Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 18

           
    "సంవత్సరాల తరబడి లేనీ నీకీ అనురాగం హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది అరుణా?" నాగొంతులో వెటకారం!
    అరుణ తలదించుకుంది - "ఇప్పటి నాస్థితే నీకూ సంభవిస్తే నాబాదేమిటో నీకు తెలుస్తుంది కృష్ణవేణీ!"
    "నేను నవ్వాను. గర్వంగా ధీమాగా నవ్వాను-"ఎంత పిచ్చిదానివి అరుణా! నీవంటి మూర్కురాలిని కాను నేను. అటువంటి అవసరం నాభర్త కెప్పుడూ రానివ్వను. ఆకలితో అలమటించిపోయే మనిషి అన్నానికి పరుగులు పెడతాడుగానీ సుష్టుగా తిన్నవాడికెందుకా బాధ?" అరుణ అవమానంతో కృంగిపోయింది-చేసేదిలేక కన్నీళ్ళతో వేడుకోసాగింది-"ఈనాడు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను కృష్ణవేణీ! ఇప్పటికైనా కళ్ళు తెరవగలిగాను. నన్ను క్షమించు. చిన్నదానివైనా నిన్ను ప్రాధేయపడుతున్నాను. నా భర్తను నా నుంచి దూరం చెయ్యకు. నా సంసారం నీది చేసుకోకు-నువ్వు దయామయురాలవు కృష్ణవేణీ! నా చోటు నాకివ్వు."
    నా కన్నులు నిండుకున్నాయి -నేనూ అదే స్థితిలో వున్నాను. అరుణని బ్రతిమాలుకున్నాను -"నన్ను మాత్రం ఏం చెయ్యమంటావు అరుణా? ఈనాడు నేనెక్కడికి పోయేది? ఈ మనిషిని నమ్మివచ్చిన దాన్ని ఇప్పుడేమైపోను? నామాట విను. మనం ఇద్దరం ఎక్కడికీ పోవద్దు. కలిసి మెలిసి ఇక్కడే వుందాం. అక్కచెల్లెళ్ళలా వుండి పోదాం." ఉలిక్కిపడ్డాను. మెలుకు వచ్చింది. అరుణాలేదు. ఎవరూ లేరు నా పందిరిమంచంమీద నేనే వున్నాను. చెంపలు తడిగా వున్నాయి. కల లోనే ఏడ్చానని అనుకున్నాను. తిరిగి కళ్ళు మూసుకు అలానే పడుకున్నాను. ఎంత చిత్రమైన కల! ఎంత సున్నితమైన పరిష్కారం!
    "ఎక్కడికీ పోవద్దు.' ఇద్దరం ఇక్కడే వుందాం" ఏమిటీ చిత్రం! ఆ పరిష్కారం చేసింది నేనా? నిజంగా అరుణలో అంత మార్పా? ఏదీ నమ్మదగ్గది కాదు. అరుణ ఏనాడూ అలా మారదు .... కాని మారితే? తన చోటు తన కిమ్మని కోరితే? ....అదేనా పరిష్కారం? ఈ ఆలో ఆలోచనలతో మనసు చెదిరిపోయేలా వుంది.
    అలా కన్నుమూశానో లేదో మరొక స్వప్నం.
    తెల్లటి మంచులా మెరిసిపోతూన్న ఎత్తైన వెండికొండ!
    ఆ కొండ శిఖరాలకంటుతూ విశాలమైన మెట్లు!
    మాధవ్ నాచేతిని తన చేతిలోకి తీసుకుని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పైకి తీసికెళ్తున్నాడు. నేను మవునంగా మాధవ్ వెంటనే వెళ్ళిపోతున్నాను. ఇద్దరం పర్వతశిఖరాలని అందుకోగలిగాం. అంత ఎత్తునుంచి ఎక్కడికో కొత్త ప్రపంచాలకి పోయినట్టు విచిత్రంగా దిగువనంతా పరిశీలిస్తున్నాను. ఉన్నట్టుండి కొండకున్న మెట్లు మాయమయ్యాయ్! దిగే దారేలేదు. నేను భయంతో వణికిపోయాను. "మాధవ్! ఏమిటది?" అంటూ భయంతో మాధవ్ ని అంటిపెట్టుకుపోయాను. మాధవ్ చిరునవ్వు నవ్వుతూ- "భయం దేనికి కృష్ణా? నేను లేనూ? ఇద్దరం హాయిగా సంతోషంగా ఈశిఖరాల మీదే వుండిపోదాం." అంటూ నన్ను హృదయానికి చేర్చుకున్నాడు.
    కళ్ళుతెరిస్తే మాధవ్ లేడుగానీ ఆ అనుభూతి అలానే వుంది. నాకెందుకో నవ్వు వచ్చింది. ఏమిటో దాని అర్ధం? బంగారు స్వప్నం-అనుకున్నాను. అటువంటి స్వప్నాలు ఎన్నని చెప్పను? మాధవ్ నాకు మరీమరీ సన్నిహితమైపోయాడు. రాయాలని పించి ఆకల మాధవ్ కి రాశాను.
    "నీవంటి కన్నెలు కనే కలలు పవిత్రంగా వుంటాయి కృష్ణా!" అన్నాడు. నాప్రయత్నం లేకుండానే నావుత్తరాలలో అనురాగం చిందులు వేసేది. అలా మాధవ్ కి ఉత్తరాలు రాయటం నాకెంతో హాయిగా వుండేది. ఏది జరిగినా ఏది చూసినా మాధవ్ కి రాసేదాన్ని. ఇక మాధవ్ రాతలకి తెంపేలేదు. చక్కని ఆ ప్రదేశాలని మరీ చక్కగా వర్ణించేవాడు.
    "ఎప్పుడూ కృష్ణవేణి గలగలలు వింటూ'నే వుంటాను సుమా! ఎక్కడ చూసినా చెట్లూ చేమలూ-రాళ్ళూ కొండలూ! ఎత్తైన కొండ మీద ఆఫీసూ-ఎక్కడో క్రింద వయ్యారంగా కంటపడేకృష్ణవేణి-ఆపక్కనే మనోహరమైన లోయా-కొండమీదేకోలనీ-ఇక్కడి జనమంతా లంబాడీలు- వాళ్ళ భాష మనకేం అర్ధంకాదు. ఓ లంబాడీ పడుచు మాఇంట్లో పని చెయ్యటానికి కుదిరింది. ఉదయం గదులు తుడవటానికొస్తుందా- ఒక్కొక్క సారెప్పుడైనా రాసుకుంటున్నాననిగానీ-ఇప్పుడు వీల్లేదు. మళ్ళీరా అనిగాని చెప్తే అదేం చెవిని పెట్టదు. ఏమిటేమిటో వాళ్ళభాషలో లేచేవరకూ సాధిస్తుంది. బలే గడుసుది. గమ్మత్తుగా మాట్లాడుతుంది.
    ఈ అడవుల్లో జంతువుల భయం వుందనే చెప్పుకొంటారు. ఎలుగుబంట్లు పగలే కన్పిస్తాయట కూడా. ఎంతైనా రాత్రుళ్ళు నిర్భయంగా వరండాల్లో పడుకోటానికి వీల్లేదు. ఏదీ? ఇంకా ఈ ప్రదేశమంతా నాకు కొత్త. షికార్లు తిరగాలంటే మాత్రం ఎక్కడికక్కడ ప్రకృతే పార్కులు వేసింది. నాకు ఒంటరిగా తిరగబుద్ధి కాదే. నువ్వు వచ్చాక ఇద్దరం పార్కులన్నీ షికారుచేద్దాం. టౌన్ లో మాదిరి ఇక్కడ వేరే వ్యాపకాలనేవి వుండవు. ఇంటిపనీ -ఆఫీసూ-ఏదో కాస్సేపు షైరూ!
    మొన్ననో గమ్మత్తు జరిగింది. జయసింగు అనే కో-జె.ఇ. ఓ పదిహేనుమందిని తాను వేటాడబోతున్నాను కాబట్టి ఆశౌర్యధైర్యాలు చూడటానికి రమ్మని ఆహ్వానించాడు. అందులో నేనూ ఒకన్ని. తన దగ్గిరతప్ప మా ఎవరిదగ్గిరా తుపాకీ వుండరాదని ఆర్డర్ చేశాడు. సరేనని చేతులూపుకుంటూ బయల్దేరాం అడవిలోకి- జయసింగు వీరుడులాగే సాగిపోతున్నాడు గానీ తీరా లోయలోకి దిగేసరికి పిల్లిలా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో నడక సాగించాడు. తుపాకీలోడ్ చేసి రెడీగా వుంచుకుని మెల్లమెల్లగా పొదలూ-తుప్పలూ, చెట్లూ, చేమలూ పరికిస్తూ బింకంగా అడుగుతీసి అడుగువేస్తున్నాడు. మాలో ఎవడికో ఓ కుందేలుకంటబడిందట. వాడు వెంటనే హడావిడిగా-"అదిగో-అదిగో" అంటూ కేక లెట్టాడు. అందరికన్నా ముందు పోతూన్న జయసింగు ఆ కేకలకి బిర్రబిగుసుకుపోయి ఏదో పెద్ద పులి అంత క్రూరమృగం తన మీదే వురికేస్తుందనే భ్రమతో రెడీగా వుంచుకున్న తుపాకీ పేల్చేశాడు. ఓ పొజిషనూ లేదు, పాడూ లేదు. అతని ప్రయత్నం లేకుండా దానికదే పేలిఊరుకుంది. జయసింగు వెనక్కి తిరిగి ఒకటే పరుగు. నలుగురైదుగురం మాత్రం కాస్త నిదానించి చూస్తే ఓ కుందేలు ఓ పొదలోంచి మరోపొదలోకి తుర్రు మనటం మాత్రం కంటబడింది. కానీ చిత్రంగా జయసింగు షూటింగు కూడా గొప్ప మేలే చేసింది. ఎదర చెట్టు కొమ్మకి చుట్టుకు ఓ నాగుబాము తుపాకీ దెబ్బకి వూడి క్రింద పడింది - తర్వాత జయసింగు శౌర్యానికి జోహారులర్పించామనుకో - ఆ జయసింగే మొన్న ఓ నెమలిని కొట్టుకొచ్చాడు. విలవిలా తన్ను కుని రక్తం మడుగులో ప్రాణాలు వదిలిందేమో చూడటానికే ఎంతో జాలనిపించింది."
    మాధవ్ అలా ప్రతీసంఘటననీ రాసుకు పోయేవాడు. ఆయా విషయాలలో నా అభిప్రాయాలే జవాబులుగా రాసేదాన్ని. నెమలి విషయం వింటే నాకెంతో బాధనిపించింది. స్వేచ్చగా ఎక్కడో అడవుల్లో ఆడుతూ పాడుతూ తిరిగే ఆ అందాల నెమలి ఎవరిదారి కడ్డువచ్చింది? ఎవరికేం కీడు చేసింది?దాని మీదికి తుపాకీ గురి పెట్టటానికెలా చేతులాడాయి?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS