ప్రతిమ రామానికి నమస్కరించింది. రామం కూడా ఇబ్బందిగా ఆమెకు నమస్కరించాడు.
"హౌ డూ యూ లైక్ హెర్-" అన్నాడు రవి కిశోర్ . రామం బదులివ్వలేదు. కానీ ఓరకంటితో ప్రతిమను చూసి ఆమె అందం అంచనా వేసి -- చాలా అందమైనదేనని అప్రయత్నంగా అనుకున్నాడు.
"నీకామే నచ్చుతుందని నాకు తెలుసు -- " అన్నాడు రవి కిశోర్-- "ఓ గంటసేపు ఆమె నీది, ఈమె నాది --" అంటూ గిరిజను చూపించాడతను.
"వాడ్డూ యూ మీన్ -- " మళ్ళీ రామం ఎర్రబడ్డాడు.
"జస్ట్ ఎక్స్ చేంజ్ -- అది ఓ గంట సేపు -- " అన్నాడు రవి కిశోర్.
రామం జవాబివ్వకుండా క్రూరంగా రవి కిశోర్ కళ్ళలోకి చూశాడు.
'అలా చూడకు మిస్టర్! నేను చాలా న్యాయంగా మాట్లాడుతున్నాను. నీకీ వ్యవహారం కొత్త కావచ్చు. అంతమాత్రాన మరీ అంత బెట్టు చేయకూడదు. కావాలంటే ఎక్స్ ట్రాగా డబ్బు కూడా ఇస్తాను. ఎంతైనా ఇవ్వగల సమర్దుడ్ని. జస్టు -- మీ ఆవిడంటే మోజు పడ్డాను ...." అన్నాడు రవికిశోర్.
"పెళ్ళైన ఆడది చెల్లెల్లాంటిదని తెలియదా నీకు--" అన్నాడు రామం తన్ను తాను నిగ్రహించుకునెందుకు ప్రయత్నిస్తూ.
'అలా అనుకునేవాడేవడూ ఈ హోటల్ సంపెంగ కు రాడు. ఇక్కడికి వచ్చేదే ఎక్స్ చేంజి కోసం. అలాంటప్పుడు నువ్విలా నీతులు వల్లిస్తే ఎలా? అందులోనూ నీ భార్యను చేల్లెలిలా భావించడం మరీ కష్టం --" అంటూ గిరిజను అంగ వర్ణన చేయనారంభించాడు. ఆ వర్ణనలో రవంత అసభ్యత కూడా లేకపోలేదు.'
గిరిజకు ఈ సంభాషణ చాలా ఇబ్బందిగా వుంది. కానీ అది కోరి తెచ్చుకున్న సమస్య, అందువల్ల తానేమీ మాట్లాడకుండా టెలివిజన్ కేసి దృష్టి సారించింది. టెలివిజన్ లో ఏదో బాక్సింగ్ పోటీ జరుగుతోంది. పోటీ చాలా ఆసక్తికరంగా వుంది. వున్నట్లుండి ఓ బాక్సర్ తన రెండు చేతుల్ని వేగంగా కదిపి అవతల వాడి ముఖం పై రెండు బ్లోస్ ఇచ్చాడు. అవతలి బాక్సర్ కుప్పలా కూలిపోయాడు.
అయిదారుగురు మనుషులు పరుగున తమవైపు వస్తున్న చప్పుడు విని గిరిజ అటు చూసింది.
నేలమీద రవికిశోర్ పడి వున్నాడు. అతడి భార్య అతడి పక్కనే కూర్చుంది. రామం కోపంగా రవికిశోర్ వంక చూస్తూ -- "ఇంకా వాగావంటే చంపేస్తాన్రా రాస్కెల్ --" అన్నాడు.
వచ్చిన మనుషులు రామం చేతులు పట్టుకుని-- "వాటీజ్ దిస్ నాన్సెన్స్" అన్నారు.
"నేను కాదు . ఇతను అంతా నాన్సెన్స్ మాట్లాడుతున్నాడు--" అన్నాడు రామం.
రవికిశోర్ లేచి కూర్చున్నాడు. రామం జరిగింది క్లుప్తంగా వాళ్ళకు చెప్పాడు.
"దాందేముంది సార్ - ఇష్టముంటే ఒప్పుకుంటే సరిపోతుంది. లేదా -- ఇష్టం లేదని చెప్పండి. ఇక్కడ మనిషికి ఏమైనా మాట్లాడే స్వతంత్ర్యం ముంది. కానీ ఎవర్నీ ఎవ్వరూ బలవంతం చేయరు. ఇష్టపడని స్త్రీని పురుషుడు తాకనైనా తాకడు. కానీ మాములుగా బయట మాట్లాడలేని ఏ మాట అయినా చెప్పవచ్చు. ఇది హోటల్ సంపెంగ చేస్తున్న వినూత్న ప్రయోగం. ఆడవాళ్ళ చేయ చెప్పు దెబ్బలు తినకుండా వాళ్ళ గురించి మీకు తోచిన మాటలు-- అవి ఎంత అసభ్యంగా ఉన్నా సరే -- చెప్పగలగడం - ఓహ్ - అలాంటి అనుభవం మీ కెక్కడ దొరుకుతుంది?" అన్నాడో మనిషి.
"కానీ ఇతను నా భార్యను వర్ణిస్తున్నాడు--"
"వర్ణించనివ్వండి. మీరూ అతడి భార్యను వర్ణించండి. ఆమెనే కాదు, ఈ హోటల్లో వున్న ఏ స్త్రీ దగ్గరకైనా వెళ్ళి మీరామేను యదేచ్చగా వర్ణించవచ్చు. ఎవరైనా ఒప్పుకుంటే అనుభవం కూడా పొందవచ్చు. పశుబలాన్ని చూపి బలవంతం చేయడం ఒక్కటే ఇక్కడ సహించబడదు--" అన్నాడు హోటల్ మనిషి.
రామం రవికిశోర్ భార్య వంక చూశాడు. ఆమె నిజంగా చాలా అందంగా వుంది. కొద్ది క్షణాలు ఆమె తనిది కావడం కోసం ఏమైనా చేయవచ్చు ననిపించింది. మగవాడికి పరాయి స్త్రీ ఆకర్షణ చాలా బలమైనది. రామం ఎదురుగా ఓ అందమైన పరాయి స్త్రీ నిలబడి వుంది. ఆమె అతనిది కావడానికి అభ్యంతర మేమీ లేదు. కానీ ఒకే ఒక చిన్న షరతు...
రామం, రవికిశోర్ వంక చూశాడు. అతడు గిరిజ వంకే చూస్తున్నాడు. ఆ కళ్ళు నిండా ఆకలి....
రామం చటుక్కున గిరిజ చేయి పట్టుకుని-- "మిస్టర్ రవి కిషోర్! ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఇంతటితో నిన్ను వదిలి పెడ్తాను అనుకోకు. నీ చావు నాచేతుల్లో రాసి పెట్టి వుంది--" అన్నాడు.
అప్పటికా హోటల్ మనుషులు వెళ్ళిపోయారు.
"నువ్వు నన్ను చంపే మాటైతే ఇలా వృధాగా అరవకు. నలుగురూ వింటే అదేసాక్ష్యమై నీ పీకకు చుట్టుకుంటుంది .. జరిగిందేదో జరిగిపోయింది. బీ స్పోర్టివ్, స్పోర్టివ్ గా ఉండలేకపోతే ఇలాంటి హోటల్స్ కు రాకు" అన్నాడు రవికిశోర్.
4
రామం స్నేహితులిచ్చిన డబ్బు తీసుకోలేదు.
"మీరు చెప్పింది నేను సరిగ్గా అర్ధం చేసుకోక పందెం కట్టాను. అసలు నేనా హోటల్ కు వెళ్ళకుండా వుండవలసింది. అలా వెళ్ళడం వల్లనే నేనో వెధవకి నా భార్యని అంగాంగ వర్ణన చేసే అవకాశమిచ్చాను. ఆ రాత్రంతా నా భార్య ఏడుస్తూ కూర్చుంది--" అన్నాడు రామం.
"నువ్వు చెప్పేది వింటుంటే నాకా హోటల్ మీద మోజు కలుగుతోంది రామం! పెళ్ళాం తో కాకుండా ఒంటిగా ఓసారి ఆ హోటల్ కు వెళ్ళి మన నోటి దురద తీర్చుకువద్దామా?" అన్నాడో స్నేహితుడు.
"ఆ హోటల్ కు జంటలే వెళ్ళాలి!" అన్నాడు రామం.
"ఆ జంట భార్య భర్తలై తీరాలని కూడా ఉందా ?" అడిగాడా స్నేహితుడు.
"వున్నట్లు లేదు -- " అన్నాడు రామం సాలోచనగా.
'అయితే మనకు జంటల్ని నేను సంపాదిస్తాను ఓసారి అక్కడకు వెళదాం--" అన్నాడా స్నేహితుడు.
"నీతి కన్నా అవినీతి ఎంత బలమైనది -- " అన్నాడు రామం నిట్టురుస్తూ. అతను వాళ్ళతో హోటల్ కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అలాంటిది తనకు చాలా అసహ్యమని చెప్పాడు.
"ఎందుకని?" అన్నాడో స్నేహితుడు.
"నీ భార్యని ఓ పరాయి మగాడు నీ కళ్ళెదుట అంగాంగ వర్ణన చేసి తప్పించుకోవడమన్నది-- ఎంత బాధాకరమో-- అనుభవం లోకి వస్తే గానీ తెలియదు...." ఆవేశంతో రామం పిడికిళ్ళు బిగిశాయి.
'అంగాంగ వర్ణన అంటే....అసభ్యంగా కూడా వుందా?" అన్నాడా స్నేహితుడు.
'అసభ్యత తప్ప మరొకటి అందులో లేదు. శరీరంలో ఏ భాగాలూ వదిలి పెట్టబడలేదు. నా భార్యకు బట్టలు విప్పుకుని నిలబడ్డ అనుభూతి కలిగిసిగ్గుతో చచ్చిపోయిందిట --" అన్నాడు రామం.
ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కాసేపు అక్కడ మౌనం రాజ్యమేలింది.
"ఒక స్నేహితుడు నెమ్మదిగా -- ఇప్పుడెం చేద్దామను కుంటున్నావ్?" అనడిగాడు.
"అ రవికిశోర్ అంతు చూద్దామనుకుంటున్నాను-" అన్నాడు రామం.
అన్నాడు కానీ ఆ పని ఎలా చేయాలో అతడికి తెలియడం లేదు. హోటల్లో వున్నప్పుడు అతడి ఆవేశం పని చేయలేదు. నలుగురు మనుషుల బలం ముందు అతడి ఆవేశం తలవంచింది. తర్వాత అతడు రవికిషోర్ గురించీ ఆచూకీ తీస్తూనే వున్నాడు.
రవి కిశోర్ పెద్ద బిజినెస్ మాగ్నెట్. అతణ్ణి ఒంటరిగా కలుసుకోవడం అసాధ్యం. అతన్ని చంపాలంటే మళ్ళీ హోటల్ సంపెంగ కే వెళ్ళాలి. అయితే అక్కడ మరొకడు తన భార్య జోలికి వస్తే ....
ఇలా ఒక్కొక్కడే తన భార్య అందాన్ని గుర్తించి ఎక్స్ రే కళ్ళతో ఆమెను చూడడం రామాని కిష్టం లేదు. అదీకాక హోటల్ సంపెంగ లో తన ఆవేశం పనిచేయదు. రవికిశోర్ ని కలుసుకుంటే వేరేఎక్కడైనా -- తను మీదపడి చంప గలిగే విధంగా కలుసుకోవాలి.
రామం ఈ విషయం భార్యతో కూడా చర్చించాడు.
"ఎందుకండీ వెధవ గొడవ. తప్పు అయనదీ కాదు. తెలిసీ ఆ హోటల్ కు వెళ్ళడం మన తప్పు. మీరు హత్యల గురించి ఆలోచించకండి. నాకు భయం వేస్తోంది" అంది గిరిజ.
5
రామానికి ఒక చక్కటి ఉపాయం తోచింది. రవికిశోర్ గురించి అతడికో కొత్త సమాచారం తెలిసింది.
రవికిశోర్ కు విలియమ్స్ అనే బ్రోకరోకడునన్నాడు. డబ్బాశ చూపించి వాడు రవికిశోర్ దగ్గరకు ఆడవాళ్ళను తీసుకు వేడుతుంటాడు. తనకు నచ్చిన ఆడవాళ్ళ గురించి అయిదారు వేలదాకా సులభంగా ఇస్తాడు రవికిశోర్. విలియమ్స్ క్కూడా మంచి కమిషన్ ముడుతుంది.
తనకు నచ్చిన అమ్మాయిలతో సుఖపడేందుకు రవి కిశోర్ ఒక ప్రత్యేకమయిన బంగళా వుంది. రవికిశోర్ అమ్మాయిలతో కలిసి అక్కడకు వెళ్ళినపుడు బంగళా లో ఇంకెవ్వరూ ఉండకూడదు. ఆఖరికి వాచ్ మాన్ కూడా! అంది శాసనం....
