సెకండ్లు ముల్లు పరుగెడుతోంది. నిముషం ముల్లు నడుస్తోంది. టైము పన్నెండూ నలభై అయింది. శాంత చెప్పిన ప్రకారం శోభనాద్రి రావడానికి ఇంకా ఇరవై నిముషాల వ్యవధి ఉంది.
ఇరవై నిముషాలు!ముగ్గురు వ్యక్తుల జీవితాలతో ముడి పడి ఉన్న ఒకే ఒక విషమ సమస్యకు పరిష్కారం ఆసన్నం కావడానికి ఉన్న వ్యవధి - ఇరవై నిముషాలు! !
నేను శాంతను ఒకసారి పరీక్షగా చూశాను. ఆమె లేతనీలి రంగు చీరలో ఉంది. హటాత్తుగా నాకు గుర్తు వచ్చింది. శాంత నాకు పరిచయమైన మొదటి రోజున ఏ బట్టలు వేసుకుందో - ఏ అలంకరణ లో ఉందొ - ఈరోజూ అదే విధంగా ఉంది.
"రాజా!" అంది శాంత - "నాకేమిటో భయంగా, కంపరంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో , తేల్చుకోలేక పోతున్నాను. అన్నీ తప్పుగానే కనబడుతున్నాయి. నా వంటిదానికి ఆత్మహత్య తప్పితే గత్యంతరం లేకనిపిస్తోంది." అంటూ శాంత లేచి అటూ ఇటూ అసహనంగా పచార్లు చేయసాగింది.
అప్పుడు టైము సరిగ్గా చెప్పాలంటే పన్నెండూ ఏభై అన్ని వైపులా చూస్తున్నాను.
"బాతూరూం కి వెళ్ళి వస్తాను"- అంటూ శాంత నడవలోని మెట్లు వైపు కదిలింది. నేనూ ఒక్క క్షణం తటపటాయించి మెట్ల వైపు కదిలాను . శాంత మెట్లు ఎక్కుతోంది. నేను కదిలిన చప్పుడు విన్నాక ఆమె నడకలో వేగం హెచ్చింది.
"శాంతా! ఒక్క నిముషం అగు!" అన్నాను.
"ఇక నన్ను మీరు ఆపలేరు రాజా!" అంటూ శాంత పరుగెడుతూ మెట్లక్కసాగింది. నాలో ఆదుర్దా ఎక్కువైంది. నేను కంగారుగా ఆమెను అందుకోవడానికి కానీ వేగంగా పరిగెట్టాను. సరిగ్గా పది మెట్లయినా ఎక్కానో లేదో కళ్ళు తిరగడం మొదలైంది. నాకు హటాత్తుగా నాలోని లోపం గుర్తుకొచ్చింది. వెంటనే వేగాన్ని తగ్గించాను. కానీ కొద్ది క్షణాల పాటు ఒక ఊతాన్నానుకుని నిలబడి విశ్రాంతి తీసుకుంటే గానీ మళ్ళీ మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ తర్వాత నెమ్మదిగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా రెండు అంతస్తులైనా చేరుకోకుండా నాకు "కెవ్వు" మని అరచిన పెద్ద కేక వినబడింది.
నా హృదయ చలనం స్తంభించింది. ఇన్నాళ్లుగా నేను దేనికి భయపడుతూ వస్తున్నానో ఏది అపాలని ప్రయత్నిస్తున్నానో అదే జరిగి ఉంటుందని నా బుద్దికి తోచింది. ఆ కేక వీధి వైపు నుంచి వచ్చింది. మెట్లు దిగి వీధి వైపు పరుగెత్తాను.
బహుశా కాపలావాడనుకుంటాను పరిగెడుతున్నాడు. నేను పరుగు ఆపి, వాడు వెడుతున్న వైపే నడిచాను. ఏ దృశ్యం నా కళ్ళబడనున్నదో అని నాకు భయంగా వుంది. మరోక్షణం లో కాపలావాడి కేక వినబడింది- " అయ్యో! శాంతమ్మగారిక్కడ పడి ఉన్నారు!"
నేనింకా అడుగులు వేస్తుండగానే వాడు నాకు తిరిగి వస్తూ ఎదురయ్యాడు. నన్ను చూసివాడు - "ఇందాక మీరూ శాంతమ్మ గారితోనే వచ్చినట్లున్నారు కదూ? ఆమెగారు ఇక్కడ రాళ్ళలో పడి ఉన్నారు. కొంచెం డాక్టర్ని ఫోన్ చేసి పిలవగలరా?" అన్నాడు. నా మీద ఏ విధమైన అనుమానమూ వ్యక్తపరచకుండా . నేను నెమ్మదిగా నిర్జీవంగా అన్నాను - "ఒక్కసారి ఆమెను చూసిరావాలి.
శాంత - ఆవరణ అందం కోసం అమర్చబడ్డ కృత్రిమ మైన కొండరాళ్ళ మీద బోర్లా పడిఉంది. తల ప్రాంతంలో రక్తం బాగా చిమ్మింది. నేను కళ్ళు తుడుచుకుని ఆమె కట్టుకున్న అందమైన ఆ చీర వంక బాధగా చూశాను. అదే చీర కట్టుకుని ఆమె ఒక పర్యాయం ఆత్మహత్యా ప్రయత్నం చేసినపుడు నేను వారించగలిగాను. కానీ ఆమె జీవితం ఆ చీర కట్టుకుని ఉన్నప్పుడే నా సమక్షంలోనే ఆమె కోరిన విధంగా మిగిసింది. నేను నాకున్న ఒకే ఒక లోపం కారణంగా నిస్సహాయాడునై ఆమెను ఆత్మహత్య చేసుకోనిచ్చాను.
జీవకళ లో చూసిన ఆమె అందమైన ముఖంలో ప్రేతకళ చూడలేననిపించి వెనక్కు తిరిగాను. నాకు శోభనాద్రి ఎదురవుతున్నాడు. అతను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. కాపలావాడు 'అయ్యగారూ! అటు చూడండి-" అని అరిచాడు . శోభనాద్రి వెళ్ళాడు. అటువైపు చూడలేక నేను ఇటు తిరిగాను. ఇంకా నేను తిరుగు తుండగానే "శాంతా!" అన్న హృదయావిదారకమైన కేక నాకు వినిపించింది.
9
అతి విచిత్రంగా నా జీవితంలో అడుగు పెట్టిన శాంతను మొత్తానికి విచిత్ర పరిస్థితుల్లో ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. నామటుక్కు నాకు ఆమె మరణానికి కారణం తను భారతదేశంలో పుట్టడమే ననిపించింది. భర్త బ్రతికి ఉండగా తనకు తానుగా విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకునేందుకు భారత స్త్రీ గా ఆమె సిద్దపడలేక పోయింది. మొత్తానికి ఏమైతేనేం ఆమె శోభనాద్రి భార్యగానే మరణించింది. ఆమెను ఆత్మహత్య నుండి తప్పించాలనే నేను ఆమె జీవితంలోకి ప్రవేశించాను. ఆరోజు ఆ క్షణంలో ఆ విధంగా ఆమె ఆత్మహత్య కు ప్రయత్నిస్తున్నందన్న విషయం నా ఊహకు ఏ మాత్రం అంది ఉన్నప్పటికి నేనామెను రక్షించుకోగలిగి ఉండేవాడిని. చిట్ట చివరకు అమెది హత్య కాదనీ, ఆత్మహత్య అనీ పోలీసులు నిర్ణయించడానికి నా వాగ్మూలమే ఆధారం కావలసిన పరిస్థితిలో ఆమె మరణం సంభవించింది.
ఎంతటి కష్టమైనా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. శాంతి మరణం సంభవించి అప్పుడే రెండు నెలలు కావస్తోంది. నేనామెను క్రమంగా మరచి పోగలుగుతున్నాను. శాంత మరణించినందుకు నిరుత్సాహపడ్డ ప్రసాద్ కూడా ఇప్పుడామె ప్రసక్తి అట్టే నావద్ద తీసుకురావడం లేదు.
అర్జంటు పని మీద రైలు ప్రయాణం చేస్తున్నాను. ట్రయినులో కొంచెం బోరుగానే ఉంది. రకరకాల వ్యక్తులూ రకరకాల సొదలు. నేను ప్రయత్నించినా నిద్ర నాదరికి రావడం లేదు. ఏదైనా పత్రిక చదవాలన్నా దృష్టి కేంద్రీకరించలేక పోతున్నాను. ఆ సమయంలో హటాత్తుగా నాకెంతో పరిచయమైనదని పించే ఒక కంఠం వినిపించింది. ఉలిక్కిపడ్డాను. సాధారణంగా ఒక పర్యాయం విన్న కంఠస్వరాన్ని నేను మరిచిపోలేను. కానీ ఈ కంఠం ఫలానా వారిదని వెంటనే పోల్చుకోలేక పోతున్నాను. అందుకే ఆ వ్యక్తిని చూడాలనిపించింది. నెమ్మదిగా బెర్తు దిగి క్రిందకు వెళ్లాను. అప్పుడు నాకు నేను ఆ కంఠస్వరాన్ని వెంటనే పోల్చుకోలేక పొవాడానికి కారణం గ్రహించాను. నేనే కాదు, ఎవరైనా ఊహించలేరనుకుంటాను. నా కళ్ళ ముందు మరణించిన వ్యక్తీ మాట మళ్ళీ వినగలనని అనుకోగలనా?
సందేహం లేదు , ఆమె తప్పక శాంతే అయి వుండాలి. నాకళ్ళు నన్ను మోసం చేయగలవేమో కానీ నా చెవులు నన్నెప్పుడూ మోసం చేయవన్నది నా నమ్మకం. అయితే ఇదెలా సాధ్యం?
నేనామెను కాస్త పరీక్షించి చూడడం ఆరంభించేసరికి అంత వరకూ పక్కనున్న స్త్రీతో చకచకా కబుర్లు చెబుతున్న ఆమె కాస్త తడబడ్డట్లు కనబడింది.
"నమస్తే" అన్నాను.
ఆమె కూడా ఇబ్బందిగా "నమస్తే!" అని - "మీరెవరో గుర్తించలేకుండా ఉన్నాను-" అంది.
అమెవడ్డ చనువును వ్యక్తపరచడానికి నాకు కాస్త సంకోచంగానే వుంది. ముఖంలో అన్నీ శాంత పోలికలే కనబడుతున్నా - కట్టు బొట్టూ, తీరు తెన్నులలో -- శాంతకు, ఆమెకూ - చాలా బెధముంది -" మీకు శాంత తెలుసా?" అనడిగాను.
"శాంతా? ఆమె ఎవరు?" అందామె ఆశ్చర్యంగా.
ఆ మాటలు వింటుంటే ఆమె తప్పక శాంత అయి ఉండాలని నాకు బాగా అనిపిస్తోంది. కానీ ఎక్కడా అందుకు అవకాశం కనబడడం లేదు. నేను సూటిగా ఆమె వైపు పరీక్షగా చూస్తూ - "శాంత అంటే అచ్చం మీకులాగే ఉంటుంది. బహుశా మీరేననుకుంటాను-" అన్నాను.
ఆమె బాగా తడబడింది - "ఏమో నాకు అ శాంతా తెలీదు, మీరూ తెలీదు -" అంది విసుగును అభినయిస్తూ.
ఈసారి నేను కాస్త సీరియస్ గా ముఖం పెట్టి "మీరు తప్పక నాతొ వచ్చి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరందుకు అంగీకరించని పక్షంలో నెక్ట్స్ స్టేషన్లో పోలీసుల సహాయంతో నేననుకున్నది సాధించగలను -" అన్నాను.
ఈ పర్యాయం మా సంభాషణ చుట్టూ ఉన్నవారిని కూడా ఆకర్షించింది. ఆమె కాస్త కంగారు ను ప్రదర్శిస్తూ -" ఎవరు మీరు?" నన్నందుకిలా వేదించదల్చుకున్నారు ?"
