"ఇది ఆటోమేటిక్ కెమేరా.......మనమేమీ చేయనక్కర్లేదు! లైటు దానంతటదే అడ్జస్టయిపోతోంది. ఫోకస్ చేయడం-క్లిక్ మనిపించడం - అంతే!" - అన్నాడు రంగనాధం.
"నిజంగా!" - అన్నాడు తను.
"ఓ రీలు కొనేశారు. అప్పుడే ఇరవై ఫోటోలదాకా తీసేశారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుంది ఈయన వ్యవహారం-" అంది కాంతిమతి.
"పైన ఫ్లాష్ షూ పక్కన ఇంకో స్విచ్ కనబడుతోందేమిటి?"
"దాని గురించి నువ్వడక్కూడదు. నేను చెప్పకూడదు."
"ఇంతకీ ఆ కెమేరా ఎక్కడిది?"
"అదికూడా నువ్వడక్కూడదు. నేను చెప్పకూడదు."
తనకు చిరాకు కలిగి ఏమైనా సాయం చేస్తుందేమోనని కాంతిమతి వంక చూశాడు. ఆమె ఏ సమాధానమూ ఇవ్వకుండా అన్నం వడ్డించింది.
ఆ రాత్రి అతనా దంపతులతో రెండు ఫోటోలు తీశాడు. వాళ్ళింట్లో భోంచేస్తూండగా అంతా కలిసి సెల్ఫ్ టైమర్ తో ఓ ఫోటో తీసుకున్నారు కూడా.
ప్యాకెట్ ట్రాన్సిస్టర్ మాత్రం తను అంతకు క్రితం రోజునే సాంబమూర్తి దగ్గర చూశాడు. సాంబమూర్తికి పాకెట్ ట్రాన్సిస్టర్ లేదు. ఎప్పుడూలేనిదీ అతనా రోజున ఆఫీసులో మధ్యాహ్నం లేటెస్టు వార్తల గురించి మాట్లాడితే-ఎలా తెలిసిందని తనడిగాడు. అప్పుడు సాంబమూర్తి తన దగ్గరున్న పాకెట్ ట్రాన్సిస్టర్ చూపించాడు.
ఎలా వచ్చిందని అడిగితే చెప్పలేదు. నవ్వి వూరుకున్నాడు. తనూ నొక్కించలేదు.
అది మామూలు ట్రాన్సిస్టర్లాలేదు. దానికి కొన్ని అడిషనల్ స్విచెస్ కూడా వున్నాయి. అవేమిటో సాంబమూర్తికి తెలియవని తనకు తెలిసిపోయింది.
ఈ మూడు వస్తువులూ తప్పక ఆ స్మగ్లర్ కి సంబంధించినవే అయుంటాయి. స్మగ్లర్ కి సంబంధించిన ఆ మూడు వస్తువుల గురించిన ప్రకటన తను పేపర్లో చదవడమూ, తనకా మూడు వస్తువులూ తటస్థపడడమూ కాక తాళీయం కావచ్చు. కానీ అవి స్మగ్లర్ వి కాకుండా పోవు. అవీ ఇవీ ఒకేరకంగా వుండడం కాకతాళీయంగా జరిగుండకపోవచ్చు. పైగా తన మిత్రులు ముగ్గురూ కూడా ఆ వస్తువులు తమ దగ్గర కెలా వచ్చాయో చెప్పడానికి నిరాకరించారు. అంటే ఏదో రహస్యమున్నదన్నమాట!
2
సూర్యారావు ముందుగా రామారావింటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి రామారావింట్లోనే వున్నాడు. అతను కాస్త కంగారుగా కనబడ్డాడు.
"ఈవేళ పేపరు చూశావా?"-అన్నాడు సూర్యారావు సంభాషణ ప్రారంభిస్తూ.
"చూశాను, అందుకే కంగారుగా వుంది....."
"అయితే ఆ బాల్ పెన్ నీకు స్మగ్లరే యిచ్చాడా?"- సూర్యారావు సూటిగా అడిగాడు.
"అతను స్మగ్లరో కాదో తెలియదు. మనిషి బాగా ముసలివాడిలాగున్నాడు. అయిదా ర్రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఈ పెన్నిచ్చాడు. తన కొడుకు వాడేవాడట ఈ పెన్ను. ఆ కొడుకు చనిపోయి ఏడాదయిందట జ్ఞాపకార్ధం ఇది వుంచుకున్నాట్ట. ఈ పెన్నును తన కొడుకీడు వాడి కిచ్చి ఓ వారం రోజులుంచుకోమనాలని ఆయన ఆశయం. ప్రతి ఏటా యిలాగే చేస్తాడట. ఆ విధంగా తన కొడుకు పేరు చాలామంది గుర్తుంచుకుంటారన్నాడు. అప్పుడాయన అన్నీ వివరంగా చెబుతూంటే నాకు నమ్మకంగానే అనిపించింది. కానీ ఈ రోజు పేపర్లో ప్రకటన చూసేక అంతా మోసమేననిపిస్తోంది...." అన్నాడు రామారావు.
"నీ దగ్గరకొచ్చిన ముసలాయనకీ - పేపర్లో ఫోటోకీ పోలికలు లేవా?"
"ఏమో - వున్నాయేమో - పోల్చడం చాలా కష్టం...." అన్నాడు రామారావు.
"కానీ ఆ పేపర్లో మనిషిని నేను చూశాను. అక్కడికి తీసుకువెడతాను. నాతో వస్తావా?" అన్నాడు సూర్యారావు.
రామారావు ఆశ్చర్యంగా మిత్రుడివంక చూశాడు.
"ముందు మనమిగతా మిత్రుల దగ్గరకు వెడదాం-ఆ తర్వాత అంతా కలిసి ఏంచేయాలీ నిర్ణయించవచ్చు....." అన్నాడు సూర్యారావే మళ్ళీ.
ఇద్దరూ కలిసి రంగనాధం ఇంటికి వెళ్ళారు. రంగనాధం కూడా పేపర్లో ప్రకటన చూశాడు.
"ఆ రోజు ఓ ముస్లిం నా దగ్గరకు వచ్చాడు. తన కెమేరాని ఓ వారం రోజులపాటు ముచ్చటైన జంటకివ్వాలని తోచిందిట. అదేదో తన సెంటిమెంటన్నాడు. కెమేరా ఎలా వాడాలో చెప్పాడు. అతను మాట్లాడుతూంటే ఏ విధమైన అపనమ్మకమూ కలగలేదు. కానీ యిప్పుడీ ఫోటో ప్లస్ ప్రకటన చూస్తూంటే నాకు అనుమానంగానే వుంది" అన్నాడు రంగనాధం.
"ఫోటో మనిషికీ-నీకు కెమెరా ఇచ్చిన ముస్లింకీ పోలికలు కనబడుతున్నాయా?"-అడిగాడు సూర్యారావు.
"చెప్పలేను....." అన్నాడు రంగనాధం.
"రీలింకా లోడయ్యే వుందా? లేక అయిపోయిందా?"- అడిగాడు రామారావు.
"ఇంక రెండే రెండు స్నాప్స్ వస్తాయి. మా ఆవిణ్ణి పిల్చి మన ముగ్గురినీ తీసేయమంటాను...." అన్నాడు రంగనాధం.
"సెల్ఫ్ టైమరుందేమో...."
"మనిషుండగా సెల్ఫ్ టైమరెందుకూ-వెధవ బోరు...." అన్నాడు రంగనాధం అతని కిప్పుడు కెమేరా మోజు పూర్తిగా తీరిపోయినట్లు కనబడుతోంది.
అన్ని ఫోటోలూ అయేక రీలు కెమేరాలోంచి బయటకు తీసేశారు. మిత్రులు ముగ్గురూ కలిసి సాంబమూర్తి ఇంటికి వెళ్ళారు.
సాంబమూర్తి పేపర్లో ప్రకటన చూడలేదు. వీళ్ళు ముగ్గురూ కలిసిరావడం అతన్ని ఆశ్చర్యపరచింది. అయితే విషయం విన్నాక అతను మరింత ఆశ్చర్యపడి-"ఇక్కన్నించి పేపర్లో ప్రకటనలు కూడా చాలా జాగ్రత్తగా చూస్తూండాలన్న మాట...." అన్నాడు.
"ఇంతకీ రేడియో...."
"ఎవడో చిన్న ఉద్యోగి-పదిహేను రూపాయలకు నా దగ్గర తాకట్టుకి పెట్టాడు. అలాంటివి నా కలవాటు లేవన్నాను. ముక్కూ ముఖం ఎరగనివాడికి డబ్బెవరిస్తార్సార్ ఈ రోజుల్లో-ఇది తాకట్టు కాదు. నా బాధ్యత నాకు గుర్తు చేయడానికి మీ దగ్గరుంచుతున్న వస్తువు అన్నాడు. అతను మాట్లాడుతున్నంతసేపూ నాకే విధమైన అనుమానమూ రాలేదు....."
