Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 19


    ఓరోజు స్నేహితులతో కబుర్లు చెబుతుండగా హోటల్ సంపెంగ ప్రసక్తి వచ్చింది.
    "హోటల్ సంపెంగ లో బీరు అద్భుతంగా వుంటుందట. అందులో ఏదో స్పెషాలిటీ వుందట. భార్యతో కలిసి అక్కడ బీరు త్రాగడమన్నది ఒక అద్భుతమైన అనుభవం అంటారు. కానీ ఆ అదృష్టానికి మనం నోచుకోలేదు --" అన్నాడో మిత్రుడు.
    "ఎందుకని?" అనడిగాడు రామం. అతనా ప్రశ్న కేవలం కుతూహలం కొద్దీ అడిగాడు. అంతేకానీ భార్యతో కలిసి హోటల్ సంపెంగ లో బీరు తాగాలని అతడనుకోలేదు.
    "ముందు మన ఆడవాళ్ళు బీరు తాగడానికి ఒప్పుకోరు. ఓవేళ ఒప్పుకున్నా అక్కడ బీరు చాలా ఖరీదు. గ్లాసు పది రూపాయలు. అంతేకాక అక్కడ అన్నీ ఖరీదే! సర్వరే పదిరూపాయలకు తక్కువ టిప్స్ పుచ్చుకోడంటారు--"    
    "ఓస్ యింతేనా?' అన్నాడు రామం- "చెప్పేలా చెబితే ఏ ఆడదైనా వింటుంది. సరదాగా తాగమంటున్నాం కానీ గంగలో దూకమనడం లేదు గదా! ఆ తాగేది కూడా మనతో కలిసి. అదీ బ్రాందీ కాదు, విస్కీ కాదు, ఉత్త బీరు, ఖర్చు సంగతంటావా? ఆ అనుభావం నిజంగా అంత అద్భుతమైనదే అయితే ఓ రోజుకి వంద రూపాయలు మనవి కావనుకుంటే సరిపోతుంది. ఆమాత్రం లగ్జరీ కి - అదీ ఎప్పుడో ఒక్కసారికి-- ఖర్చు చేయలేకపోతే వెధవ సంపాదన ఎందుకు? ఈ వెధవ బ్రతుకు ఎందుకు?"
    రామం స్నేహితుడు నవ్వి - "అంత తేలిగ్గా తీసి పారేయాకు. ఆమాత్రం వందరూపాయలు జన్మ కోసారి అంటే ఎవరైనా ఖర్చు పెడతారు. ఎటొచ్చీ ఆడాళ్ళని ఒప్పించడం నువ్వనుకున్నంత సులభం కాదు. అదీకాక -- అన్నింటికీ మించిన అసలు సమస్య వేరే వుంది--" అన్నాడు.
    "ఏమిటో -- అది కూడా చెప్పి ఏడు --" అన్నాడు రామం విసుగ్గా.
    'చెప్పడానికేముంది? ఆ హోటల్ కు వెళ్ళిన ఆడవాళ్ళు అక్కడ భర్త తో కాక పరాయి మగాడితో గడపక తప్పదు--"
    రామంలో కాస్త ఆవేశం చోటు చేసుకుంది-- "ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు కట్టి పెట్టకపోతే -- నిన్నేవరైనా సరే పల్లెటూరి గబ్బులాయి అనే అంటారు. హోటల్ సంపెంగ -- మనుష్యుల మధ్య -- నాగరికత నడుమ వుంది. అంతేకానీ అడవిలో లేదు. తమకు అందుబాటులో లేనివాళ్ళ పైన అభాండం వేయడం మన దేశ ప్రజల అలవాటు. నీ మాటలు నేను నమ్మను--"
    "నువ్వు నమ్ము- నమ్మకపో . నాకెంతో నమ్మకమైన వ్యక్తుల ద్వారా అందిన సమాచారమిది. నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నాను కాబట్టే నా భార్యతో కలిసి ఆ హోటల్ కు వెళ్ళడం లేదంటాను--"
    'అయితే ఆ హోటల్ కి వెళ్ళిన ఆడవాళ్ళను రేప్ చేస్తారంటావా?" వేళాకోళంగా అడిగాడు రామం.
    "అలాంటిదేం జరగదట. అన్నీ ఇచ్చాపూర్వకంగానే జరుగుతాయి. అందుకు అనుకూల వాతావరణం మాత్రం అక్కడ ఏర్పాటవుతుంది--"
    "ఇది మరీ అసంబద్ధంగా ఉంది. నీ భార్య శీలాన్నే నువ్వు శంకిస్తున్నట్లవుతుంది - అలాంటి అనుమానం పెట్టుకుని గనుక నువ్వా హోటల్ కి వెళ్ళకపోతే -- " అని తన స్నేహితుడి ముఖం చిన్న బోయి వుండడం చూసి రామం మళ్ళీ అన్నాడు--" నేనిలా ఎందుకంటున్నానంటే -- నీ భార్య పక్కన నువ్వుంటావు. ఎవ్వరూ ఆమెను బలవంతం చేయరు. అయినా ఆమె పరాయి మగాడితో అనుభవం పంచుకుంటుంది. ఇది జరుగుతుందని భయపడి నువ్వు హోటల్ సంపెంగ కు వెళ్ళడం లేదు. ఈ మాటలు నువ్వు మా దగ్గర అన్నట్లు తెలిస్తే నీ భార్య ఎంత బాధపడుతుందో నువ్వే ఆలోచించు--"
    "నీతో వాదన అనవసరం . నేను సమాచారం చెబితే దాన్ని నువ్వు సవాల్ గా మరుస్తున్నావు--"
    'అవును సవాలే! నేను, నా భార్య సంపెంగ హోటల్ కు వెళ్ళి వస్తాం-- ఎంత పందెం?" అన్నాడు రామం ఉన్నట్లుండి.
    మిత్రులంతా నివ్వెరపోయారు. అక్కడున్న ఎవ్వరికీ ఈ పందెం ఇష్టమున్నట్లు లేదు. కానీ రామం మొండిపట్టు పడ్తాడు. ఆఖరికి అతడి మిత్రులంతా తలా వందా ఇస్తామన్నారు.
    "నాతొ కూడా ఎవరొస్తారు? మీకు సాక్ష్యం కావాలి కదా --" అన్నాడు రామం.
    "నీమాటంటే మాటే ! నిన్ను పూర్తిగా నమ్ముతున్నాం. మాకు వేరే సాక్ష్యం అక్కర్లేదు--" అన్నారు మిత్రులంతా ఏక కంఠంతో.
    "మీకు నామీద ఎంత నమ్మకం ?" అన్నాడు రామం ఆశ్చర్యంగా.
    "కానీ నీకే మామీద నమ్మకం లేదు. అందుకే జీవితంతో ఆటలాడే పందెం కట్టావు--" అన్నాడో స్నేహితుడు విచారంగా.
    "డియర్ ఫ్రెండ్ ! మనిషి మొదట తనను తాను నమ్మాలి. తర్వాత తన భార్యను నమ్మాలి. ఈరెండూ కాదన్న వారితో నేను పందెం కట్టక తప్పదు--"అన్నాడు రామం.

                                      3
    హోటల్ సంపెంగ కు రావడానికి గిరిజ ఒప్పుకోలేదు-- 'ఆ హోటల్ కు మంచి పేరు లేదండీ -- అక్కడికి వెళ్ళి వచ్చావంటే ఆ తర్వాత నలుగురికీ ముఖం చూపించడం కూడా కష్టమవుతుంది -" అందామె.
    "తీసుకు వెడుతున్నది నేను. అక్కడికి వెళ్ళటానికి డబ్బుల్లేక నలుగురూ అలా అనుకుంటే మనం ఆ మాటలకు విలువనివ్వక్కర్లేదు . నా మాట విను--" అన్నాడు రామం.
    గిరిజ ఓ పట్టాన ఒప్పుకోలేదు. కానీ అతను ఆవేశపడే లోగా ఒప్పేసుకుంది.
    'అంతేకాదు -- అక్కడ నువ్వు నాతొ కలిసి బీరు తాగాలి--" అన్నాడు రామం.
    "ఆడది బీరు తాగడం మా యింటా వంటా లేదు--" అంది గిరిజ.
    'అంటే మా ఇంటా వంటా ఉందనా నీ వుద్దేశ్యం ?" అన్నాడు రామం.
    ఏమో నాకేం తెలుసనీ అందామనుకుంది గిరిజ. కానీ భర్త ఆవేశ పడతాడని భయపడి -- "మీరు తాగమంటే విషమైనా తాగేస్తాను--" అంది.
    'అలాగుండాలి -- భార్య అంటే!" అన్నాడు రామం ఆమెను మెచ్చుకుంటూ.
    "ఏమండీ -- మీరేమీ అనుకోనంటే ఓ మాట అడగనా--" అంది గిరిజ బెదురుగా.
    'అడుగు --"
    "ఇలా అడుగుతున్నానని మరోలా భావించకండి. ఏ మగాడూ తన పెళ్ళాన్ని హోటల్ సంపెంగ కు తీసుకెళ్ళడు. ఏ మగాడూ తన పెళ్ళాన్ని బీరు తాగమని వేదించడు. ఈ రెండూ మీరు చేశారు. ఇంతకుమించి అడ్వాన్సు గా వెళ్ళరు గదా! మీ ఆవేశం మంటే నాకు భయం. అలాంటి పరిస్థితి ఏర్పడితే నా ప్రాణాలైనా తీసుకుంటాను గానీ మీ మాట వినను--" అంది గిరిజ.
    రామం ఆశ్చర్యంగా -- "అలా అడిగారేమిటి?" అన్నాడు.
    "హోటల్ సంపెంగ కు ఊళ్ళో మంచి పేరు లేదండీ --" అంది గిరిజ మళ్ళీ.
    "లేకపొతే లేకపోనీ -- నాకలాంటి భయలేమీ లేవు. నిజం చెప్పాలంటే ఇది మనకు మనం పెట్టుకుంటున్న పరీక్ష. నాకు నీమీడా , నీకు నామీదా నమ్మకముందనడానికి ఇంతకంటే మంచి పరీక్ష ఎందుకు?"    
    గిరిజ అనుమానంగా - "అసలు మనకు పరీక్ష ఎందుకు?" అంది.
    "మనకు పరీక్ష అవసరముందో లేదో కూడా తెలుసుకుందుకిది పనికొస్తుంది--" అన్నాడు రామం. తర్వాత గిరిజ మరింకేమీమట్లాడలేదు.
    ఇద్దరూ ఆ సాయంత్రం కలిసి -- హోటల్ సంపెంగ కు వెళ్ళారు.
    హోటల్లో అడుగు పెట్టగానే ఏదో స్వర్గంలో అడుగు పెట్టినట్లుంది.
    ఇద్దరూ డైనింగ్ హాల్ కు వెళ్ళారు.
    అదే ఓ ఇంద్ర భవనం లా వుంది. హాలు నిండా ఎన్నో బల్లలున్నాయి. ప్రతి బల్లకూ అటూ ఇటూ రెండేసి కుర్చీలు.
    హల్లో చాలా టెలివిజన్ లున్నాయి. బల్లల్నీ, టెలివిజన్నీ అమర్చిన పద్దతి వల్ల హల్లో ఏ బల్ల దగ్గర కూర్చున్నా హాయిగా టెలివిజన్ చూడొచ్చు. టెలివిజ న్లో కూడా మాములుగా వచ్చే చెత్త కార్యక్రమాలు లేవు. చూపరులకు ఆసక్తికరంగా వుండే కార్యక్రమాలు వస్తున్నాయి. అది క్లోజ్డ్ సర్యూట్ టీవి. హోటల్లో వారికీ మాత్రమే ప్రత్యేకమైన కార్యక్రమాలు. బహుశా ఏ ఫారిన్ కార్యక్రమాలో విడియో టేప్స్ రూపంలో సంపాదించి వేస్తుండి వుండాలి.
    కార్యక్రమాల్లో కూడా ఎక్కడా అసభ్యత లేదు. సునిశితమైన హాస్యం , ఆసక్తి కలిగించే సన్నివేశాలున్నాయి.
    రామం, గిరిజ రెండు బీర్లు అర్ద్రిచ్చారు.
    గిరిజ బీరు కొద్దిగా చప్పరించి -- "ఛీ కుంకుడు కాయ పులుసులా వుంది--" అంది.
    "మొదట్లో అలాగే వుంటుంది. అలావాటైతే అదే బాగుంటుంది -" అన్నాడు రామం ఉత్సాహంగా చప్పరిస్తూ.
    "అడుసు తొక్కి కాలు కడుగుక్కున్నట్లు -- ఇది అలవాటు చేసుకోవడం కూడా ఎందుకు....?"
    గిరిజ ప్రశ్నకు జవాబు రాలేదు. సరిగ్గా అప్పుడే బల్లకు వారిద్దరికీ ఎదురుగా ఒకతను వచ్చి కూర్చున్నాడు. అతడు నేరుగా రామం వంక చూసి -- "నీ అదృష్టాన్నభినందిస్తున్నాను.  నీ భార్య చాలా అందంగా వుంది-" అన్నాడు.
    రామం కాస్త ఇబ్బందిగా -- "థాంక్యూ --" అన్నాడు.
    "అందమే కాదు, చాలా సెక్సీగా కూడా వుంది --"అన్నాడతను.
    రామం ముఖం ఎర్రబడింది. తటపటాయిస్తూ-- "నీ కామెంట్ నాకు నచ్చలేదు --" అన్నాడు.
    "కానీ నాకు నీ భార్య నచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్....ఇద్దరం కాసేపు .....అలా ...."
    అతడి మాటలు పూర్తీ కాకుండానే రామం లేచి నిలబడి -- "యూ బ్లడీ ఫూల్....గెటౌట్ ...." అన్నాడు ఆవేశంతో అతడి శరీరం వణుకుతోంది.
    "నా పేరు బ్లడీ ఫూల్ కాదు. రవి కిశోర్ --" అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను.
    గిరిజ భర్త వంక అదోలా చూసి -- "నేను వద్దంటే ఇక్కడికి తీసుకువచ్చారు. వాడన్న మాటలకు సిగ్గుతో నా వళ్ళు చచ్చిపోయింది -" అంది.
    "ముందు బీరు తాగు..."అన్నాడు రామం. అతను తన ఆవేశాన్నణచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రవి కిశోర్ వెంటనే వెళ్ళిపోవడం అతడికి కాస్త తృప్తిని కలిగించినట్లుంది.
    గిరిజ ఇబ్బందిగా ముఖంపెట్టి బీరు చప్పరించసాగింది.
    అయిదు నిముషాలైనా గడవకుండా అక్కడికి మళ్ళీ రవికిషోర్ వచ్చాడు. ఈ పర్యాయం అతడి కూడా ఓ అప్సరస లాంటి అమ్మాయి వచ్చింది. వస్తూనే అతను రామం వంక తిరిగి -- "ఇందాకా నేను  ఓ చిన్న పొరపాటు చేశాను. నేనేమీ ఆఫర్ చేయకుండా నిన్నేదో కోరాను. మీట్ మై వైఫ్ ప్రతిమా -- " అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS