Previous Page Next Page 
మేఘమాల పేజి 18


    
    మరొక్క మాట --
    నిన్న మీ ఆఫీసులో పని చేసే సీత కనిపించింది నాకు-- నిన్ను గురించి నలుగురూ ఏవేవో అనుకుంటున్నారట. చెప్పాలంటే బాధగా వున్నదంటూ ఏవేవో చెప్పింది. వ్రాయాలంటే నాకు బాధగానే వున్నది.... కాని వాళ్ళనుకునేవేవీ నిజం గాదని నాకు అత్మసాక్షిగా తెలుసు.... అందుకే నవ్వి వూరుకున్నాను.

                                                                         ఉంటా -- నీ చెల్లి.
                                                                               శశిరేఖ.
    త్యాగరాజు బాధ పడతాడేమోనని అతడికి ఆ ఉత్తరంలోని విషయాలు చెప్పటానికి సంశయించసాగింది.
    ఒక్కసారి తలెత్తి త్యాగరాజు పడుకున్నాడెమోనని చూచింది.
    అప్పటికే అతడు నల్లటి దుప్పటిని నిలువెల్లా కప్పుకొని పడుకొని వున్నాడు!

                               *    *    *    *
    తెలతెలవారుతుండగా త్యాగరాజుకు మెళుకువ వచ్చింది.
    కాసేపు కళ్ళు తెరుచుకునే పడుకున్నాడు.
    రాజేశ్వరి యింకా లేవలేదు.
    -- అంటా అనుకున్నట్లుగా జరిగినట్లయితే ఈ ఉదయాన తన జీవితంలో వో ముఖ్యమయిన సంఘటన జరిగి వుండేది!
    కాని-- నిన్న ఎదుర్కొన్న మానసిక ఆందోళన ఈనాడు ఆ పనిని చేయనీయక పోయింది.
    --రాజేశ్వరి బాధ పడుతున్నదేమో?'
    లేచి బెడ్ మీద కాళ్ళ మీదుగా తల పెట్టుకుని కూర్చున్నాడు త్యాగరాజు.
    కళ్ళ ముందు చంద్రం కదిలాడు.
    వాడి పగిలిపోతున్న హృదయాన్ని తనెలా అతకగలడు?-- తనెలా అతడిని వోదార్చగలడు?
    అసలు ఎలాటి చంద్రం యెలా అయ్యాడు?
    'చంద్రా! నీకెలా తెలుస్తుంది-- నీవు నిన్న అన్న మాటలకు నేనెంతగా కుమిలి పోయానో? నన్నెలా అర్ధం చేసుకుంటావురా!... నీవు నూరేళ్ళు జీవించాలి రా నాన్నా!'
    కంటి వెంట నీరు గిర్రున తిరిగింది.
    'చంద్రా! ... చంద్రా!' తలను అటూ యిటూ బాధగా ఊపసాగాడు.
    గొంతు మంట పుడుతోంది.
    కళ్ళు రెపరెప లాడించాడు.
    'అదేవిటి?.... ఈరోజు పెందరాళే లేచారు! ... నిద్ర పట్టలేదా?' అన్న రాజేశ్వరి మాటలకు ఉలిక్కి పడ్డాడు త్యాగరాజు.
    నీటి పొరలు క్రమ్మిన కళ్ళతో తల పై కేత్తితే అంతా మసక మసకగా కనబడింది.
    "ఏవిటి? ఎవంటున్నావ్?' అన్నాడు అయోమయంగా.
    ఫక్కున నవ్వింది రాజేశ్వరి.
    'మీరు అప్పుడే ముసలి వారై పోతున్నారు!' అన్నది.
    త్యాగరాజు అమాయకంగా నవ్వాడు.
    'అయితే నీకు తగనంటావా?' అన్నాడు అప్రయత్నంగా. అలాగే చూస్తూ -- ఏదో వాతావరణం లో పెరిగిపోతున్న ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా.
    రాజేశ్వరి తీక్షణంగా చూచింది.
    తడబడ్డాడు త్యాగరాజు.
    "ఎండుకన్నానా అలా' అని బాధపడ్డాడు.
    రాజేశ్వరి వంట యింట్లోకి వెళ్ళిపోయింది.
    తరువాత కాఫీ గ్లాసు అందిస్తుండగా మౌనంగా నిలబడ్డ రాజేశ్వరి వంక చూస్తూ దీనంగా, 'నన్ను క్షమించు!' అన్నాడు.
    'గాయపడ్డ మనస్సుకు మందా అది?' అన్నది తదేకంగా నేలను పరీక్షిస్తున్నట్లుగా చూస్తూ.
    'కాదు, పోరాపాటున తగిలిన దెబ్బకు కావాలని ఇస్తున్న ఔషధం!'
    రాజేశ్వరి బాధ పడింది.
    -అతడు అన్న మాటలను తను చాలా సీరియస్ గా తీసుకున్నందుకు--
    'చేసిన తప్పుకు క్షమాపణలే చెప్పుకోనక్కర లేదు-- పశ్చాత్తాపపడితేనే దేవుడు మెచ్చుతాడు!-- అటువంటిది నేనెంత' అన్నది నవ్వును విరుస్తూ.
    కాఫీ త్రాగి ఖాళీ గ్లాసు క్రింద పెడుతూ, 'ఈరోజున నేను దంద్రం దగ్గరకు వెళ్ళను -- వాడిని చూడాలన్నా, వాడి మాటలు వినాలన్నా నాకు భయంగా వున్నది-- నీవు వెళ్ళి కాఫీ ఇచ్చిరా!' అన్నాడు.
    రాజేశ్వరి తల ఊగిస్తూ , 'అలాగే!' అన్నది.
    తరువాత కాఫీ తీసుకొని రాజేశ్వరి బయల్దేరుతుండగా సత్యవతి అడగనే అడిగింది. 'నీవు వెళుతున్నావేం; రాజేశ్వరీ!' అంటూ.
    'ఆయనకు తెల్లవార్లూ నిద్ర లేదేవో-- కళ్ళు మంటలు పుడుతున్నయ్యట! - నేనే వెళ్ళొస్తానని బయల్దేరాను!' అన్నది త్యాగరాజు వంక చూస్తూ, గుంభనంగా నవ్వి.
    "నీవెందుకు-- నేను వెళ్ళి వస్తానులే, ఇటు ఇవ్వు!' అన్నది సత్యవతి.
    'సత్యవతీ! వెళ్ళి రానీయ్...నీవు మాములుగా వెళుదువు గానీ లే!' అన్నాడు త్యాగరాజు.

                          *    *    *    *
    తొమ్మిది గంటలయింది?
    త్యాగరాజు కావాలని మరోసారి కాఫీ కలిపించుకు త్రాగుతున్నాడు.
    అప్పటికి సత్యవతి చంద్రం దగ్గరకు వెళ్ళి ఓ పావు గంట అయింది.
    వంట యింట్లో గడప అవతలగా సంచీ వేసుకొని కూర్చున్నాడు త్యాగరాజు.
    'ఇప్పుడిచ్చిన కాఫీ చాలా అద్భుతంగా వున్నది!' అన్నాడు మరుక్షణం లోనే, ఏదో తప్పు చేసిన వాడిలా నవ్వి, 'ఆహా.... నీవు కాఫీ ఎప్పుడు కలిపినా బాగానే వుంటుంది!' అన్నాడు.
    '--ఇంతలోనే కోపం తెచ్చుకునే టందుకు నేనేవైనా చిన్న పిల్ల ననుకుంటున్నారా?' అన్నది రాజేశ్వరి నవ్వి కన్నార్పకుండా త్యాగరాజు ముఖంలోకి చూస్తూ.
    '....అదిగాదు నా ఉద్దేశ్యం!' తడబడ్డాడు.
    'మరి దేనికి బుజాలు తడుముకోవటం?' రెట్టిస్తున్నట్లుగా అడిగింది.
    ఒక్కక్షణం సాలోచనగా ఆగి, 'నేనీ మధ్య చాలా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను... అందువలన , నా తెలివి తక్కువను కప్పి పుచ్చుకోవటానికి మరిన్ని తప్పులు చేయవలసి వస్తోంది!' అని ఫక్కున నవ్వాడు.
    రాజేశ్వరి నవ్వింది.
    తరువాత వో నిముషం ఆగి; ఇంతకీ ఈపూట మీ కార్యక్రమమేమిటి?-- శకుంతలను చూడటాని కైనా వెళుతున్నారా?" అడిగింది.
    'వెళ్ళొస్తాను! ....నిన్న సాయింత్రమే వస్తానని చెప్పి వెళ్ళలేక పోయాను!' అన్నాడు కొద్దిగా పాశ్చత్తాప కంఠంతో -- కూర్చున్న చోటు నుండి లేచాడు , స్నానానికి నీళ్ళు తోడు!'
    ఇవతల గదిలోకి వచ్చిన వాడల్లా మళ్ళా గడప దాటి వంట యింట్లోకి వెళ్ళి స్టౌ మీద నీళ్ళు దించుతున్న రాజేశ్వరి తో, 'మరి, ఇంటికి ఉత్తరం వ్రాశావా?' అడిగాడు.
    'ఉత్తరం వ్రాయటమూ అయింది, జవాబు రావటమూ అయింది!'
    "అక్కడ క్షేమమే గదా, అంతా?"
    "ఆహా! ' అని ఒక్క క్షణం స్థిరంగా అతడి ముఖంలోకి చూచి, 'నా పెట్లో పైనే ఉన్నది.... కాస్త తీసుకొని చూడండి బాబూ!' అన్నది చెల్లెలి వ్రాతలను తను చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా.
    -ఆమెకు ఉత్తరం రాలేదని అబద్దం ఆడటం ఇష్టం లేదు. నిజం చెబుతూ చెల్లెలు వ్రాసిన విషయాన్ని త్యాగరాజు నుండి దాచటమూ యిష్టం లేదు-- రాత్రంతా ఆలోచించిన మీదట 'త్యాగరాజు బాధపడ్డా' అతడికి చెప్పటానికే నిర్ణయించుకున్నది!
    -అందుకే అలా అన్నది!
    'నీ ఉత్తరం నేనెందుకు చదవాలి?' అన్నాడు వెనక్కు తిరగబోతూ.
    'నాకంటూ వేరే కొన్ని రహస్యాలుండటం వలన మీకేవైనా లాభమున్నదా?' అన్నది వంట యింట్లోంచి. వెనుక భాగంలోకి వెళ్ళబోతూ -- చేతిలో వేడినీళ్ళు బక్కెట్ తో-- ముఖం వెనక్కు తిప్పి!
    "నష్టమూ లేదుగా!' అన్నాడు నవ్వి.
    'అలా మీరు చూడకపోవటం వలననే నాకు నష్టమున్నదేవో ననిపిస్తోంది-- అందుకే చూడమన్నాను!' అవతలకు వెళ్ళిపోయింది, ఇక అక్కడ వుండటం యిష్టం లేనట్లుగా.
    ఒక్క క్షణం తటపటాయించి ఆ గది మూలగా ఉన్న పెట్టి మూత తీసి పైనే వున్న ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నాడు.
    త్యాగరాజు ఆ ఉత్తరం చదువుతూనే ఆప్రతిభుడయ్యాడు -- అలాంటివి తాను ఊహించనే లేదు!
    ఆవేశంగా, 'రాజూ!' అంటూ వెనుదిరిగిన అతడికి, అతడి ముఖంలోకి చూస్తూ, వెనగా నిలబడి వున్న రాజేశ్వరి కనబడింది.
    కలవరంతో ఆమె భుజాల మీద చేతులు వేసి ఊపుతూ, 'రాజేశ్వరీ! ఏవిటిది?" అన్నాడు ఉద్రేకంగా.
    మొఖమంతా చెమటలు పట్టింది.
    'నాకెలా తెలుస్తుంది-- నేను వ్రాశానా ఆ ఉత్తరం!' అన్నది నిర్లక్ష్యంగా. "అయినా ఎందుకంతగా అవేశపడతారు -- లోకులు కాకులు!'
    త్యాగరాజు తదేకంగా రాజేశ్వరి మొఖంలోకి చూస్తూ అలాగే వుండి పోయాడు.
    "నేను పొరబాటు చేశాను-- నేను పొరబాటు చేశాను!' పెదిమలు అల్లల్లాడినయి.
    -మనస్సు మరోసారి విలపించింది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS