"తెలిస్తే వేదతావన్న మాట !"
"ఆ వెడితే వెడతాను...." అన్నాడు రామం.
కొడుకిలా అంటాడని ఊహించక ఆవిడ తడబడింది. తర్వాత గొణుక్కుంటూ లోపలకు వెళ్ళిపోయింది.
8
ఆ రాత్రి రామం తండ్రి విశ్వనాధం అయిదారు చోట్లకు ఫోన్ చేశాడు. సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు అయన కొడుకును పిలిచాడు-- "ఈరాత్రి నాకు నిద్ర పట్టేలా లేదు. నా రహస్యాలన్నీ ఎవరో తెలుసుకున్నారు. నన్నో అట ఆడించాలనుకుంటున్నారు------........."
"అలా ఎందుకనుకుంటున్నారు?" అన్నాడు రామం.
"మనింటికి వచ్చిన వీణ పెట్టి మాయమైంది. మరో పెట్టెలో అమ్మాయోచ్చింది . ఆ పెట్టె మావాళ్ళు ఎవరూ పంపలేదు. కానీ దానికి తాళం మాత్రం మా భాగస్వాము ల్లోదే వేసి వుంది...."
'అంటే మీ భాగస్వాముల్లో ఒకరు...."
"అలాగని నేననుకోవడం లేదు...."అన్నాడు రామం తండ్రి.
"మరేమనుకుంటున్నారు?"
"అందుకే నిన్ను పిలిచాను!"
రామం తండ్రి వంక ఆశ్చర్యంగా చూశాడు.
"ఈ నాటకంలో నీ చేయి వుంది. ఎంతో కొంత నీకు తెలుసు. అది నువ్వు నాకు చెప్పాలి!" అన్నాడు విశ్వనాధం.
"నిజంగా నాకేమీ తెలియదు...."
"అబద్దం చెప్పకు. కొడుకు తండ్రిని మోసం చేస్తే దేవుడు కూడా క్షమించడు. నీకేమీ తెలియకపోతే ఆ వీణ పెట్టి నీకోసమే నని ఎందుకన్నావు? అందులో ఏముందో నీకు తెలుసు. ఎవరు పంపారో నీకు తెలుసు?"
"నన్నేమీ అడగొద్దు-- నాకేమీ తెలియదు--"అన్నాడు రామం. తనకూ సునంద కూ మధ్య జరిగిన కధ తండ్రికి చెప్పడం అతడికి బొత్తిగా ఇష్టం లేదు.
"చెప్పవా?" అన్నాడు విశ్వనాధం.
"మనింటికి వచ్చిన మొదటి పెట్టి ఏమయినదో తెలుసుకోవాలి. పక్కింట్లో ఇద్దరబ్బాయిలున్నారు. వాళ్ళ చేత నిజం కక్కించాలి. ముందా ఏర్పాట్లు చూడండి--" అన్నాడు రామం.
"నాకా విషయం ఎప్పుడో స్పురించింది. సరిగ్గా పన్నెండు గంటలకు రంగడు ఆ ఇంటికి వెడతాడు. ఈలోగా నువ్వు నీకు తెలిసింది చెప్పాలి. అది నాకు ఎంతగానో సహకరిస్తుంది. విషయం దాచడం వల్ల వ్యాపారంలో పరిస్థితులు ఒకోసారి ఎంతగానో విషమిస్తాయి--" అన్నాడు విశ్వనాధం.
"ఎవరో నన్ను ఫోన్ చేసి బెదిరించారు. నాపేరున ఒక వీణ పెట్టి మనింటికి చేరుతుందిట. అందులో ఒక శవం ఉంటుందట. ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా వదుల్చుకోవడం నా బాధ్యతట. ఈ విషయం రహస్యంగా ఉంచకపోతే నా ప్రాణాలకే ప్రమాదం --' అన్నాడు రామం.
విశ్వనాధం అంతా సావధానంగా విని -- "అయితే ఇదంతా ఎవరో తెలివిగా ఆడిన పన్నాగం. నాకు రహస్యమైన సరుకు కొంత చేరవలసి వున్నది. అది నా మిత్రుడు వీణ పెట్టె లో పంపాడు. ఈ రహస్యం ఎవరో తెలుసుకుని ముందే నీకు ఫోన్ చేసి బెదరగొట్టారు. నువ్వు భయపదిపోయావు. ఫలితంగా పెట్టి పక్కింటికి చేరింది. అక్కణ్ణించి వాళ్ళేలాగో దాన్ని సంగ్రహించుకుని పోయారు. ఆ తర్వాత ఇంట్లో కలతలు రేపడం కోసం ఓ అమ్మాయిని పంపారు.
మీ అమ్మ దగ్గర నా పరువు కాపాడు. ఆ పిల్ల నీ కోసమే నని చెప్పు. చెప్పమన్నాను కదా అని వెధవ్వేషాలు వేస్తె కన్న కొడుకునని కూడా జాలి తలచను. అమ్మ నీ తప్పునైతే క్షమిస్తుంది. కానీ నా తప్పును క్షమించదు. అందుకని ఈ అబద్దం చెప్పమంటున్నాను తప్పితే నిన్ను అల్లరి చిల్లరిగా తిరగమనడం లేదు. మనం అల్లరి పెడుతున్న వారెవరో ఆచూకీ తెలిస్తే మాత్రం నాకు చెప్పడం మరిచిపోకు ...."
రామం తండ్రి మాటలు శ్రద్దగా విన్నాడు. సునంద తండ్రిని అల్లరి పెట్టాలను కుంటుందా? ఎందుకు?
సునంద వ్యవహారం మొత్తం తమాషాగా వుంది.
పరీక్ష పేరు చెప్పి ఓ ప్రియుడ్ని హత్య చేసింది. మరో ప్రియుడ్ని హత్యా నేరం మోయమంది. తమ ఇంటికి వచ్చిన వీణ పెట్టె ని ఆమె కాజేసిందా? తండ్రికి వీణ పెట్టె లో ఏదో వస్తుందని ఆమెకు ముందుగానే తెలుసా? తెలిసే ఈ నాటకమంతా ఆడిందా?
అయితే బీచి వద్ద తనే ఆమెను పలకరించాడు తప్పితే ఆమె తన వంక నైనా చూడలేదే! ఇదామే ఆడిన నాటకమెందుకవుతుంది?
ఇంతకీ తను తండ్రికి సునంద పేరు చెప్పాలా అక్కర్లేదా?"
రామానికి నిద్ర పట్టలేదు. రాత్రి పన్నెండు గంటలకు పక్కింటి అబ్బాయిలకు నాలుగు తగిలించి రంగడు తీసుకొచ్చే సమాచారం తెలుసుకోవాలని అతడికి చాలా కుతూహలంగా వుంది.
రంగడంటే ఆ ఊరిలోని రౌడీ లందరికీ కూడా సింహ స్వప్నం. వాడికి ఏనుగు బలం. ప్రత్యర్ధిని ఎదుర్కొనడం లో సింహం బుర్ర. వాడు సరదాగా వీపు మీద తడితే రక్తం కక్కుటుంటారని చెప్పుకుంటారు. మనిషి చూడ్డానికి కూడా మహా భయంకరంగా వుంటాడు.
పక్కింటి అబ్బాయిలు అతడ్ని చూడగానే నేరం ఒప్పేసుకుంటారని రామం అనుమానం.
సరిగ్గా పన్నెండుం పావుకి రంగడు ఆ యింట్లోకి వచ్చాడు. వాడి బట్టలు చిరిగి వున్నాయి. పెదవి చిట్లి రక్తం కారుతోంది. జుత్తంతా రిగిపోయి వుంది. మనిషి ఆయాసంతో రొప్పుతున్నాడు. వాడి చేతిలో ఓ కవరు వుంది.
"కలియుగం లో కూడా దేవుడు అవతారమెత్తాడు. లేకపోతె ఈ రంగడిని కొట్టడం మానవమాత్రుడి వల్ల అయ్యే పని కాదు -"అన్నాడు రంగడు.
"{దెబ్బలు తినోచ్చి ఇంకా ప్రగల్భాలు దేనికి?' అన్నాడు విశ్వనాధం.
"తన ఇస్త్రీ మడత కూడా నలక్కుంటా నన్నిలా కొట్టాడు సార్! వాడు మానవమాత్రుడంటే మీరు నమ్ముతారా?" అన్నాడు రంగడు.
నమ్మడం కాస్త కష్టమే- "అసలేం జరిగిందో చెప్పు. తర్వాత వాడు దేవుడో మనిషో ఆలోచిద్దాం -" అన్నాడు విశ్వనాధం.
"నేనాయింట్లో అడుగు పెట్టబోగా -- గుమ్మం దగ్గిరే ఓ నీటైన మనిషి తగిలాడు. లోపలకు వెళ్ళవద్దన్నాడు. నేను వేడతానన్నాను. వెడితే ఏం జరుగుతుందో తెలుసా అన్నాడు. తెలియదన్నాను. రెండే రెండు నిమిషాల్లో నన్నిలా చేసి నా చేతిలో ఈ కవరు పెట్టి విశ్వనాధం గారికి ఇమ్మన్నాడు...."
విశ్వనాధం ఆత్రుతగా కవరు అందుకున్నాడు.
మిస్టర్ విశ్వనాధం!
మీ పక్కింటి వాళ్ళ జోలికి వెళ్ళడం నీకు మంచిది కాదు. మీ ఇంట్లో ఓ బాంబుంది. వాళ్ళ జోలికి వెడితే ఆ బాంబు పేల్తుంది. నీకు శాంపుల్ కావాలంటే ఇంకోసారి మీ మనిషిని వాళ్ళింటికి పంపి చూడు. శాంపుల్ గా ఓ గది పేలిపోతుంది.
ప్రస్తుతానికి ఇంతే విశేషాలు.
ఇట్లు,
నిన్ను మించిన మనిషి."
రామం కూడా ఆ ఉత్తరం చదివాడు. అతడికి వళ్ళంతా వణుకు పుట్టింది. తమ యింట్లో బాంబుందా?ఎక్కడ?
అతడేదో అనబోగా విశ్వనాధం మాట్లాడవద్దన్నట్లు సైగచేశాడు.
"నేనిప్పుడెం చేసేది సార్ !అన్నాడు రంగడు.
"హాయిగా ఇంటికి పోయి పడుకో! పొరపాటున కూడా ఆ యింటి జోలికి మరోసారి వెళ్ళకు...."అన్నాడు విశ్వనాధం.
రంగడు వెళ్ళిపోయాడు.
"మనమిప్పుడెం చేయాలి నాన్నా!" అన్నాడు రామం.
"నువ్వు పోయి పడుకో!" అన్నాడు విశ్వనాధం.
9
రాత్రంతా సరిగ్గా నిద్రలేదేమో రామానికి మెలకువ వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. కానీ విశ్వనాధం కంటే ముందే లేచాడు.
టైము ఎనిమిదన్నర యింది . విశ్వనాధం ఇంకా నిద్ర లేవలేదు.
ఆ సమయంలో ఇంటి కెవరో వచ్చారు. మనిషికి యాభై ఏళ్ళుంటాయి. బుగ్గ మీసాలు, రామాని కాయన్నేప్పుడూ చూసిన గుర్తు లేదు.
"నా పేరు కాంతారావు. మీ నాన్న ఉన్నాడా?"అన్నాడాయన.
"ఇంకా నిద్ర లేవలేదండి. మీరెవరు?" అనడిగాడు రామం.
"మేమిద్దరం బాగా స్నేహితుతం!"
"నాకు మిమ్మల్నేప్పుడూ చూసిన గుర్తు లేదే!" అన్నాడు రామం.
"మీ నాన్న స్నేహితులందర్నీ నువ్వు చూడడమెందుకూ? నీ తెలితేటలూ మీ నాన్న తెలివితేటల్లాగే ఏడిశాయి. అసలు నేనీరోజైనా వచ్చి ఉండేవాడ్ని కాదు. అంతా మీ నాన్న తెలివితక్కువ వల్ల వచ్చింది --" అన్నాడాయన విసుగ్గా.
వాటం చూస్తుంటే తండ్రిని బాగా ఎరిగున్న వాడి లాగున్నాడు. రామం ఆయన్ను కూర్చోమని చెప్పి వెళ్ళి తండ్రిని నిద్ర లేపాడు.
విశ్వనాధం కళ్ళు నులుముకుంటూ లేచి -- "ఏమిట్రా గొడవ -- అసలే రాత్రంతా నిద్రలేదు -"అన్నాడు.
"ఎవరో కాంతారావుగారుట...."
