షాజహాన్ ప్రేమ కధ
వసుంధర
ఐ లవ్ యూ రియల్లీ రవీ!" అంది నీరజ.
రవి ఆమె వంక గంబీరంగా చూసి "నేనూ అంతే అందుకే ఈరోజు నా గురించిన భయంకర నిజం నీకు చెప్పెయదల్చుకున్నాను...." అన్నాడు.
భయంకర నిజం అన్న మాటకు నీరజ తడబడింది. ఆమెకు నోట మాట రాలేదు. రవి మళ్ళీ ప్రారంభించాడు. నాకు తెలియదు --- ఇలాంటి రోజొకటి మన జీవితంలో వస్తుందని. తెలిస్తే నా బ్రతుకు దారి ఇంకొకలా వుండేదేమో! నిన్ను చూసినప్పుడు నీ అందానికి చలించి పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత నీ ఆకర్షణకు లోనై నీ చుట్టూ తిరిగాను. కానీ అదంతా ప్రేమగా మారిపోయి మనం పెళ్ళి చేసుకోవాలనుకుంటామని నేనప్పట్లో అనుకోలేదు.
కానీ నువ్వు లేనిదే నాకు ప్రపంచం లేదు. నేను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. నువ్వు అంగీకరించావు కాబట్టి ఇంక నిన్ను నేను నా కాబోయే భార్యగా భావించవలసి వుంటుంది. కాబోయే భార్య దగ్గర నన్ను గురించి ఏ రహస్యాలూ ఉండడం నా కిష్టం లేదు. ఎంత భయంకరమైనదైనప్పటికీ నన్ను గురించి నిజం నీకు చెప్పక తప్పదు. అందువల్ల మన వివాహం ఆగిపోయినా సరే!"
"ఏమిటా నిజం రవీ --" అంది నీరజ. కానీ వినడానికామెకు భయంగానే ఉంది.
రవి ఎలా చెప్పడమా అన్నట్లు ఒక్క క్షణం ఆగాడు. ఆ తర్వాత నెమ్మదిగా "షాజహాన్ పేరు విన్నావా ఎప్పుడైనా?" అన్నాడు.
"హిస్టరీ లో వస్తుంది...."
"ఆ షాజహాన్ కాదు...."
"మరి? అని ఆగిపోయింది నీరజ. హటాత్తుగా షాజహాన్ గురించి ఆమెకు స్పురించింది.
షాజహాన్ ఆ నగరాన్ని గడగడలాడిస్తున్న వ్యక్తుల్లో ఒకడు. ఆరితేరిన స్మగ్లర్ గా పోలీసుల తడిని అభివర్ణిస్తుంటారు. ధనిక వర్గాల కతను సింహస్వప్నం. అతనికి పెద్ద ముఠా ఉన్నదనీ ఆ ముఠా లో ఉన్న క్రమశిక్షణ అపూర్వమనీ అందరూ చెప్పుకుంటుంటారు. తనను గురించి భయంకర నిజమంటూ రవి షాజహాన్ ప్రసక్తి తీసుకురావడం నీరజ నేదో అనుమానానికి గురి చేసింది.
"షాజహాన్ ఎవరో గుర్తొచ్చిందా?" అన్నాడు రవి.
"వచ్చింది కానీ నీకూ షాజహాన్ కు ఏమిటి సంబంధం?" భయపడుతూనే అడిగింది నీరజ.
"షాజహాన్ నా బాస్. అతని అనుచరులలో నేనే ప్రధముడిని...." అన్నాడు రవి.
రావాలనుకుంటున్న భయం నీరజ కళ్ళలోకి వచ్చేసింది. చెప్పాలనుకున్న మాటలు మాత్రం నోటికి రాలేదు. అలా కళ్ళప్పగించి నోరు తెరిచి రవి వంకే చూస్తుండి పోయిందామే.
"అవును నీరజా! నా పదిహేనో ఏట చిల్లర దొంగతనాలు చేసి బ్రతుకుతుండే నేను షాజహాన్ కు దొరికాను. షాజహాన్ నా తెలివితేటలకూ, చాకచాక్యానికీ సమర్ధతకూ ముచ్చటపడి నాకు తను స్వయంగా శిక్షణ ఇచ్చాడు. అయిదేళ్ళ లో నేను అతని అనుచరులందరిలోకి ప్రప్రధముడి నయ్యాను.
ఇప్పుడు నాకు పాతికేళ్ళు. ఆరకం జీవితం మొహం మొత్తింది. బ్యాంకులో నా పేరున చాలా డబ్బుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించి సాఫీ జీవితం గడపాలని వుంది. నాలో ఈరకం ఆలోచనలు తలెత్తడానికి నీ పరిచయం కూడా కొంత వరకూ కారణం. నువ్వనుమాతిస్తే నా పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితం ప్రారంభించాలనుంది."
నీరజ రవి కళ్ళలోకి చూసి " నువ్వు నిజమే చెబుతున్నావని నమ్ముతున్నాను. నిన్ను పెళ్ళి చేసుకోవడానకి నాకేమీ అభ్యంతరం లేదు. నేను లక్షాధికారి కూతుర్ని కావచ్చు. కానీ నా తండ్రి సంపాదన కూడా న్యాయర్జితం కాదు. బ్లాక్ మార్కెట్ లో ఈయన పాత్ర కూడా ఉంది.
అయన కుమార్తెగా అయన డబ్బు ననుభావిస్తున్న వ్యక్తిగా అయన చేసే పాపాల్లో నాకూ భాగముంది. అందుకని నన్ను నేను స్వచ్చమైన మనిషిగా భావించడం లేదు. ఎటొచ్చీ మన వివాహం జరిగేక నువ్వు స్వచ్చమైన జీవితం గడపాలి. షాజహాన్ గురించి మర్చిపోవాలి. నేనూ మా నాన్న గురించి మరిచిపోతాను. నలుగురూ మెచ్చే విధంగా న్యాయంగా బ్రతుకుదాం....' అంది.
రవి కళ్ళలోకి వెలుగు వచ్చింది. "షాజహాన్ నన్నాదుకున్న వ్యక్తీ. నాలో వ్యక్తిగతం నింపిన మనిషి. అతని పట్ల కృతజ్ఞత చూపడం నా బాధ్యత. అయినా ఇక మీదట వ్యక్తిగా అతన్ని గౌరవిస్తాను తప్పితే అతని కార్యకలాపాల్లో పాల్గొనను. ఇది నా తుది నిర్ణయం. ఆ రకం జీవితంలో సుఖం లేదు. సంతృప్తి లేదు. నీ భావాలు తెలిసేక నీమీద ప్రేమ మరింత పెరిగింది. కానీ మీ నాన్న కూడా ఓ చిన్న షాజహానే అయినప్పటికీ -- ఆయనకు సంఘంలో స్తానముంది.షాజహాన్ కి, అతని మనుషులకీ సమాజంలో స్థానం లేదు. అందువల్ల మన వివాహం కాస్త ఇబ్బంది కావచ్చు..." అన్నాడతను.
"ఆ విషయంలో నువ్వు బెంగ పెట్టుకోవద్దు. మా ఇంట్లో అందర్నీ పెళ్ళికి ఒప్పించగలను. అయినా పెళ్ళికి నీ గురించిన పూర్తీ వివరాలు వాళ్ళందరికీ ఎందుకు చెప్పాలి? నువ్వు షాజహాన్ మనిషివని తెలియకపోతే సమాజంలో నీకేం తక్కువ?' అంది నీరజ.
రవి, నీరజ చేతిని మృదువుగా తాకి " నాకు నమ్మకం వుంది నీరజా -- నీ మూలంగా నా జీవనవిధానం మారుతుంది....' అన్నాడు.
2
"ఏమైంది నీకు....' అన్నాడు షాజహాన్.
రవి మాట్లాడలేదు. అతని ముఖంలో ఏవిధమైన భావాలూ లేవు.
"నేను నిన్ను నాకోసం తయారు చేసుకున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. అలా జరగడం నేను సహించను...."
'తప్పదు బాస్! మీరు నన్ను వదిలి పెట్టేయాలి. అయితే నేను మీకో హామీ యిస్తున్నాను. మీరు నా కిచ్చిన శిక్షణ మరే ఇతర వ్యక్తీ ప్రయోజనాలకూ ఉపయోహించబడదు. నేను గడపబోఎది చాలా సాదా జీవితం. ఏ పరిస్థితుల్లోనూ మీ జోలికి రాను. మీ వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోను. నాకు మీరు భగవంతుడు. రోజుకొకసారైనా మిమ్మల్ని స్మరించుకుంటూ వుంటాను."
"నామస్మరణ వల్ల నా కోరిగేదేముంది? పని కావాలి. నీమీదా చాలా ఆశలు పెట్టుకున్నాను. నీవల్ల కావలసినవి కొన్ని పనులున్నాయి. ప్రస్తుతానికి. కనీసం అవైనా పూర్తీ చేసి వెళ్ళిపో...."
"లేదు బాస్. ఒక మంచి నిర్ణయన్నమలు పరచడానికి వాయిదాలు వేయకూడదు. ఇంక నేను ఏ పనులూ చేయలేను" దృడంగా అన్నాడు రవి.
'అయితే ఇదే నీ తుది నిర్ణయమా?"
"అవును."
'ఈ నిర్ణయం మూలంగా నీ ప్రాణాలు నీవి కాకుండా పొతే?' కర్కశంగా అన్నాడు షాజహాన్.
"నేను మిమ్మల్నేదిరించను. అన్నింటికీ సిద్దపడే వచ్చాను. చంపదల్చుకుంటే ఇప్పుడే ఈ క్షణం లోనే చంపెయ వచ్చు మీరు. నేను నిరాయుధుడ్ని. మీ పట్ల క్రుతజ్ఞాతాభావంతో కట్టుబడ్డ వాడ్ని" అన్నాడు రవి.
షాజహాన్ కేమీ తోచలేదు. అతనికి రవి మొండితనం గురించి బాగా తెలుసును. రవికి ప్రాణ భయం లేదు. అనుకున్న పని ఎంత కష్టమైనా సాధించి తీరతాడు. ఇలాంటి మనిషి ఎక్కడో కానీ ఉండడు. అనుకోకుండా తనకు దొరికాడు. ఇతన్ని వదులుకోవడం అతని కేమాత్రం ఇష్టం లేదు. అయితే ఈ మొండి మనిషిని లొంగ దీస్కోవాలి. అందుకు ఏం చేయాలి?"
షాజహాన్ ఓ క్షణం అలోచించి , "ఇంతకీ నన్ను వదిలి పెట్టి పోతానని నువ్వనడానిక్కారణం ఒక అమ్మాయి అంతేనా?" అన్నాడు.
"అవును."
"అయితే నేను చెప్పిన పనులు నువ్వు చేయని పక్షంలో ఆ పిల్ల మీద అత్యాచారం జరుగుతుంది." అన్నాడు షాజహాన్.
రవి చలించలేదు. 'అత్యాచార మంటే?"
"నీ కళ్ళముందే ఆమె దారుణంగా హింసించబడుతుంది. అప్పటికీ నువ్వు లొంగి రాకపోతే ఆమెకు మానభంగం కూడా జరుగుతుంది."
"నన్ను బెదిరించవద్దు బాస్. నా కళ్ళముందే మానభంగం జరిగినా నేనామెను పెళ్ళి చేసుకుంటాను. నేను ప్రేమిస్తున్నది ఆ మనిషిని. ఆ మనిషికున్న మనసును. ఆ రెండింటిని సామాన్యులు మలినం చేయగలరని నేననుకోను. ఆ విధంగా అయితే నేనెప్పుడో మాలిన పడ్డాను." అన్నాడు రవి.
షాజహాన్ కు చిరాకు వేసింది. 'ఆమె ముఖాన్ని వికృతంగా తయారు చేస్తాను..." అన్నాడు.
'అందం కారణంగానే ఆమె పట్ల నేనాకర్శించబడ్డాను. కానీ మా మధ్య ప్రేమ ఏర్పడ్డాక ఇంక అందంతో పని లేదు" అన్నాడు.
"నీ కళ్ళముందే ఆమెను హింసించి చంపేస్తాను" అన్నాడు షాజహాన్ కసిగా.
"అందువల్ల మీరు సాధించేదేముంది బాస్! మీపనులు నేనెలాగూ చేయను. ఆమె చనిపోయేక నేనూ నా ప్రాణాలు తీసుకుంటాను. అందువల్ల మీకు మనశ్శాంతి ఉండదు. మీరే పని చేసినా ఒక ప్రయోజన,ముంటుంది. కేవలం పగతో ఘోరాలు చేయగలరని నేనుకోవడం లేదు. మమ్మల్నీద్దర్నీ విడదీయడం ద్వారా మమ్మల్ని బాధపెట్ట గలరు. కానీ మీ పని జరిపించుకోలేరు. అటువంటప్పుడు మమ్మల్ని వదిలి మామానాన మమ్మల్ని బ్రతకనిస్తే, మీ మనిషికి మీరన్యాయం చేయలేదన్న తృప్తి మీకుంటుంది!"
ఏం మాట్లాడాలో తోచలేదు షాజహాన్ కు. అతనంటే ఊళ్ళోనే కాదు, అతని అనుచరుల్లో కూడా చాలా మందికి భయం. కానీ రవికి భయం లేదు.
రవి మొండివాడు. విపరీతమైన పట్టుదల అతనికి. ఆ లక్షణాలు షాజహాన్ కి బాగా ఉపయోగపడతాయి. అందుకే అతను రవిని ముఖ్యాను చరుడిగా చేసుకున్నాడు. కానీ రవిలో ఉన్న మొండితనం పట్టుదల ఇప్పుడు షాజహాన్ కే ఎదురు తిరిగాయి. వాటినెలా లొంగ దియాలో షాజహాన్ కర్ధం కావడం లేదు.
