Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 2


    ఈ వెకిలితనం తప్పించాలని ఎన్నోసార్లు అమ్మ, నాన్న కేక లేసేవారు. వినేది కాదు పదేళ్ళు వచ్చినా పేర్ల పుస్తకం పూర్తిగా చదవలేక పోయేది.
    అక్కయ్య కు పద్నాలుగేళ్ళు వచ్చాయి మనస్సూ, తెలివి తేటలు లేకపోయినా ఏపుగా ఎదిగి అందంగా చూడ ముచ్చటగా ఉండేది. శారీరకంగా పెళ్ళీడు వచ్చినా దాని తెలివి తేటలకు వయస్సు రాలేదు. వెకిలితనానికి మాత్రమే వయసొచ్చింది. ఈ ఈడొచ్చిన వెకిలిదాన్ని చూచి అమ్మా, నాన్న ఎంతో కుమిలి పోయేవారు. డాక్టర్ల కు చూపిస్తే పుటక లో ఉన్నదానికి మందులేదన్నారు. పద్నాలుగేళ్ళ అక్కయ్య మూడో క్లాసు పుస్తకం చదువుతూ ఉండేది. దాని వెకిలితనం బయటపడకుండా వుంటానికి అమ్మ దాన్నెప్పుడూ వీధి లోకి వెళ్ళ నిచ్చేది కాదు. కాని దాని పరిస్థితి బంధువుల కూ, చుట్టూ పక్కల వారికీ తెలిసిపోయింది.
    నేనూ పదేళ్ళ పిల్లని సెకండ్ ఫారం లోకి వచ్చాను. అన్నయ్య వాణీ నాధం పన్నెండేళ్ళ వాడు. వాడికి చదువు అబ్బలేదు. వాడూ సెకండ్ ఫారం చదివేవాడు. ఆ వయస్సు లోనే సిగరెట్లు, చాటుగా కాల్చేవాడు. క్లాసు పిల్లలతో కజ్జాలు పెంచుకునే వాడు. చిన్నవాళ్ళ ను కొట్టే వాడు. పెద్ద వాళ్ళతో దబాయించి, మొరాయించి మాట్లాడేవాడు.
    ఈ సంసార పరిస్థితులు చూసి నాన్న విసివేసారి పోయేవారు. అమ్మ తల్లడిల్లిపోయేది నేనే కాస్త ధైర్యం చెప్పేదాన్ని.
    కాలం ఎవరి కోసం ఆగదు. మరో రెండేళ్ళు గడిచాయి. అక్కయ్య బాగా ఎదిగింది. పెళ్ళి చెయ్యాలి. దాని అందం చూసి ఎవరయినా మోసపోయి పెళ్ళి చేసుకోవాలి. నోరు మెదిపితే దాని వెకిలితనం బైట పడిపోతుంది.
    పిల్లను చూడ్డానికి వచ్చిన వాళ్ళు "నీ పేరేమిటమ్మా" "ఏం చదువు కున్నావు" అని ఎంతో సంతోషంతో అడిగేవాళ్ళు. చూసేవాళ్ల కు రంభ లా ఉండేది. ప్రతి పెళ్ళి కొడుకు ముచ్చటగా చూసేవాడు. ఈ అందాల భామను తప్పకుండా పెళ్ళాడాలని మనస్సు లో మురిసి పోయే వారు.
    "నా పేరు సునంద. మూడో క్లాసు చదువు కున్నా. ఉండండి పుస్తకాలు చూద్దురు గాని, మీ బళ్ళో నూ ఈ ఆంధ్ర వాచికమేనా" అనేది.
    పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు విస్తుపోయే వారు. పెళ్ళి కొడుక్కి ముఖానకత్తి వేసినా నెత్తురు చుక్క ఉండేది కాదు. ఈ పిల్ల వేకిలిది పిచ్చిది. అమాయకురాలు. బుద్ది లేదు. ఇట్లా  ఎవరికి తోచినట్లు వాళ్ళని వెళ్ళిపోయేవారు. ఇట్లా పాతిక సంబంధాలు వచ్చాయి. ఏదీ కుదరలేదు. అమ్మా, నాన్నా దిగులు పడిపోయారు.
    అక్కయ్య స్కూల్ ఫైనల్ తప్పాడు. నేను పాసయ్యాను. అక్కయ్య అందం చిందులు వెయ్యసాగింది. తెలివి తేటలకూ, మెదడు కూ ఉండవలసిన అందచందాలు శరీరానికి ఉన్నాయి. ఈ వెర్రి బాగుల్దాన్ని ఎవరయినా చెదకోడతారేమో నని అమ్మ భయపడి పోయేది. వీధి గుమ్మం దాట నిచ్చేది కాదు. ఎంతో కష్టపడి చెపుతూ ఇంటి పని నేర్పేది. వంటపని దగ్గిర ఉండి చెప్పి చేయించేది. ఆరుమాసాలకు అక్కయ్యకు అన్నం వండటం వచ్చింది. కూరలు తరగటం వచ్చింది. మిగతా వంట ఇంకా రాలేదు.
    అన్నయ్య చదువు మానేశాడు నాన్నకు ఇక చదువుకొనని ఎదురు తిరిగాడు. గట్టిగా మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్లి పోతాననేవాడు.
    "ఇంత రౌడిగా మారిపోయావేంరా" అని తల బాదుకుంది.
    "ఈ రోజుల్లో వాళ్ళే బాగా చలామణీ అయి డబ్బు సంపాయిస్తున్నారు. నా సంగతెందుకు గానీ అక్కయ్యకు పెళ్ళి చెయ్యండి. ఎవడయినా లేపుకు పోగలడు." అన్నాడు. ఈ మాటలు విన్న నాన్న హృదయం ఆక్రోశించింది . అప్పుడు నేనూ ఉన్నాను. అన్నయ్య దవడలు నాన్న చేతుల్లో పేలి పోయాయి. అంతే!
    అన్నయ్య చర్యలు ద్వితీయ దశలోకి వెళ్ళాయి. అన్నయ్య రౌడీ గానే మారాడు. ఏం చేసేవాడో తెలీదు. వాడి రాకపోకలకూ, భోజనానికి ఒక వేళంటూ లేదు. నాన్నని రూపాయి అడిగేవాడు కాదు. రూపాయి తనిచ్చేవాడు కాదు. వాడి ఖర్చులకు ఎప్పుడూ డబ్బులుండేవి.
    ఒకరోజున అక్కయ్య నాన్నతో అన్నది, నాకు మళ్ళీ పెళ్ళి సంబంధాలు చూట్టం లేదేం"
    "నిన్నెవడు చేసుకుంటాడే. బుద్ది లేని వాడేవరయినా నిన్ను పెళ్ళాడాలి."
    "అదే అలాంటి వాడు కనబల్లెదూ ఈ రాజమండ్రి లో కాబోతే కాకినాడ, లేకపోతె ఏలూరు" అన్నది.
    నాన్నకు నిజంగా కళ్ళంట నీళ్ళోచ్చాయి. ఇంత అందాల బొమ్మకు ఈ కర్మ ఏమిటా అని కుళ్ళి పోయేవాడు.
    "ఉన్న ఇల్లూ వాకిలీ అమ్మి కట్నం ఇచ్చి నీకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాను. వెకిలిగా మాట్లాడకుండా భర్తకు అన్నం వండి పెడుతూ నీ కాపురం గుట్టుగా చేసుకుంటావా సునందా" అన్నాడు నాన్న.
    "ఆ మాత్రం తెలీదు. పెళ్లి చెయ్యండి. అన్నీ తెలుస్తయి. ఎన్నేళ్ళ ని గుండెల మీద వేడి నిప్పుల కుంపటి గా వుండను" అన్నది అక్కయ్య.
    నాన్న తీవ్రంగా పరాన్వేషణ ప్రారంభించారు . ఉన్న ఆ కాస్త పెంకుటిల్లూ ఎనిమిది వేలకు అమ్మేశారు.
    మళ్ళీ పరాన్వేషణ ప్రారంభించారు నాన్న. రెండు జతల చెప్పులు అరిగాయి. పెళ్లి చూపుల సందర్భం లో ఎట్లా ఉండవలసింది అక్కయ్య కు నేర్పాను. నేను పెళ్లి కొడుకుగా అక్కయ్య పెళ్లి కూతురు గా రిహార్సల్సు వేయించాను.
    కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా అగధంటారు. అక్కయ్య ను పెళ్ళాటానికి ఆనందరావనే అయన వప్పుకున్నారు. పెళ్లి చూపులప్పుడు అక్కయ్య వెకిలితనం బయటపడలేదు. మాటల్లో అమాయకత్వం మాత్రమే అతనికి తెల్సింది. పెళ్లి కొడుకుతో నాన్నగారు అన్నారు.
    "అమ్మాయి అందచందాలు చూశారు. చదువు కాస్త తక్కువ. కొంచెం అమాయకురాలు. చెపితే తెల్సుకుంటుంది."
    "ఫరవాలేదండీ , నాకు కావలసింది అమాయకురాలే. కాకపోయినా మీ అమ్మాయి అందం అమాయకత్వాన్ని కప్పేస్తుంది.'
    నాన్న కట్నం సంగతి కదిలించారు. ఆరు వేలు కావాలన్నారు. నాన్నగారు ఒప్పుకున్నారు. కారణం పెళ్లి కొడుకు గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్నాడు. అత్తా, ఆడబిడ్డలు లేరు. తండ్రి రిటైరయినాడు. ఈ కొడుకు దగ్గరే ఉంటాడు. ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుక్కి కాకినాడ లో ఉద్యోగం , స్వంత ఇల్లు కాకినాడ లో వున్నది.
    ఒక సుముహూర్తాన ఆరువేల కట్నంతో, రెండు వేల పై ఖర్చులతో అక్కయ్య పెళ్ళయింది. తల దాచు కునేందుకు ఇల్లు లేకపోయినా ఈ వెఱ్రి బాగుల్దానికి పెళ్లి చేసి కన్నె చెర వదిలించుకున్నాననే తృప్తి తో అమ్మా, నాన్నా సంతోష పడ్డారు. నేనూ ఎంతో సంతోషించాను.
    మొదటి రాత్రి గదిలోకి పంపేరు. మర్నాడు అక్కయ్య సంతోషం గానే ఉన్నది. బావ ముఖం వెలవెల బోయింది. బావ నాన్నతో అన్నాడు.
    "వెకిలితనానికి, అమాయకత్వానికీ చాలా తేడా ఉంది మావగారూ.'
    "ఏం బాబూ."
    "ఆడపిల్లకు అందమూ, స్త్రీత్వమే కాదు కావలసింది. అమాయకురాలైనా సహించవచ్చు కాని వెకిలిచేష్టలు సహించలెం."
    "అంత పొరపాటు గా మాట్లాడిందా."
    కాదు నేనే పొరపాటుగా మీ అమ్మాయిని అర్ధం చేసుకున్నాను. రెండు మూడు నెల్లు అత్త గార్ని మా ఇంట్లో ఉంచి మా కాపురం చూడమనండి. వెకిలితనం పూర్తిగా రూపు మాపి పోవాలి."
    ఏదో గట్టి నిర్ణయానికే వచ్చినట్లు అన్నాడు బావ.
    అక్కయ్య కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ కూడా వెళ్ళింది.
    ఈ విషయాలన్నీ అమ్మ చెప్పింది. రోజూ రాత్రి నిద్రపోయే ముందూ, ఉదయం లేవగానే బావ పాదాలకు నమస్కరించి మంగళ సూత్రాలు కళ్ళకు అడ్డుకునేదిట.
    "పాదాలకు నమస్కరించి మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకోవాలని ఎవరు చెప్పారు." అన్నాడు బావ.
    'మా అమ్మ చెప్పింది . తప్పా"
    "తప్పని కాదు. నీలో ఇటువంటి భావాలు ఉన్నాయని నాకు తెలీదు లే."
    "ఏమిటో గొడవగా ఉంది. అది పతివ్రతల లక్షణంట, నేనయితే ఎవర్ని చూళ్ళేదు. పోనీ మీరు చెప్పండి ఎట్లా ఉండాలో , హ్హిహ్హిహ్హి" అని నవ్విందట. అట్లాంటి నవ్వు అక్కయ్య ఎప్పుడో కాని నవ్వదు. దానికున్న అమాయకపు భావాలకు ఎంతో ఆనందం కలిగితే దాని కంటి చూపు కూడా వెకిలి గా మారిపోయి అంతకన్న వెకిలిగా నవ్వుతూ తోడ మీద కొట్టుకుని చప్పట్లు కొడుతుంది . పెళ్ళయ్యాక ఈ వెకిలి చూపూ, వెకిలి నవ్వూ కొంచెం అధిక మయ్యాయి. కాపురానికి వెళ్ళాక బావంటే తనకు భర్త కదా, గౌరవంగా, ప్రేమగా, అణకువగా ఉండాలని దానికి తెలీదు. ఉన్నట్లుండి ఒక్కసారి కౌగలించుకుని వెకిలిగా నవ్వేదిట. అది వయస్సు లో ఉన్న ఉద్రేకమూ కాదు. భర్తంటే అతి చనువుగా ఎట్లా మాట్లాడినా నవ్వినా, ముట్టుకున్నా ఫరవాలేదనే ఒక మగ మనిషి.
    "చూడు సునందా, నువ్విట్లా వెకిలిగా ప్రవర్తించకూడదు. ఎవరయినా చూస్తె ఏమనుకుంటారు. నీ మీద అందరికీ చిన్న చూపుగా ఉంటుంది' అన్నాడు బావ.
    "మనిద్దరం ఒకళ్ళ నోకళ్ళం పెళ్ళి చేసుకున్నాం . నా మెళ్ళో బంగారపు మంగళ సూత్రాలు కట్టారు. మనం ఎట్లానయినా ఉండచ్చు. ఏం తప్పు లేదు. పోనీ ఎలా ఉండాలో మీరు చెప్పండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS