Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 18


                            కలలోని హంతకుడు
                                                                --వసుంధర

    "నన్ను చంపవద్దు" అన్నదామె.
    "నేను వచ్చింది నిన్ను చంపడానికి వద్దంటే ఎలా?" అన్నాడతను.
    "నువ్వు చెప్పినట్లు వింటాను. నువ్వేం చెప్పినా చేస్తాను. నన్ను మాత్రం చంపవద్దు. ప్లీజ్" అన్నదామె.
    "ఈ నిర్ణయానికిదివరకెప్పుడో రావలసింది. ఇటీజ్ టూ లేట్!"
    "ప్లీజ్-ప్లీజ్"అరుస్తోందామె.
    "నీ అరుపులు బయటకు వినిపించవు. నువ్వు బయటకు పోలేవు. నా గుండె కరుగదు. అందుకని వృధా ప్రయత్నాలు మాని దేవుణ్ణి ప్రార్ధించుకో. అయిదునిమిషాలు మాత్రం టయిమిస్తున్నాను" అన్నాడతను.
    "నిండా పాతికేళ్ళు లేని నాకు నువ్విచ్చే అయిదు నిముషాలూ ఏం సరిపోతాయి? నాకింకా చాలాకాలం బ్రతకాలనుంది. అందుకోసం నీకు బానిసలా పడుండమన్నా పడుంటాను. నన్ను మాత్రం చంపవద్దు.....నన్ను చంపవద్దు..." అన్నదామె.
    ఆమె పరిస్థితి చూస్తూంటే అతనికి జాలి కలగడం లేదు. నువ్వు పుట్టుకొస్తోంది. అతను తన జేబులోంచి పిస్తోలు తీసి ఓపెన్ చేసి "ఊఁ గుళ్ళు సరిగ్గానే వున్నాయి" అంటూ గొణిగాడు.
    "ప్లీజ్ నన్ను చంపవద్దు" అన్నదామె.
    "అబ్బబ్బ ఈ ఆడవాళ్ళతో ఇదే బోరు. కాళ్ళూ చేతులూ కట్టిపడేసినా సరే నోరుమాత్రం ఊరుకోదు" అన్నాడతను విసుగ్గా.
    పిస్తోలు పక్కనున్న టేబుల్ పైన పెట్టి ఆమెను సమీపించాడు.
    "నీకు దణ్ణం పెడతాను నన్ను చంపవద్దు" అందామె.
    "ఎంతసేపూ ఒకటే డైలాగు చంపొద్దు, చంపొద్దు అని. నేను నువ్వు చెప్పినమాట వినడానికిక్కడకు రాలేదు. నీ వాగుడు భరించలేకుండా వున్నాను. ఇంకా నిన్ను చంపడానికి కొంత గడువుంది. అంతవరకూ నిశ్శబ్ధంగా వుండు" అంటూ ఆమెనోటికి టేప్ అంటించాడు.
    నిస్సహాయంగా మూలిగిందామె.
    అతను మళ్ళీ వెనక్కు వెళ్ళి పిస్తోల్ ను జేబులో వేసుకుని "ఇది నిన్ను చంపడానికి కాదు. నిన్ను చంపడానికి వేరే ఆయుధముంది. నీ పనయ్యాక ఇంకొకళ్ళనుచంపాలి. దానికీ ఈ పిస్తోలు" అన్నాడు.
    ఆమె మాట్లాడడం లేదు. కానీ ఆమెకళ్ళు చూస్తే ఆమె చెప్పదల్చుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఆ కళ్ళు ఎంతో దీనంగా అతన్ని అర్ధిస్తున్నాయి. తన నిస్సహాయతకు సూచనగా ఆ కళ్ళలోంచి ధారాపాతంగా నీళ్ళు కారుతున్నాయి.
    "చావాలని ఎవ్వరికీ వుండదు. ఎప్పుడు తమమీదకు చావు వస్తుందోనని భయపడుతూంటారు. చావు ముందుగా తెలిసిరావడం ఎక్కడో అదృష్టవంతులకుగానీ పొసగదు. నీ అదృష్టాన్ని అభినందించుకో. నువ్వు నిస్సహాయంగా కొద్ది నిముషాల్లో చచ్చిపోతున్నావు. చేసిన పాపాలేమైనా ఉంటే పోవడానికి దేవుణ్ణి ప్ర్రార్ధించుకో-నన్ను అర్ధించి, నా వైపు జాలిగాచూసి నీ సమయాన్ని వృధా చేసుకోకు" అన్నాడతను.
    కానీ ఆమె దేవుణ్ణి ప్రార్దిస్తున్నట్లులేదు. అతనివైపే యింకా అర్దింపు చూపులు చూస్తోంది. ఆ కళ్ళలో ఏ మూలనో యింకా ఆశ వున్నట్లుంది. కానీ చూస్తూండగా ఆ ఆశ భీతిగా మారింది. ఆమెకళ్ళు పెద్దవౌతున్నాయి. ఆమె ముఖంలోంచి అందం మాయమవుతోంది. అందుకు కారణం లేకపోలేదు.        అతను పొడుగాటి, పదునైన కత్తితో ఆమెను సమీపిస్తున్నాడు.
    భయం ఆమె ముఖాన్ని అసహ్యంగా తయారుచేస్తే క్రూరత్వం అతని ముఖాన్ని భయంకరంగా తయారుచేసింది. అతనిప్పుడు చూడ్డానికి మనిషిలాకాక రాక్షసుడిలా వున్నాడు. మధ్యమధ్య అదోలా నవ్వుతున్నాడు. ఆ నవ్వు రాక్షసుడి నవ్వులాగే వుంది.
    ఒక గోడ-ఆ గోడమధ్య భాగంలో రెండు, క్రింద రెండు-హుక్స్ వున్నాయి. ఆ హుక్స్ కు ఆమె చేతులు, కాళ్ళు బంధించబడ్డాయి. ఆమె తన బంధనాలు సడలించుకోడానికి పెనుగులాడుతోంది. కానీ అది వృధా ప్రయత్నం అవుతుంది.
    అతడు ఆమెను సమీపించి ఆమె అవస్థను చూసి పకపక నవ్వాడు. ఒకసారి తన చేతిలోని కత్తివంకా, ఆమె గుండెలవంకా చూశాడు. కత్తిని ఎడమచేతిలోకి మార్చి కుడిచేత్తో జేబులోని పెన్ను తీశాడు. అది బాల్ పెన్ను.
    అతను ఆమెకు బాగా దగ్గరగా వచ్చి ఆమె గుండెల మీది ఆచ్చాదన తొలగించి-కొంచెం ఎడమప్రక్క బాల్ పెన్నుతో సున్నాచుట్టి మళ్ళీ నవ్వాడు.
    "సరిగ్గా ఆ సున్నా వెనుక నీ గుండె వుంది. ఇది ఇప్పుడు ఇదివరకెన్నడూ ఎరుగని వేగంతో కొట్టుకుంటోంది. నా కత్తి సరిగ్గా ఈ సున్నాలోంచి నీ గుండె ల్లోకి దిగబడుతుంది. కళ్ళు మూసుకో-నువ్వీ ఘోరాన్ని చూడలేవు. ఇంక నా వైపు చూడ్డంమాని నీ యిష్ట దైవాన్ని ప్రార్ధించుకో. ఒక్క నిముషం మాత్రమే నువ్వు జీవిస్తావు. నీకు నేనివ్వగల హామీ అలల సునాయాస మరణం. ఒకేఒక్క పోటుతో నీ ప్రాణం పోతుంది. అందులో ఏమీ సందేహం లేదని అనుభవం నాకు చెబుతోంది" అన్నాడతను.
    ఆమె పెదవులు కదిలే అవకాశముండి వుంటే అనగలిగిన అక్షరాలు మాత్రం ఇవే "ప్లీజ్ నన్ను చంపొద్దు." కానీ అని కదిలే అవకాశం లేదు. అందువల్ల ఆమె మూలుగుతోంది. ఆ మూలుగులో వున్న ధ్వనిని అతను అర్ధం చేసుకోగలడు. కానీ ప్రయోజనం లేదు.
    అతని కత్తి కుడిచేతికి మారింది. "కంగారుపడకు-నీ బ్రతుక్కింకా కొద్ది సెకన్లు టైము వుంది. నాది ఎడమచేతి వాటం. కుడిచేత్తో పొడవడం నాకు రాదు" అంటూ అతను కత్తిని ఎడమచేతికి మార్చాడు. ఆ చేయి గాలిలోకి లేచింది. విసురుగా ఆమె గుండెల్లోకి దిగింది-సరిగ్గా అతను గీసిన సున్నాలోంచి చివ్వున రక్తం చిమ్మింది.
    చివరిక్షణంలో తను అనుభవించిన బాధను, భయాన్ని ధ్వనిరూపంగానైనా బయటపెట్టుకునే అవకాశంలేని ఆ అభాగ్యురాలి తల క్షణాల్లో పక్కకు వాలింది.

                                                  *    *    *

    "కెవ్వు" మని అరిచింది సుజాత.
    ఉలిక్కిపడి లేచాడు మధు. మధు సుజాత భర్త "ఏమయింది సుజా?" అంటూ ఆత్రుతగా ప్రశ్నించాడతను.
    సుజాత కళ్ళు నులుముకుని చుట్టూ చూసి "నేనిప్పుడెక్కడున్నాను!" అంది.
    మధు ఆమెను దగ్గరగా తీసుకుని "శ్రీవారి కౌగిట్లో!" అన్నాడు.
    "కాదు, కాదు...." అంది సుజాత.
    మధు లేచి లైటుచేశాడు. లైటు వెలుగులో సుజాత ముఖం చూసి ఆశ్చర్యపోయాడతను - "అదేమిటి సుజా అలా వణికిపోతున్నావు, ఏం జరిగింది?"
    సుజాత తన్ను తాను తమాయించుకునేందుకు ప్రయత్నిస్తూ "ఒక దారుణమైన హత్య చూశాను" అంది.
    "ఎప్పుడు?"
    "ఇప్పుడే?"
    మధు చటుక్కున ఆమెను సమీపించి ప్రేమగా చెక్కిళ్ళు నిమురుతూ-"సుజా! ఏదయినా పీడకల వచ్చిందా?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS