అయితే రమణమూర్తి కూడా వున్నప్పుడు ఎవరినైనా ప్రశ్నలడగాలంటే శాస్త్రికి అంతగా ఇష్టముండదు. తన అసిస్టెంటు కు తనపై ఆరాధనా భావమున్నదని అతనికి తెలుసు. కానీ తను మరీ అంత తెలివైనవాడిని కాదని శాస్త్రి నమ్మకం. తన మాటలు విని రమణమూర్తి కి తన మీద గల ఆరాధన భావం తగ్గిపోతుందేమోనని శాస్త్రి భయపడతాడు.
ఏది ఏమైనా ఆరోజు సాయంత్రం ఇద్దరూ కలిసి కమలాకరం ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్లేసరికి కమలాకరం ఇంట్లో ఒంటరిగా, దిగులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చుని వున్నాడు. వీధి తలుపులు బార్లా తెరిచి వున్నాయి.
"మా బంధువు అమ్మాయుంది. పేరు సీత. చాలా అందంగా వుంటుంది. బియ్యే ప్యాసయింది. మంచి సంబంధం కోసం చూస్తున్నారు. కట్నం ఎంత కావాలన్నా ఇవ్వగలరు. మీ గురించి తెలిసింది. అన్యదా భావించ కుంటే " అంటూ తనను తను పరిచయం చేసుకుంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు శాస్త్రి.
'సారీ సర్! నాకు వైవాహికేచ్చ లేదు...." అన్నాడు కమలాకరం.
శాస్త్రి ఎంతో ఆశ్చర్య పోయినట్లు నటించి కారణం తెలుసుకోకోరాడు.
"నేనో అమ్మాయిని ప్రేమించాను" అన్నాడు కమలాకరం.
శాస్త్రి తెల్లబోయినట్టు ముఖం పెట్టి - "ఆ ఆమ్మాయేవరో తెలుసుకోవచ్చా?" అన్నాడు.
"అది మీ కనవసరం. ఆ అమ్మాయి చనిపోయింది."
"పోయిన వాళ్ళతో మనమూ పోతామా?" అని శాస్త్రి ఏదో అనబోగా ....
'ఆమెతో పాటే నాలోని ప్రేమ కూడా చచ్చి పోయింది. ఈ జీవితాని కింక పెళ్ళి ప్రసక్తి లేదు " అన్నాడు కమలాకరం.
అతన్ని చూస్తుంటే నిజంగానే ఒక ఆదర్శ ప్రేమికుడిలా అగుపించాడు శాస్త్రికి. నెమ్మదిగా ప్రశ్నలు ప్రారంభించాడు.
"ఎలా చనిపోయిందామే."
"ఆత్మహత్య చేసుకుని ."
'ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆమె శీలాన్నేవరైనా అపహరించేరా?"
"కళ్యాణి నిప్పులాంటి మనిషి. ఆమెను ముట్టుకున్న వాళ్ళు కాలిపోతారు. " అన్నాడు కమలాకరం. ఆ తర్వాత అతను ఇంకే ప్రశ్నలకు జవాబివ్వదల్చుకొనట్లు చెప్పేశాడు.
అక్కణ్ణించి బయట పడ్డాక - "నేను నిన్ను కూడా ఎందుకు తీసుకోచ్చానో తెలుసా? నేనడిగే ప్రతి ప్రశ్నకు కమలాకరం లో కలిగే భావ సంచలనాన్ని శ్రద్దగా గమనించి తర్వాత నాకు చేబుతావని! " అన్నాడు శాస్త్రి.
"మీరు ముందుగా చెప్పకపోయినా నేనా పని చేశాను సార్! మీరడిగినవన్నీ భలే ప్రశ్నలండీ -- ప్రతి ప్రశ్నా అతడిని కదిలించింది. ఆమె శీలం గురించి మీరు అడిగినప్పుడు అతడి నరనరాల్లో నూ ప్రత్యేకమైన ఆవేశం కనబడింది" అన్నాడు రమణమూర్తి.
"అయితే నువ్వు గమనించని విశేషం ఇంకొకటుంది." అన్నాడు శాస్త్రి. "కమలాకరం మనకు పూర్తిగా నిజం చెప్పడం లేదు, ఏదో దాస్తున్నాడు."
'అదేమిటయుంటుంది ?" అన్నాడు రమణమూర్తి.
"ఏమి తెలియటం లేదు. నిప్పులాంటి మనిషి కళ్యాణి. నీతి లేని ఇంట నివసిస్తూ ఆత్మహత్య చేసుకుంది. ఇదొక విచిత్రమానుకుంటే కమలాకరం ప్రేమ నన్నింకా ఆశ్చర్య పరుస్తోంది. కళ్యాణి అన్నయ్య సుధాకర్ ఆమె పెళ్ళి కోసం డబ్బు కూడ బెడుతున్నాడు. మంచి సంబంధం చేయాలన్నది అతని కోరిక. కమలాకరం లాంటి వరుడు కళ్యాణికి దొరకడం అదృష్టమే! అతను ప్రాణప్రదంగా కళ్యాణి ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి కళ్యాణిని కట్న మక్కర్లెకుండా చేసుకుని ఉండేవాడు. అటువంటప్పుడు ఇంతకాలమూ ఈ పెళ్ళి ఎందుకు జరుగలేదు? ఎప్పుడో జరుగవలసిన పెళ్ళి కదా ఇది!" అన్నాడు శాస్త్రి.
"సార్!" అన్నాడు రమణమూర్తి-- "కమలాకరం కళ్యాణిని ప్రేమించవచ్చు. కాని కళ్యాణి కమలాకరాన్ని ప్రేమిస్తోందన్న రూడి ఏమిటి?"
శాస్త్రి , రమణమూర్తి భుజం తట్టి మెచ్చుకున్నాడు. "రేపు నువ్వు కమలాకరం ఆఫీసుకు వెళ్ళి అతనికి దగ్గర స్నేహితుల్ని విచారించి అతడి ప్రేమ కధ పూర్తి వివరాలు తెలుసుకుని రా"
మర్నాడు సాయంత్రాని కల్లా రమణమూర్తి చాలా వివరాలు సేకరించుకుని వచ్చాడు."
కమలాకరం కళ్యాణిని మనసారా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె అతన్ని ప్ర్రేమిస్తున్నట్లు రూడి లేదు కానీ అతనితో చాలా సరదాగా వుండేది. అభిమానంగా మాట్లాడేది. అతడు ఎన్నో మార్లు పెళ్ళి ప్రసక్తి తీసుకుని రాగా ఆ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడేది, లేదా సంభాషణ దారి మళ్ళింపజేసేది .
కమలాకరం ప్రేమకు కల్యాణి భయపడుతుండేది . అతడికి తనకంటే మంచి వధువులు దొరుకుతారని అతడి ప్రేమకు తను తగననీ ఆమె అంటుండేది. తన ఇంటికి తీసుకు వెళ్ళడానికి గానీ, తనవారికి పరిచయం చేయడానికి గానీ ఆమె అంగీకరించలేదు.
ఒక పర్యాయం కమలాకరం ఆమెను సూటిగా అడిగేశాడుట -- "నువ్వు నన్నెందుకు పెళ్ళి చేసుకోవు?" అని, దానికి సమాధానంగా ఆమె - "కుళ్ళిన శవాలమధ్య నిలబడి పారిజాత సౌరభాన్నా స్వాదించాలనుకుంటున్నావు నువ్వు. ఆ శవాల వాసనలా సౌరభాన్ని మించగలనని గ్రహించలేక పోతున్నావు" అన్నదట కళ్యాణి.
కమలకరానికి అనుమానం వచ్చి ఆమె మరెవర్నైనా ప్రేమించిందేమోనని విచారించాడు. ఆమె పని చేస్తున్న ఆఫీసులో అడగ్గా అందరూ ఆమె అందంతో పాటు నడవడికకు కూడా మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. కళ్యాణిని అర్ధం చేసుకోలేక కమలాకరం సతమతమవుతుంటే ఇటీవలే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నించీ కమలాకరం మరింత డీలా పడిపోయాడు.
రమణమూర్తి చెప్పినదంతా విని --"కళ్యాణి ఏదో విష వలయంలో ఇరుక్కుంది. ఆ విషయం కమలాకరానికి సూటిగా చెప్పకుండా సూచన ప్రాయం గా తెలియ జేసిందామె. తన బంధువుల నైతిక ప్రవర్తన ను అసహ్యించుకునే కళ్యాణి ఆ కారణంగా తన కాపురంలో నిప్పులు పడగలవని భయపడింది. అదే కారణంగా ఆమె కమలాకరం తో విపరీతంగా ప్రవర్తించింది" అన్నాడు.
"సుబ్బరామయ్య గారమ్మాయి ప్రవర్తన మంచిది కాదా...."
"కాదనడానికి ఏమాత్రమూ సందేహం లేదు. అయితే హత్యలు కూడా చేయగలరా?" అని మాత్రం ఆలోచిస్తున్నాను" అన్నాడు శాస్త్రి.
8
శాస్త్రి వేషం మార్చుకుంటుంటే అప్పుడే గదిలోకి అడుగు పెట్టి న అతని భార్య వెంకటరమణ "వేషాలు కూడా వేస్తున్నారా - ఏదో ప్రమాదకరమైన కేసే అయుంటుంది . మీరు ఇల్లు కదలడానికి వీల్లేదు " అంది.
"అలా అంటే ఎలా? ఈ కేసు అవగానే నీకు నాలుగు జతల బంగారు గాజులు చేయించాలనుకుంటున్నాను...." అన్నాడు.
వెంకటరమణ కళ్ళు మెరిశాయి-- "నిజంగానండీ!" అంది.
"నిజంగానే " అన్నాడు శాస్త్రి . "బంగారు గాజు అంటే ఏమిటనుకున్నావ్? మట్టి గాజులైతే ఇట్టే పగిలి పోతాయి. పసుపు తాడైతే చేత్తో తెంపేయవచ్చు. నీ మెళ్ళో పసుపు తాడు కు బదులు బంగారు నానుతాడు వుంది. చేతిక్కూడా బంగారు గాజులు వస్తే అప్పుడు నీ మాంగల్యానికి లభించే పటిష్టమైన రక్షణ ఏ ఆడదానికీ వుండదు."
"నిజమేనంటారా?" అంది అమాయకంగా వెంకట రమణ.
"ముమ్మాటికీ ఇది నిజం. కాబట్టే డబ్బున్న ఆడవాళ్ళ మొగుళ్ళు బ్రతికినంతకాలం పేదవాళ్ళ మొగుళ్ళు బ్రతకడం లేదు...." అన్నాడు శాస్త్రి.
వెంకటరమణ మౌనంగా ఊరుకోవడం చూసి -- "నీకు నాకంటే బంగారు గాజులే ముఖ్యమనుకుంటాను, బండెడు నగలోస్తాయంటే నువ్వే స్వయంగా నన్ను చంపేస్తావేమో!" అన్నాడు శాస్త్రి.
వెంకటరమణ చటుక్కున అతడి నోరు మూసి -- "పాపిష్టి మాటలు అనకండి -- నిజం చెబుతున్నాను మీరిలాంటి డిటెక్టివ్ గా వుండడం నాకు నచ్చలేదు. ఈ వృత్తి మానేస్తే అందరి కంటే ఎక్కువగా సంతోషించే దాన్ని నేనే" అంది.
"నేను డిటెక్టివ్ నయ్యాను కానీ డిటెక్టివ్ భార్యగా నిన్ను తాయారు చేయలేక పోయాను" అన్నాడు శాస్త్రి.
ఆ తర్వాత నెమ్మదిగా అతను దొడ్డి దారిన బయట పడి కాసేపు అటూ ఇటూ తిరిగి ఓ సందులోకి ప్రవేశించాడు. అక్కణ్ణించి నడుచుకుంటూ వెళ్ళి సుబ్బరామయ్య ఇల్లు చేరాడు.
ఆ ఇంటికి తాళం వేసి వుంది. కాసేపు అటూ ఇటూ తచ్చాడి పక్క సందులోంచి ఆ ఇంటి వెనుక భాగం వైపు వచ్చాడు.
అక్కడ నిర్మానుష్యం గా వున్న ఇరుకు సండును అతను గుర్తు పట్టాడు. చటుక్కున ఆ సందులో దూరి తనకు తెలిసిన తలుపు దగ్గర నిలబడి ఒ క్షణం తటపటాయించి , నెమ్మదిగా తలుపు తోశాడు. అతను లోపల అడుగు పెట్టబోయెంతలో భుజం మీద బలంగా ఓ చేయి పడింది. శాస్త్రి చటుక్కున వెనక్కు తిరిగి అ మనిషిని చూసి "ఓ నువ్వు సుబ్బన్నా " అన్నాడు.
ఆ మనిషి ఆశ్చర్యంగా -- "నా పేరు నీకెలా తెలుసు!" అన్నాడు.
"నన్ను నువ్వనేంత వాడివయ్యావురా - నేనవర్నిననటున్నావ్ - డిటెక్టివ్ శాస్త్రిని " అన్నాడు శాస్త్రి.
