Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 18


    రాత్రి తొమ్మిదిగంటల వేళ నెమ్మదిగా ఆ యింటి వెనక సందులోకి వెళ్ళాను. బొత్తిగా నిర్మానుష్యంగా వుంది. నేనొక్కడినే వున్నానిప్పుడా వీధిలో.
    దొడ్డిగుమ్మం దాకా వెళ్ళి తలుపుసందుల్లోంచి చూశాను. ఎవ్వరూ కనబడలేదు. ఇంట్లో కనీసం వెనకవైపు దీపాలు వెలుగుతున్నట్లులేదు.
    ఓసారి చుట్టూ చూసి గోడ పక్కకువచ్చి రెండుచేతులూ చాపి గోడమీద పెట్టాను. ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి పైకెగిరాను. ఇందులో నాకు చాలా అనుభవముంది. సులభంగా గోడ యెక్కాను. ఎక్కువసేపు అక్కడ నిలబడలేదు. వెంటనే అవతలవైపుకు దూకాను. అంతవరకూ ఏమీ చప్పుడు కాలేదు.
    దొడ్డి అట్టే పెద్దదిగాలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటిని సమీపించాను.
    సహజంగా-ఇంటి వెనుకవైపు తలుపు వేసేవుంది. తలుపు సందుల్లోంచి చూశాను. లోపల అంతా చీకటిగా వుంది.
    నా జేబులోంచి సన్నటి ఇనుప పుల్లను తీశాను. తలుపు సందుల్లోకి దూర్చి గడియను ఎత్తాలని నాప్రయత్నం. నేను యినుప పుల్లను సందులోకి పూర్తిగా దూర్చి అటూ యిటూ కదిపానో లేదో-ఏదో గిన్నె క్రిందబడ్డ చప్పుడయింది.
    ఎవరో పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు వినబడింది.
    జరిగిందేమిటో నాకు అర్ధమయింది. ఆ తలుపుకు అడ్డంగా ఏ కుర్చీయో, బల్లో పెట్టి దానిమీద వరుసగా గిన్నెలు పేర్చివుంటారు.
    నేను ఊపిరి బిగబట్టి పక్కకు తప్పుకున్నాను.
    గిన్నె పడిపోయినంత మాత్రాన ఎవ్వరూ దొంగ అనుకోరు. ఏ ఎలకో తోసేసిందనుకుంటారు. అందుకే తలుపు తీయరు. ఒకవేళ తలుపు తీసే ప్రయత్నం జరిగితే దాక్కు'నేందుకు దొడ్డిలో స్థలమెక్కడ వున్నదా అని పరిశీలించాను. అటువంటిది నాకు కనబడలేదు. మొలలో వున్న బాకుమీద చేయి వేసుకుని చూస్తున్నాను.
    తలుపుకవతల దీపం వెలిగింది. ఓరెండు నిముషాల అనంతరం మళ్ళీ ఆరిపోయింది.
    ఇంకో అయిదునిముషాలాగి నేను యింటిచుట్టూ తిరిగాను. బాత్రూం కనబడింది. ఇంట్లోకి ప్రవేశించడానికి అదే దారి అనిపించింది.
    బాత్రూం దగ్గర చేయి అందేటంత దూరంలో పై గూడు ఉంది. నేను చేతులు జాపి ఎగిరి అందులో దూరాను. తలుపులు మూసివున్నాయి. అవి తెరిస్తే-నేను బాత్రూంలో ప్రవేశించడం పెద్ద కష్టంకాదు. కానీ అవి లోపల కీ బోల్టు వేసివున్నాయి.
    అదృష్టమల్లా ఆ తలుపులు చెక్కఫ్రేములో బిగించబడ్డ అద్దాలు. అద్దాలకు ఆవలపక్క ఏవో రంగు కాగితాలు అంటించివున్నాయి. అద్దానికి మూలగా ఓ చిన్న కన్నం చేయగలిగితే బోల్టు తీసేయడమంత కష్టంకాదు.
    నా జేబులోంచి గ్లాస్ కట్టర్ తీశాను. ఒక నిమిషంలో పని జరిగిపోయింది. అవసరమైన అద్దం కోసేసి బోల్టుతీశాను.
    తలుపు తెరుద్దామనుకుంటూండగా గది ప్రకాశవంతమయింది. అంటే ఎవరో బాత్రూంలోకి వస్తున్నారన్న మాట!
    సాధారణంగా బాత్రూమ్సుకు స్విచ్ బయటవుంటుంది. దీపం వెలిగిన మరుక్షణంలో లోపలికెవరో వస్తారు. రంగుకాగితాల కవతల నేను నీడలా కనబడతానా?
    న్యాయంగా ఈ సమయంలో బాత్రూంకు వచ్చి అన్నీ పరిశీలనగా చూడడం జరుగదు-ఏదైనా అనుమానం వస్తే తప్ప! నేనిప్పుడీ గూట్లోంచి దూకానంటే ఎంతో కొంత శబ్దమవుతుంది. ఒక చిన్న శబ్దంతో నా పథకమంతా తల్లక్రిందులైపోతుంది. రిస్కు తీసుకుని ఇక్కడ కూర్చోవడమే మంచిది.
    లోపల షవర్ విప్పిన శబ్దం వినిపించింది. శ్రద్దగా వినసాగాను. ఏదో కూనిరాగం కూడా వినబడుతోంది. అంటే.....ఆమె స్నానం చేస్తోందన్న మాట!.....
    ఆ క్షణంలో నాకు లోపలికి చూడాలన్న కుతూహలం కలగలేదు. ఆడవాళ్ళ స్నానం ఓ పట్టాన అవదంటారు. ఇలా ఈ గూట్లో నేనెంతసేపు కూర్చోవాలో-నా ఆచూకీ తెలీకుండా ఈ గూట్లో కూర్చోగలనో-లేదో!-అదీ నా బాధ!
    కూనిరాగం కాస్త పెద్దదైంది. ఆమె పాడుతోంది. ఆమె కంఠం చాలా తీయగావుంది. ఆ తీపిని నేనానందించ లేకపోతున్నాను. క్షణం యుగంలా గడుస్తోంది నాకు.
    ఇంతలో నాకు దొడ్డిగుమ్మంవైపు ఓ ఆకారం గోడ మీదకు రావడం కనబడింది. ఆ ఆకారం గోడమీదనుంచి లోపలకు గెంతింది.
    ఎవరైవుంటారు? అతను కూడా నాకులాగే దొంగతనానికి వచ్చేడా? ఇప్పుడతనెక్కడికి వెడతాడు? తిన్నగా నా గూటిదగ్గరకు రాడు కదా.....
    దొంగైనా ఎవరైనా నేనామనిషి కళ్ళబడదల్చుకోలేదు. అస్పష్టంగా ఆకాశం కనబడుతోంది. ఆమె లోపలే-నిలబడి వుంది. షవర్ కట్టేసినట్లుంది. శబ్దంలేదు. మనిషి కదలికను బట్టి వళ్ళు తుడుచుకుంటోందనుకోవచ్చు.
    చటుక్కున జేబులోంచి గుడ్డతీసి ముసుగు మొహానికి తగిలించుకున్నాను. ఇంక నాకు గత్యంతరం లేదు.
    ఏమయితే అయిందనుకుని మొండిధైర్యంతో కిటికీ తలుపులు నెమ్మదిగా తెరిచాను. అటువైపుకు దూరి మళ్ళీ తలుపులు మూశాను. నేనీపని చేస్తూండగా ఏ మాత్రమూ చప్పుడు కాలేదు. నా అదృష్టవశాత్తూ-ఆమె చూపులు ప్రసరించేవైపుకు నీ నీడకూడా పడలేదు.
    అప్పుడే ఆమె వళ్ళు తుడుచుకోవడం అయిందను కుంటాను. వళ్ళంతా తువ్వాలు చుట్టబెట్టుకుని వుంది. ఆమె వెనక్కయినా తిరగలేదు. తిన్నగా బయటకు వెళ్ళిపోయింది. మరుక్షణంలో దీపం ఆరిపోయింది.
    నా అదృష్టాన్ని నేనే అభినందించుకుంటూండగా గది బయటనుంచి తలుపులు వేసిన చప్పుడయింది.
    నా గుండెల్లో రాయిపడింది.
    ఆమె నా ఉనికిని గమనించిందా? ఏమీ ఎరుగనట్లు నటించి అలా చేసిందా? అలాగైతే నాకు పెద్దప్రమాదమే సంభవించవచ్చు.
    కానీ చాలామంది యిళ్ళలో రాత్రిసమయాలలో బాత్రూం తలుపులు వేసేయడం అలవాటుగా వుంటుంది. అది అధికరక్షణ కోసం. నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా-వాళ్ళు నా స్నేహితులే అయినప్పటికీ-వాళ్ళు జాగ్రత్తకోసం తీసుకునే చర్యలన్నీ కూలంకషంగా తెలుసుకుంటూంటాను. అది నా వృత్తి ధర్మం. నాకున్న ఈ పరిశీలనా దృష్టివల్లనే ఇంతవరకూ ఒక్క పర్యాయం కూడా నేను పట్టుబడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS