Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 17

 

    నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "అయితే నిధి చేజారి పోయిందన్న మాట" అన్నాను బాధగా.
    'అవును, నేను దగ్గిరుండి కూడా నీకు సహాయపడలేకపోయాను." అంది శోభ దిగులుగా.
    కానీ నాకు బాగా అనుమానంగా ఉంది. నా  నిధి మాయం కావడం లో శోభది ప్రధాన పాత్ర అని. కానీ ఆశ్చర్యమేమిటంటే నిజంగా ఇంటి పెరట్లో నిధి వుండడమూ, అమ్మకు ఆ విషయమూ తెలిసి వుండడమూ , తులసి మొక్క కింద అమ్మ నిధిని వుంచిందని ఖచ్చితంగా తెలిస్తే నేను అంత తొందరపడి శోభకు దొరికిపోయేలా ఆ ప్రయత్నం చేసి వుండేదాన్ని కాదు.
    నేనూ, శోభ కలిసి త్రవ్వి పెట్టెను ఒకదానిని వెలికి తీయగాలిగినప్పుడు నాకు కలిగిన ఆనంద మింతా అంతా కాదు. అయితే ఆ సమయంలో మరొకరు మా ఇంట్లో జొరబడే అవకాశమూ లేదు.
    సుజాత అన్నకు శోభ ఏ సమాచారమైన అందచేసే అవకాశం సాయంత్రం వున్నదని నాకు తోచడం లేదు.
    శోభ బయటకు వెళ్ళే నెపంతో దొడ్లో నేను నిధి కోసం ప్రయత్నం చేసే అవకాశమిచ్చి తను పెరటి వైపుకు వచ్చి నా చర్యలను గమనించి నేను కాస్త తవ్వకం మొదలు పెట్టగానే వచ్చి తలుపు తట్టి ఉంటుందని నా ఊహ. అయితే ఆతర్వాత మరో వ్యక్తీ వచ్చిన అలికిడి కాలేదు.
    ఇప్పుడు నాలో మరో అనుమానం రేకేత్తుతోంది. నన్ను శోభే కొట్టి ఉంటుంది. తర్వాత విషయం పోలీసుల వరకూ పోకుండా వుండడం కోసం, పోయినా తన మీద అనుమానం రాకుండా వుండడం కోసం ఆమె నన్ను స్వయంగా హాస్పిటల్ లో చేర్చింది.
    "శోభా , ఏమాత్రం వీలుపడ్డా నీకు నా నిధిలో భాగమిస్తానని ఓసారి నీతో అన్నాను. కానీ నిధి నీ చేతుల్నించి నా చేతుల దాకా రాలేదు. అమ్మకు నిధి పాతిపెట్టేటంత సంపద ఎక్కడిదో నాకు తెలియదు. ఆనీ అది ఆమె కేవలం నాకోసం సంపాదించింది. కేవలం నాకు మాత్రమే ఉపయోగ పడాలనే అభిప్రాయంతో దాన్నామే భూస్థాపితం చేసింది. భూమాత ప్రభావం వల్ల అది ఏ నీబోటి గాళ్ళ చేతుల్లోనో పడి చిల్ల పెంకుల కిందో, మరే విధంగానో కనపడితే తిరిగి దానిని నిదిగా మార్చడానికి నేనున్నానని గుర్తుంచుకొంటే చాలు. అది ఒకవేళ నీ చేతిలోనే ఇంకా వుండి ఉన్నట్లయితే ఎవాటా కోరకుండా నీకు నిదిగా మార్చి పెడతాను. అమ్మ కష్టార్జితం ఎవరికీకాకుండా వృధాగా పోకూడదు" అన్నాను.
    అప్పటికి నాకు దుఖం ముంచుకు రాగా రెండు చేతులూ ముఖానికి కప్పుకొని ఏడ్చాను.
    నాకు తెలుసు. నేనిప్పుడు పూర్తిగా నిస్సహాయురాలిని. తెలిసి కొరివితో తల గోక్కున్నాను. ఇంతకీ నా రాత అలా వుంది. అమ్మే నాతొ తను ఫలానా చోట నా గురించి నిధిని పాతానని చెప్పి వుంటే నాకీ కష్టాలే వుండి ఉండేవి కాదు.

                                   14
    మర్నాడుదయమే నేను తిరిగి ఇంటికి వచ్చేశాను.
    తగిలిన దెబ్బ ఏమాత్రమూ ప్రమాదకరమైనది కాదని డాక్టరు అన్నప్పుడే అది శోభ లాంటి బలహీనురాలు  కారణంగా తగిలిన దెబ్బ అని ఊహించగలిగాను. నేనూ బలహీనురాలినే కావడం వల్ల నాకు ఆమాత్రం దెబ్బకే స్పృహ తప్పి వుండాలి. నేను స్పృహ తప్పి పడిపోయినట్లు శోభ గుర్తించి వుంటుంది.
    అందుకే ఎవరో ఇతరులు నన్ను కొట్టారన్న భ్రమ కలిగించడం కోసం నెమ్మదిగా దొంగ అనరిచి వుంటుంది.
    ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లోనే వుండి పోయాను. శోభ వుంటానన్నా వద్దని ఆఫీసుకి పంపించేశాను. ఒంటరిగా ఆలోచిస్తూ మంచం మీద పడుకుంటే ఎప్పుడు తెలియకుండా నిద్ర పట్టేసింది.
    మెలకువ వచ్చేసరికి ఎవరో తలుపు తడుతున్నారో లేక ఎవరో తలుపు తట్టడం వల్ల మెలకువ వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేను కానీ లేచి వెళ్ళి తలుపు తీశాను.
    మొట్టమొదటి సారిగా నేను శోభనూ, సుజాత అన్నయ్యను కలిసి చూశాను. సుజాత అన్న చేతిలో ఒక సంచీ వుంది. ఇద్దరు మౌనంగా లోపలకు ప్రవేశించారు.
    నేను తిరిగి తలుపు వేయడమేమిటి, శోభ నా కాళ్ళ మీద వాలిపోయి "ఒక వుత్తమ స్నేహితురాలిని మోసం చేయాలనుకున్నందుకు నన్ను క్షమించగలవా?' అంటూ ఏడ్చింది.
    శోభ ఏడవడం నాకు విపరీతంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. కారణం సరిగా ఊహించలేక పోయాను. రెండు చేతులతో ఆమెను పైకి లేవనెత్తుతూ మరో నాటకానికీ నాందీ ప్రస్తావన కాదు కదా, అనుకున్నాను.
    ముగ్గురం మౌనంగా నా గదిలో ప్రవేశించి తలో కుర్చీలో కూర్చున్నాం. సుజాత అన్న మౌనంగా తన చేతి సంచి లోంచి ఏదో బయటకు తీసి మౌనంగా నాకు అందించాడు. నా కళ్ళు మెరిశాయి. నా మదిలో ఎన్నో ఆలోచనల తరంగాలు ఉవ్వెత్తున ఉబికాయి.
    అది నిన్న సాయంత్రం పెరట్లో నేనూ శోభా కలిసి కనుగొన్న పెట్టె. అంటే నేనూహించిన విధంగానే జరిగిందన్న మాట. శోభ ఈ దొంగతనంలో ప్రధాన పాత్ర వహించిందన్న మాట. అయితే ఆ పెట్టె తిరిగి నా దగ్గర కెందుకు తీసుకువచ్చేరు? పెట్టెలో ఏముంది చిల్ల పెంకులా , లేక తేళ్ళు, పాములు , లేక.....
    వణుకుతున్న చేతులతో నేను పెట్టె తెరిచాను. పెట్టెలో కనపడ్డవి నన్ను అమితంగా ఆశ్చర్య పరిచాయి. అన్నిటి కంటే ఫైన వున్న కాగితం ఒక నవలలోంచి చింపబడ్డ మొదటి పేజీ. ఆ తర్వాత.....

                                  15

    "నేను రుక్మీణిని ప్రేమ వివాహం చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ఆకారణంగా నేను అస్తీకీ రుక్మీణి కి- మనసులో పోటీ పెట్టవలసి వచ్చింది. రుక్మీణి నెగ్గింది. ఆస్తి వదులుకుని స్వతంత్ర జీవితం ప్రారంభించాను.
    అదృష్టం కలిసి రాగా రెండు సంవత్సరాలలోనే పైకి రాగలిగాను. రుక్మిణి అదృష్టంతో నన్ను గొప్పవాణ్ణి చేయసాగింది. నేను స్వయంకృషి తో పైకి రావడం చూసి ఆస్తి వదులు కోవడంలో అధోగతికి పోతాననుకున్న నమ్మకం నిజం కాని కారణం వల్లనేమో , అమ్మా, నాన్న నన్ను తిరిగి ఆదరించారు.
    ఆ ఆదరణ లోని మర్మం నేను తెలుసుకోలేక పోయాను. రుక్మిణీ మీద నా తలిదండ్రులకు పగ ఉంటుందని ఊహించ లేక పోయాను. తలిదండ్రులు చెప్పిన అబద్దపు మాటలనూ, చూపిన తప్పుడు సాక్ష్యాలనూ నమ్మి నా జీవిత భాగ్యలక్ష్మీ , అర్ధాంగి అయిన రుక్మిణి శీలాన్ని అనుమానించగలిగేటంత నీచపు స్థాయికి దిగజారిపోయాను.
    రుక్మిణీ అభిమానవతి. నా అనుమానాన్ని అతికష్టం మీద మొట్ట మొదటిసారి ఆమె ముందు బయట పెట్టినపుడు ఆమె దెబ్బతిన్న పులిలా నావంక చూసింది. ఆ సమయంలో ఆమె అన్న మాటలు నేను జీవితంలో మరచిపోలేను.
    "మీకు సంబంధించి నంతవరకూ ఈ రుక్మిణీ చచ్చిపోయింది. ఇంత అసత్యకరమైన , అవమానకరమైన అనుమానం మనసులో పెట్టుకున్న భర్తతో నేను కాపురం చేయలేను. కానీ ఈ లోకానికి సంబంధించి నంత వరకు రుక్మిణీ చావలేదూ. చావదు. భర్త పంచన లేకుండా స్వచ్చమైన జీవితాన్ని నడపగలనని ఋజువు చేస్తాను. కానీ మళ్ళీ మీ కళ్ళ పడను."
    అవే రుక్మిణీ చివరి మాటలు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళి పోయాక అతి స్వల్పకాలం లోనే నాతప్పు పొరపాటు నాకు తెలిసి వచ్చాయి. అయితే అప్పటికే సమయం మించి పోయింది.
    ఒక పర్యాయం పేపర్లో ప్రకటన వేస్తె సమాధానంగా రుక్మిణి వద్ద నుంచి తనను వెదికే ప్రయత్నాలు చేస్తే చూడగలిగేది తన శవాన్ని మాత్రమే నని వుత్తరం వచ్చింది.
    రుక్మిణీ గురించి నేనేమీ తెలుసుకోలేక పోయినా నా గురించి ఆమె తెలుసుకుంటూనే వుంది. అడపాదడపా ఆమె నాకుత్తరాలు రాసేది.
    ఒక సంవత్సరం క్రితం ఆమె నాతొ ఫోన్ లో కూడా మాట్లాడింది. ఇంతకాలం భార్యను మరిచి పోకుండా వున్నందుకు, మరో వివాహం చేసుకోనందున నన్నభినందించింది. కన్న కూతురి భవిష్యత్తు బంగారం చేయాలన్న బలహీనత తనను మళ్ళీ నా దగ్గరకు చేరుస్తుందేమోని భయపడుతున్నాని చెప్పింది. తన సచ్చీలతకు ముమూర్తులా తండ్రినే పోలి వున్న తన బిడ్డే సాక్ష్యమని అంది.
    తనకు అర్దాన్తరపు చావు వస్తే మాత్రం తన కూతురిని ఆదరించమనీ, నా కూతుర్ని నేను గుర్తు పట్టడానికి కొన్ని సాక్ష్యాలను ఉంచుతానని చెప్పింది. అయితే నువ్వు నా దగ్గరకు రావాలని నేను బాధగా అడగ్గా సమాధానంగా టెలిఫోన్ నిట్టుర్పూ క్లిక్ మన్న శబ్దమూ వినిపించాయి. ఆతర్వాత ఈరోజు ఈ విధంగా నా చిట్టి పాపను చూడడం జరిగింది...."
    ఆపైన ఆయనకు మాటలు పెగల్లేదనుకుంటాను. మరి మాట్లాడలేక పోయారు.
    ఎవరూ లేరనుకుంటున్న నేను తండ్రి స్థానంలో నిలబడి వున్న ఆ అమృతమూర్తి ని చూస్తూ సంతోషం దుఖం వగైరా విచిత్ర సమ్మేళన భావాలతో సతమతమవుతున్నాను.
    కానీ అమ్మ కధ నాకు బాగా ఇప్పుడర్ధమైంది. అభిమానంతో, పట్టుదలతో ఇల్లు వదిలి సంపదలకు దూరమైనా ఎప్పుడూ వాటి గురించి బాధ చెందలేదు. ఏ పరిస్థితుల్లోనూ తన పట్టుదలను సడలించుకోలేదు. ఎదుగుతున్న కూతుర్ని చూసినప్పుడల్లా ఆమెకు బాధగా వుంటుండేది. నిధి పేరిట ఆమె భర్తకు, తనకూ సంబంధించిన ముఖ్య గుర్తులూ, నాకు సంబంధించిన ముఖ్య గుర్తులూ తన జీవిత వివరాలూ తను సంతకం చేసిన నా ఫోటోలూ ఒక పెట్టెలో భద్రంగా దాచి వుంచింది. ఆమె ఎంత పకడ్భందీగా ఏర్పాట్లు చేసిందంటే వేరెవ్వరూ నా పేరుతొ ఆ నిధిని వశం చేసుకోలేరు.
    శోభా, సుజాత అన్నా పెట్టెలోని విశేషాలూ, వివరాలూ చూసి అది నిధి కాదని , కేవలం నాకు మాత్రమే ప్రయోజనకారి అని గ్రహించి, చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడి నా దగ్గరకు తిరిగి వచ్చారు. పెట్టెలో గత పది పదిహేను సంవత్సరాలుగా తన భర్త చిరునామా వివారాలూ, రాయబడి వున్నాయి. సుజాత అన్న ఆ చిరునామా వ్యక్తీ వద్దకు నన్ను చేర్చడానికి సహాయపడ్డాడు.
    అమ్మ మాటలూ నిజమయ్యాయి. ఆమె నాకోసం చాచి పెట్టిన నిధి నన్ను అపార సంపదలకు ఏకైక వారసురాల్ని చేసింది. అమ్మ దానిని ఏ ఉద్దేశ్యంతో నిధి అని పిలిచిందో నాకు తెలియదు కానీ నిజంగా దానికి నిధి అన్న పేరు తగును. ఎందుకంటె అది నాచేయి దాటి పోయినా చివరకు నాకు తప్ప మరేవ్వరకూ వుపయోగపడ లేకపోయింది.
    కొత్త జీవితం ప్రారంభించేక నాకు అమ్మ చేసిన పెద్ద పొరపాటు అర్ధమయింది.
    అభిమానానికీ, పట్టుదలకూ ప్రాముఖ్యత నిచ్చి ఆమె జీవితంలో తనకూ, తన భర్తకు మనశ్శాంతి లేకుండా చేసింది. నాన్నగారి లాంటి ప్రేమమూర్తి ని వదులుకుని ఆమె జీవితంలో ఏం సాధించిందో నా కర్ధం కాకుండా వుంది.
    కానీ నాన్నగారు మాత్రం అది అమ్మ తప్పు కాదని, తను చేసిన తప్పుకు భగవంతుడు తననా విధంగా శిక్షించాడని అంటుంటారు.
    ఇంతకాలం సంపదకు నన్ను దూరంగా వుంచినందుకు తన్ను క్షమించలేనని అమ్మ అనుకుంది. అయితే పిల్లలకు కావలసిన సంపద డబ్బు రూపంలో కాదు, ప్రేమ రూపంలో! తను బ్రతికున్నంత కాలం నా కాలోటు లేదు, తన మరణానంతరం కూడా నాకా లోటు లేకుండా చేసిన అమ్మను నేను సర్వదా ఋణపడి వుంటాను.
    కానీ నాన్నగారి వంటివుత్తమ మానవుడి ప్రేమకు తను దూరం కావడమే కాక నన్ను కూడా దూరం చేసిన అమ్మ తప్పును క్షమించడం నావల్ల అవుతుందో కాదో నాకు తెలియదు.
    'అంతా ఆపై వాడి లీల." అంటారు నాన్నగారు.
    పైవాడి లీల సంగతి ఎలా ఉన్నా ప్రతి మనిషి, తన అభిమానానికీ, పట్టుదలకూ కాస్త హద్దులు ఏర్పరచుకోవాలన్న సత్యాన్ని మాత్రం  నేను గుర్తించాను. అమ్మ కధ తెలిపే సత్యం నాకు తెలిసినంత వరకు ఇదే!

                       ---: అయిపొయింది :-------
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS