Previous Page Next Page 
వసుంధర కథలు-13 పేజి 18


    అయితే ఎక్స్-32 అతడిదాకా ఎలా వచ్చింది? అతడి ప్రయోగాల్ల్లో ఎక్కడా ఎక్స్-32 అవసరమున్నట్లు లేదు. అతడు ఎక్స్-32 తఃననుంచి తీసుకున్నట్లు సైంటిస్టు మధుమూర్తి కూడా చెప్పలేదు.
    అప్పుడు వెంకన్నకు స్ఫురించింది-సుబ్బారావు కు డైరీ వ్రాసే అలవాటు గనుక ఉన్నట్లయితే-అది చూడాలి! అందులో చాలా విశేషాలు బయటపడవచ్చు. కానీ వసంత అతడికి డైరీ రాసే అలవాటు లేదని చెప్పి నట్లు గుర్తు.
    వెంకన్న వెంటనే వసంతను కలుసుకుని రామ్మూర్తి విషయమడిగి-"నువ్వు మొదట ఈ రామమూర్తి వ్యవహారం బయట పెట్ట్టకపోవడంవల్ల-నిన్నిప్పుడనుమానించక తప్పదు. నీ నిజాయితీని నీ భర్త ఒక్కడే నిరూపించగలడు. లేదా అతడి డైరీ నిరూపించగలదు. దురదృష్టవశాత్తూ అతడికి డైరీ నిరూపించగలదు. దురదృష్టవశాత్తూ అతడికి డైరీ రాసే అలవాటు లేదు-" అన్నాడు.
    "వెంకన్న గారూ! ఇబ్బందికరమైన విశేషాలు దాచి పెట్టిన మాట నిజం. మావారు డైరీలో ఉన్నదున్నట్లు రాస్తారు. అందులో మా యిద్దరికీ సంబంధించిన వ్యక్తి గతానుభవాలు కూడా వివరంగా వున్నాయి. అందుకే దాని గురించి అబద్ధం చెప్పాను. వారు డైరీ రాస్తారు. ఆ డైరీ నా నిజాయితీని ఋజువు చేస్తుంది-...." అంది వసంత.
    కేసిలా మలుపుతిరిగినందుకు వెంకన్న ఆశ్చర్యపడ్డాడు. సంతోషపడ్డాడు. మనసులోనే రామ్మూర్తి నభినందించుకున్నాడు.
    మరి కాసేపట్లో సుబ్బారావు డైరీ వెంకన్న చేతికి వచ్చింది. వెంకన్న ఆ డైరీ చదివాడు. చదివినందుకు తర్వాత అతడు బాధపడ్డాడు కూడా అందులో భార్యా భర్తలకు సంబంధించిన ప్రయివేటు విషయాలు చాలా యెక్కువగా వున్నాయి. అందులో రామమూర్తి ప్రస్తావన వుంది. సుబ్బారావు రామమూర్తిని అసహ్యించుకున్నాడు. రామ్మూర్తివంటి స్నేహితుడి నింటికి రానిచ్చి భార్యను బాధపెట్టానని వ్యధ చెందాడు. మళ్ళీ తమ ఇంటికి వస్తే యే కాఫీలోనో స్లోపాయిజనిస్తానని భయపెట్టి అతడితో తెగ తెంపులు చేసుకున్నాడు.
    విశేషమేమిటంటే అందులో ఎక్కడా ప్రవీణ్ కుమార్ ప్రసక్తిలేదు. డైరీ నిండా-అతడికీ భార్యకూ సంబంధించిన విశేషాలే వున్నాయి.
    వెంకన్న డైరీని వసంతకు తిరిగిచ్చేసి- "నీవు చెప్పింది నిజం. రామ్మూర్తి నీ గురించి అబద్ధం చెప్పాడు. నేనతడి అంతు చూస్తాను. మీ వ్యక్తిగతానుభవాలకు సంబంధించిన ఈ డైరీని చదివినందుకు మన్నించు-" అన్నాడు.
    వసంత తల వంచుకుని-"వారీ డైరీని నా కోసమే రాసేవారు. నా గురించి తనకు కలిగే భావాలన్నీ డైరీలో వ్రాసి-దీన్ని నీ వెప్పుడయినా చదువుకోవచ్చు-.....అనేవారు. అందులో మాకు సంబంధించి తప్ప మరేమీ వుండదు-అందుకే నేను దీని గురించి ముందుగా మీకు చెప్పలేదు-" అంది.
    అర్ధమయింది వెంకన్నకు. సుబ్బారావు భార్యను సంతోషపెట్టడానికి మాత్రమే డైరీ వ్రాసేవాడన్న మాట!
    వెంకన్న డైరీ గురించి యింకా ఆలోచిస్తూండగానే బయట్నుంచి ఫోన్ వచ్చింది.
    "హలో!" అన్నాడు వెంకన్న.
    "నేను శంకర్రావుని మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నది వెంకన్నగారేకదూ!"
    "అవును-ఏమిటి విశేషం!"
    "ప్రవీణ్ కుమార్ గురించిన వివరాలు తెలిశాయి. అతడు నేరస్థుడు కావడానికి వీల్లేదు. ప్రభుత్వ గూఢచారి శాఖకు చెందిన వ్యక్తి....ఇప్పుడీ ఊళ్ళో అతడి మిషన్ అయిపోయింది. అతణ్ణి ట్రేస్ చేయడం కూడా కష్టం...."
    "వాట్...." అన్నాడు వెంకన్న.
    
                                   7

    వెంకన్న రామ్మూర్తి గురించి వాకబు చేశాడు. రామ్మూర్తిలో పెద్దగా విశేషాలేమీ లేవు. కానీ అతడికీ శ్రీకాంత్ కీ పరిచయముంది.
    "శ్రీకాంత్ తోనే ఈ కేసు లింకంతా ఉంది-" అనుకున్నాడు వెంకన్న. కానీ ఆ లింకును సాధించడమెలా?
    వెంకన్న బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతడు లాబొరేటరీ అసిస్టెంటు సుధాకర్ ని స్వయంగా కలుసుకుని-"నువ్వు ఎక్స్-32 ని వేరే కాగితంలో వేసి పొట్లాం కట్టడం చూసినవాళ్ళున్నారు. ఆ సాక్ష్యం నిన్ను హంతకుణ్ణి చేస్తుంది. నిజం చెబితే నిన్ను రక్షించగలను. లేదా-నీ కర్మ!" అన్నాడు.
    సుధాకర్ భయపడ్డాడు-"నేనిలాంటి పని చేయలేదు. మీకెవరో అబద్దం చెప్పారు-...." అన్నాడతడు.
    "సరే-అయితే నీకేమయినా ఆస్తి పాస్తులుంటే త్వరగా వీలునామా వ్రాసుకో! సుబ్బారావు డైరీలో నీవు ఎక్స్-32 దొంగతనం చేస్తూండగా చూసినట్లు రాసుకున్నాడు. అదికాక బ్రతికున్నవారి సాక్ష్యం కూడా వుంది-..."
    సుధాకర్ క్షణం తటపటాయించి-"వెంకన్న గారూ! నేను ఎక్స్-32 కొద్దిగా తీసుకున్న మాట నిజం. కానీ నా కోసం కాదు. నేను దాన్ని వాడలేదు....-" అన్నాడు.
    "మరి?"
    "శ్రీకాంత్ కిచ్చాను...."
    "శ్రీకాంత్ కీ నీకూ సంబంధమేమిటి?
    సుధాకర్ బయటపెట్టిన నిజం వెంకన్న నాశ్చర్యచకితున్ని చేసింది.
    శ్రీకాంత్ దగ్గర రకరకాల మర్యాదలున్నాయి. వాటిలో కొన్ని నూరేళ్ళ నాటివి. వాటి రుచి మద్యం తాగేవాడికే తప్ప తెలియదు. ఒకసారి వాటిని మరిగిన వాడు- ఆ రుచి మరిగి వాటికోసం ఏమైనా చేయగల్గుతాడు. శ్రీకాంత్ స్నేహితులందరూ అతడిచుట్టూ తిరిగేది వాటికోసమే! అతడు వారిని బాగా తాగించి తన క్కావలసిన రహస్యాలు రాబడుతూంటాడు. తనక్కావలసిన పనులు చేయించుకుంటాడు.
    "శ్రీకాంత్ కీ సుబ్బారావుకీ సంబంధమేమిటి?"
    "నాకు తెలిసి యే సంబంధమూ లేదు. ఒకరోజాయన సుబ్బారావుగారిని కలుసుకుందుకు వచ్చాడు. అప్పుడే నా దగ్గర ఎక్స్-32 తీసుకున్నాడు. ఆ రాత్రే సుబ్బారావు గారు చనిపోయాడు. ఇంతకు మించి నా కేమీ తెలియదు-"
    "చూడు....నీ సాక్ష్యం చాలా అవసరం. నిన్ను రక్షించుకుందుకే కాదు. ఓ భయంకర నేరస్తుణ్ణి బయటపెట్టడానికి...."
    సుధాకర్ భయంగా-"నన్ను బయటకు లాగకండి, శ్రీకాంత్ సామాన్యుడు కాదు, అతడికి పెద్దవాళ్ళ అండ వుంది. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తే బహుశా నేను, నా కుటుంబం సర్వనాశనమయిపోతాం-...." అన్నాడు.
    "అలా జరగదని నేను హామీ యిస్తున్నాను-...." అన్నాడు వెంకన్న. అతడి కిప్పుడెంతో సంతోషంగా వుంది. సుధాకర్ మీద ఓఅస్త్రం వేసిచూస్తే ఫలించింది. అప్పుడప్పుడిలాంటి అదృష్టముంటే తప్ప కేసులు పరిష్కారం కావు.
    వెంకన్న తర్వాత రామ్మూర్తిని కలుసుకుని-"నువ్వు వసంతకోసం సుబ్బారావుని చంపేశావనడానికి ఆధారాలున్నాయి. లాబొరేటరీలో ఓ వ్యక్తి నీకు ఎక్స్-32 విషాన్ని ఇచ్చానని సాక్ష్యం చెప్పాడు. సుబ్బారావు ఎక్స్-32 విషంతోనే చనిపోయాడు. నువ్వు నా యింట్లో వున్న వసంతను బెదిరించడం కారణంగా కేసు నీకు వ్యతిరేకంగా బలపడింది. సుబ్బారావు డైరీ వసంత నిర్దోషిత్వాన్ని బయట పెట్టింది...." అన్నాడు.
    రామ్మూర్తి భయపడ్డాడు. అతడు వెంటనే-"నాకేం తెలియదు. నేను హత్యలు చేసే రకంకాదు. సామాన్యుణ్ణి-" అన్నాడు.
    "హత్యలు కాంతాకనకాలకోసం జరుగుతాయి. కాంత ఉండనే ఉంది కారణమిక్కడ...." అన్నాడు వెంకన్న.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS