అంత దుఃఖం లోనూ కర్తవ్యమనేది బళ్ళు కట్టించి ఆస్పత్రికి దారి తీసింది. విడిపోని దుఃఖం అనేక వ్యక్తులుగా వెంబడించింది. ఆస్పత్రి -- రాత్రయినా గుప్పున మేల్కొంది.
'ఏమయింది? ఏమయింది? 'ఎవరో ఇద్దరు ఖూనీ! బరుకుటారో, లేదో పాపం! ' ప్రపంచం నాశనమై పోతుంది. హత్యలకు కారణ మక్కరలేదు. ఎవరెక్కడ ఎంత చిన్న విషయానికి నరుక్కుని చచ్చిందీ సంభాషణలు!
డాక్టర్లు , వాళ్ళ ప్రయత్నాలు , ప్రయత్నాలకు సహాయపడే నర్సులు, కట్లు, కుట్లు , రక్త మేక్కించడం.....సూర్యనారాయణ కు వాసవి రక్తం సరిపడింది. నన్నయ్య కూ? నీవా? ...కాదు, గ్రూపు కాదు. పోనీ ఇతను? ఇదీ సరిపడదు. అతనో? ఉహూ...ఈమె? కరెక్ట్! ఈమె శ్యామల! నన్నయ్య కు -- మాదిగ వాడికి -- తన బిడ్డ రక్త మివ్వడం , సావిత్రమ్మ కు కోపమొచ్చింది, అసహ్యమేసింది. అయినా, ఆ పరిస్థితిలో 'వద్దు!' అన్న తను -- ఎంత వికృతంగా కనబడుతుందో అలోచించి అనలేక పోయింది!
నిమిషాలు గంటల్లా, గంటలు రోజుల్లా గుండెల మీద అడుగులుంచి కదులుతున్న కాలం భయంకర మైన నడక! ఏడ్పులు, ఓదార్పులు! మాగన్ను లో కదిలే గత జ్ఞాపకాలు! గతం, వర్తమానం , భవిష్యత్తు లేకుండా పడి ఉన్న శరీరాలు!
చివరికి ఎట్లాగో ఆ రాత్రి గూడా తెల్లవారక తప్పలేదు. తెల్లవారింది. ఇంక భయం లేదు. తెల్లవారితేనేం? ఏమో తెలీదు. భయం తగ్గిపోవచ్చు! అంతలోనే ఘోల్లున ఏడ్పు! నన్నయ్య అప్పుడే కళ్ళు తెరిచాడు.
'అయ్యో! తల్లీ, సారస్వతమ్మా! నేనుండీ నీ మొగుణ్ణి కాపాడలేక పోయినా నమ్మా!' గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నన్నయ్య.
* * * *
అప్పుడు ఉదయం ఎనిమిది గంటలైంది. గోదాదేవి పూలల్లుకుంటూ కూర్చుంది. అలివేణి లోపలి నుంచీ ఇద్దరికీ కాఫీలు తెచ్చి, పక్కలో కూర్చుంది.
'కాఫీ సేవించండి!' దారం మునిపంట కొరుకుతూ కళ్ళెత్తి చూసింది.
'ఏమిటీ కొత్త మర్యాద?'
'పదవి కొత్తది -- దానితో పాటు కొత్త మర్యాద.'
'ఈ పదవి నీకూ వస్తుంది.'
'వచ్చినప్పుడు నువ్వూ చెయ్యలనేగా ఇప్పుడు చేస్తోంది!' ఇద్దరూ నవ్వారు.
'ఈ రాత్రి స్నేహితులకు విందు ఇవ్వాలట....'
'ఔనట....'
'అప్పుడే ఇల్లు కూడా చూశాడట.'
'ఔనట ...' నవ్వుతూ.
'నాకేమీ తెలీనట్లు! నువ్వు తొందర పెట్టి ఉంటావు. కొత్త దంపతులు ఎట్లా సంసారం ప్రారంభిస్తారో , ఏం మాట్లాడు కుంటారో చూద్దామను కుంటే చాన్స్ దొరకనిచ్చేలా లేవు.'
'ఎవర్నో చూస్తె ఏం లాభం?'
'ఏమైనా ఆకర్షనుంటే స్వంతానికి పని కొస్తుందని.' నవ్వుకున్నారు.
'నిజం చెప్పు! అర్ధరాత్రి ఇద్దరూ వరండా లో మాట్లాడుకుంటూ ఉండలేదూ? రవీంద్ర లేచి రావడం, నువ్వు మెల్లగా నా పక్క లోంచి చప్పుడు కాకుండా ....'
గోదాదేవి గాభరా పడింది.
'ఛీ, ఛీ! అసలు నేను నీ దగ్గరి నుంచి లేవనే లేదు...'
అప్పుడు అలివేణి ముఖం చూసింది. అలివేణి పడీపడీ నవ్వుతుంది.
'అయితే వెళ్ళలేదు, మాట్లాడు కోలేదు అంటావు ఏం? ఎదురు చూసినా అతను రాలేదు?'
'నోర్మూయ్!'
'అలాగే నోరు మూసుకుంటాను, నువ్వు కళ్ళు మూసుకుని కలలు....అరె పోస్ట్!' తీసుకుని, గోదాదేవి కిచ్చింది. ఒకటి, రెండు, మూడు నిమిషాలు నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయి. అలివేణి ఆందోళన పడుతుంది. అంత స్నిగ్ధ సుందరంగా ఉన్న ఆ నవ వధువు ముఖం వాడిపోయిందెందుకు? ఏముందందులో? అడుర్వార్త ఏమిటి? ,మ్రాన్పడి కూర్చున్న గోదాదేవి చేతి నించే ఉత్తర మందు కుంది.
'గోదాదేవి!
సరస్వతి నుదుటి కుంకుమ ను రాక్షసులు చెరిపేశారు. వేయి కలల రేకులు విరిసి, దివ్య పరిమళాలు కురిసి, నేత్రోత్సవం చేస్తుందన్న ఆ పారిజాతం నలిపి వేయబడింది. 'ప్రభాత శైల సానూపల నీలపాళికల నొత్తకయే స్రవియించు ఆ హిమనీ వర గాయనీ గళ వినిస్రూత మాధురి."మంట కీడ్వబడింది.

మొన్నింకా తెల్లవారలేదు. సర స్వతిఏడుస్తూ కూర్చునే ఉంది. అనసూయమ్మ -- సరస్వతి మారుటి అత్తగా రప్పుడోచ్చింది. ఆమె జబ్బు పడి లేచినట్లుంది. వారం రోజుల నుంచీ ఆమె ఎవరికీ కనబడలేదు. ఆ దుఃఖ సమయంలో ఆమె సంగతి ఎవరికీ జ్ఞప్తి లేదు. ఆమె ఇంతవరకూ ఒక ఇంట్లో బంధించబడి ఉంది. సుబ్బరామయ్య , రాధా క్రిష్ణ సూర్యనారాయణ ని హత్య చేసేందుకు ఆలోచించడం ఆమెకు తెలిసింది. వాళ్ళను తిట్టి నే చెబుతానని రాబోయింది. ఖైదయింది! ఈ రాత్రి ప్రమాణం చేసింది. తన బిడ్డలా సాక్షిగా ఈ విషయం చెప్పనని. నమ్మి కొంత స్వేచ్చ ఇచ్చారు. పరుగెడుతూ వచ్చింది.
సరస్వతి అనసూయమ్మ ను కౌగలించుకుంది. ఆ దుఃఖాన్ని ఎట్లా చెప్పటం? ఆ క్షణంలోనే సరస్వతి కళ్ళలో భయంకరమైన కక్ష తల ఎత్తింది!
"ఈ విషయం పోలీసుల ముందు, కోర్టు లో చెప్ప గలవా?' అంది.
"ఆ...."
"ఆ ఇంట్లో ఎట్లా ఉంటావు తరవాత?'
"ఉండను."
"వాళ్ళిద్దరి కీ ఉరిశిక్ష ఖాయమైతే...."
వెక్కి వెక్కి ఏడ్చింది అనసూయమ్మ. చిత్రంగా సరస్వతి ఆమెనే ఓదార్చింది. కళ్ళు తుడుచుకుని అంది అనసూయమ్మ.
"నీ మాట నిజమై అదే ఖాయమైతే మంచిది, నేనూ చావచ్చు!" ఏడుస్తుంది మళ్లీ. సరస్వతి అనసూయమ్మ చేయందుకుని గుమ్మం దగ్గరకు దారి తీసింది.
"అత్తా! వెళ్ళిపో. ఈ విషయం ఎవ్వరితో అనకు...."
ఆశ్చర్యంగా చూసింది.
సరస్వతి తొందర చేసింది. ఆమె మాట్లాడలేక వెళ్ళిపోయింది. వెళ్ళే ఆమెను మలుపు తిరిగేవరకూ చూసింది. తెలతెల్లవారుతూ ఉంది. తిరిగి వచ్చే సరస్వతి ఉషా దేవతలా కనిపించింది!
"దోషుల్ని విడిచి పెట్టడం గూడా తప్పే!" అన్నాను.
చిన్నగా నవ్వ గలిగింది.
"అందుకు వేరే అధికారికి బాధ్యత ఉంది అనుకుందాం! సుబ్బరామయ్య ఉన్న చోటనే, అనసూయమ్మ గూడా ఉందను కుంటే ఎంత ఓదార్పుగా ఉంది! నా భర్త పోయినందుకు ప్రతిగా ఆమెకు భర్తనూ, కొడుకు నూ-- ఇద్దర్నీ దూరం చేసే పనిలో ఇంత శాంతి ఉంటుందంటావా?"
అప్పుడు నేనేం చెయ్యాలి? సరస్వతి ని దీవించాలా ? నమస్కరించాలా? గోదాదేవి! జయచంద్రునీ, ఔరంగజేబునూ మన మింకా మరిచిపోలేదు కానీ, ఈనాడు అలాంటి వాళ్ళెంత మంది? పంచాయితీ ఎన్నికల బురద జిమ్మని పల్లెటూరు ముఖం నేడేక్కడా కనపట్టం లేదు. సూర్యనారాయణ, సుబ్బరామయ్య తో పోటీ చేశాడు. కూలీ కొప్పుకున్న పట్నం రౌడీలు-- సూర్యనారాయడ్ని నన్నయ్య నూ కొట్టారు. నన్నయ్య బ్రతికాడు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా చూడకపోతే, మనుషులిట్లా ఉంటారంటే మనం నమ్మలేము. ఈ రాయలసీమ కెప్పుడూ కరువు. ఇప్పటికీ చింత గింజ లుడకేసుకుని తింటారు. కానీ, ప్రెసిడెంటు గిరీ కోసం-- అదీ గ్రామ పంచాయితీ ప్రెసిడెంటు కోసం, తండ్రీ కొడుకులు , అన్నాదమ్ములు హత్యలు చేసుకుంటున్నారు. నైతిక ప్రమాణాల్ని ఇంత ఘోరంగా ధ్వంసం చేసుకుంటూ -- ఈ ప్రజాస్వామ్యం సోషలిజమనీ, సాధిస్తామనీ అనుకోవడ మెంత విచిత్రంగా ఉందొ చూడు! వీలైతే ఒక్కసారి రా గలిగితే ....కృతజ్ఞుణ్ణి.
----వాసవి."
'వెళతావా?'
"ఆ...'
"రవీంద్ర ఒప్పుకుంటాడా?'
నిన్నటి తనకూ, ఇప్పటి తనకూ తేడా అప్పుడు గుర్తు కొచ్చింది ...ఆమెకు సరస్వతి కనిపిస్తుంది. ఆ రోజు పొలం లో అన్నం తింటున్న దృశ్యం!
'నీ జీవితం వడ్డించిన విస్తరి కావాలి....'
మరి నీ జీవితం?'
'చిరిగిన విస్తరి కాకుంటే చాలు.'
'ఛీ! నాకు వాక్భుద్ది లేదు."
సరస్వతి నోట భవిష్యద్వాణి ఎంత స్పష్టంగా పలికింది?
'వెళతావా, అమ్మా!' అన్నాడు పద్మనాభయ్య.
రవీంద్ర వైపు చూసింది. రవీంద్ర కీ సమయంలో పీడలా వచ్చిన ఉత్తరం పైన కోపం కలిగింది.
'అయినా, ఇప్పుడు వెళ్లి చేసేదేముంది? చాదస్తం కాకపొతే?'
'చాదస్త మేముంది? దుఃఖ సమయంలో స్నేహితులుంటే...'
రవీంద్ర ఏదో అనబోయాడు. కానీ, అనకుండా నవ్వేశాడు. 'సరే! నీ ఇష్టం....'
'అమ్మాయి ఒక్కతే వెళ్లడమెందుకు? ఎట్లాగూ నీకూ నాలుగు రోజులు సెలవుంది. ఇద్దరూ వెళ్లి రండి!'
ఆ సలహా అందరికీ వచ్చింది.
గోదాదేవి రెండు రోజులకే మిగతా ప్రపంచాన్ని ఆ ఇంట్లోకి ప్రవేశింప జేసింది, కొంచెం కొంచెంగా . స్తంభించినట్లున్న జీవితాన్ని మెల్లిగా కదిల్చింది. ఆమె మునుపటి లా కాకుండా, చొరవ చేసుకుంది. సరస్వతి కుమార్తె వాసంతి కి , స్నానం చేయించడం, అన్నం కలిపి తినిపించడం , సరస్వతి దగ్గర కూర్చుని ఏవో పుస్తకాల్ని గురించి ప్రసంగించడం , శ్యామలతో , సావిత్రమ్మ లతో కలిసి వంటకాల్లో ప్రవేశించటం , అనంతయ్య కూ ,భాగీరధమ్మ కూ ఆయా వేళల ఆయా అవసరాల్నీ విచారించడం , వాసవి తో అరమరిక లేకుండా మాట్లాడ్డం . గతం మరిచే వర్తమాన చైతన్యాన్ని సృష్టించడానికి సర్వ ప్రయత్నాలూ చేసింది. ఆమె ప్రయత్నం వల్ల కొంతా, నూత్న వధువు భర్తతో సహా వచ్చి చేస్తున్న కృషికి సహకార మివ్వాలని కొంతా.... వాళ్ళు కొంచెంగా తెరుకున్నట్లు కనిపించారు.
'నువ్వే ఈ ఇంటి కోడలు వయ్యుంటే...' అంది సరస్వతి.
'కాకపోతే మాత్రమేం?' అంది గోదాదేవి.
'రేపు వెళ్ళిపోయే దానివేగా....'
ఏం మాట్లాడుతుంది? మూడు రోజులు గడచినాయి. రవీంద్ర కింక సెలవు లేదు. ఉదయం వెళ్లి పోవాలనే విషయం బైటి కొచ్చింది. ఏ మడిగెందుకూ ఎవరికీ ఏ హక్కులూ లేవు; వాళ్ళకు ఉండేందుకు అవకాశం లేదు.
ఆ రాత్రి సరస్వతి తీవ్రమైన జ్వరం వచ్చింది. బిగ్గరగా పలవరింతలు. ఎక్కడికో లేచి పరుగెత్తబోవటం! అంతా భయ భ్రాంతు లైపోయారు.
తెల్లవారింది. ఒళ్ళు తెలియకుండా పడి ఉంది. ఆ పరిస్థితిలో వెళ్లడానికి గోదాదేవి కి మనస్కరించలేదు. అసలిక్కడికి రాకుండా ఉన్నా అదొక రకంగా ఉండేది. సరస్వతి కోసమే వచ్చి ఇట్లా ఉండగా వెళ్ళేదెట్లా? రవీంద్ర మరీ విసుక్కున్నాడు.
'జ్వరమొస్తే నువ్వేం చేస్తావు? డాక్టరువా? అసలు నీకు రావాలనుందా?'
ఒక్క క్షణం. గోదాదేవి ముఖం చిన్న బోయింది. అయినా, రవీంద్ర కోపంలో కూడా కొంత న్యాయముంది. ఆ పంధా లో ఆలోచించిన అమెమనస్సు ప్రసన్న మయింది. ముఖం రాగ రంజిత మయింది. దగ్గరగా వెళ్లి రవీంద్ర చేయందుకుంది. రవీంద్ర ఆమె కళ్ళలోకి చూశాడు.
'రెండు రోజులు ఓర్పు తెచ్చుకోలేరూ?'
రవీంద్ర మనస్సు ఝల్లు మంది. కౌగలించుకుని, ముద్దు పెట్టుకున్నాడు. 'ఇప్పటికి చాలు!' అంది మనోహరంగా నవ్వుతూ.
