"అంత సాహాసం లేదు..."
"మగసాయం లేకుండా ప్రయాణం చెయ్యడానికి భయంలేదు. కాని మగసాయంతో ప్రయాణం చెయ్యడమంటే భయం, విచిత్రంగా వుంది మీ ప్రవృత్తి..." నేను ఛలోక్తి విసిరా.
"మీర్ సూదుల్లాంటి మాటలు విసరగలరు..."
"క్షమించండి. మీ మనసు నొప్పించాలని వుద్దేశం లేదు. మీరు కమల్ ని ప్రేమించొచ్చు. పెళ్ళాడొచ్చు. ఇందులో దోషమేవుంది? అంచేత అతన్ని మీతో యింటికి తీసుకెళ్ళండి, మీ నాన్న గారు సంతోషిస్తారు. అందువల్ల మీ సంసార పరిస్థితి చక్కబడుతుందని నా నమ్మకం..."
ఆమె నా వేపు వేడిగా చూసింది.
నేను చిరునవ్వు నవ్వి- "అసంభవం" అన్నా- ఆమె ఫక్కున నవ్వింది.
"నా ఊతపదం పట్టేశారే..."
"చూడండి పద్మా! ఈ యుద్ధంవల్ల మన సమాజ పరిస్థితి మారుతుంది. మనం అప్పుడే మార్పు మొదటి అంచీ చేరుకున్నాం. మధ్య తరగతి కుటుంబానికి చెంది. గడప దాటి బైటకి తొంగిచూడని మీలాంటి స్త్రీలు, మిలిట్రీలో చేరి, దూర ప్రాంతంలో వుద్యోగం చేస్తున్నారు. లక్షాధికారి కమల్ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా వున్నాడు. ప్రపంచపు ప్రాక్చశ్చిమ రంగాల్లో యుద్ధం చల్లారేసరికి మన దేశం పోల్చుకోలేనంతగా మారిపోతుంది. మనం ప్రస్తుతం పాతరైలు దిగిపోయేం. కొత్త రైలింకా ఎక్కలేకపోతున్నాం. మధ్య వూగిస లాడుతున్నాం...."
"మీ భవిష్యత్ పురాణం కాస్త ఆపండి. అదిగో గొలందోఘాట్. ఇక ఈ కుంభకర్ణుణ్ణి లేపాలి... కమల్! ఇక నిద్ర చాలించు. లే అదిగో గొలందీ..." అతని నడ్డిమీద రెండు చరిచింది.
కమల్ లేచి ఆవలించి మెళ్ళు విరుచుకున్నాడు.
ఘాట్ మీద మంచి హడావిడిగా ఉంది. లాంచి నిశ్శబ్దంగా నిదానంగా జెట్టీ చేరుతూంటే జెట్టి నే లాంచివేపు కదుల్తూన్నట్టుంది. ఒంటినిండా ఆవనూనె పూసుకున్న కుర్రకుంకలు దిస మొలతో జెట్టీమీంచి నది నీళ్ళలోకి టప్పుటప్పున దూకి, చేపల్లా తుప్పుతుప్పున యెగిరిపడుతూ, కిచకిచ నవ్వుతూ పాటలు పాడుతున్నారు.
మేం లాంచి దిగేం, కొంచెం మబ్బుగా వుంది. వర్షం వచ్చేట్టుంది. ఎనిమిది గంటలగ్గాని రైలు రాదు. మిలిటరీ రైళ్ళు వస్తున్నాయి. పోతున్నాయి. అక్కడ వేలాది మిలిట్రీ వాళ్ళున్నారు. ఒక ఆలివు ఆకుపచ్చ సముద్రంలా వున్నారు. నేనూ వాళ్ళలో వాన్నే.
మేం మొహాలు. కాళ్ళు, చేతులూ కడుక్కున్నాం అక్కడ పాకల్లో కొన్ని సివిలియను కాంటీనులున్నాయి. అవి దరిద్రం వోడుతున్నాయి. వాటి యజమానులు మరీ దరిద్రంగా వున్నారు. ఆ పాకల్లో వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు కూడా దరిద్రంగానే వున్నారు. ఇన్ని దరిద్రాలకి భూషణంగా అక్కడ లెక్కలేనన్ని యీగలున్నాయి. అక్కడి వాళ్ళు మాట్లాడుతూన్న భాషలో ఒక ముక్క కూడా నాకు బోధపళ్ళేదు నేనొక పాకలొ దూరి ముక్కు మూసుకుని బైటకొచ్చా.
పద్మ నవ్వుతూ అంది. - "చూశారా తూర్పు బెంగాల్లో అడుగుపెట్టగానే మీ కెలాంటి దృశ్యం ప్రత్యక్షమైందో! భయపడకండి ముందింకా మరీ ముచ్చటగా వుంటుంది.
ఇంతలో కమల్ కొన్ని పూరీలూ, తియ్యగుమ్మడికాయకూర తెచ్చేడు, పూరీలు యెండిపోయి తోళ్ళలా వున్నాయి. కూర కంపుకొడుతూంది. అవితింటే వాంతి తప్పదు. నే నాలోచింఛా.
పద్మని, కమల్ ని అవి తినొద్దన్నా, యూనిఫారం వేసుకుని మిలిటరీ రిసెప్షను క్యాంపు దగ్గరి కెళ్ళా, అక్కడ ఒక సిక్కు సుబేదారు సాబ్ అగుపించేడు. అతనికి సెల్యూట్ చేసేను.
"సుబేదారు సాబ్! నేను అగర్తలా వెళుతున్నా. నాతో ఒక స్త్రీ వుంది ఘాట్ దగ్గిర మంచి టీ లేదు. దయిచేసి మీ క్యాంపులోది కాస్త టీ యిప్పించండి..."
అతను నన్నెగా దిగా చూసేడు.
"నువ్వొంటరిగా యెందుకు ప్రయాణం చేస్తున్నావు. నీ దగ్గిర మూమెంటార్గరుందా?" గర్జించేడు,
"ఒంటరిగా ప్రయాణం చెయ్యడం లేదనే చెప్పాను సాబ్ మూమెంటార్డరుంది. కూడా ఒక స్త్రీ వుంది...."
"నీ బీబీ హి..."
"కాదు వాళ్ళది కొమిల్లా, వాళ్ళ తాతగారు కలకత్తాలో వున్నారు ఆయిన నా స్నేహితుడు. నే నగర్తలా వెళుతున్నానంటే, ఆ పిల్లని వాళ్ళ వూరు దిగబెట్టమని బతిమాలేడు. సరే అన్నా. అదీ సంగతి.... కాస్త టీ.... సగం బొంకేను.
"అలాగా.... అరే లల్లూ రామ్ కీ బచ్చే...." సుబేదార్ సాబ్ రంకె వేసేడు.
"ఆయా హజూర్!" లల్లూ రామ్ లంగరీ (వంటవాడు) వచ్చేడు.
"చూడు ఈ సాబ్ కి చాయ్ చపాతీ ఇయ్యి,"
"జీ హజూర్ ఎన్ని వ్వమన్నారు..."
"ఒర్ మట్టి బుర్రా అదీ ఒక ప్రశ్నే?"
"అచ్చా హజూర్! ఇదిగో యిస్తున్నా..."లంగరీ పరిగెత్తేడు. ఐదునిమిషాల్లో పది పన్నెండు చపాతీలు, చాయ్ తీసుకొచ్చేడు. నేను సుబేదార్ సాబ్ కి "బహుత్ మెహర్బానీ" చెప్పి సలాం చేసి బైల్దేరా.
నేను, పద్మ, కమల్ చపాతీలు తిని, టీ తాగేం.
ఎనిమిది గంటలకి రైలొచ్చింది. వచ్చిన రైలే తిరిగి వెళుతుంది. అది తూర్పు బెంగాలు రైలుసరిహద్దు, పశ్చిమబెంగాలు వెళ్ళాలంటే పద్మానది దాటాలి. మేం యిప్పుడొచ్చినట్టే.
అక్కడ రైలు ప్రయాణం వొక సాహసమే. ప్లాటు ఫారం మీద కొన్ని వేల మంది ప్రయాణీకులున్నారు. వాళ్ళ కోసం అమ్మే తినుబడి పదార్ధాలు జంతువులు కూడా తినవు. కాని మనుషులు అవే యెగబడి తింటున్నారు. రైలు పెట్టెల్లో నొక్కుకుంటూ. తొక్కుకుంటూ, తోసుకుంటూ, తిట్టుకుంటూ కూరుకుపోతున్నారు.
కోతుల్లా రైలుపెట్టెల మీదికెగబాకి టావుల మీద కూచున్నారు. ద్వార బంధాన్ని, గజాల్ని పట్టుకు ములక్కాడల్లా వేళ్ళాడుతున్నారు. వాళ్ళ మాటలు నాకు ఆవపాటి కూడా అర్ధం కావు. వాళ్ళంతా జైలు తలుపులు పగలగొట్టి. గోడలు గెంతి పరిగెత్తుకొచ్చిన ఖైదీలో, పిచ్చాస్పత్రి నించి తప్పించు కొచ్చిన పిచ్చి వాళ్ళలా వున్నారు.
దీనికి తోడు అంతకుముందు పట్టిన మబ్బు మరీ కారుకమ్మి వర్షం ఆరంభించింది. అయినా ములక్కాడల్లా వేళ్ళాడుతున్నవాళ్ళు, టావుల మీద కోతులా కూచున్నవాళ్ళు చలించలేదు. రైలు అధికార్లు వాళ్ళని దిగమనలేదు. హో రనే వానలో, మొయ్యలేని బరువుతో మొర్రో అంటూ రైలు బైల్దేరింది. మేం రెండో తరగతి పెట్టెలో కొంచెం ఫరవాలేదన్నట్లే కూచున్నాం.
రైలాగినప్పుడల్లా తిరిగి పిచ్చాస్పత్రితయారవుతూంది. "చూశారా, ప్రయాణం యెలా వుందో మా దేశంలో......" పద్మ. ఆశ్చర్యం లేదు పద్మా. ఇది యుద్ధ రంగం. యుద్ధ రంగంలో పరిస్థితు లొక్కొక్కప్పుడు యింతకన్నా అధ్వాన్నంగా వుంటాయి. మనలాంటి సామాన్య సంసార్ల కిది యేమంత యిబ్బందికాదు. ఇదిగో, కమల్ వంటి వాళ్ళకే యిబ్బంది."
"తుక్కూ తుక్కూ, నేను రెండు సార్లు పుట్ట లేదు. పైగా నాకా ఆస్తి అక్కర్లేదు. కారణం...." అని యింకా ఏమో అనబోయి సిగరెట్టు పొగవల్ల పొలబారి దగ్గేడు కమల్.
"చూడండీ డబ్బులేని వాళ్ళు లేదని బాధ పడుతూంటే, ఉన్నవాళ్ళు వద్దో అని అఘోరిస్తున్నారు" పద్మ చిరునవ్వుతో కమల్ వేపు సైగ చేస్తూ అంది.
"నిజమే. కాని ధనం వచ్చేమార్గం కనిపిస్తూన్నా, దాన్ని అనుసరించని వాళ్ళు కూడా వుంటారు....." నేను చిరునవ్వుతో అన్నా,
పద్మ మొహం ముడుచుకుంది.
నిజానికి పద్మ కమల్ యింటికి తరుచు వెళుతుంది. కమల్ తల్లి ఆమెని కూతుర్లా చూస్తుంది. తనకి కోడలు కమ్మని చాలాసార్లడిగింది, కాని పద్మ ఏ సమాధానం చెప్పలేదు. పద్మ తనకి కోడలైతే కొడుకు ఆకాశ జీవితానికో స్థిరం కుదురుతుందని ఆమె ఆశ.
టాలీగంజ్ లో వాళ్ళ భవనం కింద అంతస్తులో ఆర్టిలరీ బ్రిగేడు ఆఫీసుంది. పై భాగంలో తల్లీ కొడుకులుంటున్నారు. పెద్ద వరండాలు, విశాలమైన గదులు, ఆధునిక గృహోపకరణాలతో భవనం చాలా బాగుంటుంది. ఇంటి వాళ్ళు కాక మరో యిద్దరు పనివాళ్ళు తప్పితే మరెవ్వరూ లేరు. కమల్ త్రిపాఠి నక్షత్రంలా తిరుగుతూంటాడు లింగు లింగు మంటూ తల్లి ఒక్కర్తే అక్కడ మెసుల్తూంటుంది,
అయితే కమల్ తల్లిది మంచి ఆరోగ్యం? చకచక. తెలివీ వున్నాయి, వయస్సు నలభై ఐదైనా, పదేళ్ళు చిన్నదిలా వుంటుంది. బ్రిగేడ్ ఆఫీసులో ఆఫీసర్లు మొదలు సిబ్బంది అందరికీ రోజుకి రెండుసార్లు "టీ" సప్లయి చేస్తుంది. సప్లయి చేసిన టీకి నెలనెలా బిల్లు చేస్తుంది. అడపా తడపా పని సమయంలో ఆఫీసు అన్ని గదుల్లోకి వెళ్లి పేరుపేర్నా అందర్నీ పలకరించి టీ యెలా వుందో కనుక్కుంటుంది. "ఓల్డ్ మాన్" బ్రిగేడియర్ గోల్డెన్ గదిలో దూరి. రెండు నిమిషాలు కబుర్లాడి వెళ్లిపోతుంది.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది పద్మ. సామాజిక దౌర్భాల్యా లొకవంక. అతిశయం మరొకవంక లాగుతుంటే, వాటి మద్య సతమతమయ్యే మధ్య తరగతికి చెందిన వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు కిట్టవు. ధనవంతులతో చేతులు కలిపితే వాళ్ళ అభిమానం దెబ్బతింటుందేమో అని భయపడతారు. అది ఒక విచిత్ర మైన మానసిక ప్రవృత్తి.
పద్మ తరుచు కమల్ యింటికి వచ్చేది. భోం చేసేది. కమల్ తో సినిమాలకి, విహారాలకి వెళ్ళేది. ఈ జంట కలిసి తిరుగుతూందని అందరికీ తెలుసు. ఎప్పుడైనా కమల్ తల్లి ఆఫీసులో కొస్తూంటే మిగిలిన స్టాఫ్ వాళ్ళు. "మిస్ పద్మా! మీ అత్తగారొస్తోంది అని యెగతాళి చేసేవాళ్ళు. కాని పద్మ తను కమల్ ని వివాహం చేసుకుంటానని ఏ నిముషానా అనుకోలేదు.
రైలుముందుకి పరిగెడుతూన్నకొద్దీ, వర్షం జోరెక్కుతూంది. ఆకాశం నల్లగా పొంగిన సముద్రం లా వుంది. కారు నల్లని మేఘాలు రక రకాల రూపులు మారుతూ నాలుగుమూలలకీ జోరుగా దొర్లుకుపోతున్నాయి. అంతా జలార్ణ వంలా వుంది. అంతులేని ఆకాశపు లోతుల్లోంచి నిర్విరామంగా ఉరుములు బావమోతని చీల్చుకుని. ప్రకృతి వణికేలా దీర్ఘంగా గర్జిస్తున్నాయి. కత్తుల్లా అనేక మెరుపులు తళుక్ తళుక్ మంటున్నాయి.
"ఈ మూడు వారాల్లో యెప్పుడైనా కొమిల్లా వస్తే మాయింటికి తప్పకుండా రండి....." పద్మ నాతో అంది.
"అలాగే..."
"మీకు మాయిల్లెలా తెలుస్తుంది!"
"ఎడ్రసు చెప్పండి...."
"నే చెప్తా రాసుకోండి..." కమల్.
"నీకు తెలీదు..." పద్మ అతని వేపు తీక్షణంగా చూసి అంది.
"తుక్కూ తుక్కూ.... చూశారాయెలా టకాయిస్తుందో. నాకు తన ఎడ్రసు తెలీదట."
"మీరెప్పుడైనా కొమిల్లా వెళ్ళేరా?" నేను.
"వెళ్ళలేదనుకోండి. కాని పద్మ కిందటిమాటు సెలవల్లో యింటికెళ్ళినప్పుడు ఆమెకి చాలా..."
"నువ్వు నోరుమూసుకో, అతని మాటలు నమ్మకండి. అతను వట్టిపిచ్చినాడు." పద్మ
కమల్ నావేపు కొంటెగా చూసి కన్నుగీటేడు.
"పికా ఢిల్లీ కి తూర్పున లాల్ ది ఘీ (ఎర్రచెరువు) వుంది. అక్కడ ఒక్కయింటికే వీధి వెంపు కొబ్బరి చెట్టుంది. అదే మా యిల్లు. ఈ మూడువారాల్లో ఓ మాటు మా యింటికి రండి." "చూశారా స్త్రీ బుద్ది. అనుకోకుండా కొన్ని గంటల్లో స్నేహం కుదిరిన మిమ్మల్ని యింటి కాహ్వానిస్తూంది. ఏళ్ళ తరబడి కాళ్ళా వేళ్ళాపడి వెనక తిరుగుతూన్న నన్ను మాట వరసకైనా రమ్మనదు..." కమల్ ఎకసెక్కంగా అన్నాడు. "ఆశ్చర్యం లేదు. మీరెప్పుడూ ఆమె దగ్గిరే వుంటారు. ఆమె మనసు లోనే వుంటారు. మీకు మళ్ళీ వేరే ఆహ్వాన మెందుకూ? బైటవాళ్ళకే ఆహ్వానం..." నేను.
"నేను బైట వాన్నైనా అయేను కాను, ఆహ్వాన మైనా వచ్చివుండును..." కమల్.
ఇద్దరం నవ్వేం. పద్మ కూడా నవ్వింది.
లక్షమ్ జంక్షను వచ్చింది. వాన తగ్గలేదు. హోరని కురుస్తూంది. వానలోనే పద్మ సామాన్లు దింపి ఫ్లాట్ ఫారం మీద వేసేం. రైలు కూసింది. కమల్ నాతో కరచాలనం చేసేడు. పద్మ నావేపు జాలిగా చూసింది. నేను గబగబ రైలెక్కి గేటు దగ్గర నిలబడ్డా. రైలు కదులుతుంటే నేను చెయ్యి వూపా, కమల్ విశాలంగా నవ్వుతూ జోరుగా చెయ్యూపేడు. పద్మ చెయ్యి నిమ్మళంగా కదిపింది. నిదానంగా, జోరుగా పడుతూన్న వానలో చెయ్యూపుతూన్న పద్మ మెరుపులా తోచింది ఆమె హృదయంలో వురుముకూడా వినిపించినట్లైంది.
* * *
