సుబ్బారావును శ్రీకాంత్ కలుసుకున్నాడు. బహుశా అతడే ఎక్స్-32 ను సుబ్బారావు శరీరంలో ప్రవేశపెట్టి ఉండవచ్చు. ఇద్దరూ కలిసి టీ తాగారు. డాక్టరు చెప్పిన సమయం, వారిద్దరూ కలిసి టీ తాగిన సమయం ఒక్కటే!
ఎక్స్-32 శ్రీకాంత్ కి అందుబాటులోలేదు. అది సుధాకర్ కీ, మధుమూర్తికీ అందుబాటులో వుంది. శ్రీకాంత్ సుబ్బారావును కలుసుకునే ముందు సుదాకర్ని కలుసుకున్నాడు.
ఏం జరుగుంటుందీ యెలా జరిగుంటుందీ డిటెక్టివ్ వెంకన్న ఊహించగల్గుతున్నాడు. కానీ ఎందుకు జరిగిందీ తెలిసేవరకూ అతడి ఊహకు విలువ, అర్ధం-వుండవు.
6
"మీ పరిశోధనలెంతవరకూ వచ్చాయి?" అన్నాడినస్పెక్టర్ శంకర్రావు కుతూహలంగా.
"మీ పోలీసులెంత దాకా పయనించారో ముందు నేను తెలుసుకోవాలి-" అన్నాడు వెంకన్న.
శంకర్రావతడికి శ్రీకాంత్ గురించి చెప్పాడు. పోలీసులు తెలుసుకున్న వివరాలకంటే వెంకన్న అనుచరులు సేకరించిన సమాచారమే ఎక్కువ. వెంకన్న అతడికి తన పరిశోధనల వివరాలన్నీ చెప్పి-"మీ పరిశోధనలో మీకెక్కాడా ప్రవీణ్ కుమార్ తగిలినట్లు లేదు. ఈ కేసు లింకంతా శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ లలో వుంది-" అన్నాడు.
"అంతేనా-మరి మృణాళిని, లక్ష్మీనారాయణల సంగతేమిటి?" అన్నాడు శంకర్రావు.
"మృణాళిని రెండుమూడుసార్లు-ఇంటిదగ్గర కలుసుకున్నాడు సుబ్బారావు. ఆ విషయం అతడి భార్యకు తెలియదు. మృణాళిని భర్తకూ తెలియదని నా నమ్మకం. మృణాళిని భర్త నెలరోజులుగా ఊళ్ళోలేడు. ఆఫీసు పనిమీద అతడు ఢిల్లీకి లాంగ్ టూర్ మీద వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఇక లక్ష్మీనారాయణ సంగతి తీసుకుంటే ఆయన సీదాసాదా వ్యాపారస్థుడిలాగే వున్నాడు. ఆయనకు సుబ్బారావంటే వాత్సల్యమున్నట్లు కనబడుతుంది-...." అన్నాడు వెంకన్న.
"మీరు కాదంటే సరేగానీ-మీరు చెప్పిన కారణాలు నాకంత సబబుగా అనిపించలేదు...."
"శంకర్రావు గారూ! ఎవరైనా హత్యచేయడానికొకోసారి చిన్న కారణం సరిపోవచ్చు. కానీ ప్రతి చిన్న కారణానికీ హత్యలు జరుగుతాయంటే-ఈ ప్రపంచంలో జనాభా మిగలదు-" అన్నాడు వెంకన్న.
"నేను శ్రీకాంత్ గురించి చాలా ఆచూకీలు తీశాను. అతడు దళారీలాంటి వాడు. ఎక్కడా తన ప్రమేయం లేకుండా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. నా అనుమానం అతడు రహస్య సమాచారాన్ని సేకరించి-పెద్దమనుషుల కమ్ముతున్నాడని...."
"కరెక్టు....బాగా తెలుసుకున్నారు......ఇక మీరు ప్రవీణ్ కుమార్ గురించి తెలుసుకోవాలి. అతడు పరారీలో ఉన్నాడని నా అనుమానం. మీరు దేశంలోని వివిధ పోలీసు స్టేషన్ లకతడి గురించి హెచ్చరిక పంపండి..."
"ఒక చిన్న హత్యకేసులో సాధారణమైన అనుమానంమీద అతడి గురించి ఇంత పెద్ద చర్య తీసుకోవడం సబబు కాదేమో!"
"శంకర్రావు గారూ! ఇది చిన్న హత్యకేసు కాదు. ప్రవీణ్ కుమార్ వివరాలు తెలిసేదాకా-ఇదెంత ప్రమాదకరమైనదో అంచనా కూడా వేయలేం...."
"సరే-పై ఆఫీసర్లతో మాట్లాడి చూస్తాను...." అన్నాడు శంకర్రావు.
అక్కణ్ణించి వెంకన్న ఇంటికి వెళ్లేసరి కో వార్త అతడి కోసం యెదురు చూస్తోంది.
పోస్టు మార్టం జరిగిన వెంటనే శవాన్ని బదువుల కప్పగించడం జరిగింది. సుబ్బారవు తల్లిదండ్రులు వసంతను శాపనార్ధాలు పెట్టారు. వసంత తల్లిదండ్రులామెనింటికి తీసుకుని వెడతానన్నారు. వెంకన్న వారితో "సుబ్బారావు హత్యచేయబడ్డాడు. ఇందులో దేశ ద్రోహుల కుట్ర ఉందని నా అనుమానం. వారిని బైట పెట్టేవరకూ ఆమెను మా యింటనే ఉండనివ్వండి. ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మా యింటనే గానీ మీ యింట ఆమెకు రక్షణ ఉండదు...." అన్నాడు.
నిజానికి వసంత ప్రాణాలు ప్రమాదంలో ఉన్నదీ లేనిదీ వెంకన్నకు తెలియదు. సుబ్బారావు కేసు చాలా చిత్రంగా ఉంది. అతడు హత్యచేయబడ్డానికి కారణం దొరికేవరకూ ఆమెను వెంకన్న తనింట్లోనే ఉంచుకోవాలని సంకల్పించాడు. అందుకు వసంత తల్లిదండ్రులూ అంగీకరించారు. వసంత కూడా ఒప్పుకుంది.
ఆరోజు వసంత కోసం రామ్మూర్తి వచ్చాడు. రామ్మూర్తి యువకుడు. సుబ్బారావు స్నేహితుడు. వసంత అతణ్ణి కలుసుకోవడానికి నిరాకరించింది. సీతమమ రాజమ్మ రామ్మూర్తిని చాలా ప్రశ్నలు వేశారు.
"నేను బ్రహ్మచారిని, వసంత అందం నన్నాకర్షించింది. ఆ మైకంలో నాకింకేమీ తెలియలేదు. సుబ్బారావు నాకు మంచి స్నేహితుడన్న విషయం కూడా విస్మరించి ఆమెకు దగ్గరకావాలని ప్రయత్నించాను. ఆరంభంలో ఆమె ప్రతిఘటించింది. క్రమంగా నా ఆకర్షణకు లొంగిపోయింది. మా యిద్దరిమధ్యా నడిచే వ్యవహారం చాలాకాలం రహస్యంగానే జరిగింది. కొన్నాళ్ళక్రితం మేమిద్దరం రెడ్ హాండెడ్ గా సుబ్బారావుకు పట్టుబడ్డాం. అతడు చాలా అప్సెట్టయ్యాడు. నన్నేమీ అనలేదు. భార్యను కూడా ఏమీ అనలేదని తెలిసింది నాకు. నేనతడికి ముఖం చూపించలేకపోయాను. జరిగిందానికి క్షమార్పణ చెప్పుకోవాలనుకున్నాను. కానీ ఈలోగానే అతడాత్మహత్య చేసుకున్నాడు. వసంతపట్ల నాకూ కొంత బాధ్యత వుంది. ఆమెకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. ఆమెను వివాహం చేసుకుని చేయూత నివ్వడానికి సిద్దంగా ఉన్నాను నేను. కానీ ఆమెకు నామీద కోపంగా ఉంది. ఇందులో తప్పు నా ఒక్కడిదే కాదు. మా యిద్దరిదీను. నా తప్పును నేను సవరించుకునేండుకు సిద్దంగా ఉన్నాను.." అన్నాడు రామ్మూర్తి.
అతడు వెళ్ళిపోయాక సీతమ్మ, రాజమ్మ అతడే మన్నదీ-వసంతకు చేరవేశారు. వసంత కళ్ళెర్రబడ్డాయి. "వాడు నరరూప రాక్షసుడు. కామపిశాచి. స్నేహితుడి భార్యనని తెలిసీ నన్ను కామించాడు. నేను వారికి ఫిర్యాదు చేశాను. వారు వాణ్ణి మందలించారు. అప్పుడు వాడు తప్పంతా నాదే అన్నట్లు వారితో మాట్లాడేడు. నా ప్రవర్తన గురించి అబద్దాలు చెప్పాడు. వారు మంచి వారు. వాడి అబద్ధాలు నమ్మలేదు. వాడిని కోప్పడి మళ్ళీ తనకు ముఖం చూపవద్దన్నారు. వాడు నా గురించి చెప్పిన మాటలన్నీ చెప్పి-" అవి నేను నమ్మడంలేదు. నువ్వు నా దానివి. నేను నీ మాటలే నమ్ముతాను. ఒకవేళ వాడు నిజమే చెప్పినా సరే-అది గతం. నా కా గతంతో నిమిత్తం లేదు-" అన్నారు అంత మంచివారు వారు-..." అందామె.
వసంత అభిప్రాయంలో-వాడిప్పుడవకాశం దొరికింది కదా అని ఆమెను దక్కించుకోవాలనుకుంటున్నాడు.
ఈ సమాచారం విన్న వెంకన్న ఆలోచనలో పడి పోయాడు.
రామ్మూర్తి విషయాన్ని వసంత ఇంతకాలమూ బైట పెట్టలేదు. కేసులో చాలా పెద్ద మిస్సింగు లింకు. తనకు తానే బయట పడ్డాడు కాబట్టి కానీ రామ్మూర్తి గురించి తెలుసుకోవడం తమకు సాధ్యపడేది కాదు.
రామ్మూర్తికీ వసంతకూ మధ్య యేదో వ్యవహారం నడిచింది. అది సుబ్బారావుకి తెలిసింది. ఆ తర్వాత సుబ్బారావు మరణించాడు. అది హత్యయితే వసంత, రామ్మూర్తి కలిసి చేసి వుండవచ్చు. ఎక్స్-32 గురించి వసంత రామ్మూర్తికి చెప్పివుండవచ్చు. తన పరిశోధనల గురించి అన్నీ చెబుతూండే సుబ్బారావు భార్యకు లాబొరేటరీలో యితర విశేషాలు చెప్పడనుకుందుకు లేదు. ఆమెకు ఎక్స్-32 గురించి తెలిసే వుంటుంది.
లేదా వసంత నిర్దోషి కానీ సుబ్బారావు రామ్మూర్తి మాటలు నమ్మాడు. నమ్మలేదని భార్య కబద్దం చెప్పాడు. మానసికంగా బాధపడుతూ తట్టుకోలేక ఒక రోజున ఆత్మహత్య చేసుకున్నాడు.
