లాభం లేదు. ఆలస్యం చేస్తే లాభం లేదు. త్వరగా తనే వెళ్ళి ఇంకో డాక్టర్ని ఎవరినైనా తీసుకురావాలి.
పంటి బిగువున కన్నీ రాపుకుంది విశాలి.
"పోనీలే, సత్యం! మీ అమ్మ నో సారిలా పిలు."
మరునిమిషంలో "ఏమమ్మా! ఏమైం"దంటూ సత్యం తల్లి సావిత్రమ్మ రానే వచ్చింది. రెండు ముక్కల్లో వదిన పరిస్థితి వివరించి, "నే నిప్పుడే వెళ్ళి ఎవరినైనా డాక్టర్ని తీసుకొస్తాను. కాస్త వదినని చూస్తూ ఉండండి" అంటూ బయటికి నడవబోయింది.
"అయ్యో! బలేదానివే! నువ్వెందుకూ వెళ్ళడం? మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఎవరినైనా డాక్టర్ని తీసుకురమ్మని ఆయనతో చెపుతాను. వేగిరం వెంట బెట్టుకొస్తారు" అంటూనే సావిత్రమ్మ వెళ్ళి డాక్టరు కోసం వాళ్ళాయనని పంపి మళ్ళీ వచ్చింది విశాలి దగ్గిరికి.
బాధతో మెలికలు తిరుగుతున్న వదిన అవస్థ చూస్తుంటే వర్షించే మేఘాలే అయ్యాయి విశాలి కళ్ళు.
చేతులూ, కాళ్ళూ వణుకుతున్నట్టయింది.
"పైన భగవంతుడున్నాడు." చేతులు జోడించి సన్నగా గొణిగింది సావిత్రమ్మ.
పైన భగవంతుడున్నాడో లేదోగాని, మహాలక్ష్మి పరిస్థితి విషమించింది. ఇది మాత్రం నిజం, మాట్లాడలేకపోతూంది.
చేత్తో సంజ్ఞ చేసి విశాలిని దగ్గిరికి పిలిచింది. అతి కష్టంతో గొంతు కూడదీసుకుంది.
అక్కడే కింద చాపమీద కూర్చుని ఆడుకుంటున్న రాజేంద్రని చూపించి, "నీదే భారం" అంది హీన స్వరంతో.
"నా అడ్డు తీరిపోయిందని చెప్పు మీ అన్నయ్యతో" అంది కన్నీటితో.
ఆపుకోలేని దుఃఖంతో వదినమీద వాలిపోయింది విశాలి.
"వద్దు, వదినా, వద్దు! మమ్మల్ని వదిలి వెళ్ళద్దు. నిన్ను వెళ్ళనివ్వను. డాక్టరు వచ్చి చూస్తారు. నువ్వు మళ్ళీ లేచి తిరుగుతావు-" ఆగకుండా కన్నీరు విశాలి చెంపలమీద స్రవిస్తూనే ఉంది.
ఆగని ఆ కన్నీరు ఆగిపోయే మహాలక్ష్మి గుండెని ఆడించలేకపోయింది. అంతా క్షణాల్లో అయిపోయింది. వచ్చిన డాక్టరు వచ్చినట్టే తిరిగి వెళ్ళాడు, తన అవసరం లేక.
రాజేంద్రని అక్కున చేర్చుకుని విలపిస్తూ కూర్చుంది విశాలి.
ఇంతలో రానే వచ్చాడు రామం.
కలుసుకుందామని నిర్ణయించుకున్న స్థలానికి విజయ రాకపోవడంతో, ఎంతోసేపు ఎదురుచూసి, చివరికి ఇంటికి వచ్చేశాడు రామం. సావిత్రమ్మ కళ్ళు ఒత్తుకుంటూ రామానికి అంతా చెప్పి, ఇంటికి వెళ్ళిపోయింది. రామంలో అణిగి ఉన్న మానవత్వం ఆ క్షణంలో ఉవ్వెత్తున పొంగింది.
కాసేపు తను మహా పాపి ననుకున్నాడు. తనని తనే తిట్టుకున్నాడు.
మరికొంతసేపు ఈ చావుకి తను ఏమాత్రం బాధ్యుడు కాదనుకున్నాడు. వ్రాసి పెట్టి ఉన్నది జరిగింది. అంతే అనుకుని ఓ నిట్టూర్పు వదిలాడు.
ఏది ఏమైనా ఇది కొంత కాకపోతే కొంతైనా విచారించవలసిన విషయమె నని మాత్రం నిశ్చయించుకున్నాడు చివరికి. చెల్లెలి ముఖం చూడటానికి భయం వేసి అన్నయ్య, అన్నయ్య ముఖం చూడటానికి అసహ్యం పుట్టి చెల్లెలు ఆ రోజుకి పరాయివాళ్ళయిపోయారు.
* * *
రాజేంద్రని నిద్ర పుచ్చడానికి పక్కన కూచుని జోకొడుతూ, వదిననే తలుచుకుని ఆలోచనల్లో మునిగిన విశాలి, సువర్ణ రావడం గమనించనే లేదు.
తన రాక తెలియజేస్తూ మెల్లగా దగ్గింది సువర్ణ.
"నువ్వా! రా!" మౌనంగా తల దించుకుంది విశాలి కన్నీటిని దాస్తూ.
"నీ బాధలో పాలు పంచుకుందామని వచ్చాను." సువర్ణ మాటలకి బలవంతంగా నవ్వింది విశాలి.
"అంతా వట్టిది, సువర్ణా! ఒకరి బాధలో ఒకరు పాలు పంచుకోవడమన్నది మనం కల్పించుకున్న భ్రమ. అది పైకి వినిపించే మాట మాత్రమే! అవునా! కాదా!"
"నువ్వేనా, విశాలీ, ఇలా మాట్లాడుతున్నది?"
"నన్ను క్షమించు, సువర్ణా! ఉన్న మాట చెప్పాను. అనుభవం నాకు నేర్పిన పాఠం ఇది. అంతేకాని నీ మీద నింద వెయ్యాలని కానీ, నిన్ను బాధ పెట్టాలని కానీ అలా అనలేదు."
తేలిగ్గా నిట్టూర్చింది సువర్ణ.
"నాకు తెలుసు, విశాలీ! నువ్వేం మాట్లాడినా నేను సరిగ్గా అర్ధం చేసుకోగలను. అపార్ధం చేసుకోవడమన్నది ఎన్నడూ లేదు."
కొంతసేపు ఇద్దరికీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు.
చటుక్కున ఏదో గుర్తు కొచ్చినట్టు తల ఎత్తి సూటిగా సువర్ణ కళ్ళలోకి చూస్తూ అడిగింది విశాలి: "రాజేంద్రని పెంచి పెద్ద చేసే భారం నామీద పెట్టింది వదిన మనఃస్ఫూర్తిగా నాకిష్టమైన పనే అది. కానీ, మా ఇద్దరి కోరికా తీరనిస్తాడంటావా అన్నయ్య?"
"మహారాజులా! అతనికి మాత్రం కావలసిందేముంటుంది ఇంతకన్నా! ఇప్పటికన్నా ఎక్కువగా వీథిన పడి తిరుగుతాడు." విశాలిమీద జాలి, రామం మీద కోపం కలిసి చిత్రంగా ధ్వనించింది సువర్ణ గొంతు-
మరికొంచెంసేపు కూర్చుని, వెళ్ళడానికి లేచింది సువర్ణ.
ఆప్యాయంగా స్నేహితురాలి చేతి నందుకుంది విశాలి. "మీ బావ సంగతి..." తృప్తిగా చూశాయి సువర్ణ కళ్ళు. వింత కాంతితో వెలిగాయి.
నేలమీద కాలి బొటనవేలితో రాస్తూ చిన్నగా అంది: "ఇప్పుడే గొడవా లేదు. హాయిగా ఉంటున్నాం. అదంతా ఓ కథ. ఇంకో సారెప్పుడైనా చెపుతాను నీకు."
"సంతోషం. మళ్ళీ ఎప్పుడు దర్శనం?"
"నీ కోసం రోజూ రమ్మన్నా వస్తాను." నవ్వింది సువర్ణ.
"వద్దులే! అంత పని చెయ్యకు. రోజూ మా ఇంటికి రప్పించుకుంటున్నందుకు, సరసన నువ్వు లేనందుకు నా మీద కోపం వచ్చేను మీ బావకి."
"మరే, పాపం!"
* * *
కాలం గడిచిపోతూంది.
కొందరికి కాలం పరుగెడుతునట్టనిపిస్తే, మరి కొందరికి నత్తనడకలా ఉంటుంది కాలగమనం. ఈ తేడా పరిస్థితులను బట్టి ఉంటుంది తప్ప నిజానికి ఎప్పుడూ కాలం ఓకే రీతిలో నడుస్తుంది.
ఆ రోజెందుకో విశాలి కెన్నడూ రాని ఆలోచనలు మనసంతా ముసురుకొంటున్నాయి. చికాకనిపిస్తూంది. భోజనంకూడా సరిగా చెయ్యలేకపోయింది.
ఏదైనా పుస్తకం చదువుకుంటే కాస్త మనసుకి శాంతి దొరుకుతుందని చేతి కందిన పుస్తకం తీసుకుని, రాళ్ళపల్లి వారి గేయం మనసులో మెదులుతూండగా కుర్చీలో వెనక్కి వాలింది కళ్ళు మూసుకుని.
"పూల బూజింపుమని నిద్ర మేలుకొలిపి
తట్టలో గాయమొగ్గలు పెట్టినావు!
నిశ్చలంబుగ మదిని ధ్యానింపుమనుచు
కుంటి ముక్కాలి పీట జేకూర్చినావు!
పరవశంబుగ గొంతెత్తి పాడుమనుచు
తెగిన తంబుర చేతి కందిచ్చినావు!"
"ఎంత బాగా రాశాడు కవి! భగవంతుడి లీల ఈ చిన్ని గేయంలో ఇమిడి ఉంది. అవును! బ్రతకమని ఈ భూమిమీద నన్ను పడేశాడు. బ్రతకాలనే ఆశ మనసులో లేకుండా చేశాడు. కష్టాలే తప్ప సుఖమన్నది లేకుండా చేసి వినోదం చూస్తూ కూర్చున్నాడు.
తన ఈడువాళ్ళ, తన స్నేహితురాళ్ళ జీవితం వేరుగా ఉంది. వాళ్ళ జీవితం పోవలసిన మార్గంలో పోతూంది. కానీ, తన జీవితం? తన మార్గం, పయణం రెండూ కష్టమైనవే. ఒక్క రాజేంద్ర కోసం తప్ప లేకపోతే తను బ్రతికి ఉండవలసిన అవసరం ఏముంది? వీడిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత తనది. ఆ బాధ్యాత తను మనఃస్ఫూర్తిగా తీసుకున్నదే. అందుకే తను బ్రతకాలి. అంతే తప్ప తన అవసరం ఇంక ఎవరికీ లేదు.
'భగవాన్! జీవితంమీద విరక్తి కలిగించకు. జీవించ డానికి శక్తినివ్వు.' బలవంతాన ఆలోచనలని బంధించి చేతిలో పుస్తకం తిరగేసింది. కళ్ళెదురుగా పుస్తకంలో గేయం.
"మింట నెచటనొ మెరయు చుక్కల
కంట జూచితి కాంక్షలూరగ
కాంక్షలూరిన కొలది చుక్కలే
కాంచి బ్రతుకే గడిపితిన్..."
కృష్ణశాస్త్రి గేయం తన మనసులో బాధని బుజ్జగించింది. ఆ గేయాన్ని తన కన్వయించుకుంది విశాలి.
అవును! తన మనసులో మెరిసే చుక్క రాజేంద్ర! అన్నయ్య స్నేహితుడు రాజేంద్ర. అతనే! అతనే తన కంటిముందు మెరిసే అందరాని చుక్క.
ఏవేవో ఆలోచనలు, ఎన్నడూ కలగని ఊహలు, ఎన్నెన్నో కాంక్షలు కలుగచేస్తున్న చుక్క అతను.
ఆ ఆలోచనల్లోనే తేలిపోతూ, ఆ చుక్కనే ఆరా ధిస్తూ జీవితం తీయగా గడపాలి తను. అంతే! అంతే!
స్రవించే కన్నీటిని కొనగోటితో విదిలించింది విశాలి.
"విశాలీ!" అన్న రామం గొంతు, తలుపు తట్టిన చప్పుడు ఒక దానివెంట ఒకటి వినవచ్చాయి.
తలుపు తీసిన విశాలి తెల్లబోయి నిలబడింది, రామం వెనకే నిలబడ్డ యువతిని చూస్తూ.
"అడ్డుగా నిలబడితే లోపలికి ఎలా వస్తాం?
తప్పుకోవాలని తెలియదూ?" కళ్ళెర్రజేసి చూశాడు రామం.
సిగ్గుతో, అవమానభారంతో లోపలికి నడిచింది విశాలి.
"రా! విజయా! ఈ వేళ మా ఇల్లు పావనం అయిందన్నమాటే అవునా?" తన గదిలోకి విజయని తీసుకెళ్ళి కుర్చీ చూపించాడు రామం.
విశాలి చూపులు హృదయంలో నాటుకోగా, చెదిరిన మనసుతో కిటికీలోంచి బయటకి చూస్తూ నిలబడి పోయింది విజయ.
"విశాలీ! కాఫీ తీసుకురా! కూర్చో, విజయా, నిలబడే ఉన్నావేం?"
"రామం!" మొట్టమొదటిసారిగా అప్రయత్నంగా పేరుతో పిలిచింది విజయ.
రామంతో కలిసి సినిమాలకీ, షికార్లకీ తిరిగినా ఇంతవరకూ అతన్ని పేరుతో పిలవడం జరగలేదు.
పులకించి పోయాడు రామం ఆ పిలుపుకి. క్రీగంట చూసి నవ్వాడు.
"నా గురించి మీ అభిప్రాయం ఏమిటి?" స్థిరంగా పలికింది విజయ.
పకపకా నవ్వాడు రామం. "భలేదానివే! ఇన్నాళ్ళనించీ చూస్తున్నావు. నా మనసులో ఏముందో తెలియనట్టు అలా అడుగుతావేమిటి?"
"మీ మనసులో ఏముందో నాకు తెలుసు. కానీ, నా మనసులో ఏముందో మీకు తెలియదు. నా గురించే మీకు తెలియదు." సన్నగా తనలో తనే గొణుక్కుంది విజయ.
"అయినా ఈవేళ నీకీ సందేహం ఎందుకొచ్చింది, విజయా? నిన్నొక్క రోజు చూడకపోతే నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది. నవ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఆ సంగతి నీకు తెలియదూ?"
'తెలుసు! తెలుసు! అదే నా క్కావలసింది.' కసిగా మనసులోనే అనుకుంది విజయ.
రామం చెప్పే మాటలకి ముక్తసరిగా ఊ కొడుతూ, ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండిపోయింది.
ఇంతలో కాఫీ తీసుకొచ్చింది విశాలి రెండు కప్పులతో. వెనకే వచ్చాడు రాజేంద్ర మెల్లిగా, భయం భయంగా.
రామంవైపు ఒకసారి చూసి, అతని ముఖంలో భావాలు కనిపెడుతూ, "రా, బాబూ!" అంటూ రాజేంద్రవైపు చేతులు చాచింది విజయ. అదే మొదటిసారి ఇద్దరూ ఒకరి నొకరు చూడటం. అయినాకూడా విజయ దగ్గిర కొత్త లేకుండా "నా క్కూడా కాఫీ ఇత్తావా?" అంటూ ముద్దు ముద్దుగా అడుగుతూ విజయ ఒడిలోకి చేరాడు రాజేంద్ర. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి వాడికి.
రోజూ వాడి ముద్దు మాటలకి మురిసిపోయేది విశాలి ఒక్కతే.
ఈ రోజు విజయని కూడా తన ముద్దు ముద్దు మాటలతో మురిపించాడు వాడు.
"వీడిని తీసుకెళ్ళు, విశాలీ!" ఎక్కడ లేని చిరాకూ ధ్వనించింది రామం గొంతులో.
"ఫరవాలేదు. ఉండనివ్వండి. మీరుకూడా కూర్చోండి." నవ్వుతూ విశాలి వైపు చూసింది విజయ.
రామం చూసే చూపులు భరించలేక, "లోపల కొంచెం పనుంది" అంటూ వంటింట్లో కొచ్చి పడింది విశాలి.
ఎవరా అమ్మాయి? అర్ధంకాక తల్లడిల్లి పోయింది మనసు.
అన్నయ్య ఇంత ఘోరం ఎలా చెయ్యగలిగాడు? అప్పుడే మనసు తెరల్లోంచి వదిన జారిపోయిందా? అవును! వాళ్ళూ వీళ్ళూ అన్నయ్య ప్రవర్తన గురించి అప్పుడప్పుడు అనుకునే మాటలు అడపా తడపా చెవుల్లో పడుతూనే ఉన్నాయి. కానీ, ఈ రోజు కళ్ళారా చూసేవరకూ తన మనసు నమ్మలేకపోయింది.
ధైర్యంగా ఇంటికే తీసుకొచ్చాడంటే ఇంకొద్ది రోజుల్లో పెళ్ళికూడా చేసుకుంటాడేమో? చేసుకోనీ! ఇంతా అయిన తరవాత ఇంక పెళ్ళాడితే తప్పేముందీ? భారంగా నిట్టూర్చింది విశాలి.
రాజేంద్ర విజయ కప్పులో కొద్దిగా కాఫీ రుచి చూసి ఇంక చాలని చెయ్యి తిప్పాడు. నవ్వుతూ మిగిలిన కాఫీ తను తాగింది విజయ.
రాజేంద్ర చెప్పే కబుర్లు వింటూ, ముద్దుమాటలకి ముచ్చటపడుతూ కూర్చుంది.
వాళ్ళిద్దర్నీ చూస్తూ మౌనంగా కూర్చున్నాడు రామం.
కొంతసేపటికి ఇంక ఓపిక నశించినట్టు చటుక్కున లేచాడు. "చాల్లే, విజయా! వాడితో కబుర్లేమిటి? అందుకోసం తీసుకొచ్చానా నిన్నిక్కడికి?"
నవ్వాపుకుంది విజయ. "లేకపోతే మీతో కబుర్లు చెప్పడానికా? మీతో రోజూ చెపుతూనే ఉన్నాగా? ఉండు, బాబూ! ఇంక నే నింటికి వెళ్ళవా మరి!" ఒడి;లోంచి రాజేంద్రని దింపి లేచింది.
"ఊఁ ఊఁ ఒద్దు."
"మళ్ళీ వస్తానుగా!"
"మళ్ళీ రేపొత్తావా?" కళ్ళు తిప్పుతూ ఆశగా అడుగుతున్న వడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది విజయ. "ఆఁ వస్తాను. ఎందుకు రానూ?"
* * *
ఆ రాత్రి విజయకి నిద్ర పట్టలేదు.
* * *
