుండేది. శరీరంలో ఒక ఔన్సు కూడా ఎక్కడా మాంసం ఎక్కువ ఉన్నట్టు గానీ, తక్కువ ఉన్నట్టు గానీ అనిపించేది కాదు. కానీ శరీరోగ్యాన్ని కాపాడుకోవాలనే శ్రద్ధ అణు మాత్రం కూడా సారధి కుండేది కాదు. రాత్రిళ్ళు చాలాసేపు మేలుకునేవాడు.
    "ఏం పనిరా ఇది?' అని అడిగితె ." ఇంకా ఇరవై తొమ్మిది చాలా దూరం ఉందిరా!" అనేవాడు.
    "అంతే?"
    "ఆయుర్దాయం మూడందే ఏం తినకపోయినా చావరు. మూడితే ఏం తిన్నా చస్తారు!"
    'బాగుందిరా నీ వేదాంతం!"
    "బాగున్నా, బాగుండకపోయినా ఇది నిజం రా, బాబూ!" అనేవాడు. శక్తి మాత్రమె కాదు, కవిత్వం చెప్పే శక్తి ఉంది. వాతావరణానికి మేరుగులిచ్చే శక్తి వుంది. ఏ విషయం మీదైనా అనర్గళంగా మాట్లాడే నేర్పు, నలుగురి తో కలిసి ఉన్నప్పుడు సరదాగా సంభాషణ దొర్లించే కౌశలం అతని కున్నాయి. అతనితో మాట్లాడటమంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసినప్పుడు గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. ఎంత మాట్లాడినా విసుగానిపించేది కాదు. ఒక్కొక్క రాత్రి కబుర్లాడుకుంటూ కూర్చుంటే కోళ్ళు కూసేవి.
    గుంటూరు వెళ్ళిన సారధి నాలుగు రోజుల దాకా తిరిగి రాలేదు. సారధి ఊళ్ళో ఉంటేనే క్లబ్బు కు వెళ్ళటం మానేవాణ్ణి. అతని కోసం అంతగా ఎదురు చూడటానికి మరో కారణం కూడా ఉంది. హెలెన్ ని గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని పించింది.
    హెలెన్ ని నే చూసి పదకొండేళ్ళయింది. కాని, ఆమె రూపం నేను మరిచి పోలేదు. చాలా అందమైన పిల్ల. తీర్చిదిద్దినట్లు, శిల్పం చేక్కినట్లుండేది. బాగా పొడగరి. పొడుగుకి తగిన ఒళ్లుండేది. అప్పటి కింకా అవయవాలు పూర్తిగా వికసించలేదు. అయినా ఒకనాడీ స్త్రీ. సౌందర్య సామ్రాజ్యాన్ని ఏకచ్చత్రాదిపత్యంగా పాలించగలదని ఎవరైనా ఊహించ గలరు. ఇంకా పూర్తిగా వికసించకుండానే ఆమెకు పెళ్లి చేశారు. అప్పటి కామెకు పదిహేనుళ్లుంటాయేమో!
    పదకొండేళ్ళు దాటాయి ఆమెను చూసి! తప్పకుండా  మారి ఉంటుంది. యౌవనం ఆమె శరీరాన్ని కప్పి, హృదయంలో గూడు కట్టుకుని ఉంటుంది.'
    పరిపూర్ణంగా వికసించిన గులాబి లా యౌవన మాధుర్యంతో ఊగుతూ , కోర్కెల మత్తుతో తూగుతూ , స్వర్గానికి నిచ్చెనలు వేస్తుండాలి. ఏమైనా హెలెన్ ని గురించి చాలా సంగతులు పార్ధ సారధి కి తెలిసి ఉంటాయి. పార్ధసారధి కి కోపం రాకపోతే, ఒకసారి ఆమెను చూడాలి.
    అయిదో రోజు తిరిగి వచ్చాడు పార్ధసారధి.
    రాత్రి భోజనాలు చేశాక వీధి అరుగు మీద ఫేం కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. ఇద్దరికీ నిద్ర రావటం లేదు. హెలెన్ సంగతి చెప్పమని అడిగాను.
    పార్ధసారధి ఈ కధ చెప్పాడు.
    అతను అసత్యం చెప్పడని, అతిశయోక్తులు మాట్లాడాడని నాకు తెలుసు.
    'నేను బొంబాయి వెళ్లి ఒక ఫిలిం కంపెనీ లో ఓ చిన్న ఉద్యోగం సంపాదించాను. ఏం ఉద్యోగమని అడగబోకు. ఆ రహస్యం చెప్పటం నాకూ గౌరవం కాదు, నీకూ కాదు. ఒకనాడు చిన్న కారు మా స్టూడియో లో ఆగింది. అందులోంచి ఓ నల్లటి భారీ విలాస పురుషుణ్ణి వెంట బెట్టుకుని హెలెన్ దిగింది. నా కళ్ళనే నేను నమ్మలేకపోయాను. జమిందారిణి లా ఉంది. శరీరం ఇంకా పల్చబడింది. నడుం అలాగే ఉన్నా, అటూ ఇటూ లావైంది. ఆమెను పలకరించడానికి నేను సాహసించ లేకపోయాను. కాని హెలెన్ నన్ను గుర్తుపట్టింది. పలకరించింది చాలా చనువుగా, లాలనగా. పక్క నున్న పెద్ద మనిషి ముఖం చిట్లించు కున్నాడు. అతను రామానాయుడని పెద్ద మైకా కంపెనీ ప్రోప్రయిటర్. ధనం ఎక్కువై, జీవిత మాధుర్యం పోగొట్టుకున్న అదృష్ట వంతుడులా కనిపించే దురదృష్ట వంతుడు. అతను సుఖాన్ని డబ్బుతో కొనాలని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకునేవాడు. అందాలను, సుఖాలని తెచ్చి ఇవ్వటానికి అతనికి ప్రత్యేకంగా అంతరంగికమయిన సిబ్బంది ఉంది. ఆ సిబ్బంది పెద్ద బుల్లి నాయుడు. అతడు దేశం ఆ చివర నుంచి ఈ చివర దాకా పర్యటిస్తుంటాడు. పరిమళాలు విరజిమ్మే సుందర కుసుమాలు ఎక్కడున్నా, ఎన్ని ముళ్ళ మధ్య ఉన్నా , అతి నేర్పుతో , డబ్బుని మంచినీళ్ళ లా పారబోసి, కోసి తీసుకు వెళ్లి రామానాయుడు ముందు పారేసేవాడు. ఆ బుల్లి నాయుడి దృష్టి ఒకనాడు హెలెన్ మీద పడింది. హెలెన్ భర్త జార్జి బెజవాడ లో స్కూలు మేస్టారు చేసేవాడు. అతనితో పరిచయం చేసుకున్నాడు బుల్లి నాయుడు.  అనతికాలం లోనే స్నేహం పెంచుకున్నాడు. ఒకశుభ ముహూర్తం లో జార్జిని తీసుకుపోయి తన కామందుకు పరిచయం చేశాడు బుల్లినాయుడు. సదవకాశం కోసం ఎదురు చూస్తున్న రామానాయుడు అతి గౌరవంగా జరిని ఆహ్వానించి, కుశల ప్రశ్నలు వేసి, కారులో నాలుగు బజార్లు తిప్పి, గూడూరు తీసుకుపోయి మైకా గనులను, తన సిరి సంపదల్ని , వైభవ ప్రాభావాల్ని చూపించి, మత్తెక్కించి, మదవతుల నప్పగించి, మధు పానీయాలు త్రాగించి, మనిషిని పెంపుడు కుక్కగా మార్చుకున్నాడు. ఈ మహా పరివర్తనం రెండు నెలల్లో జరిగిన తరువాత తన దగ్గిర జార్జిని మానేజర్ గా వేసుకున్నాడు రామానాయుడు. గూడూరు లో ఒక పెద్ద మేడ జార్జి కిచ్చాడు. అప్పటికి జార్జి కాపరం పెట్టు సంవత్సరం కాలేదు. హెలెన్ ని తీసుకుని జార్జి గూడూరు వచ్చి కొత్త ఉద్యోగంలో చేరి, కొత్త ఇంట్లో కాపురం పెట్టి, కొత్త జీవితానికి అలవాటు పడ్డాడు.
    ఒకనాడు బుల్లి నాయుడు తన కామందు ని తీసుకొని గూడూరు వచ్చి, ఒక పని పురమాయించి, రెండు వేలిచ్చి జార్జిని బొంబాయి పంపారు. జార్జి వెళ్ళగానే రామానాయుడు కారు జార్జి ఇంటి ముందు వాలింది. బుల్లి రెడ్డి మెత్తమెత్తగా నవ్వుతూ హెలెన్ దగ్గిరికి వెళ్లి, "ఇవాళ నీ అదృష్టం పండింది. రామానాయుడు గారు ఇక్కడుంటూన్నారు" అన్నాడు.
    హెలెన్ కి విషయం అర్ధమయింది.
    జార్జి కూడా ఇటీవల రామానాయుడు గారిని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు తనతో. మొదటి నుంచి ఈ విషయంలో హెలెన్ కి అనుమానం వేసింది. మొతం మీద హెలెన్ లొంగిపోయింది. రామానాయుడు తరచుగా గూడూరు వస్తుండేవాడు. అదే సమయంలో జార్జి ని ఏదో కార్యార్ధం ఏ బొంబాయో, డిల్లీ యో పంపుతూండేవాడు " అంటూ పార్ధసారధి లైటర్పటానికి లేచాడు.
    పుచ్చపువ్వు విరిసినట్లు వెన్నెల కాస్తుంది. వెన్నెల సుఖాన్ని వుద్యుద్దీపాలు నాశనం చేస్తున్నాయి.
    'మరి జరుగుతున్న కధ జార్జికి తెలీదా?" అని అడిగాను.
    'తెలుసు. కాని తెలియనట్టు నటించేవాడుట. రామానాయుడు రకరకాల రవ్వల నక్లేసు లు చేయించాడు హెలెన్ కి. డైమండ్ రింగులు కొన్నాడు. డజన్ల కొద్దీ చీరలు తెచ్చాడు. ఆ నగలు పెట్టుకుంటూ, చీరలు కట్టుకుంటూ తిరిగేది హెలెన్. అవన్నీ జార్జి చూసేవాడు. తాను కొనలేదని తెలుసు. ఎక్కడివని ఎన్నడూ అడగలేదట. ఒకనాడు హెలెన్ అతన్ని కవ్వించాలని "ఈ నెక్లెస్ బాగుందా , జార్జ్?" అందిట."
    "వండర్ ఫుల్ గా ఉంది' అన్నాడుట జార్జి.
    "ఎంతో తెలుసా ఇది?'
    'నువ్వే చెప్పు! నీకే తెలియాలి.'
    'ఆరు వేలు.'
    ఆ మాటకు జార్జి నవ్వుతూ, 'అదృష్ట వంతురాలివిలే' అనేవాడుట. హెలెన్ చెప్పింది ఇంకా వివరాలు. ఇలా కొంతకాలం గడిచాక బహిరంగం గానే జార్జి ఉండగానే రామానాయుడు వస్తుండేవాడు. క్రమంగా హెలెన్ ని తీసుకొని మహానగరాల సౌఖ్యాన్వేషణ లో తిరగటం మొదలు పెట్టాడు. అలా తిరుగుతూ బొంబాయి వచ్చి నాకు కనిపించారు.
    బొంబాయి లో పేరడైజ్ హోటల్లో దిగారు వాళ్ళు. హెలెన్ తన అడ్రస్ ఇచ్చి , రేపు ఉదయం హోటలు కు రమ్మని ఆహానించింది. వెళ్లాను మరునాడు.
    నన్ను చూసి ముఖం చిట్లించు కున్నాడు రామానాయుడు.
    హెలెన్ ముఖం నన్ను చూడగానే వికసించింది.
    రామానాయుడు కర్టెన్ చాటుకు హెలెన్ ని పిలిచి, మందలిస్తున్నాడు. నాకా మాటలు వినిపిస్తున్నాయి. మొగలాయీ దర్బారులా ఉన్న ఆ గదిలో హంస తూలికా తల్పం లాటి ఆ సోఫా పై కూర్చొని వాళ్ళ సంభాషణ వింటున్నాడు.
    ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు. 'అడ్డమైన వెధవ లతోనూ నీకెందుకు స్నేహం?' అంటూ రెట్టిస్తున్నాడు బుల్లి నాయుడు.
    'అతని కంటే నువ్వెలా అధికుడివో చెప్పు' అంటుంది. హెలెన్ నిర్లక్ష్యంగా. మాట మీద మాట పెరిగింది. రామానాయుడు పిచ్చి కేకలు వేసుకుంటూ గదిలోంచి వెళుతుంటే , హెలెన్ అతన్ని పిలిచి , మెళ్ళో నెక్లెస్ ని, చేతి ఉంగరాల్ని , గాజుల్ని ఊడబెరికి, అతని ముఖాన కొట్టి , గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. వెళుతూ నన్ను రమ్మని సైగ చేసింది. సరాసరి ఇద్దరం మా గదికి వచ్చాం. నలుగురం కలిసి ఆ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాం. ఆ వాతావరణం లో ఆడపిల్ల నుంచటం చాలా ప్రమాదమని నాకు భయం వేసింది.
    ఆ రోజే ఇంటికి తిరిగి పొమ్మన్నాను.
    ఆమె ఇంటికి వెళ్ళటం కంటే సముద్రం లో పడటం మంచిదంది. భర్త మీద ఆమెకున్న జుగుప్స అంతా వెళ్ళగక్కింది. రామానాయుడి కంటే నీచుడు, పశువు, దుర్మార్గుడు లోకంలో లేడంది. ఆ కీటకంతో తాను నరకం పంచుకోటానికి కారకుడైన బుల్లి నాయుణ్ణి, జార్జి ని పరిపరి విధాల శపించింది. ఏడ్చింది.
    నెత్తిన విరుచుకు పడ్డ అవమానంతో ఆమె హృదయం ముక్కలై పోయింది. ఆమె నెలా సంస్కరించాలో, ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.
    'నన్నేం చెయ్యమంటావ్, హెలెన్?' అని అడిగాను.
    'నేను చెప్పమన్నది చేస్తావా? నాకోసం ఆమాత్రం త్యాగం చెయ్యగలవా?' అంది.
    'ఏమిటది, చెప్పు?"
    'నీకు పెళ్లి అయిందా?"
    'లేదు.'
    'నన్ను పెళ్లి చేసుకో!'
    'నీకు భర్త ఉన్నాడుగా!'
    'ఉన్నా లేనట్టే.'
    'అంటే?'
    'అతనితో తెగతెంపులు చేసుకున్నాను. అతగాడి భార్యనని చెప్పుకు బతికే కంటే, ఆత్మహత్య చేసుకొని అంతరించి పోవటంలో గౌరవం ఉంది!' అంది హెలెన్.
    నేను పెళ్లి చేసుకోనని చెప్పాను ఖచ్చితంగా. కాకినాడ వెళ్లి నర్సు ట్రెయినింగు పొంది, ఎక్కడున్నా ఉద్యోగంలో చేరమని సలహా ఇచ్చాను. అలాగే బొంబాయి నుంచి సరాసరి కాకినాడ వెళ్లి, ట్రెయినింగ్ స్కూల్లో చేరి పాసయింది. వెంటనే గుంటూరు హాస్పిటల్ లో ఉద్యోగం దొరికింది. చేరింది. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండేది. చివరికి ఆమె రమ్మంటేనే బొంబాయి వదిలి వచ్చాను" అంటూ హెలెన్ కధ ముగించాడు పార్ధసారధి.
    "హెలెన్ పెళ్లి చేసుకోమని అడిగితె నువ్వెందుకు ఒప్పుకోలేదు?' అని అడిగాను సూటిగా. కులమత వ్యత్యాసాల మీద, సంఘ సంప్రదాయాల మీద అతని కంత గౌరవం లేదని నాకు తెలుసు.
    'నా ఆయుర్దాయం మొత్తం ఇరవై తొమ్మిదేళ్ళు. నేను చేసుకుని ఏం లాభం? మున్నాళ్ళ ముచ్చటగా?"
    కొరడాతో ముఖాన కొట్టినట్లయింది. పార్ధసారధి కి జ్యోతిష్యం పిచ్చ బ్రహ్మ రాక్షసిలా పట్టుకు పీడిస్తుంది. ఈ పిచ్చి ఊహలు నిజంగానే అతని జీవితాన్ని పాడు చేస్తాయేమో అనే భయం వేసింది. సారధి తల్లి తండ్రులకు ఈ పిచ్చ ముదిరిన సంగతి చెప్పి, అతనికి వెంటనే పెళ్లి చేయించటం అవసర మనిపించింది. మరునాడు అవరనిల గడ్డకు బయలుదేరి వెళ్లాను. పార్ధసారధి కూడా నా వెంట బయలుదేరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS