సైన్యాధిపతి అప్పటి కప్పుడు నలుగురు భటులను రప్పించి కన్నయ్యను నగరపు పొలిమేరల మైదానపు ఆవరణ లోనికి పంపించాడు. రాత్రంతా ఆ భటులు కన్నయ్యకు కాపలా కాశారు. కన్నయ్య వారితో - "వెర్రి వాళ్ళలారా - అనవసరంగా నాకు కాపలా కాస్తూ మీ నిద్ర ఎందుకు చెడ గొట్టుకుంటారు ? మీరు పొమ్మన్నా నేను పోను . మీ రాజును నాకు బందీగా చేసుకుని తీసుకు వెళ్ళాలి గదా! రేపు మీ చతురంగ బలాలనీ ఓడించాలి గదా ! నేనెక్కడికి వెడతాను ? అన్నాడు.
భటులు కన్నయ్య మాటలు పట్టించుకోలేదు- కానీ వాడి మొండితనానికి ఆశ్చర్యపడ్డారు.
కాసేపు వాళ్ళతో కబుర్లాడాక కన్నయ్య నిశ్చింతగా నిద్రపోయాడు. భటులు తట్టి లేపెవరకూ వాడికి మెలకువ రాలేదు. 'అబ్బా! చక్కటి కల పాడు చేశారు " అని విసుక్కుంటూ వాడు లేచాడు.
ఎదురుగా క్రూర సేనుడు నిలబడి కన్నయ్య వైపు క్రూరంగా చూస్తున్నాడు. "ఏదో కల కంటున్నట్లున్నావు ?' అనడిగాడు వేళాకోళంగా .
"నా కలలు మాములువి కాదు. అది నిజమవుతాయి " అన్నాడు కన్నయ్య.
"ఏం కలగన్నావో చెప్పు!"
"మిమ్మల్ని నా బందీగా నా రాజ్యానికి తీసుకు పోతున్నట్లు ."
"ఆ మాట మాత్రం మానవు " అంటూ క్రూరసేనుడు, 'చుట్టూ చూడు !" అన్నాడు.
తనకు కాస్త దూరంలో నాలుగు దిక్కులా నాలుగు రకాల బలాలు బారులు తీరి ఉన్నాయి. కన్నయ్య తాపీగా వాటి వంక చూసి, "నేను యుద్ధం ప్రారంభించ బోయే ముందు మీరు మరొక్క అవకాశం ఇస్తున్నాను. ప్రజాపీడన చేయనని మీ తల్లిపై ప్రమాణం చేసి మాట ఇవ్వండి. మిమ్మల్ని వదిలి వెడతాను " అన్నాడు క్రూర సేనుడితో.
క్రూర సేనుడు నిట్టూర్చి "నా జీవితంలో పిచ్చి వాణ్ణి శిక్షించడం ఇదే మొదటిసారి. నీ కర్మ! అనుభవించు " అంటూ నలుగురు భటులనూ తనతో రమ్మనమని సైగ చేసి అక్కణ్ణించి కదిలి వెళ్ళి పోయాడు. కొద్ది క్షణాల్లో నాలుగు దిక్కుల బలాలు కన్నయ్య వైపు కదలసాగాయి.
కన్నయ్య భిక్షా పాత్ర నేలమీద వుంచాడు. "రధ గజ, తురగ పదాతులారా! ఆగకుండా బయటకు రండి, శత్రువుల ఎదుర్కోండి !" అన్నాడు.
అంతే. భిక్షా పాత్రలోంచి నాలుగు రకాల బలాలూ ఆగకుండా వెలువడుతూ క్రూర సేనుడి బలాలకు అభిముఖంగా వెళ్ళసాగాయి. చూస్తుండగా ఆ బలాలతో మైదానం నిండిపోయింది. ఆ బలాల మధ్య కన్నయ్య ఉన్నాడు.
ముందడుగు వేయబోయిన క్రూర సేనుడి చతురంగ బలాలు ఆగిపోయాయి. కన్నయ్య తన సృష్టిని ఆపి క్రూరసేనుడి బలాల ముందుకు వెళ్ళి నా బలాల సంఖ్యకు పరిమితి లేదు. చూస్తుండగా ఎంతమందిని సృష్టించానో చూశారుగదా! ఐతే నాకు రక్తపాతం ఇష్టం లేదు. ప్రజా క్షేమమే నా ధ్యేయం. మీరు బాగా ఆలోచించుకోండి. యుద్ధం చేసి చచ్చి పోతారా ? మీ రాజును బందీగా నాకు అప్పగిస్తారా ?" అనడిగాడు.
క్రూరసేనుడి బలాలు కన్నయ్య వైపు తిరగడానికి ఎంతో సేపు పట్టలేదు.
14
కన్నయ్య వెంటనే దుర్జయ దేశానికి వెళ్ళి పోలేదు. ప్రజల నుండి ఓ సమర్దుడ్ని ఎన్నుకొని రాజ ప్రతినిధి గా నియమించి క్రూర సేనుడిని బందీగా తీసుకొని పర్వత శ్రేణుల వరకూ వచ్చాడు. అక్కడ వాడు కొంతకాలం ఆగి తన చతురంగ బలాల సహాయంతో పర్వతాన్ని బద్దలు కొట్టించి తన దేశానికి చక్కని రాజమార్గం వేయించాడు.
ఆ పని పూర్తయ్యాక తన చతురంగ బలాలని మళ్ళీ భిక్షా పాత్రలోకి పంపి వేశాడు. క్రూర సేనుడిని శృంఖలాబద్దుడిని చేసి కూడా నడిపించుకుంటూ తన దేశం చేరుకొన్నాడు.
కన్నయ్య సాధించిన విజయం అప్పుడే వీర్ సేనుడిని చేరింది. అయన రాజధానీ నగరపు పొలిమేరలలోనే వాడికి అఖండ స్వాగత మిచ్చి సకల మర్యాదలతో సభా మంటపానికి తీసుకుని పోయాడు.
వీరసేనుడు కన్నయ్యతో , "నాకు మగపిల్లలు లేరు, నా తర్వాత నువ్వే ఈ రాజ్యాన్నేలాలి " అన్నాడు. కన్నయ్య అందుకు అంగీకరించలేదు. "నాకయితే శివపురం పోయి నా బ్రతుకు నేను బ్రతకాలని ఉంది. రాజరికం నాకొద్దు" అన్నాడు వాడు.
వీరసేనుడు వాణ్ణి ఎలాగో అలా అందుకు ఒప్పించాలనుకున్నాడు.
ఆ రాత్రి నిద్రలో కన్నయ్యకు ఓ కల వచ్చింది. అందులో వాడికి ఒకప్పుడు శివాపురం గ్రామానికి గ్రామాధికారి ఇంట బస చేసి వరాన్నిచ్చిన సాధువు కనపడి, "కన్నయ్యా! దుర్జయ దేశపు ప్రజల్ని కష్టాల్నించి విముక్తి చేయడం కోసమే నేను నీకా భిక్ష పాత్ర వచ్చేలా చేశాను. నీకు రాజరికం పై మోజు ఉంటె ఆ పాత్రనింకా ఉపయోగించుకొని వీరసేనుడికి వారసుడివి కా.
లేనిపక్షంలో రేపు దైవ సాన్నిధ్యంలో ఆ పాత్రను పగుల కొట్టు. వీరసేనుడి భార్య గర్భాన ఓ సకల సద్గుణ సంపన్నుడు ఉదయిస్తాడు. నువ్వు భిక్షాపాత్ర పగులగొట్టని పక్షంలో వీరసేనుడికి సంతాన యోగం ఉండదు. బాగా ఆలోచించుకుని ఏ పనీ చేయి " అన్నాడు.
కన్నయ్య సాధువుకు నమస్కరించి, "స్వామీ ఎందరో ఉండగా తమరు భిక్షా పాత్రను నాకే అను గ్రహించడానిక్కారణం ఏమిటి ?" అని అడిగాడు.
అందులో గొప్పతనం ఏమీ లేదు. నాకు మంచి వారనిపించిన చాలామందికి ఈ పాత్రను అను గ్రహించాను. పాత్ర తమ వశమైన కొన్ని రోజులకే అంతా తను మంచి మనసును పోగొట్టు కున్నారు. పాత్ర మహత్యం పోయింది. ఇంతకాలం ఆ పాత్ర మహత్తును నిలుపగలిగిన ఘనత నీదే" అన్నాడు సాధువు.
'అందుకే నువ్వు పాత్ర పోగొట్టుకున్నప్పటికీ నీ కలలు నిజమయ్యే వరకూ నీతోనే ఉంటుంది. నీ మంచి మనసు నన్ను వదలనంత వరకూ !"
మర్నాడు కన్నయ్యకు మెలకువ రాగానే వీరసేనుడిని కలుసుకుని తనకు వచ్చిన కల సంగతి చెప్పి సమీపంలో ఉన్న పూజా మందిరానికి వెళ్ళి భిక్షా పాత్రను పగుల కొట్టేశాడు.
కన్నయ్య నిస్వర్దబుద్దిని ఎలా అభినందించాలో కూడా తెలియలేదు రాజుకు, అయన ఆస్థాన కవుల్ని అప్పటికప్పుడు పిలిపించి కన్నయ్య పేరు చరిత్రలో చిరస్థాయి గా ఉండేలా చేయమని కోరాడు.
కన్నయ్య తిరిగి శివాపురం వెళ్ళిపోయాడు. శివాపురం లో అప్పటికే అతణ్ణి గురించిన వార్తలు తెలిశాయి. ఊరు ఊరంతా వాడికి అఖండ స్వాగతం పలికింది. చాలామంది గురవయ్యనూ, గ్రామాదికారినీ నిందించబోయారు.
కన్నయ్య వాళ్ళను వారిస్తూ , "ఈ సృష్టి లోనిమహా కార్యాలన్నింటి వెనుకా కొందరు అసూయా పరులున్నారు. గురవయ్య, గ్రామాధికారి నన్ను రాజధానీ నగరానికి పంపకపోతే నేను దుర్జయ దేశం ప్రజలకు న్యాయం చేకూర్చ లేక పోయేవాణ్ణి " అన్నాడు.
గురవయ్య, భద్రయ్య, గ్రామాధికారి కూడా తమ తప్పులు తెలుసుకొని కన్నయ్యను మన్నించమని వేడుకున్నారు.
తర్వాత కన్నయ్య తనకు ఈడైన యువతిని వివాహం చేసుకొని ఆ ఊళ్ళోనే హాయిగా జీవించాడు. ఎటొచ్చీ సమస్యలతో సతమతమయ్యే చాలా మంది కన్నయ్య దగ్గరకు వచ్చి పరిష్కారం చెప్పమని అడుగు తుండేవారు. కన్నయ్యకు కలలో ఆ పరిష్కారం కనబడేది. అది నిజమయ్యేది. అందుకని వాడికి కలల కన్నయ్య గా పేరు స్థిరపడి పోయింది.
కన్నయ్య దగ్గరకు గొప్పవాళ్ళు, పేదవాళ్ళు మహారాజులు, విద్వాంసులు - ఇలా ఎందరో వచ్చి వెడుతుండేవారు. కన్నయ్య మాత్రం ఎప్పటికీ శివాపురం లోని ఒక సామాన్య పౌరుడి గానే ఉండి పోయాడు. అయినప్పటికీ వాడి కధలు ప్రపంచ మంతా ప్రచారమై ఇప్పటికీ నిలిచి పోయాయి .
----అయిపొయింది -----
