2
సుమారైదు గంటలకి రైలు అఖేరా స్టేషను చేరింది. స్టేషనుకి రెండు వేపులా ఫ్లాట్ ఫారాలున్నాయి. స్టేషను నిర్మానుష్యంగా వుంది. వాన జోరుగా పడుతూంది.
అఖేరా చిన్న స్టేషను. చుట్టుప్రక్కల ఎటు చూసినా యిళ్ళు కనిపించలేదు. ఎటుచూసినా వాన మాత్రం కనిపిస్తూంది. గోతులు కనిపిస్తూన్నాయి. బురద. నీరు కనిపిస్తూంది. సామాన్లతో స్టేషను ఆవరణలోకి చేరా స్టేషను మాష్టరు గదితలుపు మూసివుంది. తలపు తట్టా. బాధగా బాధగా స్టేషను మాస్టరు తలుపు ఓరోకలిగా తెరచి. నన్నెగా దిగా చూసి పక్కని ఆర్. టి. ఒ, ఆఫీసుంది" అని తల అడ్డంగా తిప్పి మళ్ళీ తలుపేసుకున్నాడు.
నేను వానకోటు తొడుక్కున్నా కనక బాధ లేదు. కొంచెం నాలుగు మూలలా వెతికితే ఆర్. టి. ఒ ఆఫీసు కనిపించింది. కాని ఆ గదిబైట తాళం వేసుంది. స్టేషనులోకి తిరిగివచ్చా. అక్కడ నాలాగే నలుగురైదుగురు తెల్లవాళ్ళు చేరారు. అంతా వానకోటేసుకున్నారు. ఒకడు నా వేపు. నా సామాన్ల వేపు చూసి నవ్వుతూ ఎక్కడి కెళుతున్నావని ప్రశ్నించేడు. నేను సిక్సిండియన్ హెవీ యాకాక్ వర్కుషాపు"కి వెళ్ళాలన్నా. అతను తన పక్కనున్న మరోతెల్ల వాడివేపు చూసేడు. రెండోవాడు మొదటివాడి వేపు చూసి. మొహం అదోలాపెట్టి పెదిమలు విరుస్తూ భుజాలు కుదిపేడు. మొదటి వాడు నావేపుచూసి. తిరిగి అదేపని చేసేడు. "వెల్" అంటే "వెల్" అని వాళ్ళు వెళ్ళిపోయేరు తరవాత అంతా అక్కణ్ణింఛి వెళ్ళిపోయేరు. నేను మిగిలేను, ఒకటే శబ్దం మిగిలింది. అది నగారా మోతలాంటి వానశబ్దం.
స్టేషనులో దీపాల్లేవు. చిమ్మచీకటి. క్షణమైనా విరామం లేకుండా ఉరుము లురుముతున్నాయి.
భోజనం ప్రసక్తే లేదు. కనీసం టీ అయినా కొరికే సూచనల్లేవు. అక్కడి మనుషులే లేరు. మళ్ళీ స్టేషను మాస్టరు గది తలుపు తట్టా. తను తలుపు తెరిచి హరికేన్ లాంతరు నా మొహం మీద పెట్టి ఏం కావాలన్నట్టు చూసేడు.
"క్షమించండి. ఆర్, టి, ఒ. ఆఫీసు మూసి వుంది..." నేను.
ఔను, ఇప్పుడు తెరిచివున్నది వానొక్కటే, ఇక్కడికీ రాత్రి రైళ్ళు రావు పోవు."
ఇక్కడ వెయిటింగు రూముందా?"
"వెయిటింగే వుండదు. రూమెందుకూ?"
నేనీ రాత్రి ఎక్కడుండాలి?"
"నేనెలా చెప్తా? క్షమించండి, నేనేం చెయ్యను"
"చూడండి స్టేషనులోకి పిక్కలు ములిగిన రొచ్చింది."
"నాకు తెలుసు. అందుకే నా గది తలుపు మూసేశా, మీరు తలుపు తట్టితే విధిలేక తెరిచా. శలవైతే యిదిగో తిరిగి మూసేస్తున్నా." సగం తీవ్రంగా, సగం వెకాస్యంగా అన్నాడు.
"మొదట నన్ను లోపలికి రానివ్వండి. తరవాత ముయ్యొచ్చు......" నేనూ ఆ ఫక్కీలోనే అన్నా.
అతనొక్క క్షణం అలోచించి "రండి" అన్నాడు, నేను సామాన్లు తెచ్చుకుని స్టేషను మాస్టరు గదిలో దూరా.
తరవాత స్టేషను మాష్టరు కొన్ని వివరాలు చెప్పేడు. ఆ చుట్టుపక్కలంతా చాలా భాగం అడివి ప్రదేశం. అన్నీ కచ్చా రోడ్లు. అప్పటికి నాలుగైదు రోజుల్నుండి వాన తెరిపిలేకుండా కురుస్తూంది. ఆ ప్రదేశం అంతా జలమయవైంది. టెలిగ్రాఫ్, టెలిఫోను స్తంభాలు కూలిపోయేయి. రోడ్లు, చెరువులు, బురదగుంటలు, కూలిన చెట్లు, అన్నీ ఏకమై పోయేయి. తంతి, తపాల, టెలిఫోన్లు పడుకున్నాయి. సాహసించి బైటకొచ్చిన ట్రక్కులు, లారీలు రొంపిలో దిగబడు తున్నాయి.
తిండిలేదు. టీ అయినా లేదు, అదృష్టవశాత్తు అవీలేకపోతే పిచ్చెత్తి పోదును, నేను, స్టేషను మాష్టరు సిగరెట్లు కాలుస్తూ కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాం, తరువాత పడుకున్నాం.
స్టేషను మాష్టరు తెల్లవారకముందే ఎప్పుడో లేచి తన పని చూసుకుంటున్నాడు. నాకు తెలివొచ్చేసరికి ఆరున్నర దాటింది. వాన మధ్య చినుకులు కత్తెర వాటుగా నిదానంగా పడుతున్నాయి. వాన చప్పుడు లేకపోయినా ఆకాశ అనుమానం కొద్దీ మొగుడిమీద అలిగిన పెళ్ళాం మొహం లా వుంది, ట్రక్కులూ, లారీలు బురద లోంచి వర్షాకాలపు పురుగుల్లా వస్తూపోతూ న్నాయి. బురదలో దిగబడినప్పుడు బైటికి రాలేక, నరాలు బిగించి మొర్రో అంటున్నాయి.
ఉదయం కూడా టీ లేదు. ఒక బెంచీమీద కూచున్నా! ఏ మిలిట్రీ లారీవాళ్ళ నడిగినా "సిక్సిండియన్" అనగానే తెల్లమొహాలు వేస్తున్నారు. కొందరు పోస్టుకోసం అన్ని యూనిట్ల ట్రక్కులూ యిక్కడికే వస్తాయి. ఇవాళ వాన కాస్త తెరిపిగా వుంది కనక మీ యూనిట్ ట్రక్కు కూడా రావచ్చు. అని సముదాయించి వెళ్ళిపోతున్నారు. నేనలాగే కూచున్నా.
ఇంతలో ఒక సివిలియనొచ్చి నా ప్రక్కకూచున్నాడు, నేనతన్ని హిందీలో భోగట్టాచేశా.
"ఇక్కడ వానలు విపరీతంగా కురుస్తాయి, ఇలా కురుస్తూంటే బళ్ళ రాకపోకలుండవు. ఎండ బాగా వచ్చి, కాస్త నేల గట్టిపడే వరకూ లారీలు నడవ్వు.
"వాన ఎన్నాళ్ళు పడుతుంది"
"ఒక్కొక్కపుడు పది పదిహేను రోజులు ఆగకుండా పడుతుంది.
నా గుండె గుభేలు మంది.
"ఐతేనే నగర్తలా యెలా వెళ్ళడం?


"అగర్తలా! అగర్తలాకి బస్సుంది. ఇక్కడికి ఇరవై నిమిషాలే ప్రయాణం. బస్సు తిన్నగా రాజాగారి భవనం వరకూవెళ్ళి, వెంటనే తిరిగొచ్చేస్తుంది. కాని, అక్కడ మిలిట్రీయూనిటేవీ లేవు మీరు వెళ్ళవలసింది చాలా దూరం కనీసం పదిహేను మైళ్ళు. చిట్టడివి.
"హుఁ! ఇక్కడ చుట్టు పట్ల టీ దొరుకుతుందా?"
"ఇక్కడేం దొరుకుతుంది! నాతో వస్తే యిప్పిస్తా."
"సరే..."
బైల్దేరేం. అతను గొడుగు విప్పేరు. అతను సన్నంగా పొడుగ్గా వున్నాడు. చిన్న వుంగరాల జుత్తు. బుగ్గ యెమికలు యెత్తుగావున్నాయి. పెద్ద కళ్ళు, పంచా చొక్కా, ముఫ్ఫై యైదేళ్ళుంటాయి.
"మీదే ప్రాంతం?" అతను.
"మద్రాసు...."
"తమిళా?"
"కాదు. తెలుగు...."
"ఏవూరు?" అని తెలుగులో ప్రశ్నించేడు.
నేను ఆశ్చర్యపోయేను. యాసగా వున్నా అది తెలుగే. ఎక్కడ తెలుగు దేశం? ఎక్కడ అగర్తలా? ఇక్కడ వొక వ్యక్తి, ఈ విపరీత పరిస్థితుల్లో నాతో తెలుగులో మాట్లాడుతున్నాడు.
"మాది విజయనగరం, మీకు తెలుగెలా వచ్చు?"
"నాను బొరంపురొం, కొటేక్ లో సాపుల వర్తకం సేసా..."
"ఓహో! బరంపురం పోత్తి పంచల చావుల వర్తకమా...."
"ఉహూ! కాదు, షాపులు- షాపులు- సిల్క పరస్సులో వుండే సాపులు..."
"సరే సరే... చాపలు మచ్చీ"
"ఆ... అదే..."
"మరి ఎక్కడికెందు కొచ్చేరు?"
"బిజినెస్..."
"బిజినెస్..." నాలో నేను గొణుక్కున్నా.
అతని పేరు "దాస్." బెంగాలీ, దాసుకి కాలిజోళ్ళు లేవు. బురద అతని వేళ్ళ సందుల్లోంచి పైకి చిమ్ముకొస్తూంది. పంచె యెగకట్టేడు, గబ గబ నడుస్తున్నాడు. నాకే కాస్త యిబ్బందిగా వుంది. బురదలో దిగబడుతున్న ఎమ్యునిషన్ బూట్లు" బరువెక్కి పోయాయి.
అలా బురదా, నీళ్ళూ దాటుతూ మూడు ఫర్లాంగులు నడిచేం. అక్కడ చిన్న మట్టికొంపలు నాలుగైదున్నాయి. పైన టిన్ రేకులు.
దాసు ఒక తలుపుతట్టి "గో తీ-ఓ గొంతీ" అని పిలిచేడు. ఇరవై ఏళ్ల స్త్రీ తలుపు తీసింది, నల్లగా వుంది. జుత్తు నడినెత్తిమీద ముడేసింది. పెద్దకళ్ళు. కాని తిండిలేక యెండినట్టుంది. దాసు నన్ను లోపలికి రమ్మన్నాడు. గొంతి వొక చింకి చాప పరిచింది.
ఆ కొంత మొత్తం ఆ గది మాత్రమే. మధ్యగా వొక చింకితడక అడ్డుగోడలా వుంది. తడక కవతల వున్న నులక మంచం కూడవుపిస్తూంది. వేళ్ళాడుతున్న కుళ్ళు దుప్పటీ కొనకూడా అవుపిస్తూంది. పొయ్యికూడా అటు వేపే వుంది.
గొంతి అవతల భాగంలో వుండగా దాసు యేదో అన్నాడు. గొంతికూడా యేదో అంది. నా కర్ధం కాలేదు. పక్క కొంపల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి.
దాసు, అక్కడి పరిస్థితులేవీ బాగులేవని, బీదవాళ్ళకి బతకటం కష్టంగా వుందని కబుర్లు చెపుతున్నాడు. పది నిమిషాల్లో గొంతి టీ, బన్నులు తెచ్చి మాముందు పెట్టి నించుంది. నేనామెని కూచోమన్నా. కాని తడకవతలికి వెళ్ళిపోయింది.
టీ చాపల కంపు కొడుతూంది. బన్ను ముక్కి పోయింది. కాని తొలినాడు గొలంద్ లో మిలిట్రీ క్యాంపు వాళ్ళిచ్చిన చపాతీ, టీ తీసు కున్న తరువాత పచ్చి మంచినీళ్ళు తాగలేదు. ఆకలి మండిపోతూంది. ఎలాగో బన్ను కొరికి టీ గొంతుకలో పోసుకున్నా. కడుపులో తిప్పి నట్లైంది. గొంతి గ్లాసులు తీసింది. దాసు ఆమెని కూచోమన్నాడు. ఆమె ముడుచుక్కూచుని మోకాళ్ళమీంచీ రెప్పలార్పకుండా చూస్తూంది.
"ఇక్కడ కూర్చుంటారా?" దాసు నన్నడిగేడు.
"కూర్చునే వున్నానుగా................."
దాసు నవ్వేడు. గొంతి నవ్వలేదు. మాత్రం, నావేపు ఆతృతగా చూస్తూంది. నా కర్ధమైంది ఆ "కూర్చోడం" ఏమిటో.
నేనులేచి దాసుని లెమ్మన్నా. దాసు లేచేడు. గొంతికూడా చివాల్న లేచింది. నేను ఐదు రూపాయలనోటు ఆమె చేతిలో పెట్టి దాసుతో పద అన్నా ఆమె నోటు వూపుతూ గబగబ ఏదో అంది, దాసు మాటలు నవిలినట్టు ఏదో అని వెకిలిగా నవ్వేడు. భోజనమైనా చెయ్యకుండా, విశ్రాంతి తీసుకో కుండా ఆ డబ్బివ్వడం దేనికందిట.
నేను వానకోటు తొడుక్కున్నా. ఇద్దరం తిరిగి అఖేరా స్టేషను చేరేం. అక్కడ దాసు మళ్ళీ అన్నాడు- "నేను సాయంత్రం వస్తా. అప్పటి వరకూ మీరిక్కడే వుంటే రాత్రి గొంతి యింట్లో పడుకోండి-" నేను జవాబు చెప్పలేదు. దాసు గొడుగు విప్పి వెళ్ళిపోయేడు.
సన్నని కత్తెరవానలో ఆకాశం అద్దంలా మెరుస్తుంది. నా మనసులో, పద్మ, దాసు, గొంతి మెరుస్తున్నారు. ఇది రెండో ప్రపంచ మహాయుద్ధం. ఇది యుద్ధ కలాపాలకీ, కరువు కాటకాలకీ రంగస్థలమైన తూర్పు బెంగాలు. భవిష్య త్కాలం యిక్కడ యింకేవింతలు చూపిస్తుందో నాకు!
3
ఆవాళ మధ్యాహ్నం మూడుగంటలకి వాన పూర్తిగా వెలిసింది, కొంచెం సూర్యదర్శనం అయింది. ఆర్. టి . ఓ. ఆఫీసు తెరిచేరు. ఆర్.టి.ఓ. నా ఉదంతం అంతా విని చాలా విచారించేడు. ఏవైనా ట్రక్కులొస్తే చెప్తానన్నాడు.
ఐదు కావస్తూన్నా ఏ ట్రక్కులూ రాలేదు. ఆర్.టి.ఓనా పీడ వదిలించు కుందామనుకున్నాడు. నన్ను, నా సామాన్లనీ ఒక ఒంటరి రైలింజనులో ఎక్కించి, నాలుగుమైళ్ళ దూరంలో వున్న సింగార్ బిల్ స్టేషనుకి తోలేడు. అక్కడ ఒక గుడ్సు సైడింగు వుందని, అక్కడికి చాలా మిలిట్రీ ట్రక్కులు సామాన్లకోసం వస్తాయని, యేదో ఒక దాంట్లో యెక్కి మీ యూనిట్ కి వెళ్ళిపోవచ్చునని చెప్పేడు!
సింగార్ బిల్లు పేరుకే స్టేషను. అక్కడ ఏమీలేదు, ఒక చిన్న సిమ్మెంటు షెడ్డుంది. ఇంజను డ్రైవరు నన్నక్కడదింపి, యింజన్ను తిరిగి అఖేరా తీసుకుపోయేడు.
సింగార్ బిల్లు చిట్టడివిలో వుంది. నేను సామాన్లతో షెడ్డులో ఒంటరిగా నిలబడ్డా. గాలికి వెర్రిగా వూగుతూన్న చెట్ల ఆకులు సలసల్లాడుతున్నాయి. వాన నీళ్ళు జోరుగా గలగల పారుతున్నాయి. గాలి ఝూంకారం చేస్తూంది. మళ్ళీ దట్టంగా మేఘాలు క్రమ్ముకొస్తున్నాయి.
అలా ఒక బక్కచిక్కిన మనిషొస్తూ ఔపించేడు. నేనతన్ని పిల్చి ఆ చుట్టుప్రక్కల యేవైనా మిలిట్రీ క్యాంపులున్నాయా అని ప్రశ్నించేను. అతనేదో చెప్పేడు. నాకర్ధం కాలేదు. సామాన్లు యెత్తుకుని నావెంట రమ్మన్నా. అతను ముందు రానన్నాడు. మూడు వేళ్ళు చూపించి రూపాయ లిస్తానన్నా. ఎలాగో సామాన్లెత్తుకున్నాడు. నేను ముందు, అతను వెనక గమ్యంలేని ప్రయాణం. సుమారు గంటసేపు చితపతలాడే బురదలో నడిచేం. ఉండుండి అతను గొణగడం ప్రారంభించేడు, కనుచూపు మేరలో యెటుచూసినా ఇళ్ళ జాడలేదు! సింగార్ బిల్లు నించి సుమారు మూడు మైళ్ళు నడిచి వుంటాం.
ఒక దగ్గిర ఒక కెప్టెను పదిమంది కూలీల చేత మన్ను తవ్విస్తున్నాడు. అతని దగ్గిరకెళ్ళి సెల్యూటు చేసి "సిక్త్సిండియన్" గురించి భోగట్టా చేశా." అతనాలోచించి, తల అడ్డంగా తిప్పి "సారీ" అన్నాడు. ఒకవేపు చూపించి అలా మైలువెడితే ఒక సిక్కు డిటాచ్ మెంటు"వుందని చెప్పేడు? నేను తెలివితక్కువగా అక్కడేదైనా ట్రక్కువుందా అని అడిగా. అతను నడుం మీద చేతులేసుకోని చిరునవ్వుతో "నువ్వు యువకుడివి. సోల్జరువి, లెఫ్ట్ రైట్ అన్నాడు. నేను సెల్యూట్ చేసి తిరిగి ప్రయాణం ఆరంభించా. కూలివాడు మరి ముందుకి రానని సామాన్లు కింద పడేశాడు. నేను బతిమాలి ఐదు వేళ్ళు చూపించి రూపాయి లిస్తానన్నా. గునుస్తూ సామాన్లు తిరిగి యెత్తుకు బైల్దేరేడు.
నడవగా, నడవగా హఠాత్తుగా అడ్డంగా ఒక ప్రవాహం యెదురైంది, నీరు జోరుగా పారుతూంది. ఎంత లోతుందో తెలీదు. ప్రవాహం దాదాపు నూరడుగులు వెడల్పుంది. దాని అవతల వెంపు చాలా మంది సిక్కు సిపాయిలు తవ్వకం పని చేస్తున్నారు. వాళ్ళు నన్నుచూసి అరిచేరు, నవ్వేరు, వికారంగా నృత్యం చేసేరు. కూలివాడు ప్రవాహంలోకి దిగనని మళ్ళీ సామాను కిందపడేసేడు. నేను వాడికేసి తీవ్రంగా చూసి, వస్తే డబ్బిస్తా, రాకపోతే తంతా నన్నా, వాడు పిచ్చివాడిలా అరిచి సామానెత్తుకుని వచ్చేడు. ఆ ప్రవాహం దాటడం నిజంగా వొక సర్కసు పని అయింది.
