Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 18


                                  26
    రోజులు మాత్రం అలా ఎంత కాలమని గడవగలుగుతాయి? మనం తప్పు చెయ్యడం మొదలు పెట్టినప్పుడు , అది మనకు తప్ప మరొక్కరి కి తెలియ కూడదని అతి జాగ్రత్తగా ఉంటాం. ఆ తప్పు చెయ్యడమే మనకొక అలవాటయి పోయిందను కొండి, అప్పుడూ? అందరికీ తెలిసి తీరుతుంది! రఘు విషయం లోనూ అలాగే జరిగింది. అంటే, ఆ ఇండిపెండెన్సు కప్పు రేసునాడే కాదు, ఆ సీజను లోనే!
    సౌత్ ఇండియా డెర్బీ రేసు మీటింగ్ అది. మిత్రుల బలవంతం వల్ల విధి లేక సేతుపతి కూడా రేసు కోర్సు కు వెళ్లి, మెంబర్స్ ఎన్ క్లోషర్ లో కూర్చున్నారు. అసలు ఇటువంటి ఆసక్తులు లేవాయనకు.
    "అబ్బబ్బ, ఏమిటండీ సేతుపతి గారూ! రేసు కోర్సు కు వచ్చి కొత్త పెళ్లి కూతురి లా అలా కూర్చున్నారేమిటి? చెప్పండి. మొదటి రేసులో డాన్ జువాన్ మీద మీ పేర ఓ రెండు వేలు అడమన్నారా?" అన్నాడు సేతుపతి గారిని బాగా ఎరిగి ఉన్న ఒక తెలుగు జమీందారు.
    "బాబ్బాబూ, ఇది ణా యాభై రెండో ఏడు. భగవదను గ్రహం వల్ల ఏదో ఏ వ్యసనమూ లేకుండా ఉన్నాను. మన పెద్దలు చెప్పారుగా, సప్త వ్యసనాలని? ఈ జూదం కూడా అందులో చేరిందే!"
    "ఆ...ఆ.. అదేమిటండోయి! స్వామి సచ్చిదానంద యతీంద్రుల వారిలా మాట్లాడుతున్నారు? ఇంత ధర్మ పరాయణత ఎలా అబ్బిందీ మీకు?'
    "మా అరుణ నేర్పింది!"
    "ఓ! అరుణ! ఎంతటి అందగత్తె అరుణ!"
    'అందమన్నది మన మనో భావాల్ని బట్టే మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది, రాజావారూ!"
    "అబ్బబ్బ....ఇక చాలండీ ఈ వేదాంతం! మీరేమైనా అనండి. మీ పేరిట వెయ్యి రూపాయలు ఆడుతున్నాను. బిగినర్స్ లక్ అన్నారు. ఎవరికీ తెలుసూ! ఏమంటారు?"
    "మీ ఇష్టం , ఒకవేళ గెలిస్తే ఆ డబ్బు ఏ చారిటీస్ కో ఇచ్చేసేయండి. ఇదుగో నండీ, వెయ్యి రూపాయలు. దయచేసి మరోసారి నన్ను నా బిగినర్స్ లక్ కి ప్రయత్నించామని మాత్రం చెప్పద్దండీ!"
    "అలాగే! అలాగే!" అంటూ ఆ రాజా తన గొడవల్లో తాను పడిపోయాడు.
    రేసంటే ఏమిటి? అదొక పిచ్చి! అందరూ డబ్బు సంపాదించి తీరాలనుకుని వచ్చేవారే. ఎన్ని వేల మంది అంటారు? అందరూ సంపాదించగలరా? అయినా.... ఆశ అన్నది అలా చేయిస్తుంది. ఈ విచిత్రాన్ని సెటపతి కళ్ళారా చూస్తున్నారు. గొప్పగొప్ప వారు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబీకులు.....ఎందరో వస్తున్నారు! టిప్స్ కోసం వారినీ వీరిని బతిమాలుతున్నారు! పెద్దల్లో వారి చూపులు సేతుపతి గారి మీద పడగానే అందరూ ఒకే మాట అంటున్నారు.
    "అరె! మిస్టర్ సేతుపతీ! ఇదేమిటీ? ఎన్నడూ లేనిది...."
    "ఆ....ఏదో చూడాలని పించింది.,..."
    "ష్యూర్! ష్యూర్! చూచి సంతోషించండి! అంతే. దాన్ని ఒక అలవాటుగా చేసుకున్నారంటే మాత్రం , వస్తున్నది చిక్కు. ఇదొక జబ్బు. మేమంతా ఆ రోగంతో బాధపదుతున్నాం! మా స్నేహితుల్లో ఒకరు ఆ జబ్బు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉన్నారని అనుకోగలగడం వల్ల మాకెంతో తృప్తి ఉంటుంది. దాన్ని మీరు మాపి వెయ్యద్దు!" అన్నారు కొందరు అనుభవజ్ఞులు. సేతుపతి గారు చిన్నగా నవ్వి ఊరుకున్నారు.
    ఆయనకు మాత్రం తెలియదూ? తాగుబోతు , ఎప్పుడూ ఇతరులకు తాగవద్దనే సలహా ఇస్తాడు., అది పరిపాటి! వారు మునిగిపోతూ , ఇతరులను ఒడ్డున వెయ్యాలను కుంటారు. చెడ్డవారి లోనూ మనం అప్పుడప్పుడు అలాటి మంచిని చూస్తాం. అందుకని వారూ అభినంద నీయులే!
    మొదటి రేసు మొదలయింది. ఇక చూడండి. అడా లేదు, మగా లేదు; పిన్నా లేదు, పెద్దా లేదు! అందరికీ అదో శివ మెత్తింది! ఆ ఆవేశాన్ని, ఆ వేగాన్నీ ఆ పిచ్చినీ ఇక చూడలేక పోయారు సేతుపతి గారు. తనను తెచ్చిన మిత్రులకు తరవాత క్షమాపణ చెప్పుకో వచ్చునను కుని అక్కణ్ణించి చరచరా వెళ్ళిపోయారు.
    అయన మళ్ళీ బయటి ప్రపంచంలో పడబోతున్నారు. అప్పుడే ఆ ఆవరణలోకి వచ్చారు రఘూ, నలుగురయిదుగురు స్నేహితులూ కారులో. సేతుపతి తన కళ్ళను తానె నమ్మలేకపోయారు. అసలు రఘేనా ఆ కుర్రాడు? కారు అబ్బాయిదే!
    కారు పార్కు చేసి, ఆ మూక ఇటువైపే పరుగెడుతూ వస్తుంది! సేతుపతి గారికి అయిదారు గజాల దూరం నుంచే అందరూ ఎన్ ట్రేన్స్ టికెట్ల కోసం పరుగులెత్తుతున్నారు. ఆ ఆవేశంలో ఆయన్ని గమనించే టంత వ్యవధి ఉందా ఆ యువకులకు?    
    "అబ్బ , ఫస్టు రేసు మిస్సయి పోయాం రా!' అన్నాడు రఘు.
    "ఇదుగో , ఈ పరమ బడుద్దాయి వల్ల! వాడి మేకప్ తగలెయ్య! ఆడాళ్ళ కంటే అన్యాయం గాడు!"
    "డాన్ జువాన్ మీద ఆడి ఉంటె, ఫస్టు రేసు లోనే అయిదారు వందలు వచ్చేవి. అంతటినీ సౌత్ ఇండియా డెర్బీ తో షిన్ షినాకీ బూబ్లాబూ మీద అడి  ఉంటె.......ఛీ!"
    రఘు పడ్డ బాధను గమనించారు సేతుపతి.
    "ఇంకేమన్నా ఉందా? కనీసం రెండు మూడు వేల రూపాయలన్నా రఘుపతి గారి జేబులో ఘలాఘల్ ఘలాఘల్ మనేవి!"
    రఘు చమత్కరించాడు. "కరెన్సీ నోట్లు ఘలాఘల్ మనడమేమిట్రా సన్యాసీ!"
    కుర్రాళ్ళందరూ నవ్వుతూ, కేరింతాలు కొడుతూ వెళ్ళిపోయారు. సేతుపతి విపరీతంగా తపన పడిపోతున్నారు! వాళ్ళందరి వెంటనే వెళ్లి వారికి తెలియకుండా వారి చేతల్ని గమనిద్డామా అన్నంత బుద్ది కలిగింది ఆయనకు!
    'ఛీ! ఇక్కడ చూచినదానిలో లేనిది....మరెక్కువగా అక్కడేం ఉండబోతుంది?" అనుకున్నారు . ఆలోచనా నిమగ్నులై , అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి కారులో కూలబడ్డారు సేతుపతి.
    పెనం మీది అట్టులా ఉంది, పాపం, అయన మనసు! వచ్చిన ఇబ్బంది ఎక్కడంటే, చాలామంది తండ్రుల్లా కొడుకు తప్పు చేసినప్పుడు కోప్పడి , కొట్టి మందలించే స్వభావం కాదు సేతుపతి గారిది. ఇప్పుడు ఎలా రఘు ను మందలించడం? భయపెట్టడం? బుద్ది చెప్పడం? మంచి దారిలోకి తెచ్చుకోడం? అసలు.....ఆ అబ్బాయి కి ఈ డబ్బంతా ఎక్కణ్ణించి వస్తుంది? పొరపాటున దొంగతనాలు మొదలు పెట్టాడా పోరుగిళ్ళ లో కాకపోయినా, తన సొంత ఇంటిలో నయినా? లేదూ.....చండి గానీ... అరుణ గానీ..... అలా పరిగెడుతున్నాయి అయన ఆలోచనలు! వాటితో పాటే అయన ఇల్లు చేరుకున్నారు.
    హాల్లోనే సంబంధమూ, చాముండేశ్వరీ అగుపడ్డారు ఆయనకు.
    "మిస్టర్ సంబంధం!"
    "సర్?"
    "రఘు మీ వద్ద ఈమధ్య డబ్బెమైనా ఎక్కువగా తీసుకొంటూన్నాడా?"
    "నోసర్! నెలనెలా తమ రివ్వమన్న అరవై రూపాయలు తప్ప, నేను మరేమీ ఇవ్వడం లేదండీ!"
    "ఐసీ! చండీ, మాట...." అంటూ అయన మేడ పైకి దారి తీశారు. చాముండేశ్వరికి ఎందుకో భయం  వేసింది. అప్పుడప్పుడు ఆమె అబ్బాయికి డబ్బిచ్చిందిగా మరి! తన కొడుక్కి తాను వందో, రెండు వందలో ఇస్తే తప్పు కాదనుకుని ధైర్యం తెచ్చుకుంది చాముండేశ్వరి. మేడ మీది తన గది చేరుకొని ఉస్సురంటూ ఒక సోఫా మీద కూర్చున్నారు సేతుపతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS