Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 18

 

                            ఆవేశం అనర్ధం!

                                                                 వసుంధర
    రామానికి ఆవేశం ఎక్కువని ఇంట్లో అంతా అంటారు. తనకు ఆవేశం ఎక్కువని రామానికి తెలుసు, కానీ ఆవేశాన్ని అదుపు చేసుకోవాలని అతనెన్నడూ ప్రయత్నించలేదు.
    తన ఆవేశం తన్ను హంతకుణ్ణి చేయగలదని ముందే తెలిస్తే రామం- చిన్నతనం నుంచీ ఆవేశాన్నణచుకునెందుకు ప్రయత్నించి వుండేవాడు.
    రామానికి ఇద్దరు తమ్ముళ్ళు. ఒక చెల్లెలు. అతనికంటే ఒక సంవత్సరం మాత్రమే పెద్దదైన అక్క వీళ్ళంతా అతడి చేతిలో దెబ్బలు తిన్నవాళ్ళే!
    తల్లి మీద కోపం వస్తే రామం-- గిన్నెలూ, కంచాలూ విసిరేసేవాడు. తండ్రి మీద కోపం వస్తే ఇంట్లోంచి పారిపోయేవాడు.
    రామం కోపం ఇంట్లో నే కాదు-- బయట కూడా జోరుగానే వుండేది. స్కూల్లో అతను చాలామందిని చితక్కోట్టేవాడు. చాలామంది చేత తన్నులు తిన్నాడు . టీచర్సు ని ఎదిరించేవాడు.
    అయితే రామన్నేవ్వరూ అసహ్యించుకునే వారు కాదు. అతను పాఠాలు శ్రద్దగా చదివేవాడు. క్లాసులో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అతడిది మంచి మనసని అంతా అనేవారు.
    రామం పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. వాటి లోని వీరుల కదలతడిని ఎక్కువగా ఆకర్షించేవి. మితిమీరిన ఆవేశంతో -- చట్టబద్దమైన పనులు చేస్తూ- మంచి వారికి సాయపడుతూ- చెడ్డవారిని శిక్షిస్తూ-- పాలకులకు సింహ స్వప్నంగా వుండే కధానాయకులతడికి నచ్చేవారు. తనకు తెలియకుండానే అతను వారి అడుగుజాడల్లో నడిచేవాడు.
    ఇతరులకు సాయపడడం లో అతను గొడవలు తెచ్చుకునేవాడు. అతని తత్వాన్ని కనిపెట్టి చాలామంది అతడిని ఉపయోగించుకునేవారు. తమవల్ల కాని పనులతనికి పురమాయించేవారు.
    రామం క్లాసులో విశ్వనాధం గారు సైన్సు బోచించే వాడు. ఆయనంటే చాలామంది విద్యార్ధులకు కోపం వుండేది. ఎందుకంటె క్లాసులో అయన పక్షపాతం చూపించేవాడు. డబ్బున్న వారి పిల్లలనూ, అధికారంలో వున్నా వారి పిల్లలనూ తన వద్ద ప్రయివేటు చెప్పించుకునే పిల్లలనూ అయన ప్రత్యెక అభిమానంతో చూసేవాడు. వాళ్ళు తప్పు చేసినా శిక్షించే వాడు కాదు. మిగతా పిల్లలు తప్పు చేస్తే కఠినంగా శిక్షించేవాడు.
    ఒకరోజు రామం స్నేహితుడు సత్యనారాయణ క్లాసులో భీమారావు అనే కుర్రాడితో గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఇద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకొని కలియబడేవరకూ వచ్చింది. ఆ సమయంలో క్లాసులోకి సైన్సు టీచరు విశ్వనాధం గారు వచ్చేరు. పరిస్థితి చూస్తూనే అయన న్యాయాన్యాయాలు విచారించకుండా సత్యనారాయణ ను క్లాసులోంచి బయటకు పొమ్మన్నారు.
    రామం వెంటనే లేచి "మరి భీమారావు సంగతేమిటి సార్!" అన్నాడు.
    "ఇది క్లాసు రూం. ఇక్కడ మాట్లాడకూడదు. కోర్టులో జడ్జిగారినీ, క్రికెట్ ఫీల్డు లో అంఫైర్నీ , స్కూల్లో టీచర్నీ-- ఎవ్వరూ దేనికి ప్రశ్నించకూడదు" అన్నాడు విశ్వనాధం.
    రామం అప్పటికి ఊరుకున్నాడు. కానీ అతడి ముఖం ఎర్రబడింది.
    ఆ సాయంత్రం విశ్వనాధం స్కూల్నించి ఇంటికి వెడుతుంటే అతను దారి కాశాడు. విశ్వనాధం రామానికి ఒంటరిగా దొరికాడు.
    అప్పుడు రామం వయసు పదహారేళ్ళు. మనిషి బలంగా వున్నా - విశ్వానాధాన్ని కొట్టేంత బలం లేదు. కానీ రామం చేతిలో రాళ్ళున్నాయి. మనసులో మొండితనం వుంది.
    విశ్వనాధం వయసు నలభై వుంటుంది. మనిషి బలంగా వున్నా - దశాబ్దాలుగా వెలగబెడుతున్న మేస్టారు గిరి ఆయన్ను నిర్వీర్యుడిని చేసింది. దారి కాసి తన ఎదురుగా నిలబడ్డ మనిషి -- ఆఖరికతడు తన విద్యార్ధి అయినా సరే - ఎదుర్కొనే మనోబలం ఆయనకు లేదు.
    "ఏమిటిది?" అన్నాడు విశ్వనాధం.
    "ఇది క్లాస్ రూం కాదు.ఇక్కడ నేను నీకు పాఠం చెబుతాను--" అన్నాడు రామం.
    రామం శరీరం ఆవేశంతో వణుకుతోంది. కళ్ళు క్రూరంగా చూస్తున్నాయి. అతడి చేతులోని రాళ్ళు వాడిగా వున్నాయి. అతను విశ్వనాధానికి కాస్త దూరంలోనే వున్నాడు.
    "నీ గురువును నువ్వు మన్నించే విధానం ఇదేనా?" అన్నాడు విశ్వనాధం మేకపోతు గాంభీర్యంతో.
    'సత్యనారాయణ, భీమారావు - ఇద్దరూ తప్పు చేశారు. కానీ నువ్వు సత్యనారాయణనే క్లాసులోంచి పోమ్మన్నావు. భీమారావు నేమీ అనలేదు. అది అన్యాయం కాదూ?" అన్నాడు రామం.
    "అన్యాయమే!" వెంటనే అన్నాడు విశ్వనాధం.
    "తెలిసి కూడా అన్యాయం చేసేవాడు మంచి గురువు ఎలా అవుతాడు?" అన్నాడు రామం.
    'అవడు. నేను మంచి గురువు కాదు-" అన్నాడు విశ్వనాధం.
    "అందుకే నేను నిన్ను మన్నించడం లేదు-" అన్నాడు రామం.
    "నువ్వు నా మాట కూడా కాస్త వింటావా?" అనడిగాడు విశ్వనాధం.
    "చెప్పుకో!" అన్నాడు రామం నిర్లక్ష్యంగా.
    "భీమారావు పెద్ద ఆఫీసరు గారబ్బాయి. ఇంట్లో గారభంగా పెరుగుతున్నాడు. అతను శిక్షను సహించలేడు. నేను శిక్ష విధిస్తే ఇంట్లో చెబుతాడు. అఫీసరుగారిక్కోపం వస్తుంది. నా దగ్గర ప్రయివేటు మన్పించేస్తారు. నాకు నెలకు పాతిక రూపాయలు నష్టం వస్తుంది. పాతిక రూపాయలు ఆఫీసరు గారికి లెక్కలో డబ్బు కాదు. కానీ నాకదేంతో ముఖ్యమైనది. అది నేను వదులుకోలేను. సత్యనారాయణ సంగతి తీసుకుంటే -- అతను పేదవాడు. పేదవాడి కోపం పెదవికి చేటు. ఇప్పట్నించీ అతనికి ఆవేశాన్ని అణచుకోవడం నేర్పాలి. లేకపోతె జీవితంలో చాలా కష్టపడిపోతాడు. అతని మంచికోరే నేనతనికి శిక్ష విధించాను--"
    "మరి నా సంగతి?"
    "నువ్వు ఇంజనీరు గారబ్బాయివి. అంచేత నీకెంత అవేశామున్నా ఫరవాలేదు. ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా నేను క్షమిస్తున్నాను. కానీ నీ మేలు కోరి ఒక సలహా ఇస్తున్నాను----" అన్నాడు విశ్వనాధం.
    "ఏమిటది?"
    "నీలో ఆవేశం చాలా ఎక్కువ పాళ్ళలో వుంది. ప్రస్తుతం నువ్వు కుర్రాడివి. నీ ఆవేశంలో నువ్వు మనుషుల్ని తిడుతున్నావు కొడుతున్నావు. ఈ ఆవేశాన్నదుపు చేసుకోకపోతే అది ఇంతటితో ఆగదు. ఏదో ఒకరోజున నువ్వు హత్య చేసినా చేస్తావు. హత్య చేసిన మనిషిని డబ్బు కూడా రక్షించలేదు--" అన్నాడు విశ్వనాధం.
    రామం మ్రాన్పడిపోయాడు.
    విశ్వనాధం కొనసాగించాడు -- "ఏం సాధిద్దామని నన్ను కొట్టాడానికి వచ్చావు? నేను నిన్నేమీ చేయలేదే? ఎవడో సత్యనారాయణ కి అన్యాయం జరిగిందని నువ్వు అవేశపడ్డావు. అనుభవం మీద చెబుతున్నాను-- ఎదుటి వాళ్ళకు జరిగిన అన్యాయం సరిదిద్దాలను కోవడం మంచి హాబీ కాదు. అలా చేయడంలో నీకు నువ్వే అన్యాయం చేసుకుంటే -- అప్పుడా ఎదుటి మనిషి కూడా నీకు సాయపడడు--"
    రామం చేతిలోని రాళ్ళు కింద పడేశాడు. కలవరపడ్డ మనసుతో అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

                                    2
    విశ్వనాధం గారలా హెచ్చరించినపుడైనా తను జాగ్రత్త పడవలసిందనుకున్నాడు రామం. కానీ చేతులు కాలాక ఆకులూ పట్టుకుని ప్రయోజనమేముంటుంది?
    విశ్వనాధం అనుభవంతో చెప్పిన మాటలబద్దం కాలేదు. రామం ఆవేశం నానాటికీ విజ్రుంభిస్తోంది.
    అయితే రామం స్వాభావికంగా ఆవేశపరుడు కాదు. అతడికలా సాగుతోంది. ఆవేశం వల్ల కలిగే అనర్దాలతడికి అనుభవంలోకి రాలేదు. ఇంట్లో అతడి తల్లి గారాబం, అతడి నెవరూ దేనికీ ఏమీ అనడానికి వీల్లేదు. మితిమీరిన ఈగారబం అతడిలో అహంకారాన్ని పెంచుతూ వచ్చింది. పెరుగుతున్న అహంకారం అతడి ఆవేశాన్ని పెంచుతోంది.
    రామం స్కూల్లో ఫస్టుగా వచ్చాడు. కాలేజీలో ఫస్టు క్లాసు తెచ్చుకున్నాడు. డిగ్రీ వచ్చి సంవత్సరం తిరక్కుండా తండ్రి పలుకుబడి కారణంగా నెలకు ఎనిమిది వందల వచ్చే ఉద్యోగం సంపాదించుకున్నాడు.
    అతను పనిచేసే కంపెనీ మేనేజరు సుబ్బారావు. అయన వద్ద కూడా రామం తన ప్రవర్తన మార్చుకోలేదు. అసలే అది ప్రయివేటు కంపెనీ. ఆరంభంలో అలా వుంటే ఆ వుద్యోగం ఊడిపోవచ్చు కూడా. అయితే ఇక్కడ కూడా అదృష్టమో, దురదృష్టమో రామానికి కలిసి వచ్చింది.
    సుబ్బారావు కూతురు గిరిజ అన్ని విధాల రామానికి ఈడూ జోడూ గా వుంటుంది. ఈ విషయం రామం తలిదండ్రులు కూడా అనుకున్నారు. వారలా అనుకోవడం వల్లనే రామానికీ వుద్యోగం దొరికింది. ఎటొచ్చీ ఈ విషయం రామానికి తెలియకుండా రహస్యంగా ఉంచారు-- రామం వుద్యోగంలో చేరిన సంవత్సరం వరకూ.
    ఈలోగా గిరిజ తానూ ఫలానా అని చెప్పకుండానే రామంతో పరిచయం సంపాదించుకుంది. రామానికి గిరిజ నచ్చింది. అతడామెను ప్రేమించాడు.
    రామానికి ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశాన్ని రెచ్చగొట్టి అతన్ని పెళ్ళి కి రెచ్చగొట్టింది. ఇదంతా నాటకమని తెలియని రామం గిరిజ గురించి ఇంట్లో చెప్పాడు. పెద్దలు వెంటనే ఒప్పుకున్నారు. పెళ్ళి జరిగిపోయింది -- వైభవంగా!
    ఇంతవరకూ బాగానే వుంది. ఎక్కడా రామం అహం గానీ, ఆవేశం గానీ దెబ్బ తినాల్సిన అవసరం రాలేదు. గిరిజ కూడా అనుకూలవతి అయిన భార్య. ఆవేశం లేనప్పుడు రామం మంచివాడు. అతడికావేశం రాకుండా చూసుకుంటే ఎప్పటికీ మంచివాడే! రామానికి ఆవేశం రాకుండా చూసుకోవడమూ , అతడి కావేశం వస్తే దాన్ని ఎదుర్కోవడమూ -- గిరిజ కు సులభంగానే వుంది. ఇంకా సమస్యలే లేవు.
    సమస్యలు లేనపుడు కొంతమంది కొని తెచ్చుకుంటారు. రామం కూడా అలాగే ఓ సమస్య కొని తెచ్చుకున్నాడు. లేకపోతే అతనా ఊళ్ళో హోటల్ సంపెంగ కు వెళ్ళడం ఎందుకు? అదీ భార్యతో కలిసి....
    అదంతా తమాషా గా జరిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS