Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 18

 

    "వెంటనే నాకీ కబురు చెప్పొద్దు ? ఇంత అలస్యంగానా నాకు చెప్పేది! అంటే నీలో నన్ను చంపాలన్న ఆలోచన కూడా కొంతకాలం వచ్చి ఉండాలి--" అన్నాడు రోశయ్య.
    "అబ్బే-- లేదండి..." అన్నాడు రమణరావు.
    "మరింత జప్యమెందుకు చేశావు?" అన్నాడు రోశయ్య.
    "జరుగుతున్నది కలో, నిజమో తెలుసుకోడానికే ఈ కాస్త వ్యవదీ అయింది -- " అన్నాడు రమణరావు.
    రోశయ్య ఆలోచనలో పడ్డాడు. అయన ముఖం గంభీరంగా అయిపోయి చాలాసేపు అలాగే వుండిపోయింది.
    రమణరావు  అయన చెప్పేది వినడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండిపోయాడు.
    "నీకు పట్టయ్య తెలుసా?' అన్నాడు రోశయ్య కాసేపటికి.
    "తెలుసండి--"
    "అయితే వాణ్ణి కలుసుకుని ఓ హత్యకు బేరమాడు" అన్నాడు రోశయ్య.
    "ఎవర్ని చంపాలి?"
    "కౌముదిని...."
    రమణరావు  కంగారుగా -- "నేనామెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను...." అన్నాడు.
    రోశయ్య నవ్వి "నువ్వు మగాడివి - మగాడిలా మాట్లాడ్డం నేర్చుకో--" అన్నాడు.
    "అంటే?"
    "నేనో ఉపాయం చెబుతాను. ఆ ప్రకారం నువ్వామేను నమ్మించి మోసం చేయొచ్చు. నన్ను చంపినట్లు భ్రమ పెట్టవచ్చు. ఆ తర్వాత ఆమె నీ వశ మవుతుంది. కొంతకాలం కలిసుండండి. తన పగను మరచిపోయి నీతో అడ్జస్టయిందా సరేసరి -- లేదా ఆమెను పట్టయ్యకు అప్పచెప్పవచ్చు. ఆమె మీద నీమోజు తీరిపోడానికి వారం రోజులు చాలని నా అనుమానం---"
    రమణరావు ఆశ్చర్యంగా అయన వంక చూశాడు.
    "తెలివైన ఆడది మగాడికి ప్రమాదం. అందులోనూ మగాణ్ణి హత్యలకు పురికొల్పే ఆడది ఇంకా ప్రమాదం. అందంగా ఉందంటూన్నావ్ కాబట్టి కొన్నాళ్ళు అనుభవించి చంపేయ్--" అన్నాడు రోశయ్య.
    హటాత్తుగా రోశయ్య కళ్ళలో క్రూరత్వం కనబడింది రమణరావుకు.
    కౌముది రోశయ్యను చంపమంది. రోశయ్య కౌముదిని చంపమంటున్నాడు. అసలు వీళ్ళీద్దరికీ మధ్య ఆసలు కధేమిటి?
    "కౌముది మీ మీద ఎందుకు పగబట్టింది?" అన్నాడు రమణరావు. ఆప్రయట్నంగా అతడి చూపులు రోశయ్య కళ్ళ పైనే ఉన్నాయి.
    "భగవంతుణ్ణి దర్శించుకోడానికి కొండ ఎక్కాలంటే ఎన్నో మెట్లు ఎక్కాలి. అలా ఎక్కడంలో మనకాళ్ళ కింద ఎన్ని చీమలు నలిగాయో లెక్క చూడగలమా? అలాంటి చీమల్లో ఒకటి తనూ కొండ ఎక్కి మనకు కుట్టాలని వచ్చిందనుకో -- దాన్ని చేత్తో నలిపేయడమో కాలితో రాసేయడమో చేస్తాం కానీ ఈ చీమ ఎవరు? ఎందుకు మనని కుట్టడానికి కింతదూరం వచ్చింది -- అని ఆలోచిస్తూ కూర్చుంటామా ? కౌముదిని గురించి ఆలోచించడం నా కిష్టం లేదు. నన్ను కుట్టాలని వచ్చిన చీమ అది. నేను దాన్ని కాల రాస్తాను. అంతే!" అన్నాడు రోశయ్య.
    "ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటారు?"
    "నీకు నేను సాయపదతాను. ఆమె కళ్ళముందు హత్య చేయబడడం కోసం ఆమె కోరిన చోటకు నీతో పాటు నేనూ వస్తాను. ముందు మీరిద్దరూ కలిసి కార్యక్రమాన్ని నిర్ణయించండి. దాని నేను ఫినిషింగ్ టచ్ ఇస్తాను---"
    రమణరావు రోశయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు.

                                     5
    'అంతా మీరు కోరినట్లే జరుగుతుంది. నేను మీ విధేయుడ్ని!" అన్నాడు రమణరావు .
    కౌముది తృప్తిగా తలాడించి -- "ఎల్లుండి సాయంత్రం  మీరు రోశయ్య ను తీసుకుని హోటల్ మీనాక్షికి రండి. అక్కడ రూం నెంబరు పదహార్లో నేను ఉంటున్నాను. ఆ గదిలో నిరాటంకంగా మన కార్యక్రమాన్ని కొనసాగించవచ్చును...." అంది.
    "ఒక హోటల్ గదిలోనా?" అదేంత ప్రమాదం.... ?' అన్నాడు రమణరావు .
    "ఆ హోటల్ గదులన్నీ సౌండ్ ప్రూఫ్. అక్కడి మాటలు బయటకు వినిపించవు. రోశయ్య కేకలు పెడుతూ చచ్చినా మనకేమీ భయం లేదు...."అంది కౌముది.
    రమణరావు  అనుమానంగా ఆమె వంక చూసి -- "ఒక హత్య గురించి ఇంత తేలికగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఈ విషయంలో మీకు బాగా అనుభవమా?' అన్నాడు.
    "ఏ అనుభవం మిమ్మల్నిప్పుడు హత్యకు పూరిగొల్పిందో చెబితే నాగురించి నేను మీకు చెబుతాను--" అంది కౌముది. రమణరావు  మాట్లాడకుండా ఊరుకున్నాడు. "ఇందులో అనుభవానిదేముంది? సంకల్పం అంతే" అందామె.
    "రోశయ్యను చంపాక శవాన్నేంచేద్దామని మీ ఉద్దేశ్యం!"
    "ఎలాగో అక్కణ్ణించి బైటకు చేరవేసి ఏ నదిలోనో పారేస్తాను...." అంది కౌముది.
    "ఇంత చేసినవాడ్ని మిమ్మల్ని మళ్ళీ శ్రమ పెట్టలేను. ఆ పని కూడా నేనే చేస్తాను...." అన్నాడు రమణరావు .
    "మీవల్ల అవుతుందా?"
    "హత్య చేసినవాడికి శవాన్ని మాయం చేయడం ఓ లెక్కా?"
    "అలా తేలిగ్గా మాట్లాడకండి. చంపడం తేలికే. శవాన్ని మాయం చేయడమే కష్టం . ఎందరో  హంతకులు  అది చేతకాకే పట్టుబడి పోయారు" అంది కౌముది.
    "మీరు ఆడవారు. నేను మగవాడ్ని. మీకంటే ఈపని నాకే సులభం అనుకుంటున్నాను...." అన్నాడు రమణరావు .
    "ఎలా చేద్దామనుకుంటున్నారు?' అంది కౌముది.
    "రోశయ్య ను స్పృహ తప్పించి ఓ ట్రంకు పెట్టెలో వేసుకుని హోటల్ కు వస్తాను. మీ ఎదురుగా ఆయన్ను చంపేక మళ్ళీ ఆ ట్రంకు పెట్టిలోనే రోశయ్య శవాన్ని తీసుకు పోతాను" అన్నాడు రమణరావు .
    "ఈజిట్ సో సింపుల్?" అంది కౌముది.
    "అద్భుతమైన మీ అందాన్ని స్వంతం చేసుకోవడం కోసం ఎంత కష్టమైనా పనినైనా నేను సింపుల్ గానే భావించక తప్పదు" అన్నాడు రమణరావు.
    "ఇంక నేను ఎల్లుండి సాయంత్రం కోసం ఎదురు చూస్తుంటాను.... అప్పుడే మనం మళ్ళీ కలుసుకునేది....' అంది కౌముది.

                                   6
    రమణరావు రోశయ్య కు కత్తి చూపించి "దీంతోనే నేను మిమ్మల్ని హత్య చేయబోతున్నాను" అన్నాడు.
    రోశయ్య దాని వంక పరీక్షగా చూశాడు. తర్వాత తన దగ్గరున్న బొమ్మనొకటి తీసి కత్తితో దాన్ని పొడిచాడు.
    బొమ్మ రక్తసిక్తమైంది. కత్తి మాత్రం రోశయ్య చేతిలోనే వుండిపోయింది.
    "పొడుస్తూ వుంటే కత్తి పిడిలోకి వెళ్ళి పోతుంటుంది. పిడిలోంచి రక్తం మనిషి శరీరం పైన ప్రవహిస్తుంటుంది" అని నవ్వాడు రమణరావు .
    "ప్రాణం లేని బొమ్మలను కూడా రక్తపు మడుగులో నుంచగలనీ కత్తికి జోహార్లు" అన్నాడు రోశయ్య.
    "జోహార్ల సంగతి అటుంచి నేను జాగ్రత్తగా వుండాలి. గోడకు అన్చినా ఈ కత్తి లోంచి రక్తం వస్తుంది" అన్నాడు రమణరావు
    రోశయ్య బొమ్మను పరిశీలిస్తూ "దీంతగలేయ్యా-- ఇది నిజం రక్తం లాగానే ఉందయ్యా" అన్నాడు.
    "చచ్చినవాళ్ళను తాగలేయ్యక ఏంచేస్తాం . కాని అది నిజం రక్తం లా వుండడం లో ఆశ్చర్యమేముంది? విజ్ఞానం అదే పనిగా వృద్ది చెందుతోంది. మనిషి చంద్ర మండలం మీద అడుగు పెట్టాడని అనడం పూర్వకాలపు మాట అనిపించుకునే రోజులు వచ్చాయి"అన్నాడు రమణరావు .
    "సరే-- నీ కార్యక్రమం ప్రారంభించు" అన్నాడు రోశయ్య.
    రమణరావు ట్రంకు పెట్టి తెరిచి -- "మీరు ఇందులో ప్రవేశించాలి!" అన్నాడు.
    'అలాగే కానీ ....గుర్తుంచుకో ....అక్కడ హోటల్లో నాకేదైనా ప్రమాదం జరిగిందో -- నీకూ ప్రమాదమే! ఇంట్లోనూ, దుకాణం లోనూ కూడా రెండు కవర్లిచ్చి వచ్చాను. రేపు మధ్యాహ్నం లోగా నేను రాకపోతే ఆ కవర్లు పోలీస్ స్టేషన్ కు వెడతాయి. నా చావుకు నువ్వే కారణమని అందులో రాశాను" అన్నాడు రోశయ్య.
    "ఇది మీకు తగునా?' అన్నాడు రమణరావు .
    "నీకోసం ఇంత సాహసం చేస్తుంటే -- నా జాగ్రత్తలో నేనుండడం  తప్పా?" అన్నాడు రోశయ్య.
    రమణరావు  నవ్వి -- "మీ జాగ్రత్త ఎంత అనవసరమో మీకు రేపు తెలుస్తుంది?" అన్నాడు.
    "అదే నేనూ కోరుకునేది!" అన్నాడు రోశయ్య.
    రమణరావు  ఒక నైలాన్ తాడు తీసి రోశయ్య కాళ్ళూ, చేతులూ కట్టేశాడు. తర్వాత ఆయన్ను భుజాన వేసుకుని "అబ్బా- మిమ్మల్ని మోయడం కష్టమే!" అన్నాడు.
    "అందుకే టాక్సీ లో కాక రిక్షాలో వెళ్ళు. వాడైతే ఓ రూపాయి డబ్బు లేక్కువడిగినా పెట్టె మోస్తాడు"అన్నాడు రోశయ్య.
    "మెలకువగా వుంటే పెట్టెలో ఎక్కువ సేపు ఉండలేక కేకలు వేసినా వేయొచ్చు. కాస్త క్లోరో ఫాం వాసనా చూసి పడుకోండి" అన్నాడు రమణరావు .
    "నీ సూచన బాగానే వుంది" అంటూ మెచ్చుకున్నాడు రోశయ్య.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS