Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 17


    
    ఉపోర్ఘాటం తగ్గించి త్వరగా చెప్పండి -" అన్నాడు వెంకన్న.
    'ఆమె నన్ను కలుసుకుని వెళ్ళిన తర్వాత ఒకతను వచ్చి నన్ను హెచ్చరించాడు. ఆమె కామినీ పిశాచి అనీ ఆమె సంపర్కం నాకు చావుకు తెచ్చి పెడుతుందని అని -- సుగుణ్ కేసు ఉదాహరణగా ఇచ్చాడు...."అంటూ జరిగింది పూర్తిగా వివరించాడు.
    'అంతా నోట్ చేసుకున్నారా?" అన్నాడు వెంకన్న తన అసిస్టెంట్స్ వంక చూసి.
        సీతమ్మ, రాజమ్మ తలలూపారు.
    "ఒకసారి చదవండి --" అన్నాడు వెంకన్న.
    సీతమ్మ, రాజమ్మ ఏక కంఠంతో నోట్సు చదివారు.
    "ఇద్దరూ ఒక్కలాగే రాసుకున్నారే!" అన్నాడు ప్రకాష్ ఆశ్చర్యంగా.
    "నా అసిస్టెంట్స్ టేపురికార్డును మించిన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక్కలాగే రాశారని ఆశ్చర్య పోక - మీరు చెప్పిందంతా వాళ్ళు తిన్నగా నోట్ చేసుకున్నారో లేదో చెప్పండి --" అన్నాడు వెంకన్న.
    ప్రకాష్ -- "నేను చెప్పింది వాళ్ళ నోటంట వింటుంటే -- ఒకే విషయాన్ని కొందరు నాలా అసహ్యంగానూ, కొందరు మీ అసిస్టెంట్స్  కిలా అందంగా కూడా చెప్పవచ్చునన్న కొత్త విషయాన్ని తెలుసుకున్నాను-" అన్నాడు.
    వెంకన్న తన విసుగును బయటకు ప్రదర్శించకుండా మనసులోనే విసుక్కున్నాడు. అతడి అసిస్టెంట్స్ వయసులో వున్న అందమైన ఆడపిల్లలు. కొందరు క్లయింట్స్ కేవలం వాళ్ళ కోసమే వస్తారని అతనికి తెలుసు.నిజంగా ఆపదలో వున్న వాళ్ళు పరిసరాలను గుర్తించలేరు. ప్రకాష్ ప్రవర్తనను బట్టి అతడు నిజంగా ఆపదలో లేడని వెంకన్నకు అనిపించింది.
    "సుగుణ్ మరణం గురించి నాకు తెలుసు. ఎక్కడెక్కడి నేరాలకు సంబంధించిన వార్తలూ నాకు వస్తాయి. అతడిని కామినీ పిశాచి గురించి ఎవరో హెచ్చరించారన్న విషయం మాత్రం మీవల్ల నే నాకు తెలిసింది. ఇంతకూ మీరు వచ్చిన పని చెప్పండి . నాకు చేతనైనా సాయం చేస్తాను..." అన్నాడు వెంకన్న.
    "నేను లీలను వివాహం చేసుకుందామనుకుంటున్నాను. ఆమె షరతులు నాకు నచ్చాయి. మా వివాహం నా ప్రాణాలకు ప్రమాదం కలగకుండా మీరు నన్ను కాపాడాలి ---" అన్నాడు ప్రకాష్.
    వెంకన్న కాస్త చిరాగ్గా -- "నేను విషం తాగాలను కుంటున్నాను , నాకు చావు రాకుండా కాపాడండి -- అని నా దగ్గరకు వస్తే నేనేం చెప్పాలి ?' అన్నాడు.
    "లీలను వివాహం చేసుకోవడమూ -- విషం తాగాలను కోవడమూ ఒకటేనని మీ అభిప్రాయమా ?"
    "నా అభిప్రాయం అది కాదు. భార్యాభర్తను చంపాలను కుంటే అందుకు ఎన్నో అవకాశాలు. మీరుద్దరూ విడిగా వుంటే తప్ప ఆమె నుంచి మిమ్మల్ని కాపాడడం మాకు సాధ్యపడదు ...."
    "నా అనుమానం నన్ను హెచ్చరించిన చలం అనే వ్యక్తీ మీద వున్నది - మీరతడిని కనిపెట్టి వివరాలు సేకరిచాలి. అందుకు అడ్వాన్సు గా వెయ్యి రూపాయలు ఇస్తాను...." అన్నాడు ప్రతాప్.
    "అడ్వాన్సు వద్దు. వివరాలు సేకరించాక నేనే మీ నుంచి అయిదువేల రూపాయల ఫీజు వసూలు చేస్తాను?" అన్నాడు వెంకన్న.
    ప్రకాష్ వెళ్ళిపోయాడు.
    "బాస్ - అడ్వాన్సు ఎందుకు వద్దన్నారు?" అంది సీతమ్మ.
    "ఇలాంటి కేసులు నేను తీసుకొను. ప్రకాష్ అలా వెళ్ళగానే ఇలా మన బాధ్యత తీరిపోయింది -" అన్నాడు వెంకన్న.
    "పాపం - అతడు నిజంగానే ఆపదలో వున్నాడెమో!" అన్నాది రాజమ్మ.
    "ఎవరి కర్మకు ఎవరు కర్తలు ?" అన్నాడు వెంకన్న.
    
                                                             7
    
    అది చిన్న డాబా ఇల్లు.
    డిటెక్టివ్ వెంకన్న కారు ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి వెంకన్న దిగి ఆ యింటి తలుపు తట్టాడు.
    సుమారు పదహారేళ్ళ కుర్రాడు ఆ ఇంటి తలుపు తీశాడు,
    "మిస్ లీల - ఈ యింట్లో వుంటున్నదా?" అన్నాడు వెంకన్న.
    "లోపలకు రండి -" అన్నాడా కుర్రాడు.
    వెంకన్న లోపలకు వెళ్ళాడు.
    పెద్ద హాలు , ఆ హాలుకు అనుకుని వున్న ఓ గదిలో లీల అద్దె కుంటున్నది. ఆ సమయంలో లీల గదిలో వున్నది.
    వెంకన్న తలుపు తట్టాడు. లీల తలుపు తీసి అతడి వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    "నా పేరు వెంకన్న. నేను డిటెక్టివ్ ను...."
    "నమస్కారం -" అన్నది లీల. ఆమె కనుల నుంచి ప్రశ్నార్ధకం మాత్రం తొలగిపోలేదు.
    వెంకన్న లీలను పరీక్షగా చూశాడు. చెప్పుకోదగ్గ అందం అమెది. ఆమె కనులలో లీలగా మెరిసే ఆహ్వానం ఏ పురుషుడి కైనా మతి పోగొడుతుంది. ఈమె కామినీ పిశాచి అంటే నమ్మవచ్చునని అనుకున్నాడు వెంకన్న.
    లీల అతడికి కుర్చీ చూపించింది. తనూ కూర్చుంది.
    "నీవు మళ్ళీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా ?" అన్నాడు వెంకన్న.
    లీల అతడి ప్రశ్న అర్ధం కానట్టు చూసింది.
    "నువ్వు సుగుణ్ ని ప్రేమించావు. అతడు మరణించాడు. ప్రకాష్ ని ప్రేమించావు . అతడూ మరణించాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నావేమో తెలుసుకుందామని వచ్చాను ...."
    ;లీల ఆశ్చర్యంగా --"మీకివన్నీ యెలా తెలుసు?" అంది.
    "నేను డిటెక్టివ్ నని ముందే చెప్పాను -" అన్నాడు వెంకన్న.
    "మీరు డిటెక్టివ్ అయితే మాత్రం - అందరికీ సంబంధించిన విషయాలూ తెలియాలని లేదు గదా --" అన్నది లీల.
    "నిజమే! కానీ -- నన్ను ప్రకాష్ అడిగాడు - తన ప్రాణాలు రక్షించమని !"
    లీల ఆశ్చర్యంగా - "తను చనిపోతానని ప్రకాష్ కు ముందే తెలుసా ?" అన్నది.
    "ప్రకాష్ నే కాదు. సుగుణ్ కి కూడా తెలుసు. నీ మైకంలో పడి వాళ్ళిద్దరూ ప్రాణాలకు కూడా లెక్కచేయలేదు -"
    "మధ్య నేనేం చేశాను -" అన్నది లీల.
    చలం కామినీ పిశాచి గురించి హెచ్చరించిన విషయం లీలకు చెప్పాడు వెంకన్న.
    లీల తెల్లబోయి - "ఎవరతను ? నా గురించి అలా ఎందుకు చెప్పాడు?" అన్నది.
    "అతడెందుకు చెప్పాడో నీకు తెలియాలి. కానీ అతడు చెప్పింది నిజంగా జరిగింది -" అన్నాడు వెంకన్న.
    "మీరిప్పుడు నా దగ్గరకు యెందుకు వచ్చారు!" అన్నది లీల.
    "ప్రకాష్ నన్ను తన ప్రాణాలు రక్షించమని అడిగాను. నేనది సీరియస్ గా తీసుకోలేదు. అతడి ప్రాణాలు పోయాయి. నిజం తెలుసుకోవడం నా బాధ్యత . పోలీసులు ప్రకాష్ ది ఆత్మహత్య అని తీర్మానించారు. కానీ నేనది నమ్మడం లేదు. ప్రకాష్ నీతో వైవాహిక జీవితం గురించి కన్న కలలు అతడి కళ్ళారా చూశాను నేను -" అన్నాడు వెంకన్న.
    లీల దిగులుగా - "అంతా నా దురదృష్టం -" అన్నది.
    "ఒకరి దురదృష్టం - ఇంకొకరి అదృష్టం అవుతుంది. నీకు ఇద్దరి ప్రేమికుల నుంచి రెండెనిమిదులు -- పదహారు వేలు వచ్చాయి-" అన్నాడు వెంకన్న.
    'అంటే పదహారు వేలకోసం నేనీ హత్యలు చేశానంటారా ?"
    "నేననలేదు. తెలుసుకోవాలి -"
    "నాకేమీ తెలియదు...."
    'ఆ నమ్మకం నాకు కలగాలంటే నేనడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ముందు చలం యెవరో చెప్పు !" అన్నాడు వెంకన్న.
    "నేనతడిని చూడలేదు. అతడెవరో నాకు తెలియదు ."
    'చలం అన్న పేరు గల వ్యక్తీ నీకు తెలియదా ?"
    తల అడ్డంగా ఊపింది లీల.
    "పోనీ - నీ ప్రియులను హత్య చేయడానికి తగిన కారణాలు గల వ్యక్తీ ఎవరైనా వున్నాడా?" అన్నాడు వెంకన్న.
    లీల ఏదో చెప్పబోయి ఆగిపోయింది.
    "అది నాకు చాలా పనికి వచ్చే సమాచారం అవుతుంది. నీకు తెలిసింది చెప్పడం నీకే మంచిదవుతుంది -" అన్నాడు వెంకన్న.
    "నాకేమీ తెలియదు -" అన్నది లీల.
    "నీకు తెలుసు -" అన్నాడు వెంకన్న.
    "తెలియదు - " అన్నది లీల.
    "నీకు తెలిసింది దాచి పెట్టడం వల్ల - బహుశా ఒక రోజున నీవు చేయని హత్యలాకు హంతకురాలిగా కోర్టులో నిలబడవచ్చు ..." అన్నాడు వెంకన్న.
    "నిజంగా నాకేమీ తెలియదు -" అన్నది లీల.
    "ఎవరి కర్మకు ఎవరు కర్తలు ?" అంటూ వెంకన్న అక్కణ్ణించి బయటపడ్డాడు.
    
                                 8
    డిటెక్టివ్ వెంకన్న ఇలా వెళ్ళగానే అలా ఓ అమ్మాయి ఆ యింట్లో ప్రవేశించి - లీల గదికి వెళ్ళింది.
    ఆమె వెళ్ళేసరికి గదిలో లీల ఏడుస్తోంది.
    "లీలా!" అన్నదా యువతి.
        లీల తలెత్తి ఆ యువతి వంక చూసి కళ్ళు తుడుచు కుంది. ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి.
    "ఎడుస్తున్నావా?" అన్నదా యువతీ.
    లీలకు మళ్ళీ ఏడ్పు వచ్చింది. ఆ యువతీ లీలను సమీపించి తనే ఆమె కళ్ళు తుడిచి - "నీకో శుభవార్త తీసుకుని వచ్చాను -" అన్నది.
    "ఏమిటది?" అన్నది లీల.
    "ఇప్పుడు నీ గదిలోనికి డిటెక్టివ్ వెంకన్న వచ్చి వెళ్ళాడు కదా - ఆయనకు నీ గురించిన వివరాలేమైన చెప్పావా ?" అన్నదా యువతి.
    "లేదు --"
    "వెరీ గుడ్ - " అన్నదా యువతీ - "ఎట్టి పరిస్థితుల్లో నీ గతం ఇక్కడ బయటపడకూడదు. అసలా డిటెక్టివ్ ఎందుకొచ్చారు ? ఏం చెప్పాడు ?'
    లీల జరిగింది చెప్పింది.
    "ఆ ప్రకాష్ అనుమానస్తుడు. భయస్థుడు. అలాంటివాణ్ని ఎన్నుకుని నేనో పెద్ద పొరపాటు చేశాడు. అనవసరంగా నీ విషయం డిటెక్టివ్ వరకూ వెళ్ళింది. ఈసారి అలాంటి పొరపాటు జరగదు -" అన్నది యువతి.
    "మళ్ళీ -- ఈసారి అంటున్నావా ?' ఆశ్చర్యంగా అడిగింది లీల.
    "ఈసారి అనకుండా ఎలా? నీకు సరైన జీవిత భాగస్వామిని వెతికి పెట్టడం నా బాధ్యత ...." అన్నదాయువతి.
    "కాని అతను ....ఊరుకుంటారా ?"
    "అతడి గురించి మన అంచనా తప్పయింది. అనుకున్నది సాధించడం కోసం అతడేమైనా చేస్తాడనుకుంటాను. అందుకే ఈసారి అతడి కంటే బలమైన వ్యక్తీని ఎన్నుకున్నాను. అతడి నెవ్వరూ ఏమీ చేయలేరు ...." అన్నదా యువతి.
    "నిజంగా?" అన్నది లీల. ఆమె కళ్ళు మెరిశాయి.
    "నేను నీకు అబద్దం చెబుతానా?"
    "చెప్పవు ...." అన్నది లీల అమాయకంగా.
    'అతడికి బలం వుంది. ధనం వుంది. అనుకున్నది సాధించగల పట్టుదల వుంది. ప్రమాదాలకు లెక్క చేయని తెగింపు వుంది. తనకు ప్రమాదం వున్నదనిపిస్తే అతడు డిటెక్టివుల సాయం మాత్రం కొరడు --" అన్నదా యువతి.
    "నీ సాయంతో నేనా జీవిత భాగస్వామిని ఎన్నుకోగలనని ఆశిస్తున్నాను. నీ పరిచయం నా ఆదృష్టం --" అన్నది లీల.
    "వివేకా గార్డెన్స్ లో బ్లాక్ రోజెస్ దగ్గర - అతడు నీకోసం ఎదురు చూస్తుంటాడు. అతడు తెల్ల పాంటు - ఎర్ర చొక్కా వేసుకుని ఉంటాడు. నీకంటే తెల్లగా వుంటాడు. సరిగ్గా సాయంత్రం అయిదింటికి వెళ్ళి అతన్ని కలుసుకో - " అన్నదా యువతి.
    'అతడి పేరూ ?" అన్నది లీల.
    "జనార్దనం -" అన్నదా యువతీ.
    
                                     9
    "మీ పేరు జనార్దనం కదూ --" అన్నాడతను.
    "అవును ....' అన్నాడతడు.
    'ఇప్పుడే వెళ్ళిన ఆ యువతి పేరు లీల కదూ?" అన్నాడతను.
    'అవును....' అన్నాడతడు.
    "మీరామెను ప్రేమిస్తున్నారు కదూ ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS