మనిషి
-----నండూరి విఠల్

నాకున్న స్నేహితుల్లో ముఖ్యమైన వాడు పార్ధ సారధి. మేమిద్దరం ఒకే ఊళ్ళో పుట్టాం.ఒకే బళ్ళో చదువుకున్నాం. ఒకే జట్టుగా అడుకున్నాం. ఇంటర్ దాకా ఇద్దరం కలిసే వచ్చాం. ఇంటర్ లో అతను తప్పాడు. నేను పాసయాను. దాంతో పదేళ్లుగా కలిసి చదువు కుంటున్న మేము విదిపోవలసి వచ్చింది. రిజల్స్ పడ్డ రోజునే సారధి ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా బొంబాయి పాదిపోయాడు. నేను విజయవాడ కాలేజీ లోనే బి.ఎ . లో జేరాను.
బొంబాయి లో నాలుగెళ్ళు వుండి తిరిగి వచ్చాడు సారధి.
"ఈ నాలుగేళ్ళూ ఏ ఉద్యోగం చేసి బ్రతికావురా!" అని అడిగాను. అనేక ఉద్యోగాలు చేశానన్నాడు. అనేక బాధలు పడ్డానన్నాడు. వివరాలు మాత్రం చెప్పలేదు.
హైస్కూలు రోజు నుంచీ పార్ధ సారధి పత్రికలకు కార్దు కదల దగ్గిర నుంచి సాహిత్య విమర్శల వరకు అనేక రకాల రచనలు పంపుతూండటం , అందులో అనేకం అచ్చు కావటం, అయిదులు, పదులు మనియార్దర్లు రావటం జరుగుతుండేది. పదహారేళ్ళు దాటకుండానే అతను జీవితాన్ని గురించి, వివిధ మనస్తత్వాలను గురించి, సాంఘిక సమస్యలను గురించి, ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక విషయాలను గురించి రచనలు సాగించేవాడు. ఏదో కధ రాస్తూ, మధ్యలో ఆగి , "జీవితం అంటే ఇది" అని నిర్వచించేవాడు. ఒకానొక మహా సమస్యను చిత్రించి, డానికి పరిష్కార మార్గం ఫలానా అని తేల్చి పారవేసేవాడు. యదార్ధానికి అతగాడు ఆనాటికి జీవితంలో ఒక సమస్యను ఎదుర్కోవటం గానీ, పరిష్కరించటం గానీ జరగలేదు. హైస్కూల్లో మాతో పాటుగా చదువుకుంటున్న క్రిస్టియన్ పిల్ల హెలెన్ గ్రేస్ ను చూసి , దూరం నుంచే మెలికలు తిరిగిపోయే వాడు కానీ అప్పటికి ఇంకా ప్రేమించటం లాంటి గొడవల్లో పడలేదు.
పార్ధసారధి దగ్గిర మరో గొప్పతనం ఉండేది. సంస్కృత కవుల సూక్తులను, ఆంగ్ల రచయితల వ్యాఖ్యలను అక్కడక్కడ తన రచనల్లో మేరిపించేవాడు. ఆ పాదగటం లోనే అతని శిల్పం కనిపించేది. అరిస్టాటిల్ జీవన తత్వాన్ని పుక్కిట బట్టినట్లొక వాక్యం విరిచి, కాళిదాసు సాహితీ సౌందర్యాన్ని ఒంట జీర్ణించు కున్నట్టు ఒక సమాసం విసిరేవాడు.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బ్రతికి వుంటే ఈనాటి కోక మహారచయిత కావలసిన వాడు మా సారధి!
బొంబాయి వెళ్ళిన తరువాత ఎన్నడు సారధి నాకు ఉత్తరం వ్రాయలేదు. అతన్ని ఇంచుమించి పూర్తిగా మరిచి పోయినట్లే అయింది. కాని నా భోగట్టా మాత్రం ఎప్పటి కప్పుడు అతనికి అందుతుండేదిట!
'ఎలా అందేది?' అని ప్రశ్నించాను.
'హెలెన్ ఉత్తరాలు రాస్తుండేది."
హెలెన్ ను నేను మరిచిపోయాను. ఆమె స్కూలు ఫైనలు చదువు మధ్యలో ఆపి, పెళ్లి చేసుకుని అత్తవారింటికి ఎగిరిపోయింది. ఆ తరువాత ఆమె విషయం నేనెన్నడూ ఆలోచించలేదు. హెలెన్ పెళ్లి రోజున పార్ధ సారధి గుళ్ళో కూర్చొని బావురుమని ఏడవటం నాకింకా గుర్తుంది. అంతే. ఆ తరవాత సారధి కూడా ఎన్నడూ హెలెన్ సంగతి మాట్లాడలేదు.
'హెలెన్ ఇప్పుడెక్కడుందిరా?' అని అడిగాను.
"గుంటూరు లో" అన్నాడు.
"భర్త అక్కడ ఉద్యోగం చేస్తున్నాడా?"
"లేదు."
"ఆమె భర్తని వదిలి పెట్టింది. ఇంట్లో నించి ఎగిరిపోయింది. ఎగిరి ఎగిరి అలిసిపోయి, కాకినాడ లో ట్రెయినింగై గుంటూరు జనరల్ హాస్పిటల్ లో నర్సు గా చేరింది!
పార్ధసారధి బొంబాయి నుంచి సరాసరి విజయవాడ వచ్చాడు. ఇంకా మా ఊరు వెళ్ళలేదు. 'ఏరా, ఇంటికి వెళ్లి అమ్మా నాన్నాలను చూసి రారాదూ" అన్నాను నేనే.
"అంత తొందరేముందిరా? వెళ్ళగానే పోయి ఉద్యోగం చూసుకోమని తన్ని తరిమేస్తారు మా పితృ దేవులు! నీకు తెలియందేముంది?"
నిజమే!
తల్లి తండ్రులకు పార్ధ సారధి ఒక్కగానొక్క బిడ్డ. వాళ్లకు పోయింది పోగా అపరానిల గడ్డ లో మూడెకరాల మాగాణీ మిగిలింది. అందులో వచ్చేది తింటూ తల్లీ తండ్రి అక్కడ నిశ్చింతగా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాదు, సారధి తండ్రి ముకుందరావు కు కొంత పై సంపాదన కూడా వుండేది. ఆ చుట్టూ పట్ల గల మూడు బియ్యపు ఫ్యాక్టరీ ల్లోనూ ఆయనే ఎలక్త్రిషియన్ . కాలేజీ ల్లో చదువుకున్న చదువు కాదది. స్వానుభవం వల్ల నేర్చుకున్న విద్య.
పార్ధసారధి బొంబాయి పారిపోయినప్పుడు మా ఊరంతా గొల్లుమంది. పరీక్షల్లో తప్పిన కుర్రాళ్ళు కాలవల్లో, పడటం, రైళ్ళ క్రింద తల పెట్టి "కృష్ణా!" అనటం, సైన్సు చదివిన వాళ్ళు పొటాషియం సైనైడ్ ఫలహారం చేయటం -- అప్పుడప్పుడు పేపర్ల లో పడుతుండేవి. ఆరోజు సాయంత్రం ఆ ఊరి పెద్దలంతా ఆ ఊరిని పాలించే రావిచెట్టు అరుగు మీద సభ తీర్చి , ఎవరి కంగారు వారు పడుతూ, ఒకరో గోల ఒకరి కర్ధం కాకుండా తర్జన భర్జనలు జరిపి ముకుందరావు కు మూడు సలహా లిచ్చారు. ఒకటి, పోలీసు రిపోర్టు ఇవ్వమని, రెండు, పేపర్లో కుర్రాడి బొమ్మ అచ్చోత్తించమని, మూడు, నలుగుర్ని నాలుగు దిక్కులకూ పంపమని. సత్రంలో రత్తమ్మ గారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ముకుందరావు భార్యను ఒదార్చ వచ్చింది.
పాపం ! ఏమయ్యాడో బిడ్డ! ఎక్కడున్నాడో ఇప్పుడు!" అంది రత్తమ్మ
"ఏమౌతాడమ్మా మీ కంగారు కాని? ఆడది తిరిగి చెడింది, మగవాడు తిరక్క చెడ్డాడు అని తిరిగి తిరిగి వాడే వస్తాడు. మా అయన ఇవాళ ఇంత ప్రయోజకులై నాలుగు రాళ్ళు ఏరు కోస్తున్నారంటే . చిన్నప్పుడు ఇల్లొదిలి దేశాల వెంట తిరగటం వల్ల కాదూ?' అని అతి సాదాగా, సాఫీగా , నిర్లిప్తంగా ముకుందరావు భార్య అనంతమ్మ సమాధానం చెప్పేసరికి , తెలు కుట్టినంత బాధ పడింది పొరుగింటి రత్తమ్మ.
ముకుందరావు, భార్యా ఇద్దరు కూడా కొడుకు పారిపోవటం ఒక శుభవార్త గా స్వీకరించి, అతడింక ప్రయోజకుడు కావటానికి బీజం పడిందని సంబర పడ్డారు.
బొంబాయి నుంచి వచ్చిన వారం రోజులకినా పోరు పడలేక సారధి మా ఊరు వెళ్ళాడు. అప్పటి కతను తల్లితండ్రుల్ని చూసి నాలుగేళ్లయింది. రెండు నెల్లన్నా ఇంటి పట్టున ఉంటాడను కున్నాను. కాని రెండు రోజులకే తిరిగి విజయవాడ చేరుకున్నాడు సారధి.
"అప్పుడే వచ్చా వెందుకురా?" అన్నాను.
"వయసొచ్చాక తిని, సోమరి లా కూర్చోకూడదని మా పితృదేవులు హితబోధ చెప్ప వచ్చితిని." అన్నాడు సారధి నవ్వుతూ.
సారధి తీవ్రంగా ప్రయత్నం చేయకపోయినా , అదృష్టవశాత్తు విజయవాడలో ఒక ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లో గుమస్తా ఉద్యోగం దొరికింది చేరాడు.
దొరికిన ఉద్యోగం నిలకడగా చేసుకుంటూ, పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడై , కుటుంబీకుడై , ప్రయోజకుడై అందరిలా బ్రతికికే అతన్ని గురించి ఇంతగా వ్రాయవలసిన అవసరమే ఉండేది కాదు.
పార్ధసారధి అందరిలా బ్రతకలేదు.
అతని జీవితం అతి విచిత్రంగా నడిచింది. అన్నింటికీ మించి అతను ముందేమీ జరుగుతుందో జ్యోతిష్యం చెబుతూండేవాడు. అతను నేర్చుకున్న విద్య కాదది. తన జీవితంలో జరగబోయే అనేక విషయాలను ముందే అతను నాకు చెబుతుండేవాడు. అతను చెప్పినవన్నీ జరిగాయి. అలా అతను ఊహించిన విషయాల్లో ముఖ్యమైనది తన ఆయుర్దాయాన్ని గురించినది!
"నేను ఇరవై తొమ్మిదో ఏట మరణిస్తానురా!" అన్నాడు ఒకనాడు సారధి బొంబాయి వెళ్లేముందు.
నేను నవ్వాను.
అది నిజమౌతుందని అప్పుడు అనుకోలేదు.
ఇప్పుడు నిజమే అయింది.
పార్ధసారధి తన ఇరవై తొమ్మిదవ ఏటనే గుంటూరు లో మరణించాడు.
తన ఇరవై తొమ్మిదవ యేట!
తాను ఊహించిన విధంగా!
నాకు మతి పోయినట్లయింది . నా నమ్మకాలు విరిగిపోయాయి. భవిష్యత్తును దర్శించే శక్తి మానవ మాత్రుడు ఎలా సాధించగలడో నా కర్ధం కాలేదు.
పార్ధసారధి పోవటం లో నా జీవితంలో పెద్ద లోటు ఏర్పడింది. అటువంటి స్నేహితుడు మళ్ళీ దొరుకుతాడని పించదు. ప్రపంచంలోనే జీవిస్తూ, ప్రపంచానికి అతీతంగా ఊహించే శక్తి సారధి కుండేది. అలాటిది మహాయోగులకు పరమ మూర్ఖులకు మాత్రమెసాధ్యమవుతుంది.
ఫిలిం కంపెనీ లో సారధి ఎక్కువ కాలం పని చేయలేదు. నేలలోపునే ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కంపెనీ వాళ్ళు ఇరవై తొమ్మిది రోజుల జీతమిచ్చి అతన్ని సగౌరవంగా సాగనంపారు. ఆ శుభవార్త మోసుకుని కాలేజీ కి వచ్చాడు సారధి.
"ఒరే! ఇవాళ నీకు డిన్నరు ఇస్తారా?" అన్నాడు సారధి.
"ఏమిటి కధ?"
"ఇవాల్టి నుంచి మళ్లా మనం స్వేచ్చా జీవుల లిస్టులో చేరాం చంద్రమండలానికి పోదామను కుంటున్నా."
"శుభం! వెళ్ళు."
"హెలెన్ తోడు వస్తే వెళ్ళాలనే, కాని......."
"? ? ?"
ఆమె భూమిని వదిలి రాదల్చు కోలేదులా ఉంది!
సారధికి డబ్బు లేదు. ఉద్యోగం పోయిందనే చింత లేదు.
'ఉద్యోగం ఎందుకు పోయినట్లు?' అని అడిగాను.
'హెలెన్ ను ప్రేమించినందుకు " అన్నాడు నవ్వుతూ.
"సరిగ్గా చెప్పరా!"
"ఆఫీసు పని మీద మద్రాసు వెళ్ళమన్నారు. మెయిలు కు బయలుదేరాను. స్టేషన్ లో హెలెన్ కనిపించి, సంకెళ్ళు వేసి గుంటూరు తీసుకు పోయింది. మాయామచ్చీంద్ర సినిమా గుర్తుందా?...."
"చెప్పరా!" విసుగు వచ్చింది.
"సారీ. గుంటూరు లో స్వర్గం కట్టి వారం రోజులు విహరించాం. బెజవాడ వచ్చేసరికి మానేజర్ సీమ టపాకాయలు పేల్చడం మొదలు పెట్టాడు. ఎమ్. జి. ఎం. సింహం లా గాండ్రించి ఇంటికి పొమ్మన్నాడు ప్రోప్రయిటరు. దన్యవాదా లర్పించి తిరిగి వచ్చాను. ఇరవై తొమ్మిది రోజులకు తొంబై ఏడు రూపాయల జీతం ఇచ్చాడు. ఇక మనం ఎలాగూ ఈ జీవితంలో ఉద్యోగం చేసేది లేదు కనక, నా తుది సంపాదనలో యాభై రూప్యంబులు వెచ్చించి మదీయ ప్రేయసి హెలెన్ కు కాశ్మీరు చీర కొంటి. హెలెన్ ఒంటి కిది అందముగ నొప్పునా మిత్రమా?" అన్నాడు సారధి.
నవ్వటం కంటేనే చేయగలిగిందేముంది?
"గుంటూరు వెళుతున్నానురా" అంటూ ఈల వేసుకుంటూ, స్ప్రింగ్ లా గెంతు తున్నట్లు నడుస్తూ వెళ్ళిపోయాడు పార్ధసారధి !
2
పార్ధసారధి కధ ఒక క్షణం అపు చేసి పాఠకులకు ఒక విషయం మనవి చేయటం అవసరమని పిస్తుంది.
పార్ధసారధి లా నేను చేయి తిరిగిన రచయితను కాను. అతని కున్న ఊహా శక్తి నాకు లేదు. సంఘటనల ను రసాత్మకంగా మలిపి చిత్రించటం లో అతను చూపే శిల్పం నా కందేది కాదు.
నే వ్రాయగలిగింది , వ్రాయదల్చు కున్నది కేవలం సారధిని గురించి నాకు తెలిసిన కధ.
సారధి చనిపోయాడు.
నాకు అతన్ని గురించిన చాలా విషయాలు తెలుసు. కొన్ని కొంతవరకే తెలుసు. కొన్ని పూర్తిగా మరిచిపోయాను. మరికొన్ని స్మృతి పధం లో లీలగా మెరుస్తున్నాయి. కధ పట్టుగా నడవాలని లేనిది వ్రాయటానికి నేను ప్రయత్నించ లేదు.
