Previous Page Next Page 
మారిన విలువలు పేజి 18

                               

    "ఈయనేవరక్కా?"
    "మాకేం నేర్పుతారూ?"
    "మంచి మంచి కధలోచ్చా?"
    "మేము ఏమని పిలవాలెం?"
    పిల్లలందరూ తలో ప్రశ్నా వేసేరు.
    "ఈయన పేరు గోవిందబాబు. చాల మంచివారు. మీకు కధలు , కబుర్లు చాలా చెప్తారు. అయన కెన్నో ఆటలు కూడా వచ్చునట. మీరంతా బుద్దిగా ఉంటె మీకవన్నీ నేర్పుతారు. అంతేనా, గోవిందరాజులూ?" అన్నది జానకి అతని వైపు తిరిగి.
    పిల్లలకు ఆ పేరేమంత బాగున్నట్లు లేదు. అందులో చిన్న పిల్లలు ఆ పేరు తమ నోరు తిరుగుతుందా, లేదా అని నోటి లోనే గొణుక్కుని చూసుకొంటున్నారు. అందరూ తమలో తాము మెల్లగా అనుకొంటున్నా, అదంతా కలిసి పెద్ద గోలగా వినిపించింది.
    "ఏమిటా గోల? ఉష్!' అని గదమాయించింది టీచరు.ఒక్కసారి హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది.
    అప్పటికి పిల్లలమనస్సులో ఈకొత్త వ్యక్తిని తాము ఏమని పిలవాలా అన్న సంశయం మిగిలే ఉన్నది. ప్రశ్నార్ధకమైన చూపులతో జానకిని,గోవింద బాబును మార్చిమార్చి చూస్తున్నారు.
    "బాబుగారికి నమస్కారం చేసి, పదండి. పాఠాలకు టైమైపోతున్నది" అని టీచరు తొందర పెట్టింది.
    పిల్లలు రెండుచేతులూ జోడించి, "నమస్కారం ' అని ఊరుకొన్నారు.
    "నన్ను అన్నయ్యా' అని పిలవండి . ఏం, ఆపేరు బాగుందా?' అన్నాడు గోవిందబాబు.
    పిల్లలు ముఖాలు వికసించేయి.
    "నమస్కారం , అన్నయ్యా.... నమస్కారం అన్నయ్యా' అంటూ గోలగా అరుస్తూ వెళ్ళిపోయేరు.
    "పదండి , ఆఫీసు చూద్దురు గాని" అంటూ దారి తీసింది జానకి. ఆఫీసులో కాస్త సేపు ఆ కాగితం ఈ కాగితం చూసేడు గోవిందబాబు.
    "మీ బాలవిహార్ చూడ ముచ్చటగా ఉంది. జానకీ! ఆశయాలు కూడా అందంగానే ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడంతో ఎంతవరకు కృతార్జులవుతున్నారో కొంతకాలం ఉండి చూస్తె కాని తెలియదు. ఏవో కొద్ది పాటి లోపాలు ఉన్నా అనసూయక్క చేసిన ఈ పని నా కెంతో నచ్చింది. తనకు పిల్లలు లేరని ఇతరుల పిల్లల్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకోకుండా పై వారి పిల్లల్లో తన పిల్లల్ని చూసుకుని ఆనందిస్తున్నది.
    "ఈమె అఖరి పిల్ల పోయేక, ఈవిడను చూసిన వాళ్ళు తిరిగి ఇలా మనిషిలా బ్రతకగల ధనుకోలేదుట. మా నాన్నగారు చెప్తుండేవారు-- అనసూయక్క భర్త ఈవిడను ఇటువంటి సత్కార్యం వైపు తిప్పింది కి ఎంత గానో బాధపడ్డాడుట.భగవంతుడు ఇదీ ఒకందుకు మంచికే చేసేడేమో అనిపిస్తుంది నాకు. అనసూయక్క సొమ్ము తన అయిదుగురి పిల్లలకే పరిమితం కాక,  ఇంతమంది పిల్లల బతుకులు దిద్దుతున్నది." అన్నాడు అతడు.

                             *    *    *    *
    గోవిందబాబు రాకతో బాలవిహార్ లో ఎన్నో మార్పులు వచ్చేయి. అనసూయమ్మ అనారోగ్యం మూలంగా ఆగిపోయిన స్టాఫ్ క్వార్టర్స్ పని తిరిగి ప్రారంభమయింది. ఆ పని పూర్తయితే బాలవిహార్ లో పనిచేస్తున్న అందరికీ వసతి సౌకర్యాలు ఏర్పడతాయి. ఎక్కడో దూరంగా ఉంటూ, వేళ పట్టున చూసి పోవడం కాకుండా, స్టాఫ్ అంతా పిల్లలకు దగ్గరలో ఉంటె వారి మంచి చెడ్డలు చూసేందుకు, వారి సమస్యలు అర్ధం చెసుకొందుకు ఇంతకన్నా ఎక్కువ అవకాశం ఉంటుందన్న అభిప్రాయం తో పని ప్రారంభించడమయింది. మూడు నాలుగు నెలలు బోరుగా పనిచేస్తే నిర్మాణం పూర్తయిపోతుంది.
    పిల్లలకు అదివరలో ఉన్న అట స్థలాన్ని విసృతం చేసి మరికొన్ని కొత్త ఆటలు ప్రవేశ పెట్టేడు గోవిందబాబు. చిన్నతనంలో ఆటల్లో ఆరితేరిన అతడు, ఆ వయసులో కూడా పిల్లలతో సరిగా గెంతుతూ తుళ్ళుతూ ఆడుతుంటే, మనిషి ఏ వయస్సు లోనూ బాల్య చాపల్యాన్ని వదులుకోలేడేమో అనిపించేది జానకికి.
    ఇటువంటి సేవా సంస్థలు సమర్ధంగా నడవాలంటే ఈనాడు అమల్లో ఉన్న పద్దతుల్లో కొన్ని మార్పులు రావాలని, వాటిని ఆచరణ లో పెట్టిన నాడే అందుకు సంబంధించిన వాళ్ళు పూర్తీ ఫలితాన్ని పొందగలుగుతారనీ గోవిందబాబు అభిప్రాయం. విరిసీ విరియని మొగ్గల్లా ఉన్న బాలవిహార్ పిల్లలు, అతని ఆశయాలకు పురేక్కించేరు. తగిన వాతావరణం, డబ్బు, అధికారం చేతిలోకి వచ్చేసరికి గోవిందబాబు తన ఆలోచనలన్నీ కార్యరూపంలో పెట్టందే ఇక్కడి నుండి కదలకూడదని నిశ్చయించుకున్నాడు.
    అనసూయమ్మ బాలవిహార్ అభివృద్ధి కి తన సహాయం అంగీకారం ఎప్పుడూ ఉంటాయని అతనికి నమ్మకం కలిగించింది. తన అనారోగ్యస్థితిలో అతడు వచ్చి ఆ భారం వహించడం బాలవిహార్ పిల్లల అదృష్టం అని సంతోషించింది.
    అందరి ఆలోచనలు ఒక్కలాగ ఉండవు. అనసూయమ్మ అనారోగ్య పరిస్థితిని సాకుగా చేసుకుని ఆవిడా అనంతరం ఆస్తంతా చేజేక్కించుకోవాలని గోవిందబాబు ఈ పన్నాగం పన్నుతున్నాడని కొందరి అభిప్రాయం.
    "చూస్తుండండి. ఇతడి చేతుల్లోకి అధికారం రాగానే మూడు రోజుల్లో చెట్టు మీది పిట్టల్లా, పిల్ల లందర్నీ వెళ్ళగొట్టి బాలవిహార్ తలుపుకి తాళం వేస్తాడు.రామ, రామ! ఆ పిల్లల గతెమావుతుందో!" అని ఎప్పుడో జరుగుతుందని తాము ఊహించుకొంటున్న పిల్లల అభాగ్య స్థితికి కన్నీరు కార్చేరు కొందరు దయామయులు.
    "ఎంతో తెలివయిందనుకున్న అనసూయమ్మ ఈ ఆషాడ భూతి చేతిలో పడిందేమిటి? ఎవరో మనలాంటి నలుగురు పెద్దల్ని ట్రస్టీలు గా ఏర్పాటు చేస్తే సరిపోదూ?" అన్నారు మరికొందరు.
    ఎవరెలా అనుకొంటున్నా గోవింద బాబు మరికొంత  కాలం బాలవిహార్ లో ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. "నేను తిరిగి వచ్చేవరకు మీరు మరొకరిని సహాయం తెచ్చుకొని, అక్కడి డిస్పేన్సరీ ని నడుపుతుండండి . నాకోసం ఈ శ్రమ మీరు తీసుకోక తప్పదు" అని తండ్రికి ఉత్తరం వ్రాశాడు.
    గోవిందబాబు రాకకు పూర్వం ఎంతట పని చేసుకొని ఇల్లు చేరుకొంటాననే ఆత్రతలో ఉండేది జానకి. ఈ పిల్లల పట్ల తను చూపిస్తున్న అభిమానమంతా, తను నిజంగా అభిమానించే మరికొందరి పురోభివృద్ది కోసం అని అనుక్షణం జ్ఞప్తికి తెచ్చుకొంటుండేది. ఈ ఉద్యోగం వదిలి వేసిన క్షణం నుంచీ ఈ పిల్లలకూ, తనకూ ఏమీ సంబంధం ఉండదు. అలా తెగిపోని అనుబంధం , తెంపుకోలేని అభిమానం ఇంకో దగ్గిర ఉన్నాయన్న తలంపే ఆమెను ఇంటికి ఆకర్షించేవి.
    ఇటీవల ఆమె ఆలోచనల గతే మారిపోయింది. గోవిందబాబుతో పరిచయం అయేక తన ఆలోచనలలో చేతలలో మంచి చెడ్డలను తరిచి తరిచి చూసుకొనే అలవాటు ఏర్పడింది. ఈ ఆత్మ పరిశోధనకు తగినంత అవకాశం ఉండేది వారి సంభాషణలో.
    "మనం ఇంతగా పిల్లల్ని ప్రేమిస్తున్నామా, గోవిందబాబు? వాళ్ళ బాగుకోసం ఇంత సొమ్ము ఖర్చు పెడుతున్నాము. వాళ్ళు మనల్ని ప్రేమతో అభిమానంగా చూసినట్లే అనిపిస్తుంది. కాని ఆ అభిమానం సహజంగా వాళ్ళ మనసుల్లో పుట్టించి కాదేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళకు మన పట్ల కృతజ్ఞత మినహా ఇంకేం లేదని పిస్తుంది. ఇదే ఇంటిలో పిల్లలైతే?"
    "అక్కడే మనం పోరాపడుతున్నాం, జానకీ. వాళ్ళ మీద మనం దయ, జాలి చూపించి, ప్రేమిస్తున్నాం అనుకొంటూన్నాము. దానికి ప్రతిఫలంగా ఆప్యాయతా కోరుకొంటున్నాం. ఇది అన్యాయం కాదూ? దయకు, జాలికి ప్రతిఫలం కృతజ్ఞత. ప్రేమకు ప్రతిఫలం ఆప్యాయత.
    "మీ ఇంట్లో మీ తోడబుట్టిన వాళ్ళు సంతగించి, దెబ్బలాడి తమ కోర్కెలు సాధించుకొన్నట్లు ఇక్కడ వీళ్ళు చెయ్యలేరు. ఎందుచేతనంటారు? ఆ హక్కు మీ దగ్గర తనకు లేదని వాళ్ళ అభిప్రాయం. జాలి వల్ల పుట్టిన ప్రేమలో ఆ హక్కు ఎదుటి వారికి సంక్రమించదు. అందుకే అటువంటి వారి ప్రేమలో ఆప్యాయత లోపించి కృతజ్ఞత నిండిపోతుంది" అనేవాడు గోవిందబాబు.
    గోవిందబాబు మాటల్లో సత్యం ఉన్నదనిపించింది జానకికి. ఇంతకాలం తను బాలవిహార్ పిల్లల్ని సొమ్ము కోసమే ప్రేమించింది. కాకపోతే తలిదండ్రులు లేని అనాధలని జాలి తలచింది. కాని, ఏనాడూ హృదయపూర్వకమైన ప్రేమాభిమానాలు ఆ పిల్లలపట్ల  తనమనస్సులో కలగలేదు. వాళ్ళను చూస్తుంటే శాంతను, సాంబును ప్రకాశాన్ని చూస్తున్నప్పటి అనుభూతి కలగలేదు.
    తనలో లేనిది, అనసూయమ్మ లో ఉన్నది అదే అని తెలుసుకోంది జానకి. అందుచేతనే పిల్లలు ఆమెకు అంత మాలిమిగా ఉండి, తనంటే లక్ష్య పెట్టేవారు కారు. కొన్ని జంతువులకు ఉన్నట్లే పిల్లలకు కూడా, తమను ప్రేమించే వారి మనస్సులను అర్ధం చేసుకోగలిగే ప్రత్యెక జ్ఞానం ఉంటుంది లాగుంది. తను తన ప్రేమాభిమానాలను ఇంటి దగ్గర భద్రపరిచి ఇక్కడ నటన చెయ్యబోతే, పసికట్టి, ఆ పిల్లలు తన నటనను తన మీదికే తిప్పి కొట్టేవారు అనుకొన్నది.
    జానకి అభిప్రాయాల్లో వచ్చిన మార్పు పిల్లల కళ్ళలో కూడా కనిపించింది. వాళ్ళ చేతల్లో, మాటల్లో ఆప్యాయత, ప్రేమ ప్రవహిస్తున్నట్లు అనిపించింది ఆమెకు. నిజానికి ఏనాడూ ఆమె పిల్లల కళ్ళలో చూసింది తన ప్రతిబింబమే. తన ప్రేమలో కల్మషం ఉన్నంత కాలం అది వారి కళ్ళలో ప్రతిఫలించింది.
    "కడిగిన అద్దాల్లా ఉండే పసివాళ్ళ మనస్సులో మన కుత్రిమ రూపం ఛాయను చూసుకొని, ఆ కల్మషాన్ని వాళ్ళకు అంటగట్ట ప్రయత్నిస్తాం."అనేవాడు గోవిందబాబు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS