Previous Page Next Page 
మూడుముళ్ళూ పేజి 18

                              

                                    9

    గవర్రాజు, 'కామేశ్వరి' ఐశ్వర్యాన్ని ప్రత్యక్షంగా చూశాడు! పెద్ద మేడా, ముందర చక్కని పూలతోటా! అందమయిన కారూ! ఇంతకన్నా స్త్రీకి ఏం కావాలి! గవర్రాజుకీ మనసులో ఏ మూలో చీపురు ముల్లు గుచ్చుకున్నట్లు అనిపించింది. 'నువ్వు వట్టి దౌర్భాగ్యుడి విప్మా!' అని కామేశ్వరి పగలబడి నవ్వు తూన్నట్లు అన్పించింది గవర్రాజుకి. 'ఛ! తనదేం జీవితం! బోలెడు డబ్బు కూడ బెట్టుతున్నాడు! కాని తను 'గృహస్థు' కాలేకపోతున్నాడు! తన డబ్బెందుకు! తగలబెట్టనా!' అని విసుక్కున్నాడు! ఆకస్మాత్తుగా అతనికి సుభద్ర జ్ఞాపకం వచ్చింది! ఆమెనైనా తన కిస్తే బాగుండును! అనుకున్నాడు! కాని నల్లని కామేశ్వరినే తన కిచ్చి పెళ్ళి చేయటానికి అడగలేదు! అల్లాంటిది చలాకీ పిల్ల సుభద్ర నిస్తారా! అని నిరాశ పడ్డాడు! కాని 'ఆశ దోష మెరుగదు' అన్న నానుడినించి గవర్రాజు సుభద్రని అడగాలనుకున్నాడు. ఈసారి వాళ్ళంతట వాళ్ళే అడగాలనే నియమంలేకుండ సుభద్రనే మంచి మాటలాడాలి అనుకున్నాడు. గవర్రాజు హోటలు వినోదాలో తనకున్న వాటా మీద వచ్చిన లాభం అంతా పెట్టి పట్నంలో మంచి మేడ కొన్నాడు. అన్న లిద్దరూ ఎంతో సంతోషించారు. ఇల్లూ వాకిలీ, పొలమూ పుట్రా అన్ని ఏర్పరచుకుంటున్నందుకు తమ్ముడ్ని అభినందించారు! వదిన లిద్దరూ తమ పుట్టింటి వేపు వున్న సంబంధాలను చేసుకొమ్మని చెప్పారు.
    'అల్లాగే చూద్దాం!' అన్నాడు గవర్రాజు.
    సుభద్రకి సిక్స్త్ ఫారం పరీక్షపోయింది. ఇంక కట్టలేదు. ఇంట్లోనే కూర్చుంది! సుభద్రకి కూడా, పెళ్ళివారు వస్తూన్నారు. వెళ్తున్నారు! కామేశ్వరికి పెళ్ళి కాక మునుపు పెళ్ళిచూపులకు వచ్చిన వారంతా, సుభద్ర చాలా బాగుందనీ, ఆ చిన్నమ్మా యిని ఇస్తే చేసుకొంటామనీ, అనేవారు! అప్పుడు నరసయ్య; జగదాంబ, పెద్దమ్మాయికి అయితే కాని చిన్నమ్మాయికి చేయమని చెప్పేవారు. కామేశ్వరిని చూసుకుందుకు వచ్చిన వాళ్ళంతా సుభద్ర నచ్చిందనటంతో నరసయ్య, జగదాంబా, సుభద్ర పెళ్ళి, కామేశ్వరి పెళ్ళి అయిన మరుక్షణం చేసేయొచ్చనీ, సుభద్ర అందానికి ప్రతివాళ్ళూ, ముగ్ధులై పోతున్నారనీ, సుభద్రని పెళ్ళి చేసుకుందుకు, సంబంధాల వాళ్ళు, క్యూలో నిల్చుంటారనీ అనుకున్నారు. కాని సుభద్రని చూసుకుందుకు వచ్చిన వాళ్ళుకూడా, మూడువేలూ, అయిదువేలూ, అంటూ, కట్నాలు బేరాలు సాగించే సరికి జగదాంబకీ, నరసయ్యకీ మతులుపోయినంత పనయింది! పిల్ల అందమయినదయితే, పిల్ల నచ్చకపోవటం అంటూ వుండదు. కానీ కట్నం అక్కర్లేకుండా, చేసుకునే వాళ్ళు ఎవరున్నారు! అందులో, నరసయ్య తన రెండో కూతురు, అంద,మైనది అన్న అభిమానంతో, మంచి ఆస్తిపాస్తులున్న వారిని, డాక్టరు కోర్సు చదివిన వారినీ, ఇంజనీర్లనీ, పెళ్ళి చూపులకు పిలుచుకు వచ్చేవాడు! తన కూతురు అందం చూసి, మూర్చబోయి, ఆ పిల్లని తప్ప ఇంకెవర్నీ పెళ్ళాడమని పట్టుపట్టి కట్నాలు అడగనివ్వరనీ అనుకొనేవాడు! కాని ఆ డాక్టర్ల ఇంజనీర్ల తల్లి తండ్రులు, తమ కొడుకులకి ఉగ్గుపాలతో అయిన ఖర్చు అంతా ఏకరువుపెట్టి, పదివేలు రూపాయలతో మొదలుపెట్టి, పాతికవేల రూపాయిల దాకా పాట పెంచేవారు! జగదాంబ కళ్ళకి, వాళ్ళు సౌందర్య దృష్టి తెలీని మూర్కుల్లా అగుపించేవారు! సుభద్రకి పెళ్ళికొడుకులంటే ఒకవిధమైన చులకన భావం ఏర్పడింది! ఏమాత్రం, తన అందం వాళ్ళని కదిలించలేకపోతోంది! వాళ్ళ చదువులు ఎందుకు? సౌందర్యాన్ని ఆస్వాదించలేని వాళ్ళ పెద్దవుద్యోగాలెందుకు? ఏ పాతికవేలో కట్నం ఇస్తే, ఒక కురూపిని. కట్టుకుని, దాన్ని ఇంట్లో అట్టేపెట్టి, నర్సులతోనూ, చిన్నవుద్యోగినులతోనూ, సరసాలు సాగిస్తారు! డబ్బు కావాలి వాళ్ళకి! అందచందాలు, వయసు సొగసులూ, వాళ్ళకి అక్కర్లేదు! అలాంటివాళ్ళు తన్ని చేసుకోకుండ వుండటమే తనకి అదృష్టం! ఈమధ్య సుభద్రకి చదువులేకపోవటంనించి తీరిగ్గా ఇంట్లో కూర్చుని, డిటెక్టివ్ నవలలూ, చవుక బారు ప్రేమ కధాసాహిత్యం చదువుతూ కాలం గడుపుతోంది. ఇప్పుడామె తన అందాన్ని మెచ్చుకొంటూ, కవిత్వం మాట్లాడగల యువదర్శనంకోసం తహతహ లాడుతోంది.
    గవర్రాజుని చూడగానే, జగదాంబ అంది.
    'ఏం రాజూ! కామేశ్వరి కులాసాగానే వుందా! ఎప్పుడు పంపుతానన్నారు?'    
    'వేసంగిలో పంపుతానన్నారు! అల్లుడు కూడా, నన్ను చాలా మర్యాదచేసి భోజనం చేస్తేకాని వెళ్ళవద్దని చాలా పట్టుపట్టారు!' అన్నాడు గవర్రాజు.
    'ఇన్ని రోజులుండి పోయావేం రాజూ!' అంది జగదాంబ వారంరోజులు క్రితం నరసయ్య ఎక్కడో ఆయుర్వేద వైద్య పరిషత్తు సభలు జరుగుతూంటే వెళ్ళాడు. ఈ వారంరోజులూ, పిల్లలు ముగ్గురినీ పెట్టుకొనీ ఒంటిగా వుంది. జగదాంబ!
    'గవర్రాజు వస్తాడు కదా! వస్తే ఎల్లానూ వీధిగదిలో వుంటాడు కదా! ఇంక భయం ఎందుకు?' అన్నాడు నరసయ్య. గవర్రాజు వారంరోజులకి కాని రాలేదు.    
    'అక్క డొక ఇల్లు కొన్నానండి! రిజిస్ట్రేషనూ అదీ అయ్యేసరికి వారంరోజులయిపోయింది!' అన్నాడు గవర్రాజు.
    'ఇల్లు కొన్నవా! ఎంతపెట్టి కొన్నావ్!' అంది జగదాంబ ఆశ్చర్యంగా. ఒక కిళ్ళీ కొట్టు పెట్టుకొని కాలం గడిపేవాడు పట్నంలో ఒక ఇల్లు ఎల్లా కొన్నాడు? ఆశ్చర్యపోయింది. బహుశా ఏదో కొట్టుపెట్టుకుందుకు వీలుగా చిన్నగది పట్టు ఏదో కొనివుంటాడనుకుంది.
    'ముఫ్ఫయ్ వేలు పెట్టికొన్నాను. ఇల్లు చిన్నదేలెండి! మేడమీద ఒక హాలూ, నాలుగు గదులూ వున్నాయ్! ఇల్లు మటుకు సరికొత్తది! మెయిన్ రోడ్డుమీద వుంది! నిప్పు డమ్ముకున్నా దాని ధర దానికి వస్తుంది!' అన్నాడు. జగదాంబ కి గుండె ఆగిపోయినంతపని అయ్యింది. ఇంత చిన్న వ్యాపారం చేసి అంత డబ్బు ఎల్లా కూడబెట్టుకున్నాడు?
    'అయితే ఇంక అక్కడికి మకాం మార్చేస్తావా?' అంది.
    'లేదు! అంత ఇంటిలో నే నొక్కన్నే ఎల్లా వుంటాను? అద్దెకిచ్చేసాను. నా వ్యాపారం ఇక్కడ్నే బాగా సాగుతోంది!" అన్నాడు.
    అప్పుడు ఆమెకి గవర్రాజు కింకాపెళ్ళి కాలేదని చెప్పినట్లు జ్ఞానం వచ్చింది. ఏదో ఆలోచిస్తు లోనికి వెళ్ళింది. గవర్రాజు మామూలుగా తన గది తలుపు తాళంతీసి పనిచేసే చిట్టెమ్మని పిలిచి గదూడదచమని అరుగుమీద నించున్నాడు. ఏదో పనిమీద అరుగుమీదకువచ్చిన సుభద్రని చూసాడు. ఒక్కసారి అతని శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది.

                                
    సుభద్ర అరుగుమీద నించుని రోడ్డు మీదకు చూస్తోంది. ఇంకా చిట్టిబాబు, జగ్గూ స్కూల్ నించి రాలేదు. వారం రోజులనించీ గదిలో పేరుకుపోయిన దుమ్ముని జాగ్రత్తగా నెమ్మదిగా తుడుస్తోంది 'చిట్టెమ్మ' దానికి గవర్రాజంటే ప్రత్యేక అభిమానం వుండేది! అది అడిగినప్పుడల్లా రెండూ, మూడూ ఇచ్చేచాడు గవర్రాజు! అంచేత గవర్రాజు పని అది చాలా శ్రద్ధగా చేస్తుంది!
    'సుభద్రా! వక్కసారి మీ అక్కగారి వూరు వెళ్ళరాదూ! అన్నాడు గవర్రాజు గవర్రాజు కి సుభద్రతో చిన్నప్పట్నించీ చనువు వుంది. గవర్రాజు కొట్ట పెట్టే సరికి సుభద్ర పన్నెండేళ్ళ పిల్ల! 'ఎందుకు?' అన్నది సుభద్ర.
    'మీ అక్కమేడ ఎంతబాగుందనుకున్నావ్! అంతా సినీమాల్లో చూపిస్తారే అంత బాగుంది! అన్నాడు గవర్రాజు.
    'అందుకే అది ఉత్తరాలు కూడా వ్రాయటంలేదు! భోగభాగ్యాలుంటే ఇంక పుట్టిల్లూ; మమతలూ జ్ఞాపకం వుంటాయేమిటి" అంది సుభద్ర కామేశ్వరి ఇంటి వద్దన ఇదివరకే తన తల్లిద్వారా చిట్టిబాబుద్వారా వింది సుభద్ర.
    'నేను కూడా అల్లాంటి మేడ వకటి కొన్నాను పట్నంలో! నువ్వు చూడ్డానికి రాకూడదూ వకసారి!' అన్నాడు.    
    'నువ్వు కొన్నావా?' అంది ఆశ్చర్యంగా సుభద్ర 'అవును! నేను ఈ స్థలం అచ్చి వచ్చిందని ఇక్కడ కొట్టు ఇల్లా వున్నిచ్చాను కాని పట్నంలో హోటలు వినోదాలో నాకు భాగం వుంది. దానిమీద వచ్చిన లాభం పెట్టి మేడకొన్నాను.' అన్నాడు గవర్రాజు.
    హోటలు వినోదా అంటే అది ఎంత భాగ్యవంతులు వుండగల హోటలో సుభద్రకి తెలియంది కాదు! అందులో గవర్రాజుకీ భాగం వుందంటే అతను చాలా డబ్బుకూడా బెట్టాడన్నమాట! ఆమె కళ్ళు ఆశ్చర్యంతో తళుక్కుమన్నాయి! అంతలో మళ్ళీ.
    'నే నెందుకు చూడటం!' అంది అన్నాడు సుభద్ర.
    'మీ అక్కమేడ అందంగా వుందో నా మేడ అందంగా వుందో చెబ్దువుగాని!' గవర్రాజు.
    'నేను చెప్పాలా!' విస్తుబోయింది. సుభద్ర. 'చిట్టెమ్మ' గదూడిచి దుమ్ము చేటలో కెత్తుకుని అరుగుమీదకు వచ్చింది. సుభద్ర లోపలికి వెళ్ళిపోయింది. గవర్రాజు తనమీద తనే విసుక్కున్నాడు. ఆ పిల్ల ముందు ఎల్లా తన మనోగతం వెల్లడి చేయాలో తోచక జుత్తు వెర్రిగా పీక్కున్నాడు.
    ఆ రాత్రి సుభద్రకి నిద్ర పట్టలేదు. దశమి వెన్నెల బయిట అంతా చల్లగా పర్చుకుంది. గవర్రాజు అరుగుమీద చాప వేసుకుని పరుపు వేసుకుని పడుకున్నాడు. సుభద్ర నెమ్మదిగా వీధి తలుపు తీసుకుని బయటకు రావటం సగం మూసిన కనుకొలకుల్లోంచి చూసాడు. సుభద్ర తలుపు దగ్గరగా వేసి అరుగు చివరకు వచ్చి నించుంది. చప్పున గవర్రాజు లేచి సుభద్రకు దగ్గరగా వచ్చేడు.
    'నిద్ర పట్టటం లేదా సుభద్రా!' అన్నాడు.
    'అబ్బే ఏమీలేదు! వూరికేనే లేచాను!' అంది.
    'సుభద్రా! నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది చెప్పు!' అన్నాడు. సుభద్ర మనసు వివశమైంది. ఏమీ మాట్లాడలేదు.
    'సుభద్రా! నిజం చెబ్తున్నాను. మీ అక్కఇంటికి వెళ్లాను. ఆ ఇంటి సౌందర్యం అంతా చూసాను! మీ అక్క కూతురు నళిని నేనంటే ఎంతో ఆపేక్ష చూపెట్టింది.
    నాతో సినిమాలకీ, బీచ్ షికార్ల కీ వచ్చింది నిజంగా, నళిని, చాలా అందమైన, పిల్ల!కాలేజీ చదువుతోంది! ఆపిల్ల మనస్సు నాచుట్టూ ప్రదక్షిణం చేసిందని నాకు తెలుసు! కాని దేనివల్ల ఆపిల్ల నన్ను కోరుతుంది? పట్నంలో నాకున్న పరపతి వల్ల! త్వరలో నేనొక పెద్ద బట్టల షాపు తెరువబోతున్నాను. చేయితిరిగిన బిజినెస్ మాన్ ని! కానీ నన్ను నళిని పన్నిన వలలో పడిపోకుండా కాపాడాయి ఒక అందమైన సన్నని కళ్ళు! అవి ఎవరివో తెలుసా?' ఆగాడు గవర్రాజు. ఇంత అందంగా మాట్లాడటం తన కెల్లా నచ్చిందా! అని తనకి తనే అద్భుతపడ్డాడు గవర్రాజు! అందమైన అమ్మాయి సాన్నిహిత్యంలో అందమైన మాటలే వస్తాయేమో! అని మురిసి పోయేడు! సుభద్ర మనస్సు లజ్జాసంకోచాలతో పీడించబడుతోంది. నళినిలాంటి రూపవతి, ధనవతి, విద్యావతి కూడా గవర్రాజునికోరటం, ఆమెకి అసహనం కలిగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS