Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 18

 

    విధి బలీయం, డాక్టరుగారూ!
    ఒళ్ళు ఎరగని జ్వరంతో నేను మీ హాస్పిటల్లో చేర్చబడడం, మీతో ఆవిధంగా పరిచయమై మీదగ్గిర పెరుగుతూన్న నా బాబుకు నేను దగ్గిర కావడం చిత్రంగా జరిగిపోయాయి. బాబును చూసినది మొదలు నాలోని మాతృవాత్సల్యం కట్టలు తెంచుకొంది.
    బాబుమీద మీ ప్రేమ ఎంత అపూర్వమూ, ఆశ్చర్యకరమూ అంటే, నా మాతృహృదయం సహించలేనంతటిది. నా సొత్తు మీ రనుభవిస్తున్నట్లుగా నా మనసు ఈర్ష్య చెందేది. బాబుకు చేరువ కావాలని నా హృదయం తహతహ లాడింది. కాని అది ఎలా సాధ్యం? ఎత్తు వేశాను. మీ భార్య కాదలిచాను. సౌందర్యం, ఐశ్వర్యం, సంస్కారం, హోదా అన్నీ ఉన్న భర్తను పొందడం, నా బాబుకు చేరువ కావడం రెండూ జరుగుతాయని ఆశించాను. కవ్వించాను. మిమ్మల్ని వలపించాను.
    అనుకొన్నట్లుగానే కథ నడిచింది. కాని-
    మీ ప్రేమ వ్యక్తపరిచిననాడు నా స్వార్ధపూరిత పథకం విచ్చిన్నమైంది. కిషన్ కు మనఃపూర్వకంగా అర్పించబడిన నా యౌవనసౌందర్యం ఈనాడు స్వార్ధ ప్రలోభానికి లోబడిందనిపించింది. ఒక ఉత్తమ పురుషునికి ఎరచూపి వంచిస్తూ, నా కిషన్ కు ద్రోహం చేస్తున్నాననిపించింది. మీ నిష్కళంక జీవితంలో అడుగుపెట్టే సాహసమూ నాకు లేకపోయింది. పుణ్యంతో కలిసి జీవించడానికి పాపం భయపడుతూంది! మీ నిర్మల ప్రేమకు బహుమతిగా నా అపవిత్ర జీవితాన్ని అర్పించడానికి నాలోని మానవత్వం వెనుదీసింది.
    మీదాన్ని కావాలన్న ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాను. నా ప్రవర్తన మారిపోయింది. ఫలితంగా మీ మనస్సు నొప్పిపడింది; కోపం వచ్చింది.
    కాని, బాబుమీద నా ఆశ అంతరించిపోలేదు. బాబును అక్కున చేర్చుకొంటేనేగాని ఉబికి ప్రవహిస్తూన్న నా మాతృప్రేమకు ఆనకట్ట పడేట్లు లేదు.
    ఆరోజు సాయంకాలం మీరు ఊళ్ళో లేరన్న ధైర్యంతో బాబును ఇంటికి తెచ్చుకొన్నాను. నాకిష్ట మైన రీతిగా బాబుకు ముస్తాబు చేశాను. వాడిని కళ్ళారా చూచుకొన్నాను. చలికాలమన్న విషయం గుర్తు వచ్చి అప్పటికప్పుడు దుకాణానికి పంపించి ఊలుబనీను, మఫ్లరు తెప్పించాను. బాబుకు  అన్నం పెట్టుకొని వెచ్చగా నా రొమ్ముల కదుముకొని ఎన్నడూ ఎరగని సుఖనిద్రలో ఉండగా. ఏం చేశారు మీరు వచ్చి? బాబును నానుండి లాక్కుపోయారు. ఆ అర్ధరాత్రి! ఈ తల్లి గుండె విలవిల్లాడిందని, ఆవేదనకు తట్టుకోలేక తెల్లవారేవరకు గుమ్మంలో తెలివి లేకుండా పడి ఉందని బాబు పొట్టమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రిస్తూన్న మీకేం తెలుసు?
    బాబు నాకు కావాలి. ఈ వాంఛ దూరం చేసుకోలేను. బాబులేని జీవితం దుర్భరం, ఒకప్పుడు బాబును వదులు కొన్నానంటే, అది ఆపద సమయం. అదిరిపోయిన హృదయంతో రత్న చేతిలో కీలుబొమ్మగా ఆడాను. ఇప్పుడు నే నెవరికీ భయపడను. సంఘం ఎంత నీచంగా చూసినా నాకు బిడియం, భయం లేవు.
    ఈ తల్లి హృదయావేదన సహృదయతతో అర్ధం చేసుకొని పెంపకానికి ఇచ్చివేస్తున్నట్లుగా బాబును నాకిచ్చివేస్తే కృతజ్ఞురాలుగా ఉంటాను మీకు,మ్ ఆజన్మాంతం. లేదు, ఇవ్వలేనంటారూ, నా జీవితం ఎంత అల్లరిపడినా సరే, కోర్టు ద్వారా నా బాబును నేను దక్కించుకొంటాను. బాబును తీసుకోని ఏ దూర ప్రదేశాలకో వెళ్ళి బ్రతుకుతాను.
    ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకొనే కర్మ నాకెందుకు పట్టాలి, నాకడుపున పుట్టిన బిడ్డ ఉండగా? ఆ ప్లాస్టిక్ బొమ్మలేవో మీరు సంపాదించుకొని బాబులేని లోటు తీర్చుకోండి.
                - రూప."

                                      9

    "కోర్టుకెక్కనీ. అక్కడే తేలుతుంది విషయం. నలుగురూ 'ఛీ' అని మొహంమీద కొడితే దీని తెగులు అప్పుడు కుదురుతుంది." కాగితాలన్నీ ఉండచుట్టి గదిమూలకు విసిరి కొట్టింది కృష్ణప్రియ. "ఆనాడు అర్దాంతరంగా రైల్లో పారేసిపోయిననాడు లేని ప్రేమ ఈవేళ ఉబికి వచ్చిందిట! బాబు కావాలిట, బాబు! వెళ్ళి ఎవరితో చెప్పుకుంటుందో చెప్పుకోనీ, నీతీ జాతీలేని సిగ్గుమాలిన ఆడది. ఛీ, ఛీ!" క్రోధాసహ్యాలతో ఆమె వదనం రక్తిమ దాల్చింది.
    "గోకుల్ ను వదిలి ఉండేదెలాగ, కృష్ణక్కా?" నిస్సహాయంగా రోదించసాగాడు కళ్యాణ్.
    "పిచ్చికృష్ణుడివిరా నువ్వు!" అనునయంగా ఓదార్చింది. "ఎవరు గోకుల్ని ఇచ్చేది? ఎవరు ఇప్పించేది? బలవంతాన నీనుండి ఎవరు ఇప్పించగలరో చూద్దాం. కోర్టు కాదు; దేవుడుకూడా ఇప్పించలేడు. పురిటి పిల్లవాడిని ఇంటికి తెచ్చి ఇన్నాళ్ళు సాకింది, తిరిగి ఇచ్చివెయ్యడానికి కాదు." ఆవేశంగా అంది.
    "మనం గోకుల్ని ఇవ్వద్దు కదూ?" అక్క మాటలకు ఆలంబనం దొరికినవాడిలాగా లేచి కూర్చున్నాడు. "అవును; ఎందుకిస్తాం? మాటలా, ఇన్నాళ్ళు పెంచి!" ధైర్యం తెచ్చుకొన్నాడు.
    "అంతే మరి. మనం బాబును ఇవ్వక్కర్లేదు. వెళ్ళి దిక్కున్నచోట చెప్పుకోనీ, అయినా దీనికి ఇదేం తెగులు? ఎక్కడైతేనేం, పిల్లవాడు అల్లారుముద్దుగా పెరుగుతున్నాడని అనుకోక!"
    గోకుల్ ను తీసుకుపోయి అన్నం పెట్టివచ్చి, కళ్యాణ్ మంచంమీదే పక్కవేసి పడుకో బెట్టింది కృష్ణప్రియ. "పద, కృష్ణా, భోజనానికి."    
    "ఇప్పుడు నే నేమీ తినలేను. నా మనస్సుకు ఊరట కలగడంలేదు. నువ్వు తినేసేయ్." పిచ్చిగా పచార్లు చెయ్యసాగాడు కళ్యాణ్.
    "బాధ ఎందుకు, ఇప్పుడు? రూపకాదు; హరిహర బ్రహ్మాదులు కూడా గోకుల్ ను నీనుండి వేరు చెయ్యలేరని చెప్పానుగా? మనస్సు ఎందుకు పాడు చేసుకొంటున్నావు?"
    "కాదు, కాదు." పిచ్చిగా, బాధగా జుట్టు పీక్కున్నాడు.
    ఎంత ప్రయత్నించినా తమ్ముడిని భోజనానికి లేపలేక విసిగి వంటపదార్ధాలన్నీ మూసిపెట్టి తనూ తినకుండానే వెళ్ళి పడుకుంది కృష్ణప్రియ.
    కళ్యాణ్ పచార్లు చేస్తున్నవాడల్లా బాబు మంచం దగ్గిర నిలబడ్డాడు. అమాయికంగా ఆదమరచి నిద్రిస్తున్నాడు బాబు. బాబును చూస్తూ 'ఇవ్వలేను' అనుకొన్నాడు.
    "బాబు! నా బాబు!" చేతులు చాచి సజలనేత్రి అయి దీనదేవతవలె నిలబడింది రూప.
    "ఇవ్వను. బాబును ఇవ్వను." బాబును ఎత్తుకుని పరిగెత్తసాగాడు.
    "బాబు లేనిది బతకలేను. బాబును ఇవ్వండి. నా బాబును నాకివ్వండి!" పిచ్చిగా అరుస్తూ వెంట పడింది.
    మనఃఫలకంపై క్షణకాలం కదిలిన ఊహా చిత్రానికి హడిలిపోయాడు కళ్యాణ్. "గోకుల్!" వెర్రిగా కేకపెట్టి బాబును పొదివి పట్టుకున్నాడు. "ఇవ్వలేనురా! నిన్ను ఇచ్చివేసి నేను జీవించలేనురా!"    
    "నాన్నా!" బాబు మేల్కొని కళ్యాణ్ చెంపలమీద స్రవిస్తూన్న అశ్రుధారాలను తుడిచాడు. "ఏలుత్తున్నావేం, నాన్నా? నువ్వు ఆడపిల్లవి కాదుగా? నేను ఏలుత్తుంతే, ఆడపిల్లలు ఏలుత్తారుగాని మగపిల్లలేలవచ్చా అనలా నువ్వు?"
    "నీ ముద్దు మాటలు వినకుండా నేనుండగలవా, బాబూ?" బాబును ముద్దు పెట్టుకొన్నాడు ఆవేశంగా. పైకి, "బాబును ఇవ్వను, ఇవ్వను" అంటూన్నాడేగాని ఆంతర్యంలో సంఘర్షణ జరుగుతూనే ఉంది. 'ఎన్ని కష్టాలకో ఓర్చి బాబును మోసి శోకంలోకి తెచ్చిన తల్లికి ఉండే హక్కు నాకెక్కడిది, బాబుమీద?'
    ఏదో స్థిరనిశ్చయం చేసుకొన్నవాడిలా కళ్యాణ్ ముఖం గంభీరమైంది. అలాగే తొడమీద పడుకొన్న గోకుల్ ను నెమ్మదిగా భుజంమీదికి ఎత్తుకొని లేచాడు.
    బాబుకోసం కలవరించి, కలవరించి అప్పుడప్పుడే కలతగా నిద్రపట్టిన రూప తలుపు తట్టిన శబ్దంవిని మేలుకొంది. లేచి వచ్చి తలుపు తీసింది.
    "నా బాబును తెచ్చారా?" రూప ముఖంలో కోటి దీపాలు ఒక్కసారిగా వెలిగాయి.
    బాబును రూపముందు ఉంచి వడివడిగా వెళ్ళి వస్తున్న కల్యాణి, "నాన్నా, నాన్నా" అని బాబు ఏడవడం వినిపించినా గుండె చిక్కబట్టుకొని సాగిపోయాడు. ఇంటికి ఎలా చేరాడో తెలియదు. తాగిన వాడిలాగా తూలుతూ గదిలో ప్రవేశించి టేబిల్ మీద ముఖం ఉంచి భోరున ఏడ్చాడు, ప్రాణాధికమైన వారిని ఖననభూమిలో పెట్టివచ్చినవాడిలాగ.
    కంగారుగా లేచి వచ్చింది కృష్ణప్రియ, "బాబు ఏడీ?"
    "ఇంకెక్కడ బాబు?"
    "ఇచ్చివచ్చావా?" నివ్వెరపోయింది.
    ముఖానికి చేతులు కప్పుకొని ఏడవసాగాడు.
    "నీ జీవితం చుట్టు ఇదేం విషవలయం చుట్టుకొన్నదిరా కృష్ణా? ప్రేమించిన రాధనూ పోగొట్టుకొన్నావు. ప్రాణంలా పెంచుకొన్న గోకుల్ నీ కోల్పోయావు. ఏం దురదృష్టం నీది!" కొంగుతో కళ్ళు తుడుచుకొంది. ప్రప్రధమంగా గోకుల్ మీద అసహ్యం కలిగిందామెకు. "ఎక్కడో ముధనష్టపు పిల్లాడు! నీ జీవితానికి శనిలా దాపురించాడు. ఏ క్షణాన నీ జీవితంలో ప్రవేశించాడో నీ సుఖశాంతులను మంట గలిపాడు!"
    "అక్కా!" దీనంగా అన్నాడు. "నా బాబును ఏమీ అనకు. ఒక్క పరుషవాక్కు వాడకు. వాడు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండనీ అని ఆశీర్వదించు."
    "ఈ వెర్రిప్రేమే నీకు పిచ్చి ఎత్తిస్తూందిరా!" కృష్ణప్రియ గబగబా కళ్ళు తుడుచుకొంటూ వెళ్ళిపోయింది.

                                  *    *    *

    రాత్రి అంతా నిద్ర లేనికారణంగా కళ్యాణీ కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. ముఖం అంతా పీక్కుపోయింది. ఉదయమే, గోకుల్ బట్టలపెట్టె ఒకడి నెత్తినా, ఆట వస్తువులన్నీ వేసిన పెట్టె ఒకడి నెత్తినా, మూడుచక్రాల సైకిల్, కర్రగుర్రం మరి ఒకడి నెత్తినా పెట్టి పంపించాడు రూప ఇంటికి.
    వెళ్ళినవాళ్ళు వెళ్ళినట్లుగా తిరిగి వచ్చారు.
    "తిరిగి తీసుకువచ్చారు, ఏమంది?" అడిగింది కృష్ణప్రియ.
    దాసు మొదట తన నెత్తిమీద బరువు దించి, చెప్పాడు: "ఆడపిల్లను అత్తారింటికి సాగనంపి సారె పంపినట్లు ఏమిటి ఇదంతా? అని కసురుకొన్నారండి, అమ్మగారు! ఆ వస్తువులన్నీ ఏ గతిలేని వాళ్ళకో పంచమని చెప్పు అయ్యగారితో. కోరిన వస్తువు కొనుక్కోగల తాహతు మాకు మీ అయ్యగారికి రెట్టింపు ఉన్నదని చెప్పు- అన్నారండి."
    "అబ్బా, ఎంత అహంకారం!" ముక్కుమీద వేలు వేసుకుంది కృష్ణప్రియ, "మంచిగా బాబును ఇచ్చివేసి తెలివితక్కువ పని చేశావు కృష్ణా! దానికి తగిన శాస్తి జరగవలసిందన్న మాట!"
    వెనకటికి పబ్లిక్  గార్డెన్స్ లో జరిగిన సంఘటన కళ్ళముందు కదిలింది కళ్యాణ్ కు.
    "మీ ఆదరాభిమానాల కోసం ఎర వెయ్యడం లేదు. ఇవి లంచాలు కావు. బాబుమీది ప్రేమకొద్దీ తీసుకువచ్చాను. తీసుకోండి."    
    "మీ అనురాగాదరణలు పంచడానికి అనాథులకు కొరతలేదు." విసురుగా తలుపు వేశాడు తను. 'పగ తీర్చుకొంటున్నావా, రూపా?' నుదురు కొట్టు కొన్నాడు కళ్యాణ్.
    "ఈ చీటీ మీ కిమ్మన్నారండి." దాసు మడిచిన కాగితం ఒకటి అందించాడు కళ్యాణ్ కు.
    విప్పి చదువుకొన్నాడు. "మీలోని ఏ మానవత్వమైతే నా బాబును ఇన్నాళ్ళు కాపాడిందో అదే తిరిగి నా బాబును నా కిప్పించింది. ఎలాంటి పరిస్థితిలోనూ బాబు జీవితంలో ప్రవేశించవద్దనీ, బాబు కళ్ళలో పడవద్దనీ నా ప్రార్ధనగా మన్నించి మీ మానవత్వం నిలుపుకోండి."
    'రూపా, బదులు తీర్చుకొంటున్నావు కదూ?' బాధగా కళ్ళు మూసుకొన్నాడు కళ్యాణ్.

                                   *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS