Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 18

 

    "పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను." మీకెందుకు ?" చిరాగ్గా అన్నాడతడు.
    అతను నవ్వి - "నా పేరు చలం -" అన్నాడు.
    "మీ పేరు నేనడగలేదు !' అన్నాడు జనార్దనం.
    'అడక్కపోయినా చెబుతాను నేనూ" అన్నాడు చలం.
    "ఇదిగో మిస్టర్ చలం! నాకు టైము చాలా విలువైనది. నేనది వృధా చేయలేను -" అన్నాడు జనార్దనం.
    "టైము కంటే విలువైనది ప్రాణం. ఆ విషయం మీరు ఒప్పుకుంటారనుకుంటాను -" అన్నాడు చలం.
    'అంటే?"
    " మీ ప్రాణాలు ప్రమాదంలో వున్నాయి -" అన్నాడు చలం.
    "మీరేం చెప్పదలచుకున్నదీ త్వరగా చెప్పండి... అన్నాడు జనార్దనం.
    "మీ పేరు మీకు తెలుసు. మీ ప్రియురాలి పేరు మీకు తెలుసు. మీకు తెలిసినవన్నీ నాకూ తెలుసు. అయితే మీ గురించి మీకు తెలియని కొన్ని వున్నాయి. అవి కూడా నాకు తెలుసు -" అన్నాడు చలం.
    "ఏమిటవి ?" అన్నాడు జనార్దనం .
    "మీరు లీలను పెళ్ళి చేసుకుంటే మీ ప్రాణాలు పోతాయి -"
    "బెదిరిస్తున్నావా ?"
    "ఇది బెదిరింపు కాదు. నిజం చెబుతున్నాను ...."
    "ప్రాణాలు పోతాయని ఎవరికీ ముందుగా తెలియదు -" ఇది నిజంగా బెదిరింపే -" అన్నాడు జనార్దనం.
    'అయితే మీకు సుగుణ్, ప్రకాష్ ల గురించి తెలియదా ?"
    "వాళ్ళెవరు ?"
    "లీల గురించి నేను హెచ్చరిస్తే చెవిని పెట్టలేదు -"
    'ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు?"
    "ఎక్కడున్నారో చెప్పలేను. కానీ ఈ భూమ్మీద మాత్రం లేరు ...."
    జనార్దనం చలం భుజం మీద చేయి వేసి - 'అయితే మీరు నా శ్రేయోభిలాషి అన్నమాట -" అన్నాడు.
    "ఇప్పటికి మీరు నిజం గ్రహించారు -" అన్నాడు చలం.
    "మీ మాటలు విని లీలతో వివాహం మానేయమంటారు -"
    'అవును...."
    "నాతో రండి - " అన్నాడతను . చలం అతడి ననుసరించాడు.
    ఇద్దరూ వివేకా గార్డెన్స్ నుంచి బయటకు వచ్చారు.
    "కారేక్కండి -- మీతో చాలా మాట్లాడాలి -" అన్నాడు జనార్దనం.
    ఇద్దరూ కారేక్కారు.
    'ఇప్పుడు చెప్పండి - నా ప్రాణాలెందుకు పోతాయి ?"  అన్నాడు జనార్దనం కారు స్టార్టు చేస్తూ.
    "ఆ లీల కామినీ పిశాచి...."
    "ఆమె నాకు మనిషిలాగే కనిపించింది -" అన్నాడు జనార్దనం.
    "పెళ్ళయ్యేదాకా అలా కనిపిస్తుంది. పెళ్ళి అయినాకనే ఆమెలోని పిశాచం బయటకు వస్తుంది--" అన్నాడు చలం.
    "మీకెలా తెలుసు ?"
    "ఆమె కారణంగా ఎందరో చనిపోయారు -"
    "మీకెలా తెలుసూ -- అనడిగాను -" అన్నాడు జనార్దనం.
    చలం మాట్లాడలేదు.
    "మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పడం లేదనుకోండి. ఎలా బైట పెట్టించాలో నాకు తెలుసు " అన్నాడు జనార్దనం.
    చలం మాట్లాడలేదు.
    జనార్దనం ఉన్నట్లుండి సడన్ బ్రేక్ వేశాడు. ఒక్క కుదుపులో కారు ఆగింది.
    "ఏమయింది ?' అన్నాడు చలం.
    "మనం రావలసిన చోటు వచ్చేసింది ...." అన్నాడు జనార్దనం.
    చలం అటు చూశాడు. ఎదురుగా పెద్ద హోటలు వుంది.
    "మనకీ హోటల్లో పనేమిటి ?" అన్నాడు చలం.
    "మీరు అటు చూస్తున్నారు. ఇటు చూడండి అన్నాడు జనార్దనం.
    చలం అటు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ పోలీస్ స్టేషన్ వున్నది.  
    "మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పడంలేదు. అవి బైట పెట్టించడం కోసం ఇక్కడకు తీసుకుని వచ్చాను" అన్నాడు జనార్దనం.
    "మీ ఉద్దేశ్యం ఏమిటి?"
    "నా ఉద్దేశ్యం -- ,మీ ఉద్దేశ్యం తెలుసుకోవడం అన్నాడు జనార్దనం. 'దయుంచి పారిపోయే ప్రయత్నం చేయకండి. అది మీకు క్షేమం కాదు ---"
    చలం పారిపోయే ప్రయత్నం చేయలేదు. కార్లోంచి బయటకు వచ్చేక ఇద్దరూ పోలీస్ స్టేషన్లో ప్రవేశించారు.
    "డియర్ మిస్టర్ ఇన్ స్పెక్టర్! నేను పెళ్ళి చేసుకుంటే ప్రమాదమని ఇతడు నన్ను హెచ్చరిస్తున్నాడు. చావగాలనని బెదిరిస్తున్నాడు. రేపే నా వివాహం. నా వివాహం అయ్యేవరకూ దయుంచి ఇతడ్ని లాకప్ లో వుంచండి --" అన్నాడు జనార్దనం.
    "మీరు వెళ్ళండి సార్ -- ఇతడి సంగతి నేను చూసుకుంటాను --" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఇటీవల మరణించిన సుగుణ్, ప్రకాష్ అనేవాళ్ళు ఇతడి కారణంగా పోయారని నా అనుమానం. మీరు ఇతన్నుంచి ఆ వివరాలన్నీ రాబట్టాలి --" అని వెళ్ళిపోయాడు జనార్దనం.
    చలం ఇన్ స్పెక్టర్  వంక తిరిగి -- "మీరు నన్ను లాకప్ లో ఉంచి లాభం లేదు. అతడు వివాహాన్నాపండి. లేకుంటే అతడి ప్రాణాలు పోతాయి --" అన్నాడు.
    "నీనుంచి నేను ఇంకా చాలా విశేషాలు రాబట్టాలనుకుంటున్నాను...." అన్నాడు ఇన్ స్పెక్టర్. అతడి చూపులు క్రూరంగా వున్నాయి.

                                     10
    "హలో - మీరు కూడా ఇక్కడ ...ఏమిటి విశేషం ?" అన్నాడు ఇన్ స్పెక్టర్ శేఖర్.
    'ఈ కేసులో నాకూ ఆసక్తి వుంది --" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
    "మిమ్మల్ని ఎవరైనా పిలిచారా ?"
    "లేదు. ఇతడు చనిపోతాడేమోనన్న అనుమానం నాక్కలిగింది. ఎలా చనిపోతాడో తెలుసుకోవాలి. ఒక మనిషిని నియమించాను. అతడు అహర్నిశలు అతణ్ణి అనుసరించి వుంటున్నాడు. చనిపోగానే నాకు వార్త అందింది--"
    ఇన్ స్పెక్టర్ శేఖర్ డిటెక్టివ్ వెంకన్న వంక ఆశ్చర్యంగా చూస్తూ -- "ఇతడు చనిపోతాడన్న అనుమానం మీకెందుకు కలిగింది ?" అన్నాడు.
    'అది దేవ రహస్యం , చెప్పకూడదు ---"
    "నేనడిగిన కారణం వేరు. జనార్దనం చనిపోతాడని తెలిసిన వ్యక్తీ మరోకడున్నాడు. అతడు మా స్టేషన్ లాకప్ లో వున్నాడు -- " అన్నాడు శేఖర్.
    'అయితే మనం కలిసి మాట్లాడుకోవాలి. ముందిక్కడ తంతులు పూర్తీ కానివ్వండి --" అన్నాడు వెంకన్న.
    కేసు అన్నివిధాల సుగుణ్, ప్రకాష్ ల కేసునే పోలి వుంది.
    జనార్ధనానికి చావు హటాత్తుగా సంభవించింది.
    డాక్టర్ విషప్రయోగం అన్నాడు. అతడికి ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలున్నాయి. అవి బయటపడ్డాయి. ఎవరూ అతడిని హత్య చేసే అవకాశం లేదు.
    వెంకన్న ఎవర్నీ ఏమీ ప్రశ్నించలేదు. అతడు అక్కడ జరిగే తతంగమంతా శ్రద్దగా గమనించాడు. ఆఖరున్ శేఖర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.
    "మీకు తెలిసింది మీరు చెప్పాలి. నాకు తెలిసింది నేను చెబుతాను --" అన్నాడు ఇన్ స్పెక్టర్ శేఖర్.
    'అలాగే --' అన్నాడు వెంకన్న -- "ఒకమ్మాయి వుంది, ఆమె జనార్ధనాన్ని ప్రేమకు ఎన్నుకుంది. జనార్దనం ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలనికుంటే చస్తావని ఒకడు జనర్ధనాన్ని హెచ్చరించాడు. జనార్దనం హెచ్చరికలు లెక్క చేయలేదు. చచ్చిపోయాడు. జనార్ధనాన్ని హెచ్చరించిన మనిషి ఎవరో నేను చూడలేదు. నేను నియమించిన వ్యక్తీ ఆ విషయం నిర్లక్ష్యం చేశాడు...."  
    "ఆ మనిషి నా వద్ద వున్నాడు- " అన్నాడు శేఖర్ --" ఆశ్చర్యమేమిటంటే -- అతడు కూడా అన్నీ మీరు చెప్పినట్లే చెబుతున్నాడు --"
    "అతన్ని ఒక్కసారి పిలవండి --" అన్నాడు వెంకన్న.
    చలం అక్కడికి రప్పించబడేలోగా -- జనార్దనం తన వద్దకు చలాన్ని ఏ విధంగా తీసుకు వచ్చింది వెంకన్న కు చెప్పడు శేఖర్.
    "మనిషి మొండివాడు లాగున్నాడు. అలాంటి వాడు చనిపోవడం నాకు ఆశ్చర్యంగా వున్నది -- " అన్నాడు వెంకన్న.
    "నా అనుమానం ఆ అమ్మాయి నిజంగా కామినీ పిశాచేమో అని!" అన్నాడు ఇన్ స్పెక్టర్ శేఖర్.
    అప్పటికి సార్జంట్ చలాన్ని అక్కడకు తీసుకుని వచ్చాడు.
    చలం అక్కడకు వస్తూనే -- "జనార్దనం ఎలా వున్నాడు సార్!" అనడిగాడు ఇన్ స్పెక్టర్ని.
    "ఎలా వుంటాడనుకుంటున్నావ్ ?" అన్నాడు శేఖర్.
    "న్యాయానికి ఈపాటికి చచ్చిపోయి వుండాలి --"
    "నువ్వు లాకప్ లో వున్నావు కదా -- యెలా చచ్చిపోతాడు ?"
    "చలం నవ్వి -- "చంపేది నేనైతే కదా?" అన్నాడు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS