'గదా'అనుకునే అవకాశం కూడా కనిపించలేదు.
'చల్లారిపోతున్నదండి బాబూ, చల్లారితే పస లేదు. ముక్కు పొడుం పరిమళం తప్ప. నా తెప్పించాడు మా బానిసైనా వీరాస్వామి. పన్నెండేళ్ళు గడిచినా యింకా అమ్ముతూనే వున్నాడు సాక్షాత్తూ ఆ శ్రీ కృష్ణ పరమాత్మ బ్రాందంటూ . ఖాతా కొట్టు గనక, ఆ కమ్మదనానికే లొట్టలు వేస్తూ తాగుతుంటాడు నాన్న. కళ్ళు మూసుకు మింగేయండి కషాయం తాగినట్లు. ఆ తర్వాత ఏదన్నా జరిగితె మేం చూసుకుంటాం.'
నివ్వెరపోయిన స్వామి -- నిరట్టుడై- అందుకొని గుక్కలో త్రాగి గ్లాసందించాడు తిరిగి.
"ఒసోయ్ కొరకంలూ'
బిగ్గరగా లోపల నుంచి శారదమ్మ గారి కేక వినిపించింది. త్రుళ్ళిపడినట్లు కదిలాడు స్వామి. అతన్ని చూస్తూ ఎక్కేళ్ళు పట్టినట్లు నవ్వింది ఆమె.
'ఈ కొంపలో ఉండదలచుకుంటే ఈ సైరను కూతలకుమీరలా బేజారెత్తిపోగూడదు." అంటూ అలాగే నవ్వుతూ లోపలికి పరుగెత్తింది అ అమ్మాయి. తనకు కాబోతున్న శిష్యురాలు!
'ఇంత మనిషి! ఇంచుమించు తన కంటే భారీగా వుంది!! ఈమె గారికి చదువు చెప్పటం మాటలా?' అనుకుంటూ ఉత్సాహం నీరసించి నీళ్ళు కారుతూ కుర్చీలో కూలబడ్డాడు స్వామి.
పది నిమిషాల తర్వాత పరికిణీల రాపళ్ళ గుసగుసలు, గాజుల నవ్వుల కిలకిలలూ వినిపించాయి మళ్ళీ. ఆ రెండు తారా జువ్వలు బయటకు దోవ పొడుగునా సిగ్గుల్ని వలకపోసుకుంటూ మెలికలు తిరుగుతూ పోవడం చూశాడు.
'పెళ్ళయ్యే దాకానన్నా చదువుకోవే తల్లీ నాతొ పాటు. నాలుగు యింగ్లీషు ముక్కలు నమిలి పారెయ్యడం ఎందుకైనా మంచిది. చదువు రాని మొద్దుల మీద మరి విచ్చల విడిగా స్వారీ చేస్తారీ మగాళ్ళు.' అంటూ రఘుపతిగారమ్మాయి పెడుతున్న కేకలకు సమాధానంగా రెండు చెంబుల చిరునవ్వు వెనక్కు గుమ్మరించి జారిపోయారు వారిద్దరూ.
'మాస్టారూ! ఇవాళ -- మొదలు పెడ్తారా పాఠాలు.'
'రేపండి.'
'ఎందుకండి ? ముహూర్తం పెట్టారా ఏమిటి?'
'ఔనండి! కాదు ఇవాళ ద్వాదశి రేపు మంచిది.' అదిగాక వర్ధ్యం కూడా ఉంది పూట.'
'నా నెత్తి! ఈ వానాకాలం చదువుకు వర్ధ్యాలు, వారాలు కూడా కావాలంటారా? నాకు యింగ్లీషు చదువుకోవాలనుందండి. వెంగళ్రావు కూతురు ఆ సరోజ వరస చూశాక మరీ పట్టుదలగా వుంది లెండి. తండ్రీ అవిదగారిని బోలెడు డబ్బు తగలేసి పట్నంలో దొరసానుల స్కూల్లో , చదివిస్తున్నాడు లెండి. శలవులకొచ్చినప్పుడల్లా అక్కడ నమిలిన ఆ పాడింగ్లీషు ముక్కలన్నీ మా ముఖం మీద కక్కేస్తూ మహా ఊదరపెడుతున్నది లెండి. ఆవిడ గారి యింగ్లీషు ముక్కలు చూసే, వలిచేసాట్ట ఎవరో డాక్టరు. కారేక్కుంచుకుని వీధులన్నీ తెగతిప్పుతూ. ఏం పాడో మరి. అంతటి డాక్టరయితే మాత్రం?ఆయనగారు కాపరం చేసేది ఈవిడగారితోనో ఈవిడ గారి యింగ్లీషు ముక్కలతోనో. అంత కాడికి పది యింగ్లీషు బైండు పుస్తకాలు కొనుక్కుంటే పోలా? భూతద్దంతో వెతికి చూసీనా రవ్వంత కండ కనిపించని ఈ ఆస్తి పంజరాన్ని కట్టుకేఊరేగాలంటారా?' ఏమంటారు?'
ఏమీ అనే ధైర్యం లేక నవ్వటానికి ప్రయత్నించాడు స్వామి.
"నారలా సాగి -- ఆ భూతద్దాల కళ్ళజోడు అదీను -- తాడిలా ఎదిగి కూర్చున్న అవిడగారిని చూసి మీకే ఆశ్చర్యమనిపిస్తుంది. నిజం మేష్టారూ! టైమెంతయింది?'
రఘుపతి గారి కూతురు మాటలు వింటున్న కొద్దీ -- రైలు బండిలా పరిగెత్త సాగింది స్వామి మనస్సు.
"మీరెంతవరకూ చదువుకున్నారు మాష్టారూ?' అంది ఉపన్యాసం ఆపి.
'స్కూలు ఫైనలండి.'
'నాకూ చిన్నప్పుడనిపించేదండి కనీసం స్కూలు ఫైనలన్నా చదవాలని కానీ ఆపాడు థర్డు ఫారమే పద్మవ్యూహం లా కనిపించింది. రాయోడీ జనిరో ఏ అక్షాంశం మీదుంది? అంటూ నిగ్గ దీస్తాడు జాగ్రఫీ మేష్టారు. ఎక్కడ చచ్చిందో మరి. తళ్లికోట యుద్ధం ఎప్పుడు జరిగిందంటారు బనలాంటి పొట్ట రుద్దుకుంటూ హిస్టరీ మాష్టారు. ఎవళ్ళో ఎప్పుడో ఎక్కడో కొట్టుకు చస్తే మనకెందుకు చెప్పండి? వాళ్లెప్పుడో కలిసిపోయారు మట్టిలో. తిరగ మోతలోకి కరివేపాకు రెబ్బలా కూడా కనిపించకుండా. వళ్ళు మండేది నిలబెట్టి యిటువంటి ప్రశ్నలడుగుతున్న పంతుళ్ళను చూస్తె -- ఒకసారి పిలక ఝూడించుకుంటూ తెలుగు మాష్టారూ....'
స్వామి ప్రాణం గతుక్కుమంది.
'క్షమించండి మాష్టారు మీ ముఖానికి మరీ అంత ఎబ్బెట్టుగా లేదు పిలక. అలా మాటవరసకు చెబుతున్నా -- భయం కరాదార్య -- ఏ సంధి ? అన్నాడు నిలవేసి. చెప్పొద్దూ వళ్ళు మండి -- 'భయంకర సంది' అనేశా. తేలు కుట్టినట్లు ఎగిరి పడ్డారనుకొండి.'
కిలకిలమంటూ నవ్వింది రఘుపతి గారమ్మాయి.
నవ్వు బాగానే వుందనిపించింది. కాని ఆ మాటల్లోని మెరుపులకు మాత్రం కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి కంగారు పుట్టి- మారుతున్న కాలానికి గుర్తుగా రఘుపతిగారమ్మాయి. తన చిన్నతనం నుంచి తన కింత చొరవగా మాట్లాడడం తెలియదు.
'చివరిసారి పరీక్ష రాసినప్పుడండీ-- ఇటువంటివే ఎందుకూ పనికిరాని ప్రశ్నలకు ఒక్క సమాధానము గుర్తుకు రాక రేచిక్క ముంచుకొచ్చి - బుద్ది తెలిసినప్పట్నించి నేను చూసిన టూరింగు సినిమాల లిస్టు కుదురుగా రాసి, అరగంట కొట్టగానే అమాంతం బయటపడ్డా. ఆ బంధీఖానా లోంచి మళ్ళీ అ చాయలకు పోలేదు. నాపెరునుచూసి మాష్టార్ల గుండెలాగడం మొదలు పెట్టి -- ఒకరి గుండె లొకరు పట్టుకు హెడ్ మాష్టారీ దగ్గరకు పరుగేత్తారుట. నాకూ మానెయ్యాలనిపించిందనుకొండి. బడి, నా తర్వాత నాలుగేళ్ళకు ఓణీలు కట్టిన వాళ్ళంతా నా క్లాసు మెట్లయి పోతుంటే వళ్ళు మండదా చెప్పండి.?'
హరికధ వింటున్నట్లు, వింటున్నాడు స్వామి. 'అల్పప్రాణిని , ఆవిడకు నేనెక్కడ చెప్పగలను పాపం? అనుకుంటూ బెంబేలు పడి పోయాడు .నిజానికి ఆవైనం చూస్తె -- ఆమె దగ్గరే తను పాఠాలు నేర్చుకుంటున్నాడు -- అనే భ్రమ కలిగి తీరుతుంది.'
'గురుదేవో భవ ' అంటూ చిన్ననాడు తను రామబ్రహ్మం గారి దగ్గర చదువు ప్రారంభించాను. నిజమే. రోజులు మనో వేగంతో మారిపోతున్నాయి. మాష్టారుని తలచుకుంటే తనకు సింహస్వప్నం లా ఉంటుంది ఈ నాటికీ. పాఠం వచ్చినా , ఒకటికి పదిసార్లు మళ్ళీ మళ్ళీ వల్లే వేసి వెళ్ళేవారు ప్రయివేటుకు.
అప్పజేప్పుతున్నప్పుడు తప్పులు రావడం సంగతి దేముడెరుగు? రవ్వంత నట్టినా చింత బరిసె వీపు మీద చేరి విరిగేది. కాపీలు సరిగ్గా వ్రాయకపోతే గోడ కుర్చీ వేయించే వారు రామ బ్రహ్మం గారు. ఎక్కాలు తల క్రిందులుగా అప్పచెప్పకపోతే తోడపాసాలు వడ్డించేవారు. కూడికలు తప్పిన వాళ్ళకు మొట్టికాయలు తప్పేవి కావు. ఇంత చేసినా మాష్టారు కొట్టారని తల్లిదండ్రులకు పితూరీ చేసే ధైర్యం సముద్దారు గారి కొడుకు కొండలరావు కూడా వుండేది కాదు.
కాని----
ఎంత మారాయి రోజులు!
తనకు దొరికిన శిష్యురాలేటువంటిది? ఆమె మాటలు వింటున్న కొద్దీ, వళ్ళు వంచి చదివి తనకు పది మంచి ప్రయివేట్లు వచ్చేటట్లు ఆమె చేయగలదనే ఆశ, హారతి కర్పూరం లా హరించుకు పోతున్నది. గుంజీలు తీయించి, తోదపాశాలు వడ్డించి, గోడ కుర్చీలు వేయించి దండించి చెప్పదలచుకున్న నాలుగు ముక్కల్ని ఆమె వంటబట్టించ గల సాహసం లేదని స్వామికి తెలుసు.
యుద్దంలో విజయం తధ్యమని భావిస్తున్న సేనానికి ఆకస్మికంగా అపజయం కళ్ళముందు కనిపించి నట్లయింది.
"చదువు వంట బట్టాలంటే పిల్లలకు దెబ్బ భయం ఉండాలండీ" అంటుండేవారు అటు చూస్తూ యిటు చూస్తూ మాటలు వింటూ గండు మీసానికి పదును పెడుతున్న సముద్దారుగారితో రామబ్రహ్మం గారు .
రఘుపతి గారి అమ్మాయిని తలుచుకున్న కొద్దీ ఆ మాటలకు -- ఈ కలికాలం లో అర్ధం లేదనిపించింది.
ఆ తర్వాత సంచి పుచ్చుకుని బజారుకు బయలుదేరిన స్వామికి -- లైబ్రరీ దగ్గర ఎదురైన తోటి టీచర్ పరాంకుశం 'బజరుకా తమ్ముడు?' అంటూ ఆప్యాయంగా పలకరించి 'ట్యూషను మొదలు పెట్టినట్లున్నావు వచ్చి రాగానే? ' అంటూ ఒక ప్రశ్న గుచ్చాడు అదోరకంగా చూస్తూ.
"చూడు తమ్ముడూ! రఘుపతి కూతురు -- పావని -- అంటే నీలాంటి గంగిగోవులకు పదిమందికి పాఠాలు చెబుతుంది. కాస్త జాగ్రత్తగా మసులుకోవడం మంచిది' అంటూ హితవు చెప్పాడు పరాంకుశం. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్లయింది. చదుకునే రోజుల్లో తోటి విద్యార్ధులకు కూడా అర్ధం కాని పాఠాలు తానూ చెప్పేవాడు.'టీచర్ కంటే నువ్వు చెప్తేనే నాకు బాగా తలకేక్కుతుందిరా స్వాములూ' అనే వాడు ఆనందం. తనమీద తనకూ అంత నమ్మకం ఏర్పడింది ఆరోజుల్లో. ఆనమ్మకం తోనే తానుగూడా రామబ్రాహ్మం గారిలా ట్యూషన్లు చెప్పి, పది రాళ్ళు సంపాదించి తల్లి వచ్చేసరికి తన ప్రయోజకత్వం నిరూపించుకోవాలను కున్నాను.
'ఈ ట్యూషను దొరక్కపోయినా బావుండేది" అనిపించింది?
"ఆకాలంలో గురుదేవోభవ అనుకుంటూ చదువుకున్నారు పిల్లలు. ఈరోజుల్లో శిష్యదేవోభవ -- అనుకుంటూ బ్రతకాలేమో పంతుళ్ళు ' అనుకుంటూ చిల్లర కొట్టు వీరస్వామి సందర్శన భాగ్యం కోసం, స్వామి చకచకా సాగిపోయాడు.
ఆ విధంగా శిష్యురాలిగా పరిచయ మై కంగారు పుట్టించిన రఘుపతి గారి ఒక్కగానొక్క కూతురు 'పావని' ఆనతి కాలంలోనే ఆ మూడుముళ్ళూ వేయించుకుని- అగ్నిదేవుని సమక్షంలో తనతో పాటు ఏడడుగులు నడిచి- తన భవిష్యత్తునూ, జీవితాన్ని శాశ్వతంగా పంచుకుని పరిపాలిస్తుందని -- ఆక్షణంలో నిస్సంశయంగా ఊహించలేదు.ఆ ఊరి మిడిల్ స్కూల్లో ఆ క్రితం రోజే ఏదో టీచరుగా జేరిన శిఖరేశ్వర స్వామి!
