రఘు చటుక్కున లేచి నిలబడి వెనక్కు తిరిగాడు. ఆమె పిలుస్తున్నా వినిపించుకోకుండా గదిలోంచి బైటపడ్డాడు.
11
"ఇటీజ్ ఫంటాస్టిక్ స్వరూప్!" అందామె.
"ఏమయింది వాణీ-" అనడిగాడు స్వరూప్.
"జీవితంలో ఇలాంటి పురుషుణ్ణి ఎక్కడా చూడలేదు. ఇత్స్ ఇన్ క్రెడిబుల్-అతడు ఆ రఘు మనిషి కాదు. దేవుడు. లేకపోతే నేను చేసిన చేష్టలకు నిగ్రహించుకోవడం అసాధ్యం!" అంది వాణి.
"ఏమయింది?" అన్నాడు స్వరూప్.
"నిజానికి నేను సిగ్గుపడుతున్నాను. అతడికి మళ్ళీ ముఖం చూపించలేను. భార్యను తప్ప పరాయి ఆడదాన్ని తను కన్నెత్తి చూడడు-" అంటూ వాణి జరిగింది చెప్పింది.
స్వరూప్ నిరుత్సాహంగా-"శారద ప్రేమ చాలా గొప్పది-ఆమె ప్రేమ కాముకుణ్ణి ఏకపత్నీ వ్రతుడిగా మార్చింది. నా ప్రేమ సారహీనం. శారదవంటి అపురూప వ్యక్తికి కూడా నాపై కరుణ కలగలేదు. ఆమె ప్రేమ బలం కారణంగానే నేనామె విషయంలో చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయిపోయాయి-" అన్నాడు.
స్వరూప్ నిరుత్సాహానికి అర్ధముంది. రఘు స్త్రీలోలత నాధారంగా చేసుకుని అతను యెందరో స్త్రీలను అతడిమీద కుసిగొల్పాడు. ఆ విషయం శారదకు తెలిసే విధంగా ఎలక్ట్రానిక్ వృక్షాన్ని రూపొందించాడు. దాని ఫలితంగా శారదకు రఘుపైన విరక్తి కలుగుతుందనే ఆశించాడు కానీ-రఘులో క్రమంగా మార్పువస్తుందని యెన్నడూ ఊహించలేదు.
ఇప్పుడు ఆఖరిసారిగా వాణిని ప్రయోగించాడు.
భార్యకు దూరంగా టూర్లో ఉంటూ కూడా, పరాయి స్త్రీ అర్ధనగ్నంగా సమీపించి చనువిచ్చినా కూడా నిరాకరించే స్థాయికి రఘు ఎదిగిపోయాడు.
ఈ విజయం తన ఎలక్ట్రానిక్ వృక్షానిదా? శారద ప్రేమ బలానిదా?
శారద ఇంక తనకు శాశ్వతంగా దక్కదు. తన ప్రేమ ఉదాత్తమైనదే అయితే ఈ విషయం శారదకు చెప్పాలి. ఆమెకు సంతోషం కలిగించాలి. తక్షణం తను శారదను కలుసుకోవాలి......స్వరూప్ వాణికి ధన్యవాదాలు చెప్పుకుని అప్పటికప్పుడు శారద యింటికి వెళ్ళాడు.
12
"నీకో గొప్ప శుభవార్త!" అన్నాడు స్వరూప్, శారదను చూస్తూనే.
"ఏమిటది?"
"నీ భర్తను నేను పరీక్షించాను. అతను పూర్తిగా మారిపోయాడు-" అంటూ స్వరూప్ ఆమెకు జరిగిన దంతా చెప్పాడు.
శారద ఆశ్చర్యంగా-"నిజమని నమ్మమంటావా?" అంది.
"నీమీద ఒట్టు-" అన్నాడు స్వరూప్.
"ఓహ్ స్వరూప్-యిప్పుడు నాకెంత సంతోషంగా వుందో ఎలా చెప్పేది?" అంది శారద ఉత్సాహంగా.
ఆమె ఉత్సాహాన్ని గమనిస్తూ-"రఘు యెంత అదృష్టవంతుడు?" అనుకుని నిట్టూర్చాడు స్వరూప్.
"రఘు ఇప్పుడేం చేస్తున్నాడో?" అంటూ పూజ గదిలోకి పరుగెత్తింది శారద. ఆమె వెనుకనే స్వరూప్ కూడా వెళ్ళాడు.
ఇద్దరూ ఎలక్ట్రానిక్ వింత వృక్షంముందు నిలబడ్డారు. శారద దానివంకే చూస్తూ-"స్వరూప్! ఇది కదలడం లేదేమిటి? పాడయిందా?" అంటూ వెనక్కు వంగి రికార్డుల్లోని కాగితం తీసింది.
DEAD 3.30 P.M.అని ఉందా కాగితంమీద.
కెవ్వుమని అరిచింది శారద. స్వరూప్ కూడా ఆ చీటీ చదివి మ్రాన్పడిపోయాడు.
"ఇది నిజమా, నమ్మమంటావా?" అంది శారద అతికష్టంమీద గొంతు పెగిల్చి.
"నమ్మాలని లేదు నాకు. కానీ యంత్రం అబద్దమాడదు-" అన్నాడు స్వరూప్. అతడి ఆలోచనల స్వరూపం మళ్ళీ మారుతోంది.
శారదను తను ప్రేమించాడు. కానీ రఘు ఆ ప్రేమకు అడ్డం వచ్చాడు. యిప్పుడా అడ్డు తొలగిపోయింది. శారద ప్రేమకంటే తన ప్రేమ బలమైనది. అందుకే రఘు మరణించి కధను కొత్తమలుపు తిప్పింది.
"అసలేం జరిగి ఉంటుందంటావ్?"
"అతనిలోని మార్పు ఇష్టంలేక ఎవరైనా హత్యచేసి ఉండొచ్చు..." అన్నాడు స్వరూప్.
"లేదు-స్వరూప్! గబ్బిలం వెలుతురు భరించలేదు. దోమలు పరిశుభ్రమైన వాతావరణంలో మనలేవు. రఘు అలాంటివాడే! అతడికి కొన్ని చెడుబుద్ధులున్నాయి. అవే అతడికి ఊపిరిపోసి బ్రతికిస్తున్నాయి. నేనతన్ని సంస్కరించాలనుకున్నాను. అతడిలో మానసిక సంఘర్షణ లేపాను. ఫలితంగా అతడు మారాడు. అయితే తనువు, మనసు కూడా ఆ మార్పును తట్టుకోలేక పోయాయి. అదే చావుకు దారితీసింది. నిజంగా నే నాయన్ను ప్రేమించివుంటే ఆయన్ను మార్చాలని అనుకోకుండా ఉండవలసింది. నా స్వార్ధమే ఆయన ప్రాణాలుతీసింది-" అంటూ కూలబడి ఏడ్వసాగిందామె.
ఉన్నట్టుండి స్వరూప్ కు ఏదో గుర్తుకొచ్చింది- "అవును ఆయన ముఫ్ఫైరోజులు టూర్ గదా-నువ్వు ఆయనకు ఒక్కసారిగా ముఫ్ఫై చుక్కలు X-Y 8 ఫ్లూరైడ్ ఇచ్చావా?" అన్నాడు.
ఊఁ అన్నట్లు తలూపిందామె.
"నీకు చెప్పడం మర్చిపోయాను. ఒకే ఒక్కసారి ఇంవై చుక్కలకు మించి X-Y 3 ఫ్లూరైడ్ యివ్వకూడదు. ఇస్తే ప్రమాదం వుంది. రియాక్షన్ వచ్చి ఒకోసారి ప్రాణాలు తీయొచ్చు. రియాక్షన్ ఇరవై చుక్కలూ అయిపోయిన మూడోరోజున ప్రారంభం కావచ్చు...." అన్నాడు స్వరూప్.
"మరి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" అంది శారద.
"మరిచిపోయాను..." అన్నాడు స్వరూప్.
"మరిచిపోవడంకాదు. కావాలనే చేశావు. ఇప్పుడు నీ దుష్టబుద్ధి అర్ధమవుతోంది నాకు..." అంది శారద "అయినా నిన్నని ఏం లాభం-భర్తను అదుపులో పెట్టాలనుకుని-ఆయన్ను పూర్తిగా నావాన్ని చేసుకోవాలని ఇప్పుడు ఎవరికీకాకుండా చేసేశాను. నాకు బాగా బుద్ధి చెప్పావు-...."
స్వరూప్ వంచిన తల ఎత్తలేదు. కానీ-"అతను చావాలని అనుకున్నాను కానీ, అతన్ని చంపాలని అనుకోలేదు. X-Y 3 ఫ్లూరైడ్ ద్రవం ఆరోగ్యవంతులపై రియాక్షన్ చూపడానికి అవకాశాలు చాలా స్వల్పం. అయితే క్లిష్టమైన మానసిక సంఘర్షణ అనుభవించేవారికి ఎక్కువ డోసు యిచ్చినపుడు రియాక్షన్ ఉండవచ్చు. నేను నీకోసం వాణిని అతడిపై ఉసిగొల్పితే-అది అతడిలో కలిగించిన మానసిక సంఘర్షణ ఇంతా అంతా కాదనుకుంటాను. అదే అతడి ప్రాణాలు తీసింది. ఇది పూర్తిగా నా తప్పు-" అని నెమ్మదిగా అన్నాడు.
స్వరూప్ కి నిజంగా చాలా బాధగా వుంది. తనకు తెలియకుండా తను రఘుని హత్యచేశాడు. ఈ హత్య తనను జీవితాంతమూ వెంటాడుతుంది.
తను ఇంక శారద ముఖం ఎలా చూస్తాడు?
స్వరూప్ సమస్య చాలా సులభంగా తేలిపోయింది. రఘు తనకిచ్చిన బాకుతో ఆమె ఆత్మహత్య చేసుకుని మరో లోకంలోని రఘుని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన వార్త మర్నాడే చేరింది.
-:ఐపోయింది:-
