Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 17

   
    "మరి వచ్చేదా?" అన్నాడు రఘు.
    "ఉండండి-కాఫీ తాగి వెడుదురుగాని...." అంది శారద.
    "నేను మరిచిపోయినా కాఫీ సంగతి నువ్వు మరువవుగదా-"అన్నాడతను నవ్వుతూ.

                                       10

    రఘు ఒక్కడూ లాన్లో కూర్చునివుండగా-"హాయ్" అంటూ పలకరించిందో యువతి.
    "మీరెవరో నాకు తెలియదు-" అన్నాడు రఘు ముఖం చిట్లించి.
    "కావాలనుకుంటే స్త్రీ పురుషులకు పరిచయం ఎంతసేపు?" అందామె.
    "నేను కావాలనుకోవడంలేదు-" అన్నాడు రఘు చిరాగ్గా.
    ఆమె చనువుగా అతడి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని - "నేను కావాలనుకుంటున్నాను-" అని "యూ ఆర్ రియల్లీ బ్యూటీఫుల్-" అందామె.
    "థాంక్స్!"
    "ఉత్త థాంక్సేనా?" అందామె.
    "నిజం చెప్పినవాళ్ళకు థాంక్సుకు మించి ఏమీ ఇవ్వను నేను-" అన్నాడు రఘు.
    "కానీ నేను తీసుకోగలను-" అందామె.
    "ఎవరు మీరు?" అన్నాడు.
    "ఎవరినైనా కాల్ గర్ల్ ని మాత్రం గాదు. మిమ్మల్ని చూడగానే థ్రిల్లయిపోయాను. మీతో మాట్లాడాలని పించింది. యెంత మాట్లాడినా తనివితీరలేదు. ఆఖరికి మీరు నావైపు నిర్లక్ష్యంగా చూస్తున్నప్పటికీ కూడా!"
    రఘు ఆమెవంక అదోలా చూసి-"ఎందుకు మీరు మీ సమయం వృధాచేసుకుని నా సమయం వృధా చేస్తారు? నన్ను పొగడడం ద్వారా మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకుంటున్నారు. మీ అందం ముందు నేనెంత? మీరు తల్చుకుంటే వేలకువేలు బాయ్ ఫ్రెండ్సు దొరుకుతారు మీకు-" అన్నాడు.
    "నేను తల్చుకున్నాను. మొదటి బాయ్ ఫ్రెండే అవతలకి పొమ్మంటున్నాడు-" అందామె.
    "అవును మరి-అతను వివాహితుడు"- అన్నాడు రఘు.
    "మీరు వివాహితులా? నమ్మడం కష్టం బహుశా నన్ను వదుల్చుకుందుకు అబద్ధం చెబుతున్నారనుకుంటాను" అందామె.
    "నిజం-కావాలంటే రుజువులు చూపిస్తాను. నేను నా భార్య వివాహంనాడు తీయించుకున్న ఫోటో ఒకటి ఎప్పుడూ నా పర్సులో ఉంటుంది-" అన్నాడు రఘు.
    "వివాహమైందన్నాసరే-నా మనసు మిమ్మల్నే కోరుతోంది-" అందామె.
    "అది చాలా తప్పు.  మీ భర్త తప్పుదారిన పడితే మీకు నచ్చుతుందా?-" అన్నాడు రఘు.
    "మీవంటి భర్త దొరికితేనా-మీరెలా మసలి నా నేను పట్టించుకోను. తొలి రాత్రే మీరు మరో ఆడది కావాలన్నా నేను విచారించను. మీవంటివాడ్ని భర్తగా పొందడమే నా అదృష్టం-" అందామె!
    రఘు ఆలోచనలోపడ్డాడు. తను నిజంగానే అందగాడు. యెందరో ఆడవాళ్ళు కోరి తన కౌగిట్లో నలిగిపోయారు. తన గుణం తెలిసి కూడా శారద వివాహం చేసుకుంది తనను. తనవంటివాడు భర్తగా లభించడమే అదృష్టమా? అందుకే శారద తన తప్పులన్నీ క్షమించగల్గుతోందా? తను ఇంకా తప్పులుచేసినా ఆమె తన్ను క్షమిస్తుందా?
    "ఏమండీ-ప్లీజ్-ఒక్క అయిదు నిముషాలు. నేను మీ పక్క రూంలోనే ఉంటున్నాను..."
    ఆ యువతి అర్ధిస్తోంది.
    రఘు మనసు ఊగిసలాడుతోంది. తనను ప్రేమించడంలో శారద గొప్పతనం ఏమీలేదా? అంతా తన గొప్ప తనమేనా?
    రఘులో అహం పెరుగుతోంది. ఆమె అతడి అహాన్ని పెంచుతోంది.
    అతను లేచాడు. ఆమెహు అనుసరించాడు.
    అప్పటికి రఘు ఇల్లు వదిలిపెట్టి రెండు వారాలయింది. ఈ రెండు వారాలు కూడా అతనెంతో బుద్ధిగా ఉన్నాడు. తీరుబడి సమయంలో ఫిలాసఫీ పుస్తకాలు చదువుకుంటున్నాడు. మనసు కొద్దిగా ఆరాటపడుతోంది. అయినా నిగ్రహించుకుంటున్నాడు. చూస్తూండగా ఇప్పుడీ ఆహ్వానం వచ్చింది. ఏం చేయాలి?
    అతడామె గదిలో ప్రవేశించాడు. అతని వెనుకనే ఆమె తలుపులు మూసింది.
    ఆమె అతణ్ణి తాకలేదు. అతడి అందాన్ని పోగడుతోంది. అతణ్ణి భార్యగా పొందిన ఆడది-పాదదాసిగా ఊడిగమైనా చేయవచ్చునంటోంది. అలాంటి భర్త వుంటే పురాణంలోని పతివ్రతలకంటే పెద్ద త్యాగాలు చేయవచ్చునంది.
    రఘులోని పురుషుడు నెమ్మదిగా అతడి మెదడును స్వాధీనం చేసుకుంటున్నాడు. అపురూప లావణ్యరాశి ఎదురుగా ఉంది. కోరి పిలుస్తోందామె. తను దైవస్వరూపుడు. ఆడవాళ్ళంతా తన బానిసలు. అలాంటి బానిసల్లో శారద ఒకతె! తనామెను గదమాయించడానికి బదులు ఆమె అదుపులోకి వెడుతున్నాడు.
    కానీ...శారద మనసు ఎప్పుడూ తనను వెన్నంటే ఉంటుంది.
    అప్పుడా యువతి పైట జారింది. అతడి చూపులు స్థిరంగా ఆమె గుండెలపై నిలిచాయి. క్రమంగా ఆ చూపుల్ని ఆమె చూపులతో కలిపాడు. అప్పుడామె నవ్వింది.
    ఆ నవ్వు పరిమళ నవ్వుకిలాగుంది. దానికి తట్టుకోవటం కష్టం. రఘు ఒక్కడుగు ముందుకువేశాడు. ఆమె వెనుకడుగువేసింది. తర్వాత వెనక్కు తిరిగింది. కంగారులో చీర అక్కడి సోఫాకు తగులుకుంది. ఆమె అలాగే ముందుకు వెళ్ళిపోయింది.
    చక్కటి అంగసౌష్టవమామెది. పల్చటి లంగా....ఎత్తయిన గుండెలు.
    రఘు ఆమెకోసం పరుగెత్తాడు.
    ఆమె అతడికి అందకుండా పక్కకు నెడుతూ - "ఒక్కక్షణం అలా కూర్చోండి-నైట్ డ్రస్సులో వస్తాను. ఆపిల్ పళ్ళు తిందాం-" అంది.
    ఒకప్పుడైతే అతడామెను వదిలి ఉండేవాడు కాదు. క్షణంసేపు అతను నిగ్రహించుకుని సోఫాలో కూర్చున్నాడు. సోఫాముందున్న టీపాయ్ మీద ఆపిల్ పళ్ళు ఉన్నాయి.
    అతను ఆపిల్ పళ్ళవంకే చూస్తున్నాడు. అతడి బుర్ర గజిబిజిగావుంది.
    "ఏ పనైనా ఫ్రూట్స్ తో ప్రారంభించాలంటారు మా డాడీ-" అందామె.
    రఘు తలెత్తి చూశాడు. ఆమె నైట్ డ్రస్సులో వచ్చింది. ఒకనాటి భారతీయుల ప్రతిభావృత్తులను మించిన పనితనం నేటి యంత్రాలకున్నది. ఆమె వంటి మీద ఇప్పుడు నైట్ గౌన్ వున్నది, ఇందాకటి లంగా, జాకెట్లు లేవు. అద్దాల షో కేసులో నిలబడ్డ నగ్నసుందరిలా ఉన్నదామె నైట్ గౌన్ లో ఆమె శరీరంలో ఇప్పుడు కనపడని భాగంలేదు.
    కళ్ళప్పగించి ఆమెను చూస్తున్నాడు రఘు. అజంతా శిల్పం తనముందు నిలబడిందా అన్న అనుభూతి కలిగిందతడికి. ఎంత అదృష్టవంతుడు తను? ఆ సుందరి తనను కోరుతోంది?
    అప్పుడు ఆమె చేయి ముందుకు పెట్టింది. ఆమెచేతిలో కత్తి ఉంది-"పళ్ళు కోయడానికి!" అంది.
    స్టెయిన్ లెస్ స్టీలు కత్తి తళతళ మెరిసింది.
    అప్పుడే రఘు బుర్రలో ఏదో తళుక్కుమంది.
    ఆ కత్తి పట్టుకుని తన ఎదురుగా నిలబడిన వ్యక్తి శారదలా కనబడిందతనికి. అప్రయత్నంగా అతడికి శారదకు తను కొని ఇచ్చిన బాకు గుర్తుకొచ్చింది. తను తప్పుచేస్తే ఆ బాకుతో శారద తనను పొడవాలని శాసించాడు. లేని పక్షంలో తనే పొడుచుకు చచ్చిపోతానన్నాడు.
    కానీ-తనిప్పుడేం చేస్తున్నాడు?
    అందుకే శారద-తన పని చేయడానికి వచ్చిందా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS