Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 18

 

    సుబ్బన్న చటుక్కున రెండు చేతులు జోడించి "మన్నించాలి బాబూ , గుర్తు పట్టలేదు , ఇక్కడ తమరి కేం పని?" అనడిగాడు.
    "నా సంగతి తర్వాత చెబుతాను. ముందు నీ సంగతి చెప్పు. ఇక్కడేం పని నీకు?" అంటూ గద్దించాడు డిటెక్టివ్ శాస్త్రి.
    సుబ్బన్న ఓ క్షణం తటపటాయించి -- "ఈ యింట్లో కెవ్వరూ వెళ్ళకుండా నేనిక్కడ కాపలా వుంటాను. ఈ తలుపు తోసెంతవరకూ నేనేవ్వరికీ కంటపడను...." అన్నాడు.
    "కాపలా ఎందుకు?" అన్నాడు శాస్త్రి.
    "చెబితే ఒక తంటా....చెప్పకపోతే ఇంకో తంటా " అంటూ సందిగ్ధంలో పడ్డాడు సుబ్బన్న.
    సుబ్బన్న ఆ ఊరి గూండాల్లో ఒకడు. ఏదో కేసులో ఇరుక్కుంటే శాస్త్రి వాడిని రక్షించి -- ఇంకెప్పుడు వెధవ పనులు చేయొద్దని హెచ్చరించాడు. శాస్త్రి అంటే సుబ్బన్నకు చాలా గౌరవముంది.
    "నాతో చెబితే  ఏ తంటా వుండదు చెప్పు " అన్నాడు శాస్త్రి.
    ముందు కాసేపు  బెట్టు చేసినా చివరకు సుబ్బన్న చెప్పాడు. వాడినిక్కడ కాపలాగా వుంచింది జంబులింగం. జంబులింగం ఊరి పెద్ద మనుషుల్లో ఒకడు.
    వ్యభిచారం చట్టబద్దం కాకపోయినా ఇంచుమించు చట్టబద్ద మైనట్లే కొనసాగుతోంది. అందువల్ల డబ్బున్న వాళ్ళకు ప్రొఫెషనల్స్ మీద ఆసక్తి తగ్గిపోతోంది. సంసార స్త్రీల మీదా, సంసార పక్షంగా వుండే మధ్య తరగతి ఆడవాళ్ళ మీదా చాలామంది మోజు పడుతున్నారు. ప్రజల్లో కూడా డబ్బుకు ప్రాముఖ్యత హెచ్చి నైతిక విలువల ప్రాముఖ్యత తగ్గిపోతోంది.
    ఈ సమయంలో మధ్యతరగతి వారి బలహీన మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని జంబులింగం ఓ కొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఆ ప్రకారం అతను కొంతమంది మధ్యతరగతి వాళ్ళను లోబరచుకుని వాళ్ళ ఇంటి ముందు తాళం వేసి దొడ్డి గుమ్మాన తర్వాత వచ్చి -- అ ఇంట్లోని ఆడవాళ్ళు వ్యభిచారం కొనసాగించే ఏర్పాటు చేశాడు. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు సుబ్బన్న లాంటి వాళ్ళను దొడ్డి గుమ్మానికి కాపలా పెడుతున్నాడు.
    "మధ్యతరగతి వాళ్ళు ఓ పట్టాన లొంగరే -- నీతికి వాళ్ళిచ్చే విలువ మరెవ్వరూ ఇవ్వరు గదా " అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
    అందుకు జంబులింగం అవలంభించే పద్దతిని సుబ్బన్న వివరించాడు. ఎలాగో అలా ఆ ఇంటి ఆడపిల్లలను చెడగోడతాడట. ఆ తర్వాత వాళ్ళను తన చెప్పు చేతలలో వుంచుకోగలుగుతాడు. ఈవిధంగా ఇప్పుడు జంబులింగం చాలా సంపాదిస్తున్నాడు. అమ్మాయి తనకు తానుగానైనా బుకింగ్ చేసుకోవచ్చు. లేదా జంబులింగం ద్వారా ఏర్పాటు జరగవచ్చు."
    శాస్త్రికి అ అనుభవంలోని థ్రిల్ గుర్తుకు వచ్చింది. ఆతర్వాత ఆ థ్రిల్ జంబులింగం వంటి సంఘద్రోహి కారణంగా సృష్టించబడిందని స్పురించింది. కారణం ఏదైనాప్పటికీ తన ప్రవర్తనకు అతను చాలా సిగ్గుపడ్డాడు.
    "సుబ్బన్నా ! నిన్ను మరికొన్ని ప్రశ్నలడుగుతాను సమాధానం చెప్పాలి" అన్నాడు శాస్త్రి.
    "అడగండి " అన్నాడు సుబ్బన్న.
    "ఈ ఇంట్లో కళ్యాణి అనే అమ్మాయుందని తెలుసా?"
    "ఆత్మహత్య చేసుకున్న పిల్లే కదండీ -- తెలుసు...."
    "జంబులింగం ఆమెను కూడా లొంగదీసుకున్నాడా?"
    "లేదండి . ఆ పిల్ల చాలా తెలివైనదిటండి. ఇంట్లో ఇద్దరాడపిల్లలు అయన వలలో పడ్డారని తెలిసి చాలా జాగ్రత్త పడిపోయిందిటండి. జంబులింగం గారా అమ్మాయి కోసం ప్రయత్నాలు చేశారండి" అన్నాడు సుబ్బన్న.
    "ఆ ప్రయత్నాలకూ ఆత్మహత్యకూ ఏమైనా సంబంధ ముండవచ్చా?" అన్నాడు శాస్త్రి.
    సుబ్బన్న కంగారుగా "అయ్య బాబోయ్ మీరలాంటి ప్రశ్నలు నన్నడక్కూడదు " అన్నాడు . వాడి కంగారు చూస్తుంటే నవ్వొచ్చింది శాస్త్రికి.
    "ఒరేయ్ నీకేమీ భయం లేదు. నీకు తెలిసిన వివరాలన్నీ నాకు చెప్పు. నీకేమీ ప్రమాదం లేకుండా నేను చూస్తాను" అన్నాడు.
    "ఏం చెప్పమంటారండీ " అన్నాడు భయంగా సుబ్బన్న.
    "నువ్వెప్పుడైనా ఈ ఇంటికి రాత్రిళ్ళు కాపలా కాశావా?" అనడిగాడు శాస్త్రి.
    "లేదండి " అన్నాడు సుబ్బన్న నసుగుతూ.
    'అబద్దమాడుతున్నావ్ నువ్వు" అన్నాడు శాస్త్రి.
    "ఒకే ఒక్కసారి " అన్నాడు సుబ్బన్న ఇంకా నసుగుతూ.
    "ఆ రాత్రే కదా కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నది!"
    "మీకంతా తెలిసి పోయిందన్న మాట!" అన్నాడు సుబ్బన్న కంగారుగా.
    శాస్త్రి తనలో తనే నవ్వుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఈ ఇంటి కెటువంటి రక్షణ ఏర్పాట్లున్నాయో తెలుసుకోవడానికి వస్తే అదృష్టం కొద్దీ ఈసుబ్బన్న తటస్థ పడ్డాడు. జంబులింగం వ్యవహారం బయటపడింది.
    "కాబట్టి నీ నోటితో నువ్వే చెప్పాలి" అన్నాడు శాస్త్రి.
    "కళ్యాణి ని చెడగొట్టడానికి ఓ మనిషిని నియోగించాడు జంబులింగం. ఆ మనిషి నేనుండగానే ఇంట్లో ప్రవేశించాడు." అన్నాడు సుబ్బన్న.
    "ఎలా ప్రవేశించాడు ? సుబ్బరామయ్య కూతూళ్ళు ఊళ్ళో లేరు కదా. దొడ్డి తలుపులు తీసి వుంచే అవకాశం లేదు. కళ్యాణి అన్ని తలుపులూ వేసి బయట తాళం వేసి వుంటుంది" అన్నాడు శాస్త్రి.
    'అది నిజమేనండి. ఆ మనిషి గోడ దూకి దొడ్లోకి బాత్రూం ద్వారా ఇంట్లోకి ప్రవేశించాలను కున్నాడు. వాడు గోడ దూకేక ఓసారి బయటకు వచ్చి దొడ్డి తలుపు తీసే వుందని చెప్పాడు. అనుమానం వచ్చి చూడగా ఇంట్లోకి వెళ్ళడానికి కూడా తలుపు తీసే వుంది. ఆశ్చర్యపోతూనే ఆ మనిషి ఇంట్లో ప్రవేశించాడు."
    "కళ్యాణి అలా ఎందుకు చేసిందో ? అంటే ఆమె క్కూడా ఏదో ఇలాంటి వ్యవహార ముండి వుండాలి ..." అన్నాడు శాస్త్రి.
    'అలాగని నేననుకోలేదు. జంబులింగం చెప్పినదాన్ని బట్టి ఆ అమ్మాయి చాలా తెలివైనది. జంబులింగం ఇలాంటి దేదో చేస్తాడని ఆమె ముందుగానే ఊహించి వుంటుందని అందుకేదో ఎత్తు వేసి వుంటుంది ."
    "అలా ఎందుకను కుంటున్నావ్ ?"
    "సుబ్బరామయ్య గారు వూరు వదిలి పెట్టాక ఒక్క రాత్రి కూడా ఆమె ఇంట్లో నిద్ర చేసినట్లు లేదు. ఏ స్నేహితురాలింటి కో పోయి పడుకునేదనుకుంటాను."
    'అంటే -- చాలా రాత్రిళ్ళు కాపలా కాశావన్న మాట నువ్వు?"
    'అబ్బే లేదండి! సుబ్బరామయ్య ఊరు వెళ్ళగానే జంబులింగం తన పధకాన్న మల్లో పెట్టాలని చూస్తున్నాడు. ఆ మనిషికి ఒక్క రాత్రి కూడా కళ్యాణి దొరకలేదు. ఆఖరు రాత్రి మాత్రం తలుపులూ అవీ ముందుగానే తీసి వున్నాయి ."
    'అన్ని రాత్రులూ వదిలి ఆఖరు రాత్రి మాత్రం నువ్వు కాపలా వున్నావంటే కారణం ?"
    'అంతా మీకు వివరంగా చెప్పేస్తానుండండి. కళ్యాణికి మంచి డిమాండ్ వుంది. జంబులింగం ఆమె ద్వారా చాలా డబ్బు రాబట్టాలని చూస్తున్నాడు. అందుకనే సుబ్బరామయ్య ను ఊరు ప్రయాణం కట్టించాడు. కళ్యాణికి సెలవు దొరక్కుండా చేశాడు. ఓ మనిషిని నియోగించి ఆమెను వశ పర్చుకుందుకు చూశాడు.
    రోజులు గడిచిపోతున్నాయి కానీ వాడామెను  వశం చేసుకోలేకపోయాడు. జంబులింగానికి వాడి మీద అనుమానం కలిగింది. ఓసారి బీచ్ వద్ద కళ్యాణిని భంగ పర్చాలనుకున్న వాడికి ఆమె శ్రేయోభిలాషి ఒకడు బాగా దేహశుద్ది చేశాడు. కళ్యాణి వంటి మీద ఈగ వాలినా సహించలేని అభిమానులు కొందరున్నారని పుకారుంది. సినిమా హాలు వద్ద ఆమె భుజం మీద చేయి వేసిన వాడి కొకడికి ఇలాంటి భంగపాటే జరిగింది. అందుకని కొందరికి కళ్యాణి అంటే భయం'!
    తను నియోగించిన వాడు కూడా ఇదే విధంగా భయపడుతున్నాడేమో నని అనుమానం కలిగింది. జంబులింగానికి. అందుకే ఆఖరు రోజున ఆ ఇంటికి నన్ను కాపలా పెట్టాడు. కళ్యాణి వచ్చేవరకు వాడా ఇంట్లో వున్నట్లు నేను సాక్ష్యం అన్నమాట!' అన్నాడు సుబ్బన్న.
    "నువ్వు దొడ్డి వైపు కాపలా గదా! కళ్యాణి వీధి వైపు నుంచి రావచ్చు గదా ! మరి ఆమె వచ్చినట్లు నీకెలా తెలుస్తుంది?" అన్నాడు శాస్త్రి.
    "ఆమె రాగానే ఇంట్లో దీపాలు ఎలుగుతాయి. కాబట్టి గుర్తించడం సులువే. అయితే నాకు ఏశ్రమా లేకపోయింది. కళ్యాణి కూడా ఇంటిలో పలికి దొడ్డి దారినే వెళ్ళింది ."    
    శాస్త్రి ఆశ్చర్యంగా "తర్వాత ?" అన్నాడు.
    "తర్వాత కొద్ది సేపు వున్నాను. ఏ విశేషమూ జరుగలేదు. కళ్యాణి జంబులింగం మనిషికి లొంగి పోయిందనే అనుకుని వెళ్ళిపోయాను ."
    "ఇంకో రెండు రోజులు చూడకుండా ఆ రాత్రే నిన్నక్కడ కాపలా పెట్టడంలో జంబులింగం ఉద్దేశ్యమేమిటి?"    
    "మరేం లేదండి ....మర్నాడు ఆమె అన్నయ్య వస్తున్నాడట...."
    "ఓహ్ --" అనుకున్నాను శాస్త్రి "ఆ మనిషెవరో చెప్పగలవా?"
    "వాణ్ణి చూస్తె గుర్తు పట్టగలను కానండీ -- పేరు చెప్పలేను. అయినా జంబులింగానికి కానీ, ఆ మనిషికి గానీ ఆ అమ్మాయిని చంపే ఉద్దేశ్యం లేదండి. తమ ప్రాణాలొడ్డయినా సరే ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడతారండి. ఎందుకంటె అలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదని జంబులింగం అంటుండేవాడు."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS